న్యాయ వ్యవస్థపై అనుమాన బీజాలు!

    భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి రాజ్యసభ సభ్యత్వాన్ని రాష్ట్రపతి కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశం కావడం ఉత్తమ ప్రజాస్వామిక లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నది. అత్యంత జాతీయ ప్రాధాన్యం గల కీలక కేసుల్లో అంతిమ తీర్పులు వెలువడిన కాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథిగా ఉన్న వ్యక్తికి పదవీ విరమణ చేసిన కొద్ది నెలల్లోనే ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలోని భిన్న కోణాలు లోతైన పరిశీలనకు గురి కావడం హర్షించదగిన పరిణామమే. తనపై వచ్చిన విమర్శలకు […] The post న్యాయ వ్యవస్థపై అనుమాన బీజాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి రాజ్యసభ సభ్యత్వాన్ని రాష్ట్రపతి కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశం కావడం ఉత్తమ ప్రజాస్వామిక లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నది. అత్యంత జాతీయ ప్రాధాన్యం గల కీలక కేసుల్లో అంతిమ తీర్పులు వెలువడిన కాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథిగా ఉన్న వ్యక్తికి పదవీ విరమణ చేసిన కొద్ది నెలల్లోనే ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలోని భిన్న కోణాలు లోతైన పరిశీలనకు గురి కావడం హర్షించదగిన పరిణామమే. తనపై వచ్చిన విమర్శలకు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమాధానం ఇస్తానని గొగోయ్ ప్రకటించారు. అదీ మంచిదే. గత యుపిఎ పాలకులు కూడా రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టారన్నదీ వాస్తవమే.

విధి నిర్వహణలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామిక న్యాయ ధర్మ బద్ధంగా, నిష్పాక్షికంగా వ్యవహరించి ఆదర్శప్రాయులు కావలసిన ఉన్నత న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత పాలకులు విశేష ప్రయోజనకరమైన కిరీటాలు తగిలించడం దేశానికి అవసరమైన పనేనా అనే ప్రశ్నకు సరైన సమాధానం వెతకవలసి ఉంది. న్యాయమూర్తులుగా వారు సముపార్జించుకున్న విశేషానుభవాన్ని, క్లిష్టమైన వివాదాల పరిష్కారంలో వారు చూపించిన సునిశిత న్యాయ నైపుణ్యాన్ని వినియోగించుకోడానికి అరుదుగా సంబంధిత పదవుల్లో వారిని నియమించడం, రాజ్యసభ సభ్యత్వాల వంటి వాటిని నజరానాలుగా ఇవ్వడం వేర్వేరు అంశాలు. ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నది. వచ్చే సెప్టెంబర్ 2న రిటైర్డ్ కావలసి ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ఇటీవల జరిగిన ఒక సదస్సు వేదిక మీది నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై ఇంద్రుడు, చంద్రుడు అనే రీతిలో వ్యక్తిగత ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

మోడీ అంతర్జాతీయంగా ఆలోచించి దేశీయంగా నిర్ణయాలు తీసుకుంటారని, బహుముఖ మేధావి, ప్రజ్ఞావంతులని జస్టిస్ మిశ్రా మెచ్చుకున్నారు. ప్రధానిని ఆయన అలా బహిరంగంగా నెత్తికెత్తుకున్న తీరు న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రంపై చెడు ప్రభావం చూపుతుందని న్యాయమూర్తులు ఇకనైనా ఇటువంటి భజన మానుకోవాలని, అధికారంలో ఉన్నవారికి, ఉన్నత పాలక పదవుల్లోని వారికి దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఒక ఘాటైన ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిన్న మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభ పదవితో సత్కరించడాన్ని, జస్టిస్ మిశ్రా ప్రధానిని పొగడడాన్ని కలిపి ఆలోచిస్తే న్యాయమూర్తి పదవుల్లోని వారు పదవీ విరమణానంతర వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి పని చేస్తూ ఉండవచ్చనే అభిప్రాయానికి ఆస్కారం కలుగుతుంది. గొగోయ్ చీఫ్ జస్టిస్‌గా ఉండగా అయోధ్య, అసోం ఎన్‌ఆర్‌సి, రాఫెల్ వంటి కేసుల్లో వచ్చిన తీర్పులు కేంద్ర పాలకుల మీద ఈగను కూడా వాలనీయకుండా చేశాయన్నది వాస్తవం.

కేసులోని అత్యంత సున్నితత్వ లక్షణం వల్ల చిరకాలంగా వాయిదా పడుతూ వచ్చిన అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు వ్యాజ్యాన్ని పని కట్టుకొని తుది పరిష్కారానికి నోచుకునేలా చేయడంలో గొగోయ్ చూపించిన చొరవ ప్రశంసలు పొందింది. అదే సమయంలో ఆ తీర్పు తీరు పలు విమర్శలకు పాత్రమయింది. అలాగే 20 లక్షల మంది పైచిలుకు ప్రజలకు పౌరసత్వం లేకుండా చేసిన అసోం ఎన్‌ఆర్‌సి వివాదంపై తీర్పు ఎవరి కోసం, ఏ జనహితం కోసం అనే అభిప్రాయానికి తావిచ్చింది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన ముస్లింలు, తగిన ఆధార పత్రాలు చూపించలేకపోయిన పలువురు హిందువులు కూడా పౌరసత్వం కోల్పోయేటట్టు చేసిన ఆ తీర్పు గొగోయ్ విజ్ఞతను బోనులో నిలబెట్టింది.

ఆయన హయాంలో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులన్నీ స్వయంగా ఆయన ఒక్కరే ఇచ్చినవి కాకపోయినా తన సంపూర్ణ అధీనంలోని అత్యున్నత న్యాయస్థాన వ్యవస్థను దానిపై తనకు గల విశేషాధికారాలను ఆ రకమైన తీర్పులకు అనువుగా వినియోగించి ఉండవచ్చనే అభిప్రాయానికి ఆస్కారం కలుగుతున్నది. స్వయంగా లైంగిక వేధింపు ఆరోపణ ఎదుర్కొని తన చెప్పుచేతల్లోని న్యాయ పీఠాన్ని రక్షాకవచంగా వాడుకున్నాడన్న అనుమానానికి ఆస్కారం కలిగించిన వ్యక్తిని కేంద్ర పాలకులు చాకచక్యంగా తమకు అనుకూల తీర్పులు ఇప్పించుకోడానికి ఉపయోగించుకున్నారనే నిందకు ఇప్పటికే అవకాశం కలిగింది. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం వల్ల మన న్యాయ వ్యవస్థ స్వతంత్రతను అంతర్జాతీయ సమాజం అనుమానించే పరిస్థితి తలెత్తింది. ఇది మన జ్యుడీషియరీకి కలుగుతున్న శాశ్వత అప్రతిష్ఠ.

Ranjan To Take Oath As Rajya Sabha Member Tomorrow

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post న్యాయ వ్యవస్థపై అనుమాన బీజాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.