దొందూ దొందే

  యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం దేశ ప్రజల మీద, బ్యాంకుల సాధారణ ఖాతాదారుల మీద పడడం హద్దు, ఆపు లేకుండా సాగిపోతున్న తీరు కొట్టవచ్చినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు లోక్‌సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. బ్యాంకులకు టోపీ వేసిన 50 కంపెనీల పేర్లు […] The post దొందూ దొందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం దేశ ప్రజల మీద, బ్యాంకుల సాధారణ ఖాతాదారుల మీద పడడం హద్దు, ఆపు లేకుండా సాగిపోతున్న తీరు కొట్టవచ్చినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు లోక్‌సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. బ్యాంకులకు టోపీ వేసిన 50 కంపెనీల పేర్లు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పట్టుపట్టడం, కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ దానికి సూటి సమాధానాన్ని దాటవేయడం దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్నది. బ్యాంకుల మొండి బకాయిల సమస్యను నిష్పాక్షిక దృష్టితో లోతుగా పరిశీలిస్తే నాటి యుపిఎ ప్రభుత్వంలోనూ, ఇప్పటి ఎన్‌డిఎ హయాంలో సైతం అది కోరలు సాచి కాటేస్తూ కొనసాగుతూనే ఉన్నదని స్పష్టపడుతున్నది.

దానిని శాశ్వతంగా తుద ముట్టించి బ్యాంకులకు, ప్రజల ధనానికి రక్షణ కల్పించే దారి వెతకడానికి బదులు జాతీయ పాలక, ప్రతిపక్షాలు రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ సమస్యను వాడుకుంటున్నాయని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని వేలెత్తి చూపుకోడమే తప్ప జాతికి వాటి నుంచి ఎటువంటి మేలు జరగడం లేదని బోధపడుతుంది. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల( మొండి బకాయిలు)ను తగ్గించడానికి తగిన చర్యలు గైకొంటామని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేసింది. కాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో దాని ప్రభుత్వం అవతరించిన తర్వాత జరిగింది అందుకు పూర్తి విరుద్ధం. 2014 నుంచి 2019 ఏప్రిల్ 15 వరకు బ్యాంకుల మొండి బకాయిలు దాదాపు 4 రెట్లు పెరిగాయి. 2018లో బయటపడిన పిఎన్‌బి వంటి కుంభకోణాలతో నిరర్థక ఆస్తులు మరింత అపరిమిత స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి యెస్ బ్యాంకు దివాళా వంటివి వాటిని మరింత పెంచాయి.

2014 మార్చి 31 నాటికి మొత్తం బ్యాంకు రుణాల్లో 3.8 శాతం (రూ. 2.63 లక్షల కోట్లు) గా ఉన్న నిరర్థక ఆస్తులు 2018 మార్చి 31 నాటికి 11.2 శాతా(రూ. 10.93 లక్షల కోట్లు) నికి ఎగబాకాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారానికి వచ్చిన 201415 నుంచి 201718 వరకు బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 321 శాతం పైకి దూసుకుపోయాయి. దేశంలోని పబ్లిక్ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2014 మార్చి 31 నాటికి రూ. 2.27 లక్షల కోట్లుకాగా, 2018 మార్చి 31కి రూ. 8.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే బ్యాంకులలోని అపారమైన ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు దోచిపెట్డడంలో ఎన్‌డిఎ పాలన యుపిఎని తలదన్నిందని సందేహాతీతంగా బోధపడుతున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర పథకం కింద ఇచ్చిన బ్యాంకు రుణాలు కూడా చాలా వరకు తిరిగి వెనక్కు రాలేదని వెల్లడయింది. ఈ పథకం కింద తీసుకున్న 30.57 రుణ ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారిపోయినట్టు అధికారిక సమాచారం.

ఈ పథకం కింద 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు రూ. 3.11 లక్షల కోట్ల రుణాలివ్వగా అందులో 2.89 శాతం నిరర్థక ఆస్తులుగా తేలాయి. ముద్ర పథకం బ్యాంకుల నిరర్థక ఆస్తులను భారీగా పెంచే ప్రమాదమున్నదని రిజర్వు బ్యాంకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. అలాగే కిసాన్ రుణ పథకం కింద ఇచ్చిన రుణాలు కూడా మొండి బకాయీలుగా తేలుతున్నట్టు తెలిసింది. ఎవరు అధికారంలోకి వచ్చినా బ్యాంకుల నష్టాలు తగ్గకపోడం, మొండి బకాయిలు భారీగా పెరుగుతూ పోడానికి వాటి సిబ్బంది స్థాయి నిర్వాహకులు కొంత వరకు కారణం కాగా, రాజకీయంగా అత్యంత ఉన్నతస్థాయి బాధ్యులయిన పాలకుల నిర్లక్షమో, స్వప్రయోజనకాండో కూడా చాలా వరకు మూలమని చెప్పక తప్పదు.

సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి వంటి జాతి సమైక్యత, సమగ్రతలను దెబ్బతీసే వివాదాస్పద చట్టాలు, సంకల్పాల విషయంలో కేంద్ర పాలకులు చూపుతున్న దీక్ష పట్టుదల దేశ ఆర్థిక రంగాన్ని నమిలి మింగేస్తున్న బ్యాంకుల నిరర్థక ఆస్తుల వంటి చిరకాల రుగ్మతలను సమూలంగా తొలగించడం పట్ల కనిపించకపోడం గమనించవలసిన విషయం. కేంద్రంలోని పాలకులు బడా పెట్టుబడిదారుల, కార్పొరేట్ల కొమ్ము కాస్తూ వారు రాత్రికి రాత్రి మరింతగా కోట్లకు పడగెత్తేలా చేయడం కోసం ప్రజాధనాన్ని ధారపోసే ఆర్థిక విధానాలు అమలు చేస్తుండడం వల్లనే, కాకులను కొట్టి గద్దలకు వేసే తప్పుడు పద్ధతులను పాటిస్తున్నందువల్లనే బ్యాంకుల లూటీ సాగిపోతున్నదని చెప్పక తప్పదు. ఇందులో యుపిఎ, ఎన్‌డిఎలు రెండూ ఒకే తాను ముక్కలని రుజువు చేసుకుంటున్నాయనడం ఎంత మాత్రం అసత్యం కాబోదు.

Banking sector crisis in country

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దొందూ దొందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: