అక్కడ తగ్గినా ఇక్కడ పెరిగింది!

      సమయం, సందర్భం గమనించి చేయడం, ఎప్పుడు ఏమి చేయాలో, ఏమి కూడదో తెలిసి వ్యవహరించడం, ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం కలుగుతుందని గ్రహించి అడుగులు వేయడం ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వానికి బొత్తిగా అలవడలేదు. ఈ లక్షణం ఇక ముందు కలుగుతుందనే భరోసాకు ఆస్కారం లేదు. ఒక వైపు కనీవినీ ఎరుగని మాంద్యంతో తయారీ రంగానికి విఘాతంతో నిరుద్యోగం, అధిక ధరలతో దేశ ప్రజలు దుర్భరమైన బతుకులు వెళ్లదీస్తున్నారు. మరో వైపు కరోనా నేపథ్యంలో […] The post అక్కడ తగ్గినా ఇక్కడ పెరిగింది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

      సమయం, సందర్భం గమనించి చేయడం, ఎప్పుడు ఏమి చేయాలో, ఏమి కూడదో తెలిసి వ్యవహరించడం, ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం కలుగుతుందని గ్రహించి అడుగులు వేయడం ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వానికి బొత్తిగా అలవడలేదు. ఈ లక్షణం ఇక ముందు కలుగుతుందనే భరోసాకు ఆస్కారం లేదు. ఒక వైపు కనీవినీ ఎరుగని మాంద్యంతో తయారీ రంగానికి విఘాతంతో నిరుద్యోగం, అధిక ధరలతో దేశ ప్రజలు దుర్భరమైన బతుకులు వెళ్లదీస్తున్నారు. మరో వైపు కరోనా నేపథ్యంలో డిమాండ్ పడిపోయి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కుప్పకూలాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్‌లో ఆయిల్ ధరలు తగ్గిన మేరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించి సాధారణ వినియోగదారులకు ఊరట కలిగించడం ఏ ప్రజా ప్రభుత్వమైనా చేయవలసిన పని. అలా చేసి ఉంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విశేషంగా తగ్గి అది ప్రజల జేబులకు ఊరట కలిగించి ఉండేది.

ప్రజా రవాణా కూడా చౌక అయి ఉండేది. సరకుల ధరలు తగ్గేవి. కాని మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. పెట్రోల్, డీజిల్ పై లీటర్ వద్ద రూ. 3 వంతున ఎక్సైజ్ సుంకాన్ని పెంచి వేసింది. దేశ ప్రజల పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్‌లకు గతంలో చిరకాలం పాటు నియంత్రిత ధరల విధానం అమల్లో ఉండేది. ప్రభుత్వంపై దాని భారం పెరగడంతో బాటు ప్రైవేటురంగ చమురు కంపెనీలకు ఒత్తిడి తోడవడంతో దానిని రద్దు చేసి వాస్తవిక ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధర తగ్గినప్పుడు, పెరిగినప్పుడు దానిని యథాతథంగా దేశంలోని పెట్రోల్ పంపుల వద్ద కూడా అమల్లోకి తేవాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారం ఇప్పుడు అంతర్జాతీయంగా తగ్గిన మేరకు ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి ఉండవలసింది. కాని అలా జరగలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సైతం సరిగ్గా ఇలాగే చేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధరల ప్రయోజనాన్ని దేశంలోని వినియోగదారులకు ఈ పాలకులు అందించలేదు. ఇది అలవాటైన విద్య అయిపోయింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏడాదిలో రూ. 39 వేల కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి (ఈ నెల 31లోగా) రూ. 2000 కోట్ల రాబడి వస్తుంది. ధరలు తగ్గించినప్పుడు ప్రభుత్వ చమురు కంపెనీలకు కలిగిన నష్టాన్ని ఇప్పటి అంతర్జాతీయ తగ్గుదల వల్ల లభించిన ప్రయోజనంతో అవి పూడ్చివేయదలచాయని పెంచిన ఎక్సైజ్ భారం ఆచరణలో వినియోగదార్ల మీద పడదని వివరణ ఇస్తున్నారు. అదేమైనప్పటికీ ప్రభుత్వం తన పలు రకాల అపరాధాల వల్ల ఖజానాకు ఏర్పడిన గండిని పూడ్చివేసుకోడానికే పదేపదే పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను పెంచుతున్నదనేది వాస్తవం. 2014, 2017 మధ్య డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 380 శాతం పెంచింది. అలాగే పెట్రోల్ మీద 120 శాతం వడ్డించింది.

ఈ కాలంలో దేశంలో డీజిల్ ధర లీటర్ వద్ద రూ. 3.56 నుంచి 17.33 పెరిగింది. అలాగే పెట్రోల్ ధర రూ. 9.48 నుంచి 21.48 అధికమైంది. పెట్రోలియం ఉత్పత్తుల మీద ఎక్సైజ్ సుంకం ద్వారా 2013 14లో రూ. 88,600 కోట్లు ఉన్న ఆదాయం 201617 నాటికి రూ. 2,53,254 కోట్లకు చేరింది. వీటి మీద పరోక్ష పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఇంకే సరకు మీదా రావడం లేదు. పగటి దొంగ మాదిరిగా ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత కావలిస్తే అంత సొమ్మును పెట్రోల్, డీజిల్ ధరల ద్వారా కొల్లగొడుతున్నది. వాస్తవిక ధరల బదలాయింపు సూత్రాన్ని ఇంత దారుణంగా అవహేళన చేయడం ప్రపంచంలో ఇంకే దేశంలోనూ ఉండదు. మన ఇరుగు పొరుగు దేశాలన్నింటిలోనూ మనకంటే తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు.

ప్రజలను అష్టకష్టాలు పాలు చేసే ఆర్థిక విధానాలు భారతీయ జనతా పార్టీ పాలకులు చెప్పుకునే దేశ భక్తికి వింత విచిత్ర నిదర్శనమనుకోవాలి! పెట్రోల్, డీజిల్‌లు ఈ విధంగా అయాచిత తక్షణ ఆదాయ వనరులుగా ఉన్నప్పుడు కేంద్రం సుంకాన్ని తగ్గించుకొని వాటిని ప్రజలకు చౌకగా ఇవ్వడమనేది, పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడమనేది కలలో మాట. వాస్తవానికి ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల మొత్తాన్ని తీసేస్తే దేశంల పెట్రోల్, డీజిల్ ఇప్పటి ధరల్లో సగానికే అమ్మవచ్చు. పూర్తిగా కాకపోయినా కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా సుంకాన్ని తగ్గించినా వీటి ధరలపై ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఎక్సైజ్ సుంకంతో పాటు రోడ్డు సెస్‌ను కూడా పెంచేసి ప్రధాని మోడీ ప్రభుత్వం తన ప్రజలపై తనకున్న ‘ప్రేమాభిమానాలను’ ఈ విధంగా చాటుకున్నది!

Excise duty on petrol, diesel hiked by Rs 3 a litre

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అక్కడ తగ్గినా ఇక్కడ పెరిగింది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: