అసమానతలతోనే అనర్థాలు

దేశంలో ధనిక పేదల మధ్య వ్యత్యాసం తగ్గించి అంతరాలు లేని సమాజాన్ని నెలకొల్పడమే లక్షంగా ఎంతో కృషి చేస్తున్నామని, దాని కోసం లక్షలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు గత ఏడు దశాబ్దాలుగా పాలక పార్టీలు చెబుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా పరిస్థితి తయారయింది. ధనికులు మరింత సంపద పోగేసుకోవడానికే ప్రభుత్వ విధానాలు తోడ్పడుతున్నాయి. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా పని చేస్తోంది. బ్రిటన్‌కు […] The post అసమానతలతోనే అనర్థాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దేశంలో ధనిక పేదల మధ్య వ్యత్యాసం తగ్గించి అంతరాలు లేని సమాజాన్ని నెలకొల్పడమే లక్షంగా ఎంతో కృషి చేస్తున్నామని, దాని కోసం లక్షలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు గత ఏడు దశాబ్దాలుగా పాలక పార్టీలు చెబుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా పరిస్థితి తయారయింది. ధనికులు మరింత సంపద పోగేసుకోవడానికే ప్రభుత్వ విధానాలు తోడ్పడుతున్నాయి. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా పని చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తాజా సర్వే నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకొచ్చాయి.

రానున్న ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో కుబేరుల సంఖ్య 39 శాతం మేర పెరగనున్నట్లు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. 30 మిలియన్ డాలర్లు అంతకు మించి ఆస్తుల విలువ కలిగిన వారిని కుబేరులనే ప్రాతిపదికన నైట్ ఫ్రాంక్ ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా, ఆసియాలో కుబేరుల సంఖ్య సగటు పెరుగుదల కంటే భారత్‌లో ఎక్కువగా ఉండబోతున్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2018 2023 మధ్య కాలంలో ఆసియాలో కుబేరుల సంఖ్య 27 శాతం పెరుగనుండగా, ఉత్తర అమెరికాలో ఈ వృద్ధి 17 శాతంగాను, ఐరోపాలో 18 శాతంగాను నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

రానున్న నాలుగేండ్ల కాలంలో ఆసియాలో కుబేరుల సంఖ్య 1003కు చేరనుండగా, ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్య 2,696కు దగ్గర్లో ఉంటుందని అంచనా వేసింది. 2013 నుండి 2018 మధ్య కాలంలో భారతదేశంలో కుబేరుల సంఖ్య 116 శాతం మేర పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. రానున్న ఐదేండ్ల కాలంలో భారత్ తరువాత అత్యధికంగా ఫిలిప్పీన్స్ 38 శాతం, చైనాలో 35 శాతం కుబేరుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో 5,986 మంది కుబేరులున్నారు. ఈ సంఖ్య 2024 నాటికి 10,354 కు చేరుకుంటుందని ఈ సంస్థ తెలిపింది.

భారతదేశంలో పేదల మరింత పేదరికంలోకి ప్రయాణిస్తున్నారని, కోటీశ్వరుడు ఇంకా వందల కోట్లు సంపాదిస్తున్నాడని “క్రెడిట్ సూసే” తాజా నివేదిక గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2019పేర్కొన్నది. భారత్‌లో సుమారుగా రూ. 895 లక్షల కోట్ల సంపద ఉందని లెక్కగట్టారు. ప్రపంచ సంపద సూచికలో భారతదేశం 7వ స్థానంలో ఉందని తెలిపింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనాలు భారత్ కన్నా ముందున్నాయి. పోగులు పడిన సంపద పేదరికం భారతదేశంలో గణనీయంగా ఉందని, సంపద పంపిణీలో అసమానతలు 83.2 శాతం ఉన్నట్టు నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం సంపద రూ. 895 లక్షల కోట్లలో ఎక్కువ భాగం 12 శాతం మంది చేతుల్లో ఉందని పేర్కొన్నది.

భారతదేశంలోని ఆర్థిక అసమానతలపై అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ తన రిపోర్టులో నివ్వెరపరిచే విషయాలను బయటపెట్టింది. భారత్‌లో 63 మంది శతకోటీశ్వరుల సంపద 201819 కేంద్ర బడ్జెట్ (రూ. 24.42 లక్షల కోట్టు) కంటే అధికమని తేల్చింది. దేశంలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల సంపద 95.3 కోట్ల మంది (70 శాతం జనాభా) వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికం. పేదలు, మహిళా కార్మికుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నులు పై మెట్టుకు ఎగబాకుతున్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది.

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తామని ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని మోడీ నేతృత్వంలోని బిజెపి 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం మందగమనంలోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి స్థూల దేశీయోత్పత్తి రోజురోజుకు తిరోగమన పథంలో పయనిస్తున్నది. భారత ప్రభుత్వ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 2017 18లో నిరుద్యోగిత శాతం 6.1 శాతంగా నమోదు కాబడి 45 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 7.78 శాతంగా నమోదయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సిఎంఐఈ) తాజాగా గణాంకాలను విడుదల చేసింది.

గ్రామీణ నిరుద్యోగం జనవరిలో 5.97 శాతం ఉండగా ఫిబ్రవరి నాటికి 7.37 శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగం 8.65 శాతంగా నమోదయింది. నేడు భారతదేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని పలు విశ్లేషణలు, రేటింగ్ సంస్థలు గగ్గోలు పెడుతున్నా 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. దీనికి విరుద్ధంగా దేశ జిడిపి తిరోగమన పథంలో పయనిస్తోంది. 201819 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి మార్చి)లో దేశ జిడిపిలో 5.8 శాతమే వృద్ధిరేటు నమోదయింది.

2019 20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కేవలం 5 శాతానికే పరిమితమై ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. 201920 మూడో త్రైమాసికం అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో 4.7 శాతం వృద్ధిరేటు సాధించి ఏడేళ్ల స్థాయికి పడిపోయింది. జాతీయ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న అనేక రంగాలు రోజు రోజుకు నిర్వీర్యమైపోతున్నాయి. గత నవంబర్‌లో ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించి 1,45,000 కోట్ల దేశ ఆదాయాన్ని కార్పొరేట్లకు పంచి పెట్టింది. ప్రభుత్వ రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రైల్వే, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, బిపిసిఎల్, ఎయిర్ ఇండియాలను ప్రవేటుపరం చేస్తోంది. దేశంలో బడా సంపన్నులు వివిధ కంపెనీల పేరుతో తీసుకొన్న అప్పులో ఏడున్నర లక్షల కోట్లు పారుబకాయిలనే ముద్దు పేరుతో చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తుండటంలో ప్రభుత్వ ప్రమేయం కనబడుతోంది.

ప్రభుత్వ రంగ సంస్థలను ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ నష్టాల పేరుతో ప్రైవేటుపరం చేస్తోన్న ప్రభుత్వం మరో వైపు సంపన్నుల దోపిడీకి దివాళా తీసిన ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేయడం ప్రభుత్వ ద్వంద్వ నీతిని తెలియజేస్తున్నది. ఐడిబిఐ బ్యాంకు, లక్ష్మి విలాస్ బ్యాంకు తాజాగా యెస్ బ్యాంకు ఈ కోవలోకే వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13,800 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టి పారిపోయిన నీరవ్ మోడీని దేశానికి రప్పించడం ప్రభుత్వానికి ఇంత వరకు సాధ్యం కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున అక్రమ వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయని అమెరికాకు చెందిన మేధో బృందం గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జిఎఫ్‌ఐ) నివేదిక తెలిపింది. దేశంలో 6.14 లక్షల కోట్ల రూపాయలు పన్ను పరిధిలోకి రాకుండ ఉంటున్నదని తెలిపింది.

ఈ సొమ్ము మొత్తం అవినీతి, అక్రమ సంపాదన ద్వారా సమకూరినదేనని పేర్కొంది. ప్రపంచంలో ఇలాంటి వాణిజ్య అక్రమాలు జరుగుతున్న మూడో అతి పెద్ద దేశంగా భారత్ ఉందని తేల్చింది. నైట్‌ఫ్రాంక్, ఆక్స్‌ఫామ్, క్రెడిట్ సూసేగ్లోబల్ వెల్త్ రిపోర్టు చెప్పినట్లుగానే దేశంలో లాభాలు, సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతూ ఐరావతం లాగా పెరిగిపోతోంది. ఫలితంగా ధనిక పేదల మధ వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం మొదలగు అనర్థాలకు ఈ అంతరాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఆదాయ పంపిణీలోని అసమానతలు ఎన్నో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక దుష్ఫలితాలకు కారణమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన విధానాలను పునర్విమర్శ చేసుకొని ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేయాలి. పేదల మనుగడకు అవసరమైన కనీస అవసరాల కల్పనకు ప్రాధన్యతనిచ్చి వారి అభివృద్ధికి పాటు పడినప్పుడే రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న “సామ్యవాద” అనే పదానికి సార్థకత చేకూరుతుంది.

differences between rich and poor

బిల్లిపల్లి లకా్ష్మరెడ్డి, 9440966416

The post అసమానతలతోనే అనర్థాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.