పంటల బీమా విఫలప్రయోగం

  ప్రకృతి వైపరీత్యాల కారణంగా పండించే పంట చేతికందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఆరంభించింది. బీమా అనగానే ప్రీమియం క్రమంగా చెల్లిస్తే చాలు ఆ సమయంలో జరిగిన నష్టాన్ని భరించే బాధ్యత కంపెనీ స్వీకరిస్తుందనే నమ్మకం పాలసీ దారులకుంటుంది. మోటారు వాహనాలకు ప్రమాదం జరిగితే బాధిత వ్యక్తులకు వాహన మరమ్మత్తులకు బీమా సంస్థ సంరక్షణ కలిగిస్తుంది. తక్కువ మొత్తం చెల్లించి అనుకోని సంఘటనల వల్ల ఎక్కువ ప్రయోజనం […] The post పంటల బీమా విఫలప్రయోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా పండించే పంట చేతికందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఆరంభించింది. బీమా అనగానే ప్రీమియం క్రమంగా చెల్లిస్తే చాలు ఆ సమయంలో జరిగిన నష్టాన్ని భరించే బాధ్యత కంపెనీ స్వీకరిస్తుందనే నమ్మకం పాలసీ దారులకుంటుంది. మోటారు వాహనాలకు ప్రమాదం జరిగితే బాధిత వ్యక్తులకు వాహన మరమ్మత్తులకు బీమా సంస్థ సంరక్షణ కలిగిస్తుంది. తక్కువ మొత్తం చెల్లించి అనుకోని సంఘటనల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడమే బీమా పరమార్థం. ఇదే కోణంలో ఆలోచిస్తే పంటల బీమా అసలు బీమాయేనా అని అనిపించక మానదు. అన్నదాతల కష్టాలకు పూర్తిగా బాధ్యత వహించవలసిన ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టాయి. జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరిట 1990లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన పంటల బీమా ఏనాడు రైతులను పూర్తిగా ఆదుకోలేదు. సీజన్‌కొక్క ప్రయోగం అన్నట్లు రకరకాల మార్పు చేర్పులను చేసిన ప్రభుత్వాలు చివరికి దానికి మంగళం పాడే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఈ నెల 19వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పంటల బీమాపై కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రీమియం చెల్లింపులో కేంద్రం వాటాను సగానికి తగ్గించింది. పంటల బీమా రైతుల ఐచ్ఛికానికి వదిలేసింది. ఈ రెండు నిర్ణయాలు బీమాను చావు దెబ్బ తీసేలా ఉన్నాయి. 1990 2000 రబీ పంటతో ఆరంభమైన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని కేంద్రం దేశంలోని రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు దీనిని తప్పనిసరి చేసింది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని పంటలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తూ క్రమంగా ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలను కూడా దీని పరిధిలోకి తెచ్చింది. ఇలా దేశ వ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వచ్చింది. వివిధ రకాల పంటలకు 2 శాతం నుండి 5 దాకా ప్రీమియం చెల్లించి బ్యాంకు రుణాలు తీసుకొని రైతులు కూడా తమ పంటలను బీమా పరిధిలోకి తెచ్చుకోవచ్చు.

అయితే పైన బీమా వల్ల కలిగే ప్రయోజనాన్ని పేర్కొన్నట్లుగా పంటల బీమా వల్ల పంట దెబ్బతినగానే నష్టపోయిన సొమ్ము రైతు చేతికందదు. పంట నష్టాన్ని లెక్కించేందుకు రకరకాల ప్రమాణాలున్నాయి. అవి మార్పులు చేర్పులతో మారిపోతూ ఉంటాయి. ఒక్క రైతు నష్టాన్ని నష్టంగా భావించక జిల్లా వ్యాప్తంగా పంట దెబ్బ తింటేనే ఆ రైతుకు లబ్ధి కలుగుతుంది. అనగా జిల్లా అంతటా ఆ పంట బాగా పండి కొందరి రైతులు అదే పంటకు తగిన దిగుబడి రాకపోయినా బీమా వర్తించదు. క్రమంగా జిల్లా పరిధిని, మండల స్థాయికి, గ్రామ స్థాయికి మార్చుతూ వచ్చారు. గ్రామ స్థాయిలోనయినా పంట నష్టాన్ని లెక్కించేందుకు గత 5 సం॥రాల సరాసరి దిగుబడిని ఆధారం చేసుకుంటారు. ఆ సగటు దిగుబడి కన్నా తక్కువ పంట వచ్చినప్పుడే దానిని పంట నష్టంగా భావిస్తారు. ఇలా ఏటా వేలాది రూపాయలు బీమా ప్రీమియం కట్టిన రైతులు గింజ చేతికి రాకున్నా బీమా పరిహారం పొందని సందర్భాలున్నాయి. జిల్లా ప్రామాణికంగా తీసుకున్న రోజుల్లో పంట బాగా పండిన కొందరు రైతులకు కూడా బీమా సొమ్ము లభించింది. ఇలా రైతు లక్షంగా కాకుండా ఊరు, మండలం అనడంతో గత సం॥రాల పంట సరాసరీ లెక్కతో నష్టపోయిన రైతుకు సరియైన న్యాయం జరగడం లేదు. బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకుంటున్న రైతు బీమా ప్రీమియం భారంగానే భావిస్తున్నాడు తప్ప లాభదాయకం అనుకోవడం లేదు.

ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా పేరు మార్చి 2016లో ముందుకు తెచ్చింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థలతో పాటు ప్రైవేటు బీమా సంస్థలకు ఇందులో అవకాశమిచ్చింది. క్లెయిమ్‌ల చెల్లింపుపై ఖచ్చితమైన నియమ నిబంధనలు లేనందున లాభాలు గడించవచ్చిన 170 ప్రైవేటు బీమా కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే మొదటి సంవత్సరంలో ఆ కంపెనీలకు మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత నష్టాలు రావడంతో ఒక్కొక్కటి తప్పుకోవడం మొదలైంది. రైతుల నుండి 2 నుండి 5 శాతం కాగా మిగతా ప్రీమియం సొమ్ము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్థాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలను తమ వైపు తిప్పుకొని భారీ కేటాయింపులు పొందవచ్చని ఆ కంపెనీలు భావించాయి. ఆది నుండే ప్రభుత్వం ఆసక్తి తగ్గిపోతుండడంతో కంపెనీలు ఆశించిన లాభాలు రాలేదు. 201920 సం॥నికి ఐసిఐసిఐ, లంబార్డ్, టాటా, ఎఐజి, కోరమండలం మరిన్ని కంపెనీలు ఈ బీమా తమ వల్ల కాదని ప్రకటించాయి. మొదటి రెండు సంవత్సరాలలో79 శాతం, 86 శాతం క్లెయిమ్స్ చెల్లించి లాభాలు పొందిన లంబార్డ్ తర్వాత ఏళ్లలో క్లెయిమ్స్ పెరిగి నష్టపోయింది. టాటా కంపెనీ మూడు సంవత్సరాలు 100 శాతం పైగా చెల్లించి తప్పుకుంది. పంట నష్టాలు పెరిగిపోవడంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిహారం 100% పైగా చెల్లించవలసి వస్తోంది. గోవాలో 280%, హర్యానాలో 140% చెల్లించిన సందర్భాలున్నాయి.

అన్ని కంపెనీలు కలిసి 201617 సంవత్సరానికి 77%, 201718కి 86%, 201819కి 80% ప్రీమియంను నష్టపోయిన రైతులకు అందించింది. కంపెనీలకు 10% నిర్వహణా భారం పోగా లాభం అనుకున్నంత లేకపోగా నష్టాలు కూడా వస్తున్నాయి. ఇలా ఒక్కో కంపెనీ జారుకుంటే భారమంతా ప్రభుత్వ రంగ బీమా సంస్థలపై పడుతుంది. అనగా ఆ మోత ప్రభుత్వంపై పడక తప్పదు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నుండి ముఖం చాటేస్తే మంచిదని భావించింది. ఈ క్రమంలోనే బీమా సబ్సిడీని సగానికి సగం తగ్గించి, పంటల బీమాను రైతు ఇష్టానికి వదిలేసింది. రైతులకు బీమా గురించి సరియైన అవగాహన వచ్చినందున ఈ నిర్ణయాలు తీసుకొన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అనడం విడ్డూరంగా ఉంది.

రైతుల సొమ్ము దోచి ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారనే కోపంతో బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు ఈ స్కీమ్ నుండి వైదొలగి సొంత బీమా విధానాన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయం 2017లో ఉన్న దాని కన్నా రెట్టింపు చేస్తానన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు సాధించింది శూన్యమే. పంటల బీమాను గాలికి వదిలేయడంతో ప్రభుత్వ తిరోగమన దారి బయటపడుతోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పంట నష్టాన్ని, రైతు ఇక్కట్లను సరియైన మార్గంలో పెట్టి పరిష్కరించవలసిన ప్రభుత్వాలు ఇలా చేతులెత్తేయడం బాధాకరమైన విషయం. పంటల బీమా బాధ్యతను పూర్తిగా ప్రభుత్వాలు స్వీకరించి రైతులను ఆదుకోవలసిన అవసరం ఎంతో ఉంది. బంగ్లా సస్య బీమా పేరిట పశ్చిమ బెంగాల్ ఉచితంగానే బీమా అందిస్తోంది. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

Govt makes crop insurance schemes voluntary for farmers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంటల బీమా విఫలప్రయోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: