ద్విముఖ వ్యూహంతో వస్తున్న ట్రంప్

  తొలిసారిగా భారతదేశానికి విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం ట్రంప్ ఈ నెల 24న తన సతీమణి మెలనియాతో కలిసి భారత్‌కు రానున్నారు. అమెరికా అధినేత తొలిరోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి మరుసటి రోజు ఢిల్లీలో ద్వైపాక్షిక వాణిజ్య చర్యలు మోడీతో జరుపుతారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ట్రంప్ రోడ్ షోలో పాల్గొంటున్నారు. అహ్మదాబాద్ […] The post ద్విముఖ వ్యూహంతో వస్తున్న ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తొలిసారిగా భారతదేశానికి విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం ట్రంప్ ఈ నెల 24న తన సతీమణి మెలనియాతో కలిసి భారత్‌కు రానున్నారు. అమెరికా అధినేత తొలిరోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి మరుసటి రోజు ఢిల్లీలో ద్వైపాక్షిక వాణిజ్య చర్యలు మోడీతో జరుపుతారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ట్రంప్ రోడ్ షోలో పాల్గొంటున్నారు. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ప్రయాణించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించనున్నారు. తదనంతరం మోతేరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగుతుంది. అహ్మదాబాద్‌లో మోతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన సర్దార్ వల్లబాయ్ పటేల్ స్టేడియాన్ని ట్రంప్, మోడీలు కలిసి ఆవిష్కరిస్తారు. అనంతరం లక్ష మందితో కొనసాగే సభలో ఇరువురు నాయకులు భారతీయులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

లక్షలాది మందితో భారతదేశంలో తనకు ఘన స్వాగతం లభించబోతున్నదని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్నారు. మోడీ తనకు మంచి మిత్రుడని, గ్రేట్ జెంటిల్‌మెన్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. భారత దేశానికి వాణిజ్య ప్రయోజనాలు కల్పించే విషయంలో ట్రంప్ నిరాసక్తతనే ప్రదర్శిస్తున్నారు. ట్రంప్ రాక సందర్భంగా నిర్వహించనున్న మోగా ఈవెంట్ పేరును కేంద్రం “నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్’గా మార్చింది. అంతకు ముందు ఈ కార్యక్రమానికి “కెమ్ చో ట్రంప్‌” అనే పేరు పెట్టారు. గుజరాతిలో “కెమ్ చో ట్రంప్’ అంటే ఎలా ఉన్నారు ట్రంప్ అని అర్థం. జాతీయ విధానంలో భాగంగా కేంద్రం ఈ పేరును మార్పు చేసింది.అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ప్రారంభమయ్యే ట్రంప్, మోడీ రోడ్ షో సందర్భంగా ఈ మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ 3 గం॥ల కార్యక్రమానికి గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా రహదారుల మరమ్మతులు, నగరంలో సుందరీకరణ కోసం కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి. అక్కడి మురికివాడలు ట్రంప్ కనపడకుండ చేసేందుకు వాటికి అడ్డంగా గోడను నిర్మిస్తున్నాయి. దాదాపు అర కిలోమీటరు పొడవు, ఏడడుగుల ఎత్తుతో గోడను కడుతున్నట్లు స్థానిక పత్రికలు కథనాలను ప్రచురిస్తున్నాయి.

భారతదేశ పర్యటనలో ట్రంప్ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ వ్యక్తిగత , అమెరికా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు. ట్రంప్ భారత పర్యటన ఒక విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ఒక భాగం కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో రాబోతుండగా జరుగనున్న ఈ పర్యటన ద్వారా ట్రంప్ గరిష్ఠ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. అమెరికాలోని భారత ఎన్‌ఆర్‌ఐల ఆదరణ పొంది వారి ఓట్లను గంప గుత్తగా సంపాదించడానికి భారత్ పర్యటన ఉపకరిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న గుజరాతి సంతతి వారిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అహ్మదాబాద్ పర్యటనను ఒక ఎత్తుగడగా ఎంచుకున్నారు. అమెరికాలోని గుజరాతీయులను కూడా అహ్మదాబాద్‌లో జరిగే “నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్‌” కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. దీని ద్వారా భారత ప్రధాని మోడీ తనకు ఆప్తమిత్రుడని చాటి వారి అ భిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తున్నాడు.

నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా ఇరు దేశాల అధినేతల మధ్య గత ఏడాదిన్నరగా అనుబంధం పెరిగిపోతోంది. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ తమ తమ దేశాల ప్రజల్లో సానుకూల దృక్పథం తమ పట్ల పెంపొందేలా జాగ్రత్తలు వహిస్తూ తమ రాజకీయ భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండేలా కృషి చేస్తున్నారు. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు అమెరికాలోని హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ సభలో 50,000 మంది భారత సంతతి వారిని ఉద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించడం జరిగింది. మోడీ అమెరికా పర్యటనను బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధిపొందడం జరిగింది. ప్రస్తుతం ఇదే తరహాలో ట్రంప రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ తన పర్యటన ద్వారా అతి పెద్ద మార్కెట్ అయిన భారత దేశంలో వ్యవసాయ, రక్షణ, ఇంధన, ఇంజినీరింగ్, పారిశ్రామిక, వైద్య రంగాల్లో అనేక ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకొని తద్వారా అమెరికాకు దండిగా ప్రయోజనం చేకూర్చానని ప్రచారం చేసుకోవడానికి ట్రంప్ ఉత్సాహపడుతున్నాడు.

ఇద్దరు దేశాధినేతలు సంయుక్తంగా ఇరు దేశాల్లో సభలు పెడుతున్నప్పటికీ రెండు దేశాల మధ్య మాత్రం వాణిజ్య స్పర్దలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమెరికాలోని పారిశ్రామిక వర్గాలు ఫిర్యాదు చేయడంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి తొలగించి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. ఇండియాని అభివృద్ధి చెందిన జాబితాలోకి చేర్చడం వల్ల వాణిజ్య పరంగా రావాల్సిన అనేక ప్రయోజనాలు దక్కకుండాపోతాయి. ఫలితంగా భారతదేశం నుంచి ఎగుమతి కాబడే వస్తువులకు భారీ ఎత్తున సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మన ఎగుమతిదారులు ఇతర దేశాలతో పోటీ పడటం కష్టమవుతుంది. అమెరికాకు మన ఎగుమతులు పెద్ద ఎత్తున తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారతదేశం తగ్గించాలని ఒత్తిడి తెస్తోంది. బర్డ్‌ప్లూ వైరస్‌తో 2007లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. దీనిపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది.

డబ్లుటిఒ ద్వారా అమెరికా ఒత్తిడి తేవడంతో 2017లో చికెన్ లెగ్స్ దిగుమతికి భారత్ అంగీకరించింది. అట్టి దిగుమతులపై 100 శాతం దిగుమతి సుంకాలను విధించింది. ప్రస్తుతం ఈ సుంకాన్ని 10 శాతానికి తగ్గించాలని అమెరికా పట్టుపడుతోంది. ఇదే జరిగితే అమెరికా నుంచి కారు చౌకగా కోడి మాంసం, గుడ్లు దిగుమతి అయితే దేశీయ మార్కెట్‌లో 40 శాతం వాటా కోల్పోవాల్సి వస్తుందని 2015లోనే వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ట్రంప్ పర్యటన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలను తగ్గిస్తే అమెరికా లెగ్ పీసులు దేశీయ మార్కెట్‌ను ముంచెత్తి ఘోరంగా నష్టపోతామని కోళ్ల పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీని వల్ల లక్షలాది కోళ్ల ఫాంలు మూతపడి వాటిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. అదే విధంగా భారత డైరీ మార్కెట్‌లోకి అమెరికాను అనుమతింప చేయడానికి ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. భారత పాల మార్కెట్‌లోకి గనుక అమెరికాకు అనుమతిస్తే దాదాపు 15 కోట్ల మంది పాడి రైతుల జీవనం గందరగోళంలో పడే అవకాశాలున్నాయి.

అమెరికా వ్యవసాయోత్పత్తులైన మొక్కజొన్న, పత్తి, సోయా, గోధుమ, ఆల్మండ్, వాల్‌నట్స్, బాదం, ఆపిల్ మొదలగు వాటికి సుంకాలు తగ్గించి తలుపులు బార్లా తెరిచినట్లయితే భారతీయ రైతుల పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. ట్రంప్ పర్యటన వల్ల భారత్‌కు లాభం కలుగుతుందా? లేక అమెరికా వ్యాపారానికి ఉపయోగపడేలా ఉంటుందా అన్నది 25 తేదీ వరకు వేచిచూడాల్సిందే. ప్రస్తుత పరిస్థితులలో భారత్ అమెరికా మధ్యలో పూర్తి స్థాయిలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పరిమిత స్థాయిలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనబడుతోంది. నిరుడు నవంబర్‌లో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సందర్భంగా రైతుల ప్రయోజనాలను కాపాడిన కేంద్ర ప్రభుత్వం అదే ఒరవడితో ట్రంప్‌తో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో దేశీయ ప్రయోజనాలను పరిరక్షించే విధంగా కృషి చేయాలి.

Delhi Police, security agencies gear up for Trump visit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద్విముఖ వ్యూహంతో వస్తున్న ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: