షహీన్ బాగ్- సుప్రీం చొరవ

     షహీన్ బాగ్ అపూర్వమైన అభద్రతా భయానికి గురైన దేశంలోని ఒక వర్గం మహిళలు సాగిస్తున్న సుదీర్ఘ శాంతియుత నిరసన ప్రదర్శన. అధిక భాగం ముస్లిం మహిళలున్న ఈ ప్రదర్శన గత డిసెంబర్ 15 నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో సాగుతున్నది. ఫిబ్రవరి 20 గురువారానికి 66 రోజులయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టానికి అది తలపెట్టిన జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కి, జాతీయ పౌర […] The post షహీన్ బాగ్- సుప్రీం చొరవ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     షహీన్ బాగ్ అపూర్వమైన అభద్రతా భయానికి గురైన దేశంలోని ఒక వర్గం మహిళలు సాగిస్తున్న సుదీర్ఘ శాంతియుత నిరసన ప్రదర్శన. అధిక భాగం ముస్లిం మహిళలున్న ఈ ప్రదర్శన గత డిసెంబర్ 15 నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో సాగుతున్నది. ఫిబ్రవరి 20 గురువారానికి 66 రోజులయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టానికి అది తలపెట్టిన జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కి, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)కి వ్యతిరేకంగా 10, 15 మంది స్థానిక మహిళలతో మొదలైన ఈ ప్రదర్శన చినికి, చినికి గాలివానగా మారినట్టు ఢిల్లీలోని పలు విద్యా సంస్థల విద్యార్థుల నిరంతర రాకతో, దేశం నలుమూలల్లో గల పలు ప్రజా సంఘాలవారి మద్దతు సందర్శనలతో మొత్తంగా ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారందరి సానుభూతి, భాగస్వామ్యాలతో ఒక మహా ప్రదర్శనగా మారింది.

ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రదర్శకులపై పోలీసుల దమన కాండ, జెఎన్‌యుపై ముసుగు గూండాల దాడి వంటి ఘటనలు షహీన్ బాగ్‌ను మరింత దృఢవంతం చేశాయి. ప్రదర్శకుల దీక్షను ఉక్కు సంకల్పంగా మార్చాయి. అయినా దీనికి చెప్పుకోదగిన నాయకులు ఎవరూ లేకపోడం, మహిళలే ఒడిలో చంటి బిడ్డలను పెట్టుకొని, ఎదుగుతున్న చిన్నారులను దగ్గర ఉంచుకొని టోపీల వంటివి అల్లుతూ 24 గంటలూ ప్రదర్శన సాగిస్తున్నారు. వందేళ్లలో రెండవ అత్యంత చలి రాత్రిగా రికార్డయిన డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వేలాది మంది ప్రదర్శనకారులు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ గడిపారు. ఈ ప్రదర్శన క్రమంలో చలికి తట్టుకోలేక ఓ మహిళ ఒడిలోని పసికందు చనిపోయిన విషాదమూ చోటు చేసుకున్నది.

71వ భారత రిపబ్లిక్ దినమైన గత జనవరి 26న లక్ష మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారు. ముగ్గురు స్థానిక వృద్ధ మహిళలు (షహీన్ బాగ్ దాదీలు), కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ప్రతి రోజూ, ప్రతి క్షణం ప్రసంగాలతో, ముషాయిరాలు, ఫైజ్ అహ్మద్‌ఫైజ్, రామ్‌దారీ సింగ్ దినకర్ వంటి ప్రసిద్ధ అభ్యుదయ, విప్లవ కవుల కవిత్వ పఠనాలతో పీడిత జన నిరసన కంఠాల భేరీగా షహీన్ బాగ్ మార్మోగుతోంది. ఇంతటి గొప్ప శాంతియుత ప్రతిఘటన ప్రదర్శనకు మూలంలో ఉన్న సమస్య ప్రధాని మోడీ తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, దాని ఇతర విధానాలే అయినందున దీనికి తెర దించడానికి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఉండవలసింది. ప్రదర్శకులతో ఈ సరికే చర్చలు జరిపి వారిని ఒప్పించి దానికి స్వస్తి చెప్పించి ఉండవలసింది.

ప్రదర్శన ఢిల్లీ నుంచి నోయిడాకి వెళ్లే ప్రధాన రహదారి మీద, దేశ రాజధాని ప్రవేశ ద్వారమైన బాట మీద సాగుతున్నది కాబట్టి రోజూ ఆ రోడ్డు మీద వెళ్లే లక్ష వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నదని వేలాది ట్రక్కులను ఇతర బండ్లను దారి మళ్లించవలసి వస్తున్నదని కేవలం అర గంట పట్టే ప్రయాణం, మళ్లింపు వల్ల 2, 3 గంటలు తీసుకుంటున్నదనే కారణం చూపి సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలయింది. దానిపై తీర్పు ఇస్తూ శాంతియుత నిరసన హక్కు ప్రదర్శకులకు ఉన్న మాట వాస్తవమే కాని ఇతరుల హక్కులను బలి తీసుకోడం మాత్రం సమంజసం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా ప్రదర్శకులతో చర్చలకు తన తరపున మధ్యవర్తులను పంపించింది. బుధవారం నాటి మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయి.

గురువారం నాడూ సాగాయి. షహీన్ బాగ్ ప్రదర్శన కొనసాగుతుందని మధ్యవర్తుల్లో ఒకరైన సాధనా రామచంద్రన్ గురువారం నాడు చేసిన ప్రకటనకు ప్రదర్శకులు హర్షాధ్వానాలు చేశారు. అదే సమయంలో ప్రదర్శనను విరమింప చేయడానికి తీసుకోదగిన చర్యల పై స్పష్టతను సాధించడానికి మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ప్రదర్శకులను ఒప్పించి నిరసనను అంతం చేయించాలంటే పౌరసత్వ చట్టం, ఎన్‌పిఆర్, జాతీయ స్థాయి ఎన్‌ఆర్‌సి సంకల్పం అనే మూడింటిపై మోడీ ప్రభుత్వం ఎంతో కొంత దిగి వచ్చేలా చేయవలసి ఉంటుంది. దీనిని సుప్రీంకోర్టు సాధిస్తుందా, గత్యంతరం లేక ప్రదర్శకులను బలవంతంగా ఖాళీ చేయించడమే శరణ్యమవుతుందా అనేది వేచి చూడవలసిన అంశం.

అయితే దేశంలోని మొత్తం ముస్లిం జనాభాను భయోత్పాతానికి గురి చేస్తున్న పౌరసత్వ సవరణ పట్ల నిరసన హక్కును, ఢిల్లీకి వెళ్లి వచ్చే ప్రజల రాకపోకల స్వేచ్ఛ ను ఒకే గాటను కట్టి చూడడం ఎంత వరకు సబబనే ప్రశ్న తలెత్తుతుంది. అసోంలో ఆధార్, సాగు భూమి పత్రాలు వగైరా 15 సాక్షాలు చూపించిన ఒక ముస్లిం మహిళ పేరును జాతీయ పౌర చిట్టాకు ఎక్కించడానికి స్థానిక న్యాయస్థానం నిరాకరించిన తాజా ఉదంతం వంటివి పౌరసత్వ నిరూపణ ఘట్టం పట్ల దేశ ప్రజల్లో ముఖ్యంగా ముస్లిం మైనారిటీలలో భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అటు మోడీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఈ భయాలను సమూలంగా తొలగించే తరణోపాయాన్ని కనుక్కోవాలి.

You are safe in India, says Adv Sadhna Ramachandran

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post షహీన్ బాగ్- సుప్రీం చొరవ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: