పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ

కృష్ణాజిల్లా మున్నేరు నదీ పరీవాహక ప్రాంతంలో పూర్వం పెదకంచిగా పేరొందిన క్షేత్రం తరువాతి కాలంలో పెనుగంచిప్రోలుగా ప్రసిద్ధి చెందింది. పతి భక్తికి దైవ శక్తికి ప్రతీకగా శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు పేరంటాలుగా ఈ క్షేత్రంలో పూజలందుకుంటోంది. మాఘ పౌర్ణమినాడు తిరుపతమ్మ కల్యాణోత్సవం జరగనుంది.   పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ కథ నాలుగు వందల ఏళ్ల నాటిది. కొల్లి శివరామయ్య, రంగమాంబ పుణ్య దంపతులకు శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహంతో జన్మించిందామె. మేనమామ కొడుకు అయిన గోపయ్యను వివాహమాడింది. పుట్టింటి […] The post పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కృష్ణాజిల్లా మున్నేరు నదీ పరీవాహక ప్రాంతంలో పూర్వం పెదకంచిగా పేరొందిన క్షేత్రం తరువాతి కాలంలో పెనుగంచిప్రోలుగా ప్రసిద్ధి చెందింది. పతి భక్తికి దైవ శక్తికి ప్రతీకగా శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు పేరంటాలుగా ఈ క్షేత్రంలో పూజలందుకుంటోంది. మాఘ పౌర్ణమినాడు తిరుపతమ్మ కల్యాణోత్సవం జరగనుంది.

 

పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ కథ నాలుగు వందల ఏళ్ల నాటిది. కొల్లి శివరామయ్య, రంగమాంబ పుణ్య దంపతులకు శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహంతో జన్మించిందామె. మేనమామ కొడుకు అయిన గోపయ్యను వివాహమాడింది. పుట్టింటి నుంచి చీరె సారె తోపాటు ఒక ఆవును కూడా పెనుగంచిప్రోలు తీసుకెళ్లింది. మెట్టినింట ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంది. అయితే జననానికి ముందే జ్యేష్టాదేవికి ఇచ్చిన మాటమేరకు అమ్మవారు అనేక కష్టాలను ఎదుర్కొంది. అత్తింటి ఆరళ్లు మొదలయ్యాయి. ఆ గ్రామంలో క్షామం ఏర్పడింది. గ్రాసం కోసం ఉత్తరారణ్యానికి పశువుల్ని తోలుకెళ్లాడు గోపయ్య.

ఆ సమయంలో తిరుపతమ్మకు కుష్ఠువ్యాధి కూడా తోడైంది. తిరుపతమ్మ సన్నిహితురాలు పాపమాంబ సపర్యలు చేసి తరించింది. ఇదిలా ఉండగా అరణ్యంలో ఉన్న గోపయ్యకు భార్య ఏవో కష్టాలకు గురవుతున్నట్టు అనిపించి కలత చెందాడు. వెంటనే ఇంటికి చేరుకుని ఆమె దుస్థితిని చూసి మరింత వ్యధ చెందాడు. అంతలోనే తిరుపతమ్మ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆవును పెద్దపులి చంపిందని తెలుసుకున్నాడు. ఆ పులిని చంపి గోళ్లు తెస్తానని శపథం చేశాడు. విధివశాత్తూ గోపయ్య పెద్దపులి వాతపడ్డాడు. తిరుపతమ్మ సతీసహగమనం చేసింది. “ మా భౌతిక దేహాలు మంటల్లో కాలి బూడిదైనప్పటికీ నా పమిట కొంగు, తాళి అలాగే ఉంటాయి. వాటితో పాటు కుంకుమ భరిణెలు వెలుస్తాయి. ”

తిరుపతమ్మ ఆలయం

భూదేవి కోరికపై మానవరూపంలో జన్మించి త్రిశక్తి స్వరూపిణి తిరుపతమ్మ గృహిణిగా ఆదర్శవంతమైన జీవతాన్ని కొనసాగించింది. సతీధర్మానికి సరైన అర్థం చెప్పిన అమ్మ, గోపయ్యతో కలిసి ఇక్కడ పూజలు అందుకుంటోంది. లక్ష్మీతిరుపతమ్మ ఆదేశించిన ప్రకారం వారి బావ, తోడికోడలు కూడా ఇదే ఆలయంలో వెలిశారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో అమ్మవారి వివిధరూపాలు కొలువుదీరాయి. శుక్ర ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. మాలధారణతో మండలదీక్ష పూర్తి చేసి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు.

ప్రదక్షిణ మార్గంలో బయలు దేరిన భక్తులు ముందుగా వేపచెట్టును దర్శించుకుని ఆ తరువాతనే అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయం. ఉత్సవాల సమయంలో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పసుపు కుంకుమలు అమ్మవారికి పంపించటం ఆనవాయితీ. శ్రీ తిరుపతమ్మ విగ్రహం పక్కన ఆమె భర్త శ్రీగోపయ్య విగ్రహంతో పాటు వేరే మంటపాలలో శ్రీ అంకమ్మ, ఇతర దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ఠితమయ్యాయి. మాఘ పౌర్ణమి నుంచి ఐదురోజులు, ఫాల్గుణమాసంలో నెలరోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు వండే పొంగళ్లతో సాంస్కృతిక సందళ్లతో ఆలయం అపూర్వ ఆధ్మాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది.

ఎలా చేరుకోవాలి?

తిరుపతమ్మ తల్లి చల్లగా చూస్తుందని కోరిన వరాలు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆమ్మవారి మహిమతో అలరారుతోన్న పెనుగంచిప్రోలు క్షేత్రం కృష్ణాజిల్లా నందిగామకి, జగ్గయ్యపేటకు 22 కి.మీల సమాన దూరంలో ఉంది. కృష్ణా జిల్లా ముఖ్యపట్టణాల నుంచి , ఖమ్మం నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

The post పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.