జారుడుబండ మీద ప్రజాస్వామ్యం

   ప్రజాస్వామ్యానికి మూలమైన పౌర స్వేచ్ఛల పరిరక్షణలో భారత దేశం జారుడు బండ మీద ఉందని, 2018తో పోలిస్తే 2019లో 10 స్థానాలు వెనక్కు వెళ్లిపోయిందని లండన్‌లోని ఎకనమిస్ట్ మీడియా సంస్థ పరిశోధన విభాగం నిగ్గు తేల్చిన విషయాన్ని కొట్టి పారేయలేము. నియంతృత్వ పోకడలున్న దేశాధినేతలు ఎన్నికవుతూ ఉండడం వల్ల మొత్తం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య విలువలు పతనావస్థలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. మౌలిక ప్రజాస్వామిక విలువలపై పెట్టుబడిదారీ అమిత లాభార్జన తత్వం వేసే గొడ్డలి […] The post జారుడుబండ మీద ప్రజాస్వామ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

   ప్రజాస్వామ్యానికి మూలమైన పౌర స్వేచ్ఛల పరిరక్షణలో భారత దేశం జారుడు బండ మీద ఉందని, 2018తో పోలిస్తే 2019లో 10 స్థానాలు వెనక్కు వెళ్లిపోయిందని లండన్‌లోని ఎకనమిస్ట్ మీడియా సంస్థ పరిశోధన విభాగం నిగ్గు తేల్చిన విషయాన్ని కొట్టి పారేయలేము. నియంతృత్వ పోకడలున్న దేశాధినేతలు ఎన్నికవుతూ ఉండడం వల్ల మొత్తం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య విలువలు పతనావస్థలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. మౌలిక ప్రజాస్వామిక విలువలపై పెట్టుబడిదారీ అమిత లాభార్జన తత్వం వేసే గొడ్డలి వేటు ఒక తరహాదయితే మతోన్మత్త జాతీయత పొడిచే కత్తిపోటు మరో విధమైనది. ప్రైవేటు పెట్టుబడి రాజ్యమేలే దేశాలలో సాధారణ ప్రజల శ్రమ దోపిడీ హద్దులు మీరిపోడం వల్లనే ఆర్థిక వ్యత్యాసాలు దారుణంగా పెరిగిపోయాయని ఆక్స్‌ఫామ్ ఇటీవల నిర్ధారించిన సంగతి తెలిసిందే. అది ప్రజాస్వామ్యం బోధించే సమానత్వ, సామరస్యాలను బలి తీసుకుంటుంది.

కాని వాక్ స్వాతంత్య్రం తదితర పౌర స్వేచ్ఛలను మాత్రం ధనిక ప్రజాస్వామ్యాల్లో ఎంతో కొంత రక్షణ ఉంటుంది. మతపరమైన నిరంకుశత్వానిది పైచేయి అయిన చోట వాటికి బొత్తిగా నిలువ నీడ ఉండదు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఇదే. పౌరసత్వ సవరణ (కా) చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశంలోని ప్రజాస్వామిక వాదులంతా రోజుల తరబడిగా ప్రశాంతంగా ఆందోళనలు చేస్తుంటే ఎవరెంతగా అరిచి గీపెట్టినా దానిని వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా తెగేసి చెప్పిన తీరే ఇందుకు నిదర్శనం. అలాగే కశ్మీర్‌లో ప్రజలను ప్రభావితం చేయగల ముఖ్య నేతలను నెలల తరబడిగా నిర్బంధంలో కొనసాగిస్తుండడం, ఇంటర్‌నెట్ సంబంధాలను బంద్ చేయడం వంటి చర్యలు, గో రక్షక దళాల పేరుతో సాగిన పాశవికకాండ వగైరాలు దేశంలో పౌర హక్కులకు, స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించిన మాట వాస్తవం.

ప్రపంచ ప్రజాస్వామిక సూచీలో దేశాల స్థాయిని, స్థానాన్ని నిర్ధారించడానికి ఎకనమిస్ట్ సంస్థ ప్రధానంగా ఐదు కొలతలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇవి ఎన్నికల ప్రక్రియ బహుళత్వం, ప్రభుత్వం పని తీరు, రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌరస్వేచ్ఛలు. ఎన్నికల ప్రక్రియ బహుళత్వం అనే అంశంలో అత్యుత్తమంగా నిలిచిన భారత దేశం మిగతా నాలుగు విషయాల్లో అధమ స్థానం పొందింది. ఈ సందర్భంగా ఎకనమిస్ట్ ప్రత్యేకించి పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రస్తావించడం గమనించవలసిన విషయం. ఈ చట్టం దేశంలోని ముస్లిం జనాభాను తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురి చేసిందని మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తు నిరసన ప్రదర్శనలకు కారణమయిందని పేర్కొన్నది. అలాగే కశ్మీర్‌కు చిరకాలంగా ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదించిన రాజ్యాంగం 370 అధికరణ రద్దును కూడా దేశంలో ప్రజాస్వామ్య విఘాతకరమైన పరిణామంగా ఉదహరించింది.

ఈ చర్యకు ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో భారీ సంఖ్యలో సైనికులను మోహరింప చేసిందని ఇంకా అనేక భద్రతా చర్యలు తీసుకున్నదని భారత దేశానికి అనుకూలురుగా ప్రసిద్ధి చెందిన వారితో పాటు పెక్కు మంది స్థానిక నాయకులను గృహ నిర్బంధం లో పెట్టిందని ప్రజాస్వామ్య సూచీ నివేదిక అభిప్రాయపడింది. ఈ కారణాల వల్ల 2018 లో పదికి 7.23 స్కోర్‌తో ప్రపంచ ప్రజాస్వామిక సూచీలో 41వ స్థానంలో నిలిచిన భారత దేశం ఏడాది కాలంలో 51వ స్థానానికి పడిపోయిందని చెప్పింది. వాస్తవానికి దేశం ఆర్థిక రంగంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఆహార ధరలు అవధులు మీరి మండిపోతున్నాయి. నిరుద్యోగం ప్రబలిపోయింది.

తయారీ రంగం కునుకు తీస్తున్నది. ఇవన్నీ ప్రజలను పేదరికం నుంచి నిరుపేదరికంలోకి నెట్టివేస్తున్నాయి. అవి సహజంగానే వారి వెన్నెముకను విరిచేసి అడుగడుగునా రాజీ పడిపోయి అతి కష్టంగా బతుకును నెట్టుకుపోవలసిన దుస్థితికి దిగజారుస్తాయి. ఆ మేరకు అది దేశంలో ప్రజాస్వామిక విలువలకు భంగకరమే. ఎకనమిస్ట్ పరిశోధన ఈ అంశాన్ని పట్టించుకోలేదు. మత ప్రాతిపదిక మీద పౌరసత్వాన్ని కట్టబెట్టడం, రాజ్యాంగం జమ్మూ కశ్మీర్‌కు హామీ ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని హరించడం అనే రెండు ప్రధాన అంశాలకే ప్రాధాన్యమిచ్చింది. ప్రజాస్వామ్య రాజ్యాంగం ముసుగులోనే అందుకు పూర్తి విరుద్ధమయిన నిర్ణయాలను రుద్దడాన్ని తీవ్రమైన అంశంగా భావించింది. ఇది ప్రధాని మోడీ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ఠ తీసుకొచ్చే విషయమే. దీనిని గుర్తించి తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

India slips 10 places on global competitiveness index

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జారుడుబండ మీద ప్రజాస్వామ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: