ఆప్ వైపే ఢిల్లీ?

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ కైవసం చేసుకుంటుందా, కేంద్రంలో ఎదురులేని అధికారాన్ని అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీది పై చేయి అవుతుందా, గతం లో ఎక్కువ కాలం పాలించి ఢిల్లీ రూపురేఖలు మార్చిన ఘనతతో పాటు అపారమైన అవినీతి నేపథ్యాన్నీ వెనకేసుకున్న కాంగ్రెస్ పార్టీ స్కోరు ఎలా ఉంటుంది […] The post ఆప్ వైపే ఢిల్లీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ కైవసం చేసుకుంటుందా, కేంద్రంలో ఎదురులేని అధికారాన్ని అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీది పై చేయి అవుతుందా, గతం లో ఎక్కువ కాలం పాలించి ఢిల్లీ రూపురేఖలు మార్చిన ఘనతతో పాటు అపారమైన అవినీతి నేపథ్యాన్నీ వెనకేసుకున్న కాంగ్రెస్ పార్టీ స్కోరు ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు సహజం. ఈ సారి 59 స్థానాలు గెలుచుకొని ఆప్ మళ్లీ విజయ పతాకం ఎగురవేస్తుందనే అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఐఐటి పట్టభద్రుడయిన కేజ్రీవాల్ జనలోక్‌పాల్ సారథి అన్నాహజారే అనుయాయిగా, సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టినవాడుగా గుర్తింపు పొందారు.

అంబానీల వంటి ధనపతులతో ఢీ కొట్టిన జన రాజకీయ వీరుడనిపించుకున్నారు. మిత, అతివాద ధ్రువాల్లో దేనికీ చెందనివాడుగా ప్రజల మనుగడకు, వికాసానికి అత్యవసరాలైన విద్యుత్తు, వైద్యం, విద్య, రవాణా సదుపాయాలను చవుకగా అందించడం ద్వారా వారికి మెరుగైన జీవన పరిస్థితులను కల్పించడమే లక్షంగా పని చేసే కొత్తతరం నేతగా పేరు పొందాడు. ఢిల్లీ ఓటర్లు ఆయనకు మళ్లీ జై కొట్టడం ద్వారా భావోద్రేక, ఉద్వేగాలను రెచ్చగొట్టే ఆవేశపూరిత రాజకీయాలకు చెంప పెట్టుపెడతారో లేదో చూడాలి. అలా చేస్తే ముందు ముందు దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు తమ ఉనికికి, ఉన్నతికి తోడ్పడే వారినే ఎన్నుకోవాలనే స్పృహతో ఓటు వేసే అవకాశాలు పెరుగుతాయి. తీవ్రమైన ఆర్థిక సామాజిక సంక్షోభాలు నెలకొన్నా కొంచెమైనా పట్టించుకోకుండా మతపరమైన జాతీయత వైపు దేశాన్ని నడిపించడమే ధ్యేయంగా వరుసగా కరకు నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ఇప్పటికే జార్ఖండ్ ఎన్నికల్లో చావు దెబ్బ తిని అధికారాన్ని కోల్పోయింది.

మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించుకోలేకపోయింది. హర్యానాలో అతి కష్టం మీద ఊత కర్ర సాయంతో పాలక పీఠాన్ని నిలబెట్టుకోగలిగింది. దేశ మంతటా ప్రభుత్వ పాఠశాలలు చతికిలబడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో సర్కారు విద్యను సమున్నత స్థితికి తీసుకెళ్లాడన్న పేరును కేజ్రీవాల్ మూటకట్టుకున్నాడు. విద్యుత్తును పరిమిత ధరకు ప్రజలకు ఆప్ ప్రభుత్వం అందించగలుగుతున్నది. ప్రజల ముక్కులు పిండి అధిక లాభాలు గడించుకుంటున్న వర్గాలతో కుమక్కయ్యాయని బిజెపి, కాంగ్రెస్‌లు రెండింటినీ కేజ్రీవాల్ ఎండగట్టగలిగారు. మొహల్లా దవాఖానాల ద్వారా సామాన్యుడి చెంతకు ప్రభుత్వ వైద్యాన్ని తీసుకుపోగలిగారు. మంచి నీటి సౌకర్యం కల్పనలో కొత్త పుంతలు తొక్కారనిపించుకున్నారు.

వైఫై సదుపాయాన్ని ఉచితంగా సమకూర్చారు. ఉద్యోగినులకు ఉచిత రవాణా కల్పించారు. విద్యార్థులకూ దానిని విస్తరింప చేస్తానని వాగ్దానం చేశారు. ఢిల్లీలో ఇప్పుడు సాగుతున్న ఎన్నికల సమరం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైనదిగా పరిగణించడానికి వీలు లేదు. నగర జీవనంలో పౌరులకు ముఖ్యమైన సమస్యలు విజయవంతంగా పరిష్కరించగలగడమే పాలకుల దక్షతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇవి మినహా ఇంకేమి మాట్లాడినా పట్టించుకోవద్దని పౌర సౌకర్యాలకే ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయాలని ఆప్ రాజకీయాలు ఢిల్లీ ప్రజలకు తెలిసి వచ్చేలా చెప్పాయి. దేశమంతటా ఆప్ మాత్రమే గెలుస్తుందని కాదుగాని, అటువంటి జనహిత పాలనను వాగ్దానం చేసే శక్తులు ముందుకు దూసుకురాగల సూచనలను ఆప్ పునర్విజయం గాఢంగా రూపు కట్టిస్తుంది. తాము కూడా ఢిల్లీ ప్రజల అడుగు జాడల్లోనే ఎందుకు నడవకూడదనే యోచనను మొత్తం దేశ ప్రజల్లో అంకురింప చేస్తుంది.

కుల, మత, ప్రాంతీయ మున్నగు ప్రాతిపదికల మీద ఓటర్ల మనోభావాలను పక్కదారి పట్టించి అధికారాన్ని కాజేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంపన్న వర్గాల ప్రయోజనాలకు పల్లకీ పట్టే దొంగ రాజకీయ శక్తుల వెన్నులో అది వణుకు పుట్టిస్తుంది. ఇక్కడే ఢిల్లీ ఓటర్ల విజ్ఞత నిరూపణ కావలసి ఉంది. ఆప్ రాజకీయ పుస్తకంలోనూ మరకలు లేకపోలేదు. 2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు ఆప్ సభ్యులు లంచం తీసుకున్నట్టు బయటపడింది. అలాగే ఆప్ ఎంఎల్‌ఎ సత్యేంద్ర జైన్ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారమూ వివాదాస్పదమైంది. ఆప్‌కు రూ. 19 కోట్ల విరాళం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న కాంగ్రెస్ వైపు నుంచి దూసుకొచ్చింది. వీటన్నింటినీ దాటి కేజ్రీవాల్ ఇప్పటికీ ఒక వినూత్న, విప్లవాత్మక నగర రాజకీయాల దీప్తిగా నిలబడ్డారు. ఈసారి ఆయన నెగ్గుతారా, ఓడుతారా, జనహితానికి, భావోద్వేగ రాజకీయాలకు మధ్య ఢిల్లీ ప్రజలు దేనిని ఎంచుకుంటారు అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న.

 

AAP will be Win in Delhi Assembly Elections

The post ఆప్ వైపే ఢిల్లీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.