ఎన్‌పిఆర్‌పై ‘అభయం’!

     పులి శరీరం మీది మచ్చలు తొలగిస్తే అది పులి కాకుండా పోతుందా? అయినా అలా తొలగించాలన్న సంకల్పాన్ని, ఆ మేరకు లభించిన హామీని కూడా స్వాగతించాలి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్)లోని పౌరుల తల్లిదండ్రుల జన్మస్థలానికి సంబంధించిన ప్రశ్నను అప్రధానం చేస్తున్నామని దానికి విధిగా జవాబు చెప్పవలసిన అవసరం లేదని కేంద్రం ఇచ్చిన అభయం పులిని మళ్లీ బోనులోకి పంపించకుండా దాని మచ్చలను తొలగించడం వంటి […] The post ఎన్‌పిఆర్‌పై ‘అభయం’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     పులి శరీరం మీది మచ్చలు తొలగిస్తే అది పులి కాకుండా పోతుందా? అయినా అలా తొలగించాలన్న సంకల్పాన్ని, ఆ మేరకు లభించిన హామీని కూడా స్వాగతించాలి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్)లోని పౌరుల తల్లిదండ్రుల జన్మస్థలానికి సంబంధించిన ప్రశ్నను అప్రధానం చేస్తున్నామని దానికి విధిగా జవాబు చెప్పవలసిన అవసరం లేదని కేంద్రం ఇచ్చిన అభయం పులిని మళ్లీ బోనులోకి పంపించకుండా దాని మచ్చలను తొలగించడం వంటి చర్య అనిపిస్తే తప్పుపట్టవలసిన పని లేదు. ఈ నిర్ణయమైనా ప్రభుత్వం మంచి మనసుతో తీసుకున్నది కాదు. పౌరసత్వ చట్టం (సిఎఎకా), ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి (అసోంలో మాదిరి జాతీయ పౌర జాబితా)ల పట్ల ప్రజల నుంచి రోజురోజుకీ అధికమవుతున్న ఒత్తిడికి తలొగ్గే అది ఈ రాయితీని కల్పించిందని బోధపడుతున్నది.

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి ఇచ్చిన రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేసినప్పుడు సైతం లేని దేశవ్యాప్త ప్రతిఘటనోద్యమం పౌరసత్వ సవరణ చట్టంపై ఎగసిపడింది. ఇప్పటికీ కొనసాగుతోంది. ముందు ముందు మరింత గట్టిపడే సూచనలూ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎన్‌పిఆర్‌పైనా నిరసన వెల్లువెత్తుతున్నది. ఎన్‌పిఆర్ కోసం దేశ ప్రజల నుంచి సమాచార సేకరణ జనాభా లెక్కల గణన (2021) మొదటిదశతో బాటుగా వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతున్నది. ఇలా జనగణనతో పాటు ఎన్‌పిఆర్ తయారీ కొత్త విషయం కాకపోయినా అది గతంలో ఎప్పుడూ ఇంతగా వివాదస్పదం కాలేదు. కారణం అసోంలో మాదిరి ఎన్‌ఆర్‌సి(జాతీయ జనాభా జాబితా)ని దేశవ్యాప్తంగా రూపొందించడానికి అనువుగా ఈసారి ఎన్‌పిఆర్‌ను వాడుకుంటారనే అభిప్రాయం ప్రజల్లో నాటుకోవడమే. ఎన్‌ఆర్‌సిని జాతీయస్థాయిలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనూ, బయట పదేపదే ప్రకటించి ఉన్నారు.

అసోంలో తగిన ఆధార పత్రాలు చూపించలేకపోయిన 19 లక్షల మంది అక్కడి ఎన్‌ఆర్‌సిలో చోటు పొందలేకపోయారు. పత్రాల సేకరణ క్రమంలో బీద బిక్కి నానాఅగచాట్లు పడ్డారు. ఆత్మహత్యలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో అమిత్ షా దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సి సంకల్పం తీవ్ర నిరసనను ఎదుర్కొన్నది. అప్పుడు ఆ యోచనకు స్వస్తి చెప్పినట్టు కనిపించినా మోడీ ప్రభుత్వం అంతలోనే ఎన్‌పిఆర్ ఆలోచనను ప్రకటించి, దానికి నిధులను కూడా కేటాయించింది. 2021 జనాభా లెక్కల సేకరణపై కేంద్రం శుక్రవారం నాడు అన్ని రాష్ట్రాల అధికారులతో దేశ రాజధానిలో జరిపిన సమావేశంలో ఎన్‌పిఆర్‌పై బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల నుంచి ప్రశ్నల పరంపర దూసుకువచ్చింది. తామెక్కడ పుట్టామో సరిగ్గా తెలియని వారు అసంఖ్యాకంగా ఉన్న దేశంలో పౌరుల తల్లిదండ్రుల పుట్టిన ఊరు వివరాలడగడం హాస్యాస్పదమనే అభిప్రాయం దృఢంగా వెల్లడైంది. దాంతో ఆ ప్రశ్నను అప్రధానమైనదిగా చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలను ఆమోదించాయి.

పశ్చిమబెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు ఎన్‌పిఆర్‌కు సహకరించకబోమని ప్రకటించాయి. ఎన్‌ఆర్‌సి కోసమే దానిని ఉద్దేశించారని ఆరోపించాయి. బెంగాల్‌కు చెందిన 20 మంది పౌరులు ఎన్‌పిఆర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. వారి పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అసలు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిల మూలమే ప్రశ్నార్థకమైంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌ల నుంచి వచ్చి దేశంలో స్థిరపడిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కట్టబెట్టాలంటూ అందుకు సంబంధించిన చట్టానికి సవరణ తీసుకురావడంలోనే ఒక మతానికి చెందిన ప్రజలపై వ్యతిరేకత ఇమిడి ఉందనేది వాస్తవం. మతాతీతమైన పౌరసత్వాన్ని హామీ ఇస్తున్న రాజ్యాంగ విధానం ఉన్న దేశంలో మొదటిసారిగా అందుకు మతాన్ని ప్రాతిపదిక చేయడం పట్ల దేశంలోని సెక్యులర్, ప్రజాస్వామికవాదులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు భగ్గున మండుతున్నారు.

ఇది దేశంలో హిందూ రాజ్యస్థాపనకు నాందీ కాగలదని భావిస్తున్నారు. దేశంలోని ముస్లింల పౌరసత్వానికి ఎటువంటి ముప్పు ఏర్పడబోదని ప్రధాని మోడీ ప్రభుత్వం పదే పదే ఇచ్చిన హామీ వారిలో సంతృప్తి కలిగించలేదు. మౌలిక రాజ్యాంగ విలువలకు బిజెపి పాలకులు మంటపెడుతున్నారనే అభిప్రాయం గట్టిగా నెలకొనడమే ఇందుకు కారణం. అందుచేత ప్రధాని మోడీ, అమిత్ ద్వయం ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవడమే తగిన పరిష్కారం కాగలదు. ప్రజలను మతప్రాతిపదిక మీద విడదీసి చూస్తున్నారనే అభిప్రాయం దేశ శ్రేయస్సుకు ఎంతమాత్రం మంచి చేయదు.

No link between NRC and NPR says Amit Shah

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్‌పిఆర్‌పై ‘అభయం’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.