అమెరికా- ఇరాన్ ఆధిపత్య పోరు

  ఇటీవల పశ్చిమాసియా కేంద్రంగా పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా ప్రపంచ దేశాల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ఒక వైపు ఇరాన్ మరోవైపు అమెరికా నువ్వా నేనా అన్నట్టు తలపడటం ద్వారా ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం కలగడమే కాకుండా దాని పర్యవసానాలు అనేక దేశాలపై నేరుగా పడే వీలుంది. భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతంపై పట్టు కోసం అటు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియాలు ప్రయత్నిస్తూ ఉండటంతో […] The post అమెరికా- ఇరాన్ ఆధిపత్య పోరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇటీవల పశ్చిమాసియా కేంద్రంగా పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా ప్రపంచ దేశాల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ఒక వైపు ఇరాన్ మరోవైపు అమెరికా నువ్వా నేనా అన్నట్టు తలపడటం ద్వారా ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం కలగడమే కాకుండా దాని పర్యవసానాలు అనేక దేశాలపై నేరుగా పడే వీలుంది. భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతంపై పట్టు కోసం అటు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియాలు ప్రయత్నిస్తూ ఉండటంతో ఇది ఆధిపత్య పోరుకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి దేనికైనా తెగించే అమెరికా ఆయా దేశాల ప్రభుత్వాలను అస్తిరపరిచి తమ అదుపాజ్ఞలకు లోబడే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే తన విదేశాంగ విధానపు లక్షంగా పెట్టుకోవడం విషాదకరం.

1979 నాటి ఇరాన్ విప్లవం నుండి మొదలైన ఇరాన్ అమెరికా శత్రుత్వం నేడు తార స్థాయికి చేరింది. ఆనాటి నుండి ఇరాన్ పాలకులు అవలంబించిన విధానాలు కూడా ఈ పరిస్థితికి కొంత కారణంగా చెప్పొచ్చు. సోవియెట్ పతనమయ్యాక తమ ఆధిపత్యానికి ఇక తిరుగుండదని భావించిన అమెరికా, బహుళ ధ్రువ ప్రపంచంలో వస్తున్న సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా లేదు. తమ చెప్పు చేతల్లో లేని ప్రపంచ దేశాలను సామ, దాన, భేద దండోపాయాలను ఉపయోగించి తమకు సామంతులుగా మారమనే పిడివాదంలోనే అసలు సమస్య దాగుంది. ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని లెక్క చేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఆయా దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుని అస్థిర పరిస్థితులు రాజేస్తుంది. సోవియెట్ వ్యాప్తిని అడ్డగించాలనే కారణంతో ఆఫ్ఘానిస్థాన్‌లో అనేక తీవ్రవాద గ్రూపులకు సైనిక శిక్షణ ఇచ్చి నిధులు, ఆయుధాలను సరఫరా చేసిన ప్రయత్నాల మూలంగా నేడు అక్కడ హింస, అరాచక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.

ఒక వైపు సౌదీ అరేబియా ద్వారా చాందసవాద శిక్షణ మరో వైపు అమెరికా అందించిన రక్షణ సదుపాయాలతో ఉగ్రవాద మూకలు రెచ్చిపోతున్నాయి. ఈనాడు మనం మాట్లాడుకుంటున్న ఆల్‌ఖైదా దాని తాను ముక్కైన ఐసిస్ వ్యాప్తికి పరోక్షంగా సహాయం చేసింది అమెరికానే అనటంలో ఎటువంటి సందేహం లేదు. చమురు, గ్యాస్ వంటి విలువైన సంపదకు కేంద్రంగా ఉన్న పశ్చిమాసియా ప్రాంతం అనేక వైరుధ్యాలకు నెలవు. రాజకీయంగా, మతపరంగా అనేక సంక్లిష్టతలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. ఇస్లాంలోని సున్ని వర్గానికి సౌదీ నేతృత్వం వహిస్తుంటే షియా వర్గానికి ఇరాన్ నాయకత్వ బాధ్యతను తీసుకుంది. రానురాను ఇది ఆధిపత్య పోరుగా మారి అనేక దేశాలు రావణ కాష్టంగా మారడానికి కారణమైంది. సౌదీ పాలకులకు అండగా ఉండి అమెరికా తమ ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని ఇరాన్ భావించగా, హిజ్‌బుల్ వంటి తీవ్రవాద గ్రూపులకు చేయూతనందించి ఇరాన్ తమ మిత్ర దేశాలను ఇబ్బందులకు గురి చేస్తుందని సౌదీ భావించసాగింది.

పైగా ఆయా దేశాల్లో ఏర్పడిన మిలిటరీ ప్రభుత్వాలు, రాచరిక ప్రభుత్వాలు ప్రగతి నిరోధంగా మారి తీవ్రవాద పెరుగుదలను పోషించాయి. ఒకరిపై మరొకరు కాలు దువ్వుకుంటూ ఆ ప్రాంత శాంతి సురస్థిరతలకు భంగం కలిగించాయి. ఇరాక్‌ను పాలించిన సద్దామ్ హుస్సేన్ వంటి మిలిటరీ అధికారుల పాలనలో ఈ వర్గాల మధ్య కుమ్ములాటలను అణచివేసినా అంతర్లీనంగా ఉన్న వర్గ వైషమ్యాలు ఆ పాలన అంతమవగానే మరలా ఊపిరి పోసుకున్నాయి. స్థిరమైన పాలన లేకపోవడం, శాంతి భద్రతలు పతనమవడంతో ఇటీవల కాలంలో ఐసిస్ రూపేణా మరో తీవ్రవాద గ్రూపు ముందుకు వచ్చింది. ఐసిస్‌ను నిర్మూలించే కార్యక్రమంలో ఇరాన్, అమెరికా, సిరియా, రష్యా వంటి దేశాలు సహకరించుకున్నా ఆ పోరు ముగియగానే వీరి మధ్య విభేదాలు ముందుకు వచ్చాయి. సిరియాలోనైతే అసాద్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అమెరికా ప్రయత్నిస్తుంటే అసాద్‌కు మద్ద్దతుగా రష్యా, ఇరాన్‌లు ఉన్నాయి.

యెమెన్‌లోని ప్రభుత్వానికి సౌదీ సహాయ సహకారాలు అందిస్తుంటే అక్కడి శత్రువర్గమైన హతీలకు ఇరాన్ బాసటగా ఉంది. ఇరాక్‌లోని షియా తీవ్రవాద గ్రూపులని ఉపయోగించి ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుందనే భయం ఏనాటి నుండో సౌదీ అరేబియా, అమెరికాలను వెంటాడుతున్నది. ప్రస్తుత కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన విధానాలు ఉద్రిక్తతలకు మరింత తోడ్పాటును అందించాయి. గత ఎన్నికల్లో అమెరికాను మరోసారి గొప్పగా మారుస్తానని చేసిన ప్రకటనల మర్మాన్ని నేడు అక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మత బూచీని చూపి వలసలను అమెరికాలోని సమస్యలకు కారణంగా చూపి గద్దె నెక్కిన ట్రంప్ అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుండి ఏకపక్షంగా బయటకు రావడం ద్వారా వాటికి ఉండే విలువను ప్రశ్నార్థకంగా మార్చేశారు.

ఇరాన్‌తో అమెరికా సహా ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా, యుకె కుదుర్చుకున్న జాయింట్ కంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జెసిపిఒఎ)నుండి వైదొలగడంతో దాని అమలుపై నీలినీడలు కమ్మాయి.అమెరికాని బుజ్జగించే స్థాయిలో ఐరోపా సమాఖ్య లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఒప్పందంలో భాగంగా తమపై ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆంక్షలు తొలగిపోతాయనుకున్న ఇరాన్‌కు ట్రంప్ వైఖరి లేనిపోని చిక్కులను తెచ్చిపెట్టింది. దీనికి బదులుగా తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని మరలా మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఒప్పందంలో భాగంగా ఉన్న దేశాలు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. అణ్వాయుధాలు లేని కారణంగానే ఆనాడు అమెరికా ధైర్యంగా లిబియాలో గడాఫీ, ఇరాక్‌లో సద్దామ్ హుస్సేన్‌లను గద్దె దించిందనే భావన ఇరాన్ పాలకుల్లో గట్టిగా ఉంది.

వీటన్నిటితోపాటు ఐసిస్‌పై యుద్ధంలో అమెరికాకు సహాయికారిగా ఉన్న కుర్దుల సమస్య ప్రశ్నార్థకంగానే ఉంది. అనేక దేశాల మధ్య చీలిపోయిన కుర్దులు తమ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా పోషించే పాత్రపైనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ వంటి దేశాల వ్యాప్తంగా విస్తరించి ఉన్న మైనారిటీలైన కుర్దులపై ఆయా దేశాల పాలకులు ఉక్కు పాదం మోపుతున్నారు. వీటన్నిటితో పాటు ఇటీవలే జరిగిన పరిణామాలు అమెరికా ఇరాన్‌ల మధ్య యుద్ధం ముంచుకు వస్తుందా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. ఇరాన్‌ను సైనిక శక్తిగా మరల్చడంలో కీలక భూమిక పోషించిన కాసిం సులేమానీ హత్యతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఇరాన్ జరిపిన మెరుపు దాడులతో సమస్య తీరిపోతుందనే చెప్పలేం.

ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ ప్రాంతం అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది గనుక చమురు దిగుమతులపై ఆధారపడ్డ దేశాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇరాకీ పార్లమెంటు తీసుకున్న నిర్ణయంతో అమెరికా దళాలు వైదొలగితే ఐసిస్ ఉగ్రవాదులు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించే వీలుంది. అమెరికా సైనిక దళాలు వైదొలగే ప్రక్రియకు చట్టబద్ధ రూపం ఇవ్వాలంటే మరి కొంత సమయం పడుతుంది. గనుక ఇరాక్‌లోని అమెరికా స్థావరాలను లక్షంగా చేసుకుని ఇరాన్ మరిన్ని దాడులు చేయవచ్చు. ప్రతీకార దాడులకు తెగబడితే ఇరాన్‌లోని సాంస్కృతిక, చారిత్రక కట్టడాలను మట్టికరిపిస్తామని ట్రంప్ అనడం తన అవగాహన లేమికి నిదర్శనం. అస్థిర పరిస్థితులే ఉగ్రవాదానికి మూల కారణం గనుక ప్రపంచ దేశాలు ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది.

Article about Iran and US Violence

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమెరికా- ఇరాన్ ఆధిపత్య పోరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: