సోషల్ మీడియా స్వేచ్ఛ

           ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా నిర్భయంగా వక్తం చేసుకునే వేదికగా విశేష జనాదరణ పొందుతున్న సోషల్ మీడియా (సామాజిక మాధ్యమం)లో పెట్టే పోస్టింగ్‌లు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో త్రిపుర హైకోర్టు శనివారం నాడు ఇచ్చిన ఒక ఉత్తర్వుకు ఎంతో ప్రాధాన్యమున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆన్‌లైన్ ప్రచారాన్ని ఫేస్‌బుక్‌లో విమర్శించినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ కార్యకర్త ఒకరిని అరెస్టు చేసిన కేసులో […] The post సోషల్ మీడియా స్వేచ్ఛ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

           ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా నిర్భయంగా వక్తం చేసుకునే వేదికగా విశేష జనాదరణ పొందుతున్న సోషల్ మీడియా (సామాజిక మాధ్యమం)లో పెట్టే పోస్టింగ్‌లు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో త్రిపుర హైకోర్టు శనివారం నాడు ఇచ్చిన ఒక ఉత్తర్వుకు ఎంతో ప్రాధాన్యమున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆన్‌లైన్ ప్రచారాన్ని ఫేస్‌బుక్‌లో విమర్శించినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ కార్యకర్త ఒకరిని అరెస్టు చేసిన కేసులో హైకోర్టు పోలీసులను తీవ్రంగా తప్పుపట్టింది. ఆ కేసును కొట్టి వేసింది. ఇక ముందు ఇంకెవరినీ అరెస్టు చేయడానికి వీలులేదని కూడా ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి గమనించదగినవి. సోషల్ మీడియా ద్వారా అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ పౌరుల ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇది వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు అపూర్వమైన, అసాధారణమైన రీతిలో పట్టం కడుతున్నది.

ప్రభుత్వ ఉద్యోగులూ సోషల్ మీడియాలో స్వేచ్ఛగా పాల్గోవచ్చనడం సమున్న త స్వేచ్ఛ. కల్లోల పరిస్థితులు విస్తరిస్తాయనే భయంతోనో, ఇతరేతర కారణాల వల్లనో దీర్ఘకాలం పాటు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని బంద్ చేస్తున్న పాలకుల ధోరణుల ఉరవడిని అరికట్టగల శక్తి ఈ ఉత్తర్వుకున్నది. పాలకులను, ప్రభుత్వాల నిర్ణయాలను అవహేళన చేస్తూ పెట్టిన పోస్టింగ్‌లపై పలు సందర్భాల్లో దేశంలో పలు చోట్ల కేసులు దాఖలవుతున్నాయి. సంబంధితులను అరెస్టు చేస్తున్నారు. త్రిపుర హైకోర్టు తాజా ఉత్తర్వు ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేదిగా ఉన్నది. ఈ ఉత్తర్వు వెలువడగానే ఈ కేసులో భారత శిక్షాస్మృతి 120 (బి), 153 (ఎ) సెక్షన్ల కింద మోపిన అభియోగాలను త్రిపుర పోలీసులు రద్దు చేశారు. ఈ సెక్షన్లు రెండూ క్రిమినల్ నేరాలకు సంబంధించినవి. ఇక్కడ గతంలో సమాచార హక్కు చట్టం 66 ఎ సెక్షన్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించుకోవలసి ఉంది.

ఇంటర్‌నెట్ వంటి సాధనాలను ఉపయోగించి తప్పుడు ప్రచారం కోసం పోస్టింగ్‌లు పెట్టే వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించడానికి అవకాశం కల్పిస్తూ ఈ సెక్షన్‌ను సమాచార చట్టంలో చేర్చారు. ఇది రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణకు విరుద్ధమైనదని, సమాచారం తెలుసుకోడానికి ప్రజలకు గల హక్కును కబళిస్తుందని ఈ తీర్పులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. సోషల్ మీడియా పోస్టింగ్‌ల వికృత ధోరణి పెరిగిపోతున్నదని భావిస్తున్న పాలకులు ఆయా సంస్థల యాజమాన్యాలపై ఆంక్షలు, నియమ నిబంధనలు విధించే యత్నాన్ని ఈసరికే ప్రారంభించారు. యాజమాన్యాలు తమ ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోడం లేదని ముఖ్యంగా భారత దేశంలోని సోషల్ మీడియా సంస్థల సొంతదార్లు విదేశాల్లో ఉన్నందున వాటిని అదుపాజ్ఞల్లో పెట్టడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయం నెలకొని ఉంది.

అందుచేత అవి ఇండియాలో తమ కార్యాలయాలను నెలకొల్పి తగిన క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని, జవాబుదారీగా ఉండాలని భారత ప్రభుత్వం ఆశించింది. మద్రాస్, బొంబాయ్, మధ్యప్రదేశ్ తమపై దాఖలయిన కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదలాయించాలని ఫేస్‌బుక్ సంస్థ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ఉన్నది. సామాజిక మాధ్యమాలను అదుపు చేసేందుకు తగిన నిబంధనలను ప్రభుత్వమే రూపొందించాలని కూడా అందులో సూచించింది. తాము జనాభిప్రాయానికి వేదిక ను కల్పిస్తున్నామేగాని పోస్టింగ్‌లకు ఎంతమాత్రం బాధ్యులం కాజాలమని సోషల్ మీడి యా సంస్థలు వాదిస్తున్నాయి. ప్రధాన వాహిని మీడియా సంస్థలకు తమకు తేడా ఉందని కూడా చెబుతున్నాయి. అందుచేత తమకు రక్షణ కావాలని కోరుతున్నాయి.

టిక్‌టాక్ దారుణాలు, మూక హత్యలకు దారి తీసిన వదంతులు వంటివి సోషల్ మీడియా దుర్వినియోగానికి నిదర్శనాలే. అయితే అంతమాత్రాన సామాజిక మాధ్యమాల్లో జనాభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను అరికట్టాలనడం ఎటువంటి కత్తిరింపులూ లేకుండా ప్రజలు తమ అభిప్రాయాలను యథాతథంగా వ్యక్తం చేసుకోడానికి అమరిన నూతన వేదికను ఇతర మీడియా సంస్థల స్థాయికి కుదించడమే అవుతుంది. దీని వల్ల అటు పాలకులకు ఇటు ప్రజలకు జనాభిప్రాయ గాఢత తెలుసుకునే అవకాశం మూతపడుతుంది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం పౌరుల ప్రాథమిక హక్కు అని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ హక్కు ఉంటుందని త్రిపుర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రజాస్వామ్య స్వేచ్ఛకు వన్నె తెచ్చేదిగా ఉంది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సోషల్ మీడియా స్వేచ్ఛ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: