ఆర్ద్రత అక్షరమైంది

  గాయపడ్డ హృదయాల దండ జఖ్మి ముస్లింవాద సాహిత్యం రాస్తున్న కొత్తతరం కవయిత్రుల్లో నస్రీన్‌ఖాన్ ఒకరు. ముస్లింల, ముస్లిం స్త్రీల తరపున మాట్లాడే మరో కొత్త, గట్టి కంఠస్వరం నస్రీన్. మైనారిటీ ముస్లింల సంఘర్షణ, వారి వెనకబాటుతనం, వారు ఎదుర్కొంటున్న సామాజికదాడులు చూసి చలించిన మనసు వేదనకు కవితారూపమే నస్రీన్ తాజా కవితాసంపుటి. పైకి ముస్లిం అస్తిత్వవాద సాహిత్యంగా కనబడుతున్నా ఈ సంపుటిలో సగభాగం స్త్రీవాద సాహిత్యం చోటుచేసుకుంది. ఐనా కూడా కవితలన్నీ సార్వజనీనతను పొదువుకొని పాఠకులందరు […] The post ఆర్ద్రత అక్షరమైంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గాయపడ్డ హృదయాల దండ జఖ్మి

ముస్లింవాద సాహిత్యం రాస్తున్న కొత్తతరం కవయిత్రుల్లో నస్రీన్‌ఖాన్ ఒకరు. ముస్లింల, ముస్లిం స్త్రీల తరపున మాట్లాడే మరో కొత్త, గట్టి కంఠస్వరం నస్రీన్. మైనారిటీ ముస్లింల సంఘర్షణ, వారి వెనకబాటుతనం, వారు ఎదుర్కొంటున్న సామాజికదాడులు చూసి చలించిన మనసు వేదనకు కవితారూపమే నస్రీన్ తాజా కవితాసంపుటి. పైకి ముస్లిం అస్తిత్వవాద సాహిత్యంగా కనబడుతున్నా ఈ సంపుటిలో సగభాగం స్త్రీవాద సాహిత్యం చోటుచేసుకుంది. ఐనా కూడా కవితలన్నీ సార్వజనీనతను పొదువుకొని పాఠకులందరు కవితల్లోని ఆర్ద్రతను తమదిగా భావించేలా చేస్తాయి. అదే ఈ కవయిత్రి ప్రతిభ, పరిణతి. పైకి ఈ కవితలన్నీ ముస్లింల కష్టాలు, ముస్లిం స్త్రీల బాధలకు అక్షరరూపంలా కనిపిస్తున్నా…ఇవి ప్రతి బాధితుడి తరపున వకాల్తా పుచ్చుకుని రాసిన కవితల్లా గోచరిస్తాయి. అలా గాయపడ్డ ప్రతి బాధితుడి హృదయావిష్కరణే ఈ ‘జఖ్మి’.

డా. షాజహానా గారు తన ముందుమాటలో పేర్కొన్న ఇవి అందరికి కవితలుగా అనిపిస్తున్నాయేమో కానీ ఇవి ముస్లింల, అంటే మీ తోటి మనుషుల ఆత్మఘోష. వాళ్ళ కన్నీళ్ళకు అనువాదం. వాళ్ళ రంగు వెలిసిన జీవితాలకు చిత్రిక పట్టిన అక్షరాలు వాక్యాలు అక్షరసత్యాలు. బలమైన ప్రతీకలతో గాఢమైన విషయాలను సాంద్రంగా చెప్పడమెలానో నస్రీన్ కి తెలుసు. ఉదాహరణకి మొదటి కవిత “అమ్మీ’వ జయతే’లో ‘గడియారపు ముళ్ళలాంటి అమ్మీలు’ అన్న ప్రతీకతో కవితలో చెప్పదల్చుకున్న విషయాన్ని మనకు ముందే రూపుకట్టిస్తారు. గడియారం ముళ్ళది నిస్సారమైన, అలుపెరగని ప్రయాణం. అలాంటి గడియారం ముళ్ళతో అమ్మీ జీవనయానాన్ని పోల్చిచెప్పడంతోనే పఠిత ఆ కవితలోకి ఆర్ద్రంగా తొంగిచూస్తాడు. పైకి ముస్లిం స్త్రీ అయిన అమ్మ గురించి చెప్తున్నట్లున్నా ఇది ఎందరో అమ్మలకు సంబంధించిన అంశమే. ‘ప్రపంచంపై కన్నెత్తగలిగితే గోర్కీ అమ్మను తలపించగలదు’ అన్న వాక్యంతో కవితకు విశ్వజనీనతను ఆపాదించింది. అలాగే ఇంకో కవితలో తనని తాను కోల్పోయిన ఒక స్త్రీ అంతరంగ అస్తిత్వ ఆవేదనను ఇలా బలంగా చెప్తారు ‘రూహ్ (ఆత్మ) లేని నేనులా’.

పురుషాధిక్య ప్రపంచంలో తల్లడిల్లే స్త్రీ అఖరికి తన సంతానం విషయంలో కూడా తన అస్తిత్వం చూపుకోలేని స్థితిని సూటిగా, గుచ్చుకునేలా ప్రశ్నిచిన తీరుని చూడండి. ‘నీలోని ఒకే ఒక్క చుక్క నను బందీని చేసేసిందా?/బిందువు చిన్నదే/నేను నాలోనే ప్రాణప్రతిష్ట చేశాను/రక్తమాంసాలు అందించాను/నా శ్వాస ప్రవహింపజేశాను/ఎన్నింటినో త్యాగం చేసి తొమ్మిది నెలలు/నీ కడుపులో దాచుకున్నది నీ ప్రతిరూపమేనంటే/ఇంతకు మించిన న్యాయాన్ని ఈ లోకం నుంచి ఆశించొచ్చా?’. ఆపై ‘వెన్ను నిటారు చేసుకుని/మనోనేత్రంతో ప్రపంచాన్ని చూడాల్సిన/యవ్వనాన్ని నలుపు వస్త్రంలో చుట్టబెట్టి/చూరుకు వేలాడదీశాను’ అంటూ ముస్లిం సమాజంలోని స్త్రీలపై గల ఆంక్షల గురించి కలతచెందుతూనే ‘స్వేచ్ఛగా చిందులాడాల్సిన బాల్యాన్ని/ఆడపిల్లనైనందుకు/అలవర్చుకోవాల్సిన తరీఖాలకు/అంకితమిచ్చాను’ అంటూ ప్రతీ ఆడపిల్లపై చూపించే వివక్ష గురించి రాస్తారు. పెళ్ళి అనే తంతుతో స్త్రీ స్వేచ్ఛను హరించివేసి ఆమె అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని పురుషాధ్యికతతో నలిపివేస్తారని వేదనతో ‘షాదీ అనే ప్రహసనానికి జిందగీని తాకట్టు పెట్టి/ఆటబొమ్మనై/పునరుత్థానం చెందుతూ/ఆశలన్నింటినీ/సజీవ సమాధి చేసుకున్న బాదల్ కా టుకడాను అంటూ ‘అప్పుడే తెలిసింది ఉద్యోగం చేసినా/ఇష్టాయిష్టాలన్నీ ఆ ఇంటి మర్దానావే ఉంటాయని/కనీసం నాపైనా నాకు సాధికారత లేదా?’ అని ప్రశ్నిస్తారు.

ముఖ్యంగా ముస్లిం సమాజంలో స్త్రీపై ఉన్న వివక్షని ‘విటమిన్ డి లోటంటూ డాక్టర్లు అరిచి గీపెట్టినా మా/మగవారికిష్టం లేనిదే సూర్యుడికైనా ముఖం చూపం/చూపాల్సొచ్చినా బురఖాల మాటునే’ అని ధైర్యంగా ఎండగడుతూనే ‘నా శారీరక ధర్మమే/నీ పుట్టుక/నా మాలిన్యమే/నీ రూపు/నా మకిలియే/నీ దేహం/శుభ్రమెలా చేసుకుంటావు’ అని సమస్త స్త్రీ జాతి తరపున ప్రశ్నిస్తున్నారు. అంతగా వివక్షకు గురైన స్త్రీ ఏళ్ళ తరువాత తన మనసు విప్పుతోందని ఇంకా ఆంక్షల చట్రానికి కందెనలు పూస్తూ ఉండకుండా ఆమె మనసును వినమని పురుషుడి మనసు కదిలేలా చెప్తోంది.

‘మేమున్న చోటు మాది కాదా?’ అన్న బలమైన ప్రశ్నతో మైనారిటీ ముస్లింల తరపున కవిత్వగొంతుక వినిపిస్తున్న నస్రీన్ ‘కలుపు మొక్కలు లేని పంట ఉంటుందా?/నీ జాతిలో లేవని నువ్వేమైనా కితాబివ్వగలవా?/పెళ్ళికీ తద్దినానికీ ఒకటే మంత్రమంటావా?/జాతి మొత్తాన్నే అవమానించే మూర్ఖత్వంపై/జాలిపడుతున్నా’ అంటూ అందరి ముస్లింలను జాతివిద్వేషకారుల, జాతి వినాశకారుల జాబితాలో చేర్చడం అమానవీయమని చరిత్ర నిండా ఆనవాళ్ళున్నా సమాధానం లేని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్ళ దిల్ కీ తక్లీఫ్ ని అర్థం చేసుకోమని జాతికి దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింలు ఈ దేశపు ఇసుకరేణువులు, సౌశీల్యత నిండిన నిగ్రహాలు. వారికి ప్రేమను పంచడమే తెలుసు, వారిని మనవారిగా భావిస్తూ సోదరభావంతో జీవిద్దాం అని ఉద్బోధ చేస్తుంది. వారి మనోనైర్మల్యాన్ని, ప్రేమైక హృదయాన్ని, సమైక్యతాభావనల్నీ మన మనసులకి అద్దటానికి కవిత్వప్రయత్నం చేసింది నస్రీన్.

ప్రపంచీకరణ మాయలో మార్కెట్ శక్తులు నిజమైన శ్రమజీవి కష్టాన్ని ఎలా దోచుకుంటున్నాయో, వారి స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎలా ఉందో నస్రీన్‌కి బాగా తెలుసు. అందుకే ఆ కన్నీటిమయ గాథలని కవితామయం చేశారు. ‘ఆకలి మంటలు దహిస్తున్నా మరో కొత్త డిజైన్ కోసం/వెతుకులాట కనిపిస్తుంది ఆ కళ్ళలో/ఏళ్ళకొద్దీ అందమైన జోడాలు తయారు చేయడంలో/కురిపించే ప్రేమ సొంత దుకాన్‌ను అయినా తెరుచుకోనివ్వదు’ అంటూ కళానైపుణ్య పనిజీవుల ఎదుగూబొదుగూ లేనితనాన్ని అక్షరీకరిస్తుంది. ‘దూదినేకే మస్తాను సాయిబు/అందరిళ్ళలో మెత్తటి గద్దీలు పరిచీ/కటిక నేలపై సేద తీరుతున్నాడు’ అనే కవితావాక్యాలతో కేవలం ముస్లిం కార్మికుడి కడగండ్లే కాదు అలా అణిచివేయబడ్డ ప్రతీ శ్రమజీవి రూపం మన కళ్ళకు కనబడుతుంది.

స్థానీయతకు చోటు కల్పించకుండా కవిత్వం రాయడం ఏ కవికైనా కించిత్ కష్టమేనేమో. నస్రీన్ కూడా అదే దారిలో పయనించింది. ఐతే ఆ కవితలకు మానవీయ పరిమళాలనూ అద్దింది. ‘నాలుగు దిక్కులను పరిపాలిస్తూ/చరిత్రను భుజస్కంధాలపై మోస్తూ/మినార్లతో దర్జాగా నిలబడి ఉంటుంది/జనసందోహంతో నెలరోజులు కిటకిటలాడే/తన ఒడిని చూసి మురిసేందుకు/ఏడాదిపాటు ఎదురుచూస్తుంది’ అని చారిత్రిక చార్మినార్ గురించి రాస్తూ ‘రంజాన్ మాసపు సౌరభాలకు ప్రతినిధి/ఒట్టి చేతులతో వెనక్కు పంపని పేదల పెన్నిధి/సర్వమతాలను ఐక్యం చేసే వారధి/సకల వేళల్లో ఆత్మీయతను పంచే అమ్మ చార్మినార్/చీకటి నిండిన బతుకులకు/వెలుగుల భరోసా చార్మినార్’ అంటూ మానవీయతను అద్దింది. ‘జిందగీ అంటే ఉన్నంతలో/సంతోషంగా, సంతృప్తిగా గడపటం/ఇదే కదా ఇన్నాళ్ళుగా నాకు తసల్లీని ఇస్తోంది/ఇదే కదా ఇన్నేళ్ళుగా నాకు తెలిసిన ఖ్వాబ్’ అంటున్న నస్రీన్ ‘కదులుతూ పోవడమే అనంతానంత సృష్టి’ అన్న తాత్వికతనూ తన కవితల్లో ఒంపుకుంది.

వస్తువైవిధ్యం ఎంతగా ఉన్నా భావుకతే కవి ప్రథమ లక్షణం. నస్రీన్ కూడా భావుకతతో రాత్రిని ఎంత కొత్తగా చెప్పిందో చూడండి. ‘సూర్యుడు లేకపోవడం వల్లే చీకటి/అది రాత్ కీ గల్తీ కాదు/రాతిరిలో ఎంత చల్లదనం లేకపోతే/అనంతమైన అందమైన తారలకు తనలో తావిస్తుంది?/చల్లటి జాబిలిని చెంత కూర్చోబెట్టి కబుర్లు చెప్తుంది?’. ఇదే కోవలో కన్నీటికి అనిర్వచనీయమైన నిర్వచనాన్ని చెప్పింది. ‘బుగ్గలపై నుంచి కిందికి జారుతూ/నీవెప్పుడూ/ఏకాకివి కావనే భరోసానిస్తుంటాను/మాటలుగా వ్యక్తమవలేని జీవులకు/నేనే వాహకాన్ని/నా ద్వారా పలకాల్సిన/ఎన్నో భావాలను మాటలుగా/మార్చి తేలిక చేసేస్తాడు మనిషి/కానీ/మాట స్వరూపం పెగలాలంటే/నేను ఆలవాలమవాల్సిందే’.

ముస్లింల కష్టాలు, వారిదే అయిన అస్తిత్వ ఆవేదనను చెప్పాల్సినప్పుడు ఉర్దూ, తెలుగుల సంగమ భాషతో కవిత్వం అలరారింది అలాగే సార్వజనీన సమస్యను పెన్నెత్తి చూపాల్సినప్పుడు తెలుగునే ఎంచుకుందీ కవయిత్రి. కవిత్వం అనేక గుణాలతో, లక్షణాలతో ఎంత రమణీయంగా చెప్పినా అందులో జీవితం ప్రతిఫలించినప్పుడు ఆ కవిత్వం మనసుకు మరింత దగ్గరవుతుంది. నస్రీన్ కవిత్వం అలాంటి జీవన కవిత్వం.

                                                                                                              – రాపోలు సీతారామరాజు
Nasreen Khan poetry about Muslims

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్ద్రత అక్షరమైంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: