తప్పు ఒప్పుకున్న ఇరాన్

   నిలకడగా బద్దలయిన నిజం గుండెలు పిండేసింది. ఎద్దుల కుమ్ములాట లేగలకు ప్రాణాంతకమైనట్టు అమెరికా ఇరాన్‌ల ఆధిపత్య పోరు 176 మంది అమాయక విమాన ప్రయాణికుల దుర్మణానికి దారి తీయడం చెప్పనలవికానంత మానవ విషాదం. సాంకేతిక లోపం వల్లనో, సిబ్బంది పొరపాటు లేదా నిర్లక్షం వల్లనో జరిగే ప్రమాదాల్లో ఇటువంటి దుర్మరణాలు సంభవించడం వేరు, ఒక దేశం ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయి జరిపిన క్షిపణి దాడి గురి తప్పి ఇంతటి ఘోర విషాదం చోటు చేసుకోడం వేరు. గత […] The post తప్పు ఒప్పుకున్న ఇరాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

   నిలకడగా బద్దలయిన నిజం గుండెలు పిండేసింది. ఎద్దుల కుమ్ములాట లేగలకు ప్రాణాంతకమైనట్టు అమెరికా ఇరాన్‌ల ఆధిపత్య పోరు 176 మంది అమాయక విమాన ప్రయాణికుల దుర్మణానికి దారి తీయడం చెప్పనలవికానంత మానవ విషాదం. సాంకేతిక లోపం వల్లనో, సిబ్బంది పొరపాటు లేదా నిర్లక్షం వల్లనో జరిగే ప్రమాదాల్లో ఇటువంటి దుర్మరణాలు సంభవించడం వేరు, ఒక దేశం ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయి జరిపిన క్షిపణి దాడి గురి తప్పి ఇంతటి ఘోర విషాదం చోటు చేసుకోడం వేరు. గత బుధవారం నాడు ఇరాక్‌లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరుగుతున్న సమయంలో టెహరాన్ విమానాశ్రయ సమీపంలో అప్పుడే బయలుదేరిన ఉక్రెయిన్ విమానం కుప్ప కూలిన ఘటనకు తామే బాధ్యులమని తమ సైన్యమే అనుకోకుండా దానిని కూల్చివేసిందని ఇరాన్ ఆలస్యంగా శనివారం నాడు చేసిన ప్రకటనలో అనేక కోణాలు ఇమిడి ఉన్నాయి.

ఆ ప్రమాదంలో ప్రయాణికులంతా చనిపోయారు. వారిలో ఇరానియన్లు 82 మంది కాగా, 57 మంది కెనడా పౌరులు, 11 మంది ఉక్రెనియన్లు, 10 మంది స్వీడన్ వాసులు, నలుగురు అఫ్ఘాన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్లు ఉన్నారు. అంతకు ముందరి శుక్రవారం నాడు బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్ దాడులు జరిపి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనికాధికారి సులేమానీని హతమార్చిన దురాగతానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని దాని సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపినప్పుడు ఈ ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మామూలుగా ఇటువంటి దాడులకు సమకట్టే ముందు ఆ గగనతలంలో వాణిజ్య విమానాలు తిరగకుండా నిలిపివేయాల్సిన బాధ్యత ఇరాన్‌పై ఉంది. అలా ఎందుకు జరగలేదో తెలియదు. ప్రమాదం జరిగినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కిమ్మనకుండా మౌనం పాటించిన ఇరాన్ తీరికగా ఇప్పుడు అసలు గుట్టు బయట పెట్టి తప్పు ఒప్పుకోడం గమనించదగినది.

వాస్తవాన్ని కప్పిపెట్టాలని ప్రయత్నించి అది సాధ్యం కాని పరిస్థితి తలెత్తడంతో నిజం బయటపెట్టిందా, కూలంకష దర్యాప్తులో జరిగిందేమిటో వివరంగా బయట పడిన తర్వాతనే ప్రకటన చేయాలనుకున్నదో ఏమైనాగాని ఆలస్యంగానైనా అసలు విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు ఇరాన్‌ను అభినందించాల్సిందే. విమానాన్ని కూల్చింది ఇరానేనని అమెరికా, కెనడా, బ్రిటన్‌లు ఆ వెంటనే ఆరోపించాయి. విమాన సొంతదారు ఉక్రెయిన్ మాత్రం తొందరపడకుండా నిగ్రహం పాటించింది. అందుకు దానిని తన పౌరులే విమర్శించారు. అయినా ఉక్రెయిన్ ఆచితూచి వ్యవహరించడం వల్లనే ఇరాన్ వాస్తవాన్ని బయటపెట్టిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. యుద్ధం అనేక అబద్ధాల పుట్ట. అమెరికా ఏ కారణం లేకుండానే కేవలం స్వప్రయోజన కాండతో ప్రత్యర్థుల మీదికి దూసుకుపోయి చెప్పనలవికాని రక్తపాతాన్ని సృష్టించడం, విధ్వంసానికి పాల్పడడం తెలిసినవే. ఆ మాదిరిగానే ఇరాన్ ఇది తమ పని కాదని బుకాయించి ఉంటే చేయగలిగేదేమీ ఉండేది కాదు.

తప్పు తమదేనని ప్రకటించిన తర్వాత ఇరాన్ పాలకులు స్వజనం నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ప్రభుత్వ అనుకూలురు కూడా ఉన్నారు. చనిపోయిన ప్రయాణికుల్లో కెనడాలో చదువుల కోసం బయలుదేరిన అనేక మంది ఇరాన్ యువకులు ఉన్నారు. వారి దుర్మరణం ఆ దేశస్థులను తీవ్రంగా బాధించింది. ప్రపంచం పట్ల ఇరాన్ పాలకుల ఘర్షణ వైఖరి, అమెరికా విషయంలో ప్రదర్శిస్తున్న మొండితనమే ఈ విషాదానికి కారణమని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇవి విమానంపై జరిపిన కాల్పులు కావు, ఇరాన్ పాలకులు తమ పట్ల తమ ప్రజలకున్న విశ్వాసంపై జరుపుకున్న కాల్పులే అనే వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. అమెరికా మీద పగ తీర్చుకోవాలి గాని ప్రజల మీద కాదనే మందలింపులూ వినవచ్చాయి. ఏదిఏమైనప్పటికీ మానవ తప్పిదం వల్ల ఒక ఘోర విషాదం జరిగిపోయింది.

దీనికి బాధ్యత తనదేనని ఇరాన్ ఒప్పుకున్నా అమెరికా కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేదు. స్వార్థం కోసం పరాయి గడ్డ మీద పగ సాధింపు దాడికి పాల్పడి ఇరాన్‌ను రెచ్చగొట్టి రచ్చ పెంచిన అమెరికా నిర్వాకం కూడా ఈ దారుణానికి కారణమే. ఇంత మంది ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయిన దానికి ట్రంప్ సైతం బాధ్యత వహించాలి. ఇటు ఇరాన్ అధిపతుల్లోనూ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లోనూ ఆత్మ విమర్శ, పశ్చాత్తాపం కలిగితే అది ప్రపంచ శాంతికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో మరో యుద్ధం రగలకుండా ఉంటుంది. ఇరాన్ తన వంతుగా ఈ దాడికి బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. ప్రమాదంలో చనిపోయిన ఇరాన్ పౌరులకేగాక ఇతర దేశాల వారికి కూడా తగినంత పరిహారం చెల్లించాలి. ఇటువంటివి మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Iran Blames Downing of Ukrainian Jet on Human Error

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తప్పు ఒప్పుకున్న ఇరాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: