చావు కోరల్లో తొలి బాల్యం!

      బాలలు బాగుంటేనే భారతం బాగుంటుంది. దురదృష్టవశాత్తు ‘బాల భారతం’ అత్యంత దుస్థితిలో ఉంది. ఐక్యరాజ్య సమితి ‘బాలల స్థితి గతులు 2014’ నివేదిక ఈ అభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తున్నది. 2018లో ఐదేళ్లలోపు బాలల మరణాలు ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే అతి ఎక్కువ అని ఆ వయసులోని 8,82,000 మంది పిల్లలు ఆ ఏడాది మృతి చెందారని ఈ నివేదిక నిగ్గు తేల్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణన పొందుతూ వచ్చిన భారత్‌లో […] The post చావు కోరల్లో తొలి బాల్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

      బాలలు బాగుంటేనే భారతం బాగుంటుంది. దురదృష్టవశాత్తు ‘బాల భారతం’ అత్యంత దుస్థితిలో ఉంది. ఐక్యరాజ్య సమితి ‘బాలల స్థితి గతులు 2014’ నివేదిక ఈ అభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తున్నది. 2018లో ఐదేళ్లలోపు బాలల మరణాలు ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే అతి ఎక్కువ అని ఆ వయసులోని 8,82,000 మంది పిల్లలు ఆ ఏడాది మృతి చెందారని ఈ నివేదిక నిగ్గు తేల్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణన పొందుతూ వచ్చిన భారత్‌లో మానవాభివృద్ధి మాత్రం అత్యంత శోచనీయంగా ఉందని స్పష్టపడుతున్నది. గత ఏడాది (2019) ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం స్థానం మరింత దిగజారింది. 117 దేశాల జాబితాలో 2018లో 95వ స్థానంలో ఉన్న ఇండియా ఏడాది గడిచే సరికి 2019లో 102వ స్థానానికి పడిపోయింది.

73 శాతం దేశ సంపద జనాభాలో 1 శాతంగా ఉన్న అత్యున్నత స్థాయి సంపన్నుల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్న చోట ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోడం వింత కాదు. అత్యంత ఆర్థిక అసమానతలు ఉన్న దేశాల్లో రెండవదిగా 2016లో ఇండియా ‘పేరు’ తెచ్చుకున్నది. అందుచేత బాలల మరణాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యపోవలసిందేమీ కాదు. 69 శాతం ఐదేళ్ల లోపు మరణాలకు పోషకాహార లోపమే కారణమని యునిసెఫ్ నిగ్గు తేల్చిన దానికి ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య పెరగడానికి నేరు సంబంధమున్నది. అసమానతలు పేట్రేగడానికి కూడా వీటితో లంకె ఉన్నది. దేశంలోని సగం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారన్న దారుణ వాస్తవమూ ఈ కోవలోనిదే. ఐదేళ్లలోపు భారత బాలల్లో రక్తహీనత ప్రబలి ఉన్నదని కూడా యునిసెఫ్ నిగ్గు తేల్చింది.

రక్తహీనతను తొలగించడానికి మన కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న కృషిని ఆ సంస్థ మెచ్చుకోవడం గమనార్హం. అనీమియా ముక్త భారత్ కార్యక్రమం ప్రపంచంలో ప్రభుత్వాలు చేపట్టిన మంచి పథకాల్లో ఒకటని యునిసెఫ్ యోగ్యతా పత్రం ఇచ్చింది. పోషణ్ అభియాన్ పోషకాహార లభ్యతను పెంచడంలో బాగా ఉపయోగపడుతున్నదని కూడా చెప్పింది. ప్రభుత్వ కృషి బాగా ఉన్నప్పుడు అది ఆశించిన ఫలితాలు ఇస్తున్నప్పుడు బాలల మరణాలు, పోషకాహార లేమి, రక్తహీనత గణనీయంగా తగ్గాలి కదా! కాని అలా జరగడం లేదు. ఈ తిరకాసు ఎక్కడుంది? అవసరమైనంత స్థాయిలో ఆ కార్యక్రమాలు అమలు కావడం లేదనుకోవాలా, వాటిని తగిన విధంగా రూపొందించలేదనుకోవాలా లేక వాటి గణాంకాల్లోనే లోపాలు ఉన్నాయని భావించాలా? పథకాలు రచించి నిధులు కేటాయించి యంత్రాంగానికి అప్పగించడం వేరు, అవి ఉద్దేశించిన జనానికి సవ్యంగా అందుబాటులో ఉన్నాయో, లేదో తెలుసుకొని తగిన సవరణలు చేసుకొని ముందుకు నడవడం వేరు.

దేశంలో సాధారణ ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ధరల పెరుగుదల, ప్రజల అవసరాల్లో ఏర్పడిన వైవిధ్యం ఇందుకు చాలా వరకు కారణం. సగటు భారతీయులు తమ నికరాదాయాన్ని ఖర్చు పెట్టడంలో ప్రాధాన్యతల తేడా వచ్చింది. ముందుగా కుటుంబంలోని వారి వైద్య అవసరాలకు, పిల్లల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం సహజం. అలాగే వసతి, ఆహారం, వస్త్రం కూడా ముఖ్యమైనవే. సాంకేతిక విప్లవం పురి విప్పిన తర్వాత టివి, సెల్‌ఫోన్ వంటివి ప్రధాన అవసరాలుగా మారిపోయాయి. ఇన్నింటిని ఒకే సారి సమకూర్చుకునే స్థాయి ఆదాయాలు సగటు కుటుంబాలకు కరవయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల దారిద్య్రాన్ని తొలగించడానికి, వారి కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. వాస్తవ విలువలో బడ్జెట్‌లు కుదించుకుపోతున్న నేపథ్యం ప్రభుత్వాలకు దీనిని అలవికాని పనిగా చేస్తున్నది. అందుచేత కేవలం ఒకటి, రెండు పథకాల అమలు తీరు బాగున్నంత మాత్రాన పేదరికం, ఆకలి, పోషకాహార లేమి వంటివి తొలగవు.

మరింత లోతైన సమగ్రమైన పేదరిక నిర్మూలన కృషి అవసరం. దీనిని పాలకులు, ప్రణాళిక రచయితలు గమనించాలి. అదే సమయంలో దేశంలో పారిశుద్ధ పరిస్థితులు బాగా మెరుగుపడాలి, బహిరంగ విసర్జన పూర్తిగా తొలగిపోవాలి, మంచి నీరు లభ్యత పెరగాలి. తల్లుల అక్షరాస్యత కూడా పుంజుకోవాలి. ఒక జాతిగా మనం మరింత అభివృద్ధిని, వికాసాన్ని చూరగొనాలంటే బాలల ఆరోగ్యం మెరుగుపడి తీరాలి. వారి మరణాలు దాదాపు లేకుండా పోవాలి. డెన్మార్క్, ఐర్లాండ్, మారిషస్, ఖతార్, సింగపూర్‌లలో ఐదేళ్ల లోపు వయసు బాలల వార్షిక మరణాలు లేనేలేవని యునిసెఫ్ నివేదిక నిగ్గు తేల్చింది. మన దేశంలో 38 శాతం బాలల్లో వయసుకు తగిన ఎదుగుదల లేదని ఎత్తి చూపింది. ఈ దుస్థితి నుంచి బయటపడి తొలి బాల్యంలో మరణాలు లేకుండా చేసుకోవాలంటే మన ప్రజల స్థితిగతులు అసాధారణంగా పెరగాలి.

India ranks 102nd in child deaths list in 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చావు కోరల్లో తొలి బాల్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: