ప్రేమకు ప్రతీక

  డిసెంబర్ నెలంటే క్రిస్మస్ వేడుకల కోలాహలమే. ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. కుటుంబంతో స్నేహితులతో బంధం మరింత గాఢమయ్యే సందర్భం. కొంతమంది యేసుక్రీస్తు జననం గురించి, మానవజాతి రక్షణలో ఆయన పాత్ర గురించి ధ్యానించాల్సిన సమయంగా పరిగణిస్తారు. క్రిస్మస్ అంటే అలంకరణలు, రుచికరమైన వంటలు, కొత్త బట్టలు, ఇచ్చిపుచ్చుకునే కానుకలతోపాటు ఆత్మీయతను పంచే పండుగ. యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి భూలోకానికి వచ్చిన రోజుగా డిసెంబర్ 25న జరుపుకుంటారు. దీనులు, నిరాశ్రయులు, నిరుపేదలకు అండగా నిలవాలన్నదే యేసు సందేశం. […] The post ప్రేమకు ప్రతీక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డిసెంబర్ నెలంటే క్రిస్మస్ వేడుకల కోలాహలమే. ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. కుటుంబంతో స్నేహితులతో బంధం మరింత గాఢమయ్యే సందర్భం. కొంతమంది యేసుక్రీస్తు జననం గురించి, మానవజాతి రక్షణలో ఆయన పాత్ర గురించి ధ్యానించాల్సిన సమయంగా పరిగణిస్తారు. క్రిస్మస్ అంటే అలంకరణలు, రుచికరమైన వంటలు, కొత్త బట్టలు, ఇచ్చిపుచ్చుకునే కానుకలతోపాటు ఆత్మీయతను పంచే పండుగ. యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి భూలోకానికి వచ్చిన రోజుగా డిసెంబర్ 25న జరుపుకుంటారు. దీనులు, నిరాశ్రయులు, నిరుపేదలకు అండగా నిలవాలన్నదే యేసు సందేశం. పేదల సేవలో తరించడమే పరమావధిగా భావిస్తారు. ఇతరులకు పంచి ఇచ్చే పండుగ క్రిస్మస్.

ఒకరికొకరు పరస్పరం అభినందనలు తెలుపుకునే పండుగ క్రిస్మస్. ప్రతి ఇంటి ముందు కాంతులీనే నక్షత్రం దర్శనమిస్తుంది..
ఇంటిలోపల అలంకరించిన క్రిస్మస్ ట్రీ అతిథులను ఆహ్వానిస్తుంది… ఘుమఘుమలాడే కేక్‌ల సువాసనలు నోరూరిస్తుంటాయి. శాంటాక్లాస్ అని పిలుచుకునే క్రిస్మస్ తాత దుప్పులు లాగుతున్న మంచు రథం ఎక్కి ఆకాశాన ప్రయాణిస్తూ ఇళ్ల పొగ గొట్టాల ద్వారా లోపలికి చేరి అక్కడి క్రిస్మస్ ట్రీకి వేలాడదీసిన సాక్స్‌లో కోరుకున్న బహుమతులు పెట్టి వెళ్లిపోతాడని ఓ నమ్మకం. అందరినీ ప్రేమించడం, అందరితో ఆనందంగా ఉండటం క్రిస్మస్ ప్రత్యేకత.

క్రిస్మస్ ఎందుకంటే.. కరుణామయుడిగా పిలుచుకునే యేసు క్రీస్తు జన్మించి రెండువేల సంవత్సరాలు దాటింది. దుర్మార్గుడైన సీజర్ ఆగస్టన్ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతివిశాలమైన రోమా రాజ్యం ఎంతో బలమైంది. విశాలమైంది. సంపన్నమైంది. ఈ సామ్రాజ్యంలో ఒక మూలనున్న యూదా రాజ్యంలోని బెత్లెహేముపురంలో ఒక పశువుల పాకలో ఓనాటి రాత్రి యేసేపు, మరియల తనయుడుగా దైవకుమారుడు యేసుక్రీస్తు జన్మించాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా చరిత్రను విడదీసిన యేసుక్రీస్తు జననం అలా రెండు వేల ఏళ్ల క్రితం జరిగింది. యేసుక్రీస్తు జీవితం, పరిచర్య సందేశాల పరిమళం, ఆయన పునరుత్థానం , పరలోకా రోహణం, తర్వాత ఆయన శిష్యుల ద్వారా లోకం నలుమూలలకూ వ్యాపించింది. హింసను ఎదుర్కొనే అత్యంత ప్రతిభావంతమైన ఆయుధం ప్రేమ మాత్రమేనని నిరూపించాడు యేసుక్రీస్తు. నిన్నువలె నీ పొరుగువాడిని ప్రేమించు అనేది ఆయన సందేశం. రోమా సామ్రాజ్యమంతా విస్తరించిన క్రీస్తు ప్రేమ సందేశం చివరికి కాన్‌స్టాంటిన్, థియోడాసియస్ వంటి రోమా చక్రవర్తులనే క్రైస్తవులుగా మార్చింది.

ప్రత్యేకమైంది..

ఒకప్పుడు క్రిస్మస్‌చెట్టు పూర్తిగా అడవుల నుంచే సేకరించేవారు. ఇప్పుడు క్రిస్మస్ కోసం లక్షల ఎకరాల్లో ఫర్, పైన్ చెట్లను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, యుకెలలో సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా అమెరికాలో 330 నుంచి 360 లక్షల క్రిస్మస్ చెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. యూరప్‌లో అంతకు రెట్టింపు ఉత్పత్తి జరుగుతోంది. దాదాపు పాతిక రకాల ఫర్, పైన్ చెట్ల జాతులను డిసెంబర్ కోసం సాగుచేస్తారు. విత్తను నుంచి సుమారు ఏడు అడుగుల ఎత్తు పెరగడానికి ఒక్కో చెట్టు ఎనిమిది నుంచి పన్నెండేళ్లు సమయం తీసుకుంటుం ది. క్రిస్మస్ ట్రీ శాంతి, సంతోషం, పచ్చదనానికి ప్రతీక.

చర్చి అనగానే వెంటనే గుర్తొచ్చేది జెరూసలేంలో ఉన్న చర్చ్ ఆఫ్ హోలీ సెవల్చర్. సమీపంలోని బెత్లెహమ్‌లో క్రీస్తు జన్మించినట్లు క్రైస్తవుల నమ్మకం. దీనికి గుర్తుగా ఇజ్రాయిల్‌లో ఈ చర్చిని నిర్మించారు. గోల్కోథాలోని హిల్ ఆఫ్ కల్వరిలో ఉన్న ప్రాంతంలో ఏసుక్రీస్తు సమాధి ఉన్నట్లు సమాచారం.

పారిస్‌లో ఉన్న నోట్రిడేమ్ డీ పారిస్ చర్చి ప్రపంచంలోనే అరుదైన చర్చిగా నిలిచింది. ఈ చర్చిపై ఏర్పాటుచేసిన శిఖరం, రంగులద్దిన గాజు అద్దాలు, విగ్రహాల ప్రతిష్టాపనలన్నీ పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి.

విదేశాల్లో క్రిస్మస్

* ఇథియోపియాలో క్రిస్మస్‌ని జనవరి 7న జరుపుకుంటారు.
* ఉక్రెయిన్‌లో క్రిస్మస్ ట్రీకి సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు. ఎందుకంటే నిరుపేదలకు క్రిస్మస్ చెట్టును అలంకరించే స్థోమత ఉండదు. ఆ చెట్టుకి అప్పటికే సాలెగూళ్లు అల్లుకుని ఉన్నాయి. క్రిస్మస్ రోజు తొలి సూర్యకిరణం తగలగానే ఆ సాలె పోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి సంతోషాన్ని కలిగిస్తాయట.
*స్వీడన్‌లో గావ్లే పట్టణ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్ ఈవ్‌లో అర్థరాత్రి ఆ మేకను కాలుస్తారు. ఈ సంప్రదాయం 1966లో ప్రారంభమైంది.
* ఫిన్లాండ్‌లో క్రిస్మస్ ముందురోజు సాయంత్రం స్మశానాలకి వెళ్లి , వారి ఆత్మీయులను తలుచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు.

* జపాన్‌లో క్రిస్మస్ తరువాత అమ్మకం కాని కేక్‌లను ఇంక ఎవ్వరూ కొనరు. తినరు. పారేస్తారు.
* చాలా దేశాల్లో క్రిస్మస్‌కు ఫ్లం కేక్‌ను తింటారు. జపాన్‌లో స్పాంజ్‌కేక్ ఎక్కువగా తింటారు.
* జపాన్‌లో చికెన్ ఎక్కువగా తింటారు. క్రిస్మస్ రోజు మామూలు కంటే పదిరెట్లు ఎక్కువగా చికెన్ అమ్ముడవుతుంది.
* పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ రోజున టర్కీ అనే పక్షిని తినడం సంప్రదాయంగా వస్తోంది.
* స్లోవేకియాలో క్రిస్మస్‌రోజున ఒక విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఆ రోజున గుమ్మానికి వీపు పెట్టి చెప్పును విసురుతారు. ఆ చెప్పు గుమ్మం వైపు తిరిగి పడితే త్వరలో పెళ్లి జరుగుతుందని నమ్మకం.
* లండన్‌లో క్రిస్మస్ వేడుకలను నెలరోజుల ముందే మొదలెడతారు.
* ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలు సెయింట్ నికోలస్ దినంగా భావించే డిసెంబర్ 6 నుంచి ప్రారంభమౌతాయి. పిల్లలు తమ బూట్లను పాలిష్ చేసి చిమ్నీల వద్ద వుంచుతారు. క్రిస్మస్ తాత వాటినిండా మిఠాయిలు నింపుతాడని వారి నమ్మకం.

* జర్మనీలో గ్లూవైన్ అనే పానీయాన్ని సేవిస్తారు.
* ఇటలీలో శాంటాక్లాజ్ బదులుగా లా బెఫానా అనే మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచిపెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందని చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందని అంటారు. ఇదంతా జనవరి 6 న జరుపుకుంటారు.
* అమెరికాలో క్రిస్మస్ ట్రీ అలంకరణకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ నవంబర్‌లో వచ్చే థేంక్స్ గివింగ్ డే తర్వాత క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. ఇవి న్యూఇయర్ వరకు కొనసాగుతాయి.

మార్గం చూపేది నక్షత్రం…

యేసు ప్రభువు జన్మించిన సందర్భంగా ఉదయించిన నక్షత్రం ఇది. అందుకే అంతటి ప్రాధాన్యం. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో మిక్కిలి ప్రకాశించే ఈ నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించేందుకు బెత్లెహేంకు వచ్చారు. వారు వెళ్తుండగా నక్షత్రమే వారికి మార్గాన్ని చూపించి, పశువుల పాకలో తల్లి అయిన మరియను, శిశువైన ప్రభువును చూపించింది. వారంతా ఆనందంతో ప్రభువును ఆరాధించారు.

క్రిస్మస్ తాత
శాంటాక్లాజ్‌కు ఫాదర్ క్రిస్‌మస్, క్రైస్ట్‌కైన్ అనే పేర్లుకూడా ఉన్నాయి. 4వ శతాబ్దంలో గ్రీక్‌కు సెయింట్ నికోలస్ అనే బిషప్ ఉండేవాడు. ఇతను పిల్లలను సంరక్షించేవాడు.
ఎర్రటోపీని ధరించి, తెల్లటి గడ్డం, పొడవాటి గౌన్ వేసుకుని బహుమతులను సేకరించేవాడు. 13వ శతాబ్దంలో నెదర్లాండ్స్‌లో ప్రాచుర్యం పొందింది.

క్రిస్మస్ అనే పేరు ఎందుకంటే…
క్రిస్మస్ అనే మాట క్రీస్తు మాస్ అనే ఒక ఆచారం నుంచి వచ్చింది. యేసు తమ గురించి మరణించి, పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవులు భావిస్తారు. అందుకు గుర్తుగా అందరూ కలిసి ద్రాక్షరసం, రొట్టె తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని సమభోక్తం పేరుతో నిర్వహిస్తారు. ఇది సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్థరాత్రి తీసుకునేవాళ్లు. క్రైస్తు మాస్ క్రమంగా క్రిస్మస్‌గా మారింది.

 

పరమత సహనానికి నిదర్శనం మెదక్ చర్చి

తెలంగాణలోని మెదక్‌లో ఉన్న కేథడ్రిల్ చర్చి పరమతసహనాన్ని చాటుతోంది. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి ఇది. ఈ చర్చికి అమర్చిన రంగు రంగుల కిటికీలు బైబిల్ సారాన్ని బోధిస్తాయి. బ్రిటీషువారి కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో విపరీతమైన కరువు వచ్చింది. తిండికిలేక జనాలు అల్లాడారు. దీంతో అక్కడున్న రెవరెండ్ వాకర్ పోస్నెట్ ప్రజల ఆకలి తీర్చేందుకు చర్చి నిర్మాణం ప్రారంభించాడు. చర్చి నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటే అన్నం పెడతామని ప్రకటించారు. అలా పనికి ఆహారం పథకం మొదలైంది. మెతుకులు అంటే అన్నం. ఈ మెతుకులే క్రమంగా మెదక్‌గా మారింది. 1914 నుంచి 1924 వరకు సుమారు 12 వేల మంది 10సంవత్సరాలపాటు శ్రమించి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. అప్పట్లో చర్చి నిర్మాణానికి అయిన ఖర్చు 14 లక్షలు మాత్రమే., ప్రపంచంలో వాటికన్ చర్చి తర్వాత అతిపెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్.

పూర్తిగా తెల్లరాయితో కట్టిన ఈ నిర్మాణం కోసం ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లండ్ నుంచి, మేస్త్రీలను ముంబయి నుంచి తెప్పిం చారు. పాలరాతిని ఇటలీ నుంచి తెప్పిం చారు. చర్చికి చెందిన గచ్చు పనిని ఇటలీ తాపీవారు చేశారు. ఇంగ్లండు నుంచి ప్రత్యే కంగా తెప్పించిన అద్దాలపై యేసు ప్రతిమ, క్రీస్తు జీవన విధానం, తెలియజేసే అందమైన అక్షరాలతో దేవుడి చరిత్ర ముద్రించి ఉంటుంది. కుడివైపు యేసు జననం, ఎడమవైపు శిలువ వేసిన దృశ్యం, ముందు భాగంలో యేసు పునరు త్థానం చిత్రాలు అద్భుతంగా దర్శనమిస్తాయి. సూర్య కిరణాలు తాకగానే ఈ చిత్రాలు మరింత ప్రకాశవంతంగా వెలగడం ఈ చర్చి ప్రత్యేకత. 175 అడుగుల ఎత్తయిన మినార్ ఒకటి నాటి పనితనానికి నిదర్శనం. ఈ చర్చికి 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఉన్న కేథడ్రాల్ ఉంది. దీంట్లో ఒకేసారి 5000 ప్రార్థనలు చేసుకోవచ్చు. ఒక్క క్రైస్తవులే కాదు మిగతా మతాల వారు ఈ చర్చికి వచ్చి ప్రార్థనల్లో పాల్గొనడం పరమత సహనానికి ఓ నిదర్శనం.

                                                                                            మల్లీశ్వరి వారణాసి
Christmas is a symbol of Love

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రేమకు ప్రతీక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.