అంధకారాన్ని ఆహ్లాదంగా తలచిన అక్కితం

  అక్కితం కవిత్వం చాలా వరకు భవిష్యత్తును ఊహించే లక్షణాన్ని కలిగి వుంటుంది. రాబోయే సామాజిక, రాజకీయ పరిణామాలను తన కవిత లలో ప్రతిబింబింపజేస్తాడు. అక్కితం కవితలు భారతీయ తాత్విక, సామా జిక విలువల సమ్మేళనంతో సంప్రదా యానికీ ఆధునికతకూ మధ్య వంతెన లాగా వుంటాయి. జీవితంలోని బాధలకు ప్రేమ మందులాగా పనిచేస్తుందని చెప్పాడు అక్కితం. మలయాళ కవి అక్కితం అచుతన్ నంబూతిరికి 2019 వ సంవత్సరపు జ్ఞానపీఠ పురస్కారం ఈమధ్యనే ప్రకటింపబడింది. ఈ భాషలో ఈ […] The post అంధకారాన్ని ఆహ్లాదంగా తలచిన అక్కితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అక్కితం కవిత్వం చాలా వరకు భవిష్యత్తును ఊహించే లక్షణాన్ని కలిగి వుంటుంది. రాబోయే సామాజిక, రాజకీయ పరిణామాలను తన కవిత లలో ప్రతిబింబింపజేస్తాడు. అక్కితం కవితలు భారతీయ తాత్విక, సామా జిక విలువల సమ్మేళనంతో సంప్రదా యానికీ ఆధునికతకూ మధ్య వంతెన లాగా వుంటాయి. జీవితంలోని బాధలకు ప్రేమ మందులాగా పనిచేస్తుందని చెప్పాడు అక్కితం.

మలయాళ కవి అక్కితం అచుతన్ నంబూతిరికి 2019 వ సంవత్సరపు జ్ఞానపీఠ పురస్కారం ఈమధ్యనే ప్రకటింపబడింది. ఈ భాషలో ఈ అవార్డును పొందినవారిలో ఈయన ఆరవ వాడు. భారత ప్రభుత్వం జ్ఞానపీఠ పురస్కారాన్ని 1961 లో ప్రారంభించింది. మొట్టమొదటి అవార్డు జి. శంకర కురుప్ రచించిన మలయాళ రచన ఒడక్కుళల్ (వెదురుమురళి) కి లభించింది. హిందీ భాషకు అత్యధికంగా 11, కన్నడంకు 8 రాగా, తెలుగుకు 3 మాత్రమే రావటం చాలా మందికి తెలిసిన విషయమే. మలయాళ భాషలో మొట్టమొదటి సాహిత్య రచన రామచరితం. ఈ మహాకావ్యాన్ని క్రీ.శ. 1198 లో చీరమాన్ రచించాడు. తర్వాతి శతాబ్దాలలో ‘పట్టు’ (పాట) సాహిత్యం, దానితో పాటు మణిప్రవాళ కవిత్వం వర్ధిల్లాయి. మణిప్రవాళ శైలి మలయాళం, సంస్కృతాల మిశ్రమం. తర్వాత చంపూ కావ్యాలు, సందేశ కావ్యాలు వచ్చాయి. అనంతరం వచ్చిన భక్తికవిత్వానికి ఎళుతాచన్ ఆద్యుడు.

ఆధునిక మలయాళ సాహిత్య ఉద్యమం 19 వ శతాబ్దపు చివరలో మొదలైంది. కుమరన్ ఆశన్, ఉలూర్ ఎస్. పరమేశ్వర అయ్యర్, వల్లతోల్ నారాయణ మీనన్ ల త్రయం ఈ ఉద్యమానికి ఊతమిచ్చింది. అయితే, ఇటీవలి మలయాళ సాహిత్యంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ రంగంలో సమూలమైన మార్పును కోరుకునే ధోరణి ఈనాటి మలయాళ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తున్నది. అక్కితం నంబూతిరి 1926 లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించాడు. ఈయనను అక్కితం అనే వ్యవహరిస్తారు. చిన్నప్పట్నుంచి కళల పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగివున్న ఈయన కవిత్వమే కాకుండా నాటకాలు, నవలలు కూడా రాశాడు. ఇతని కవిత్వం చాలా వరకు భవిష్యత్తును ఊహించే లక్షణాన్ని కలిగి వుంటుంది. రాబోయే సామాజిక, రాజకీయ పరిణామాలను తన కవితలలో ప్రతిబింబింపజేస్తాడు.

అక్కితం కవితలు భారతీయ తాత్విక, సామాజిక విలువల సమ్మేళనంతో సంప్రదాయానికీ ఆధునికతకూ మధ్య వంతెన లాగా వుంటాయి. జీవితంలోని బాధలకు ప్రేమ మందులాగా పనిచేస్తుందని చెప్పాడు అక్కితం. ఇరవై ఐదేళ్ల వయసులోనే ‘సంపూర్ణమైన, శుద్ధమైన ప్రేమ కొంత కాలానికి శక్తిగా మారుతుంది. ఇదే జీవితంలోని సౌందర్యం. ఇదే ఏకైక సత్యం. దీన్ని ఆచరణలో పెట్టడం చాలా అవసరం’ అన్న తన బలమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కానీ, తాను వీటికోసం ఎన్నడూ ప్రయత్నించలేదనీ, అవే తనను దర్శించాయనీ అంటాడు. నిజానికి రాస్తున్నది తను కాదు, లోపల వున్న ఎవరో అని చెప్పుకున్నాడు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా తన బలమైన గొంతును వినిపించిన ఈయన, అంటరానితనాన్ని నిరసిస్తూ 1947 లో జరిగిన పాలియం సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. బ్రాహ్మణేతరులలో వేదవిద్యను వ్యాపింపజేసేందుకు పాటు పడ్డాడు కూడా.

తాను రాసిన ఇరుపతం నూట్టదింటె ఇతిహాసం (20 వ శతాబ్దపు కావ్యం) అన్న గ్రంథంలో ‘వెలుతురొక వెత, అంధకారం ఆహ్లాదభరితం’ అంటాడు. ఈ గ్రంథమూ, అందులోని ఈ పంక్తులూ ప్రసిద్ధి పొందాయి. వేదవ్యాసుడు రచించిన శ్రీమద్భాగవతంను అక్కితం మలయాళంలోకి అనువదించాడు. అదొక బృహద్గ్రంథం. అచ్చులో 2400 పేజీలకు పైనే ఉంటుంది. గోవింద నాయర్ లాంటి గొప్పకవులు సాహిత్యమంటే అశ్రువులకోసం అన్వేషణ అని తెలిపారనీ, తాను రాసిందంతా దోషరహితమైన సాహిత్యం అనే అభిప్రాయం తనకు లేదనీ, కొన్ని తప్పులుండవచ్చు కనుక మన్నించాలనీ అక్కితం ఎంతో వినయంగా చెప్పుకున్నాడు.

మలయాళ కవిత్వంలో ఆధునికత వుండాలనే ఉద్దేశం కలిగినవాడే కాకుండా, దాన్ని పాటించి ఆ దిశలో తనవంతు కృషి కూడా చేశాడు అక్కితం. సంప్రదాయ ఛందస్సులో కవిత్వం రాసినా, కొత్తపోకడ అయిన వచన కవిత్వాన్ని అతడు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పైగా, ఆయన రాసిన వచన కవిత్వం పాఠకులను బాగా ఆకట్టుకుంది. ఇతని కవిత్వం సార్వజనీనతను కలిగివుంటూనే సమాజ స్థితిగతుల మీద ధ్యాసను పెడుతుంది. అందులో మానవీయమైన ప్రేమ గురించిన చింతన, అది లుప్తం కావడం పట్ల నిస్పృహ, లోకంలోని అస్తవ్యస్తత పట్ల వేదన కనిపిస్తాయి. ఇతడు రాసిన కౌమారదశ లోని అమ్మాయితో ముఖాముఖి, నల్లబజారు, గుడికి మొదలైన కవితలు విస్తృతంగా చర్చించబడ్డాయి. వికృత శకం అనే కవితలోని ఒక భాగాన్ని చూడండి.

మెరిసే తన పాదాగ్రానికి ఆనుకున్న
చిన్న చీమ హృదయంలో భ్రాంతిని దర్శించే నేను
చెమటవరదలో ఈదుతున్నాను
మతవిద్వేషపు బుజం మీద తలాన్చి
జోగుతున్న ఓ విశ్వమా
నీ అవ్యక్త త్యాగపు మంత్రోచ్చారణల్లోంచి
పైకి ఉబికిన ద్వీపంలో
స్వర్గలోకం ఉదయించనీ
అదొక్కటే నాకు మోక్షప్రదాయిని

ఇప్పటివరకు ఈయన రచించిన 55 గ్రంథాలలో 45 కవితా సంకలనాలే. మిగతా వాటిలో నవలలు, నాటకాలు, ఉన్నాయి. ఇతర భాషల కవిత్వాన్ని మలయాళంలోకి అనువదించాడు కూడా. బలిదర్శనం, ఆరంగేట్టం, నిమిష క్షేత్రం, ఇడింజు పొలింజ లోకం మొదలైనవి కూడా ప్రసిద్ధాలే. బలిదర్శనంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆశన్ అవార్డు, వల్లతోల్ పురస్కారం, వాలయార్ పురస్కారం, నలప్పాడ్ అవార్డ్, ఎళుతచన్ పురస్కారం, మూర్తీదేవి పురస్కారం మొదలైన ఎన్నో కాక, కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం మొదలైన మరెన్నో అవార్డులు ఈయనను వరించాయి.

కర్తవ్య విముఖుని పాట

నా నిక్కమైన ప్రియురాలా!
నేనెరుగని తీరానికి తీసుకుపో నన్ను
అక్కడ అన్యదేశపు పువ్వుల పరిమళం
గాలిలో తేలాడుతుంటుంది
లేత నీలిరంగు సముద్రపు అలలు
తీరం హస్తాలను అటూయిటూ ఊపుతుంటాయి
మన చిన్నపడవ ఆ వొడ్డు మీద
పవళించి వుంటుంది
కాలాన్ని లక్ష్యపెట్టక ఈ ప్రపంచమంతా
ఒక స్వప్నం మీద తేలిపోతూ వుంటుంది

అక్కడి లాన్ లోని
ఒక చెట్టు నీడలో పూలపాన్పు మీద
వింతకీటకాలు వివిధ రకాల చుక్కలున్న రెక్కలను
టపటపలాడిస్తాయి
వినూత్నమైన వృక్షం అది
అలసిపోయిన నేను ఆ ఏకాంత ప్రదేశంలో పడుకుని
ఛాతీని చేతుల్తో కప్పుకుంటాను

ప్రియతమా!
మృదువైన నీ తెల్లని చేతులను
నా వక్షం మీద వుంచి
తేనెలూరే కంఠస్వరంతో
మాటలు లేని కొత్తపాటను పాడు

అక్కడ తియ్యని విస్మృతి
మన సంయోగ ఉత్సవాన్ని ముద్దాడుతుంది
నల్లని మృత్యువు నా శరీరాన్ని కప్పేస్తుంది
అక్కడ సంపూర్ణ సంగమంలో ఈ నేను
ఒక సెలయేరు లాగా కరిగి పారుతాను
నా ప్రియమైన ప్రియురాలా!
నేనెరుగని తీరానికి తీసుకుపో నన్ను

Noted Malayalam poet Akkitham wins 55th Jnanpith award

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంధకారాన్ని ఆహ్లాదంగా తలచిన అక్కితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: