తెలంగాణ కథల ‘రివాజు’

  ప్రేమ, త్యాగం, పోరాటం మూడు తెలంగాణ రక్తంలో మొదటి నుంచి మిళితమై ఉన్నాయి. కులాంతర వివాహం చేసుకున్న రుద్రమదేవి మొదలు ఇవ్వాళ్టి మిర్యాలగూడా అమృత వరకూ ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. రుద్రమదేవి బ్రాహ్మణుడైన వీరభద్రుడిని పెళ్ళి చేసుకుంది. అంతెందుకు హైదరాబాద్ నగరమే ప్రేమకు చిహ్నంగా వెలిసింది. తెలుగు, ఉర్దూ, పర్షియన్ భాషల్లో కవిత్వమల్లిన మహ్మద్ కులీకుతుబ్‌షా చారిత్రాత్మక చార్మినార్‌ని కట్టించి హైదరాబాద్ నగరానికి ముగ్గు పోసిండు. చిచలం (చెంచల్‌గూడా)లో ఉండే ప్రేయసి భాగమతిని పెళ్ళి […] The post తెలంగాణ కథల ‘రివాజు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రేమ, త్యాగం, పోరాటం మూడు తెలంగాణ రక్తంలో మొదటి నుంచి మిళితమై ఉన్నాయి. కులాంతర వివాహం చేసుకున్న రుద్రమదేవి మొదలు ఇవ్వాళ్టి మిర్యాలగూడా అమృత వరకూ ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. రుద్రమదేవి బ్రాహ్మణుడైన వీరభద్రుడిని పెళ్ళి చేసుకుంది. అంతెందుకు హైదరాబాద్ నగరమే ప్రేమకు చిహ్నంగా వెలిసింది. తెలుగు, ఉర్దూ, పర్షియన్ భాషల్లో కవిత్వమల్లిన మహ్మద్ కులీకుతుబ్‌షా చారిత్రాత్మక చార్మినార్‌ని కట్టించి హైదరాబాద్ నగరానికి ముగ్గు పోసిండు. చిచలం (చెంచల్‌గూడా)లో ఉండే ప్రేయసి భాగమతిని పెళ్ళి చేసుకుండు. ఆమె గాత్రం, నృత్యానికి దాసోహమన్నాడు. కవి హృదయమతనిది. పొంగి పొర్లుతున్న మూసీ నదిని ప్రేయసి కోసం సాహసం చేసి దాటుతున్న కొడుకు విషయాన్ని తెలుసుకొని ఇబ్రహీం కులీకుతుబ్‌షా ‘ప్యారానా పూల్’ కట్టించిండు. అదే తర్వాత పురానా పూల్‌గా మారింది. భాగమతి పేరిట ఈ నగరం మొదట భాగనగర్‌గా, తర్వాత ఆమె హైదర్‌బేగంగా పేర్చు మార్చుకోవడంతో హైదరాబాద్‌గా మారింది.

అసఫ్జాహీల కాలంలో బ్రిటిష్ రెసిడెంట్లు కిర్క్ పాట్రిక్, హాలండ్‌లు ముస్లిం అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుండ్రు. కిర్క్‌పాట్రిక్ హైదరాబాద్‌లోని ఇప్పటి మహిళా కళాశాల ఒకప్పటి బ్రిటీష్ రెసిడెన్సీని కట్టించిండు. ఖైరున్నీసా బేగవ్‌ుని పెళ్ళి చేసుకొని హష్మత్ జంగ్‌గా తన పేరు మార్చుకున్నడు. అట్లాగే తర్వాతి కాలంలో భారత స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన సరోజిని నాయుడు తాను ప్రేమించిన ముత్యాల గోవిందరాజులు నాయుడును పెళ్ళి చేసుకుంది. ఆమె సోదరుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కూడా ప్రేమించి కమలాదేవిని వివాహమాడిండు. సరోజిని నాయుడు తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ కూడా వరదాదేవిని ప్రేమించే పెండ్లి చేసుకున్నడు. సరోజిని నాయుడు విషయానికి వస్తే ఆమెను విదేశాలకు పంపిస్తే ప్రేమ గురించి మరిచిపోతుందనే ఉద్దేశ్యంతో తండ్రి ఇంగ్లండ్‌కు పంపిస్తాడు.

ఆమె అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత కూడా గోవిందరాజులు నాయుడునే పెండ్లి చేసుకుంటామని పంతం నెగ్గించుకున్నారు. వీరిద్దరి వివాహాన్ని మద్రాసులో బ్రహ్మసమాజ పద్ధతిలో కందుకూరి వీరేశలింగం తానే పెద్దగా వ్యవహరించి చేసిండు. ఆ తర్వాత సరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు చాలా కాలం నెహ్రూతో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నది. చనిపోయే వరకూ నెహ్రూ నివాస గృహం తీన్‌మూర్తి భవన్‌లోనే ఉన్నది. ఈ ప్రేమ పరంపర తెలంగాణ, హైదరాబాద్‌ల్లో ఇప్పటికీ కొనసాగుతున్నది. తెలంగాణకు శోభను కలుగ జేస్తున్నారు. ప్రేమ వివాహాలే గాకుండా తెలంగాణకే ప్రత్యేకమైనది పోరాటాలు. ఈ పోరాటాల్లో తెలంగాణీయులు చాలా త్యాగాలు చేసిండ్రు.

అది చరిత్రలో నిరంతరాయంగా సాగిన యుద్ధాలే కావొచ్చు, సమ్మక్క సారక్కల తిరుగుబాటే కావొచ్చు. అట్లనే సర్వాయిపాపన్న పోరాటం, బల్మూరి కొండలరాయుడి ప్రతాపం, తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ వ్యతిరేక ఉద్యమాలు, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, ఎమర్జెన్సీకి వ్యతిరేక ఉద్యమాలు, జగిత్యాల జైత్రయాత్ర, మారోజు వీరన్న బహుజన రాజ్యాధికార పోరాటం, తెలంగాణ రాష్ర్ట ఉద్యమం, ఇప్పటి ఆర్టీసీ సమ్మె ఎన్నడూ తెలంగాణ బిడ్డలు తల వంచలేదు. విరోచితంగా పోరాడిండ్రు. స్వీయ ప్రయోజనాల కన్నా సామాజిక ప్రయోజనాలే మిన్నగా ఉద్యమించిండ్రు. ఎనుకటి నుంచి వస్తున్న ‘రివాజు’ తెలంగాణ కథ 2018లో కూడా కొనసాగింది. ఇందులోని కథలు కూడా అటు ప్రేమకు, ఇటు పోరాటానికి, దాని పర్యవసానాలకు అద్దం పట్టాయి. తెలంగాణ తనాన్ని ఈ కథలు ప్రతిఫలింపజేశాయి.

తెలంగాణ కథంటే ఇటీవలి దాకా పోరాట కథ, ఉద్యమ కథ అనే అభిప్రాయమే ఉండేది. కాని 1990ల తరువాత నుండి అనేక మంది బహుజన కులాల విద్యావంతులు రచయితలుగా ఎదిగి కలం పట్టడం మూలంగా జీవితంలోని వివిధ పార్శ్వాలు కథల్లోకి రావడం మొదలైంది. మధ్యతరగతి కథలు, అట్టడుగు వర్గాల కథలు, ఆయా వృత్తుల కథలు, ప్రేమ కథలు వచ్చి తెలంగాణ కథా సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేశాయి. కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలతో పాటు సార్వజనీనమైన ప్రేమ కూడా తెలంగాణ నేల మీద పచ్చని చెట్టులా పురుడుపోసుకుంటుందని ఈ సంకలనంలోని కొన్ని కథలు ప్రేమగా చెప్తాయి. ఒక దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ‘సాయిబోళ్ళ పిల్ల’ (మేడి చైతన్య) ప్రేమ చివరికి ఏ తీరాలకు చేరిందో కథలో చదవాల్సిందే.

ప్రేమ చుట్టు పర్చుకున్న జీవితం ఏ కొత్త రంగులను ఆ ప్రేమికుల ముఖాల మీదికి తెచ్చి వదిలిందో తెలుసుకుంటే ప్రేమను గెలిపించడానికి ఇప్పటి యువత ఎలా నిలబడి పోరాడుతుందో అర్థం అవుతుంది. ఏ గోటీల ఆటతోనో మొదలైన బాల్యం ఒక్కసారిగా ఉద్యోగం వచ్చి నగరానికి చేరుకున్నప్పుడు ఊరును, అమ్మను మర్చిపోలేని తనం వెంటాడుతుంటే దేహం నిండా ఊరే నిండిపోయి పదేపదే గుర్తుకు వస్తుంటుంది. నగరాన్ని ఒరుసుకుంటూ సాగిపోతున్న జీవితంలోకి అకస్మాత్తుగా ఒక చెలికాడు తొంగిచూస్తే వాడితో ఎన్నో విషయాలు పంచుకుంటాం. ఊరు, చెరువు, అందులోని చేపపిల్ల.. ఇట్లా ఎన్నో షేర్ చేసుకుంటాం అతడితో. వాడు మాత్రం ఏ వివాహితనో ప్రేమించి కొద్ది కొద్దిగా వాళ్ల మధ్య చిగురించిన ప్రేమను రుచి చూపిస్తాడు. ఓడిపోయిన ప్రతిసారి ఆమె ప్రేమలో ఆ బాధను మర్చి సేదతీరుతాడు. నగరం, పల్లె కలిస్తే ఏర్పడేలాంటి ఒక రకమైన మిశ్రమ ప్రేమ అది. ఆ ప్రేమ ఒక ‘అర్బనూరు’ (వి. మల్లికార్జున్) లాంటిది. దాని తీరానికి చేరాలంటే మనసునెంతో దిటవు చేసుకొని బయలుదేరాలి. లేదంటే ఆ ప్రేమ, ఆ ఊరు అర్థం కావు. ప్రేమ, పెళ్లి తరువాత సాఫీగా సాగుతుందనుకున్న జీవితం మధ్యలోనే తెగిపోతే, తెగిపోయాక కూడా ఆమె ‘వచ్చే పోయే వానలా’ (అఫ్సర్) మళ్లీ వచ్చిపోతుంటే ఎలా ఉంటుంది ఆ అనుభూతి, ఆ జీవితం.

“తను వెళ్లిపోయాక కూడా తన నవ్వు గదిలో వినిపిస్తూ వుంటుంది. అది మాత్రం కావాలి తనకి! బహుశా ఆమెకి కూడానేమో! అందుకే, ఆమె మళ్లీ ఇంకొకరిని ఇష్టపడి చేసుకున్న రెండో పెళ్లి తరవాత కూడా తన స్నేహాన్ని వదులుకోలేదు. ఆమె తనని వదిలేసి వుంటే… ఏమో! కొన్ని ఆలోచనలు తట్టుకోవడం కష్టం.” కొందరంతే ఏ మాత్రం దయ లేకుండా దూరమవుతారు. అప్పుడు జీవితం రోజుక్కొంత శిథిలమవుతూ ఉంటుంది. ఆమె ఒక్కటే నిజం. నిజంగా అది నిజమైతే బావుండు. వలపు కోసం ఎక్కడో వెతకడం ఎందుకు అడవిపూవులాంటి నెచ్చెలి ఇంట్లోనే ఉంటే. నాలుగు గోడలు బోర్ కొడితే ఏ వెన్నెల మైదానంలోనో, వాగు నీళ్లలోనో తడిసి ప్రేమలో ముద్దవుతూ జీవితాన్ని విభిన్నంగా అనుభూతించవచ్చు. ఆలుమగలు అలా ‘యాత్ర’ (కొట్టం రామకృష్ణారెడ్డి) సాగిస్తే జీవితంలోని ప్రతిక్షణం మధురమే. కావాల్సిందల్లా తరిగిపోని ప్రేమ, ఇగిరిపోని ఇష్టం.

నిజానికి “ఒక మనిషి పూర్తిగా మనకి ఎప్పటికైనా తెలుస్తాడా, అసలు మనిషి లోపలి తత్వానికీ మనకి అర్థమయ్యే స్థితికి మధ్య ఎన్ని అడ్డు గోడలుంటాయో, ఒకవేళ అలా లేకపోతే అది అత్యంత పవిత్ర స్నేహమో, అతి కాముకత నిండిన ప్రేమో ఐ ఉండాలేమో..” పండగలాంటి జీవితాన్ని కొంత మంది మొండితనంతో చెల్లాచెదురు చేసుకుంటారు. ఒక్కోసారి అనిపిస్తుంది ‘జీవితమూ ‘ఔటర్ రింగ్ రోడ్’ (డా॥ వంశీధర్ రెడ్డి) లాంటిదే కదా, స్పీడుగా వెళ్ళొచ్చని భ్రమపడేలోపు 100 దాటితే కట్టాల్సిన పెనాల్టీ గుర్తొచ్చి ఆక్సిలరేటర్ మీది కాళ్ళు వణుకుతాయ్.. లాంగ్ లివ్..” ఎంతటి వాడైనా తీసుకోవాల్సి వస్తుంది. అయినవారు మన చుట్టూ లేకపోయినా లాంగ్ లీవ్‌తో సమానమే కదా! ప్రేమంటే భార్యాభర్తల ప్రేమే కాదు, మన కంటి వెలుగులు మన మధ్యే ఉండి మనల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా.

డాలర్ వేటలో పడి ‘దూరతీరాలు’ (కటుకోజ్వల మనోహరాచారి) శోధిస్తూ జీవితాన్ని గానుగెద్దులా అరగదీయడం కాదు. తల్లిదండ్రులతో, అన్నా చెల్లెళ్లతో, అన్నదమ్ములతో కలిసి ఉండే ప్రేమ కూడా ఆత్మీయమైందనే ఎరుక కావాలి. అప్పుడే కరిగేపోయే మంచులాంటి జీవితాన్ని ఉన్నదాంట్లోనే నలుగురికి పంచినపుడు ఆనందం అవధులు దాటుతుంది. అప్పుడు ప్రేమ విరాట్ స్వరూపం అనుభూతమవుతుంది. జీవితమనే ఫలానికి ఒక భాగం భార్య అయితే, ‘రెండో భాగం’ (పూడూరి రాజిరెడ్డి) భర్త. రెండు భాగాలు కలిసి పెనవేసుకున్న బంధం జీవితాంతం కొనసాగితేనే జీవితం పరిపూర్ణం అయ్యేది. ఏ పరిస్థితుల వల్లనో రెండో భాగం జీవితాన్ని అర్ధాంతరంగానే చాలించాల్సి వస్తే ఆయన చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు నిరంతరం మనసును తొలిచివేస్తుంటాయి. ఒకనాడు తెలంగాణ పల్లెల్లో నక్సలైట్లు పంపిన చిన్న చీటి ఎన్నో పంచాయితీలను తెంపేది. గోడ మీద వెలసిన ఒక పోస్టరు ఎన్నో జీవితాలకు ముగింపు వాక్యం పలికేది.

ఆనాడు ప్రజా కంటకుడన్న నెపంతో సారాయి కాంట్రాక్టరును చంపిన వాడే ఈనాడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి స్వార్థపు శక్తులతో చేతులు కలిపి తన చేతుల మీదుగా వైన్స్ షాప్‌ను ప్రారంభిస్తుంటే నాణానికి రెండో భాగం వైపున్న మరో కోణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. స్వార్థాన్ని బట్టి తీర్పులిస్తూ పోతుంటే బలైపోయే జీవితాలు ఎవరివి? నిజాం ప్రభువు కాలం నుండి వారసత్వంగా అందిన భూమిని అనుభవిస్తూ, తమ శక్తిమేర సేవకుల మీద అధికారాన్ని ప్రదర్శిస్తూ రాజసంగా బతుకుతున్న భార్యాభర్తల జీవితంలోకి నక్సలైట్లు ప్రవేశించి గ్రామం నుండి తరిమి కొడితే ఒక జీవిత విధానానికి అలవాటు పడ్డ వాళ్లు నగరంలో ఎలా బతుకుతారు. నారు మడి నుండి వేరు పడ్డ వరి మొక్కలు ఎండిపోయి ఏ అగమ్య తీరానికో కొట్టుకుపోతాయనుకుంటే ఎదురుచేపలాగా వినూత్న సంపాదనా మార్గాలను అన్వేషించి ఎట్లా జీవితాల్లో వెలుగు నింపుకున్నారనేదే ‘నాటు వడ్డ వరి మొక్కలు’ (డా॥ ముదిగంటి సుజాతారెడ్డి) కథ.

ఏడడుగులు నడిచిన భర్త చితికి భార్యే ఇల్లిల్లు తిరిగి కట్టెలు సేకరించడం, తన కళ్లముందే భర్త నరకయాతన అనుభవించి రజాకార్ల తుపాకీ తూటాలకు బలికావడం ఎంత పాశవికం? ఆ చీకటి రోజులను జయించిన ఇప్పటి తరం కొత్తవెలుగుల వైపు ఎలా అడుగులు వేసి జీవితాన్ని గెల్చుకుంటోంది, జీవితమనే ‘ఒక నది… రెండు తీరాల’ (ప్రొ॥ రామా చంద్రమౌళి)ను ఒరుసుకుంటూ ఎట్లా కొత్త ప్రపంచంలోకి ప్రయాణిస్తోందనే కథ ‘ఒక నది… రెండు తీరాలు.’ జీవితం నదిలాగా కాకున్నా కనీసం మురికి కాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండా నుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్క నీళ్లు దొరకక ‘పానీపట్టు’ యుద్ధంలో ఆడపడుచులు పడే పెనుగులాట, సంఘర్షణను ‘నీళ్లబిందె’ (చందు తులసి)లోనే చూడాలి.

నగరాల పరిస్థితి ఇలా వుంటే తండాల పరిస్థితి మరింత ఘోరం. అక్కడ కనీసం జీవించడానికి కూడా ఏ ఆదరువు దొరకక అప్పుడే పుట్టిన కన్న పేగుల్ని అమ్ముకొని బతకాల్సిన దుస్థితి. ‘ఫెర్టిలిటి’ (రజిత కొమ్ము)కి నోచుకోని కొందరు దేన్నయినా మారకపు సరుకుగానే చూస్తారు. మన నీళ్లు మనకు కావాలి. మన నిధులు మనకు కావాలి. మన ఉద్యోగాలు మనకు కావాలని నినదించి ఆ లక్ష్య సాధనలో ప్రాణాలను కూడా త్యాగం చేసినా చివరికి చేతిలో బూడిద మిగిలితే. మళ్లీ ఆ లక్ష్యాల కోసమే మరో తరం పోరాటం ప్రారంభిస్తే… ఈ ‘రాచపుండు’ (డా॥ పసునూరి రవీందర్) ఎప్పటికి మానాలి? ఇంతా చేసి ఏ కాంట్రాక్టు ఉద్యోగమో ఖాళీ ఉంటే తరాలుగా అన్ని ఉద్యోగాల్లో నిండిన అగ్రవర్ణాల వాళ్లే మళ్లీ పోటీ పడుతుంటే వేల ఏండ్లుగా సామాజిక ెదా కోసం పోరు సల్పుతున్న నిమ్నవర్గాల సంవేదన మిగిలిన వర్గాలకు ఎప్పటికి అర్థం అవుతుంది? కేవలం ‘స్కావెంజర్’ (పెద్దింటి అశోక్‌కుమార్) పనుల కోసమే దళితులు కావాలి.

మిగిలిన అన్ని ఉద్యోగాలకు మాత్రం అగ్రవర్ణాల వారు ముందుంటారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు లేరని కాదు కాని ఈ దళిత యువకుడి మాటలు వినండి “నువ్వు పేదవాడివే…. ఒప్పుకుం. కాని నీ పేదరికం నిన్ను ఏ గుడిలోకయినా రాకుండా నిలిపిందా… ఎవరి ఇంట్లోకయినా రాకుండా ఆపిందా… జనంలో మర్యాదని తక్కువ చేసిందా… అవమానానికి గురి చేసిందా… అత్యాచారాలకు కారణమయిందా…. వెలివేతకు గురయిందా… రోడ్లు ఊడిపించిందా… ప్రాణాలతోనే తగలబెట్టి చంపిందా… మరి నాకూ… కులం ఇప్పటికి ఇవన్నిటికి కారణమైతుందిరా…. ఈ దేశంలో సగం గుళ్లకు సగం ఇళ్లకు మెట్లు తుడవడానికి తప్ప ఎక్కడానికి అర్హత లేదు నాకు. మా పోరాటం సామాజిక ెదా కోసమే. అది లేకనే సచ్చి బతుకుతున్నంరా.” ఇందుకోసమే ఈ దేశంలో ఇంకా రిజర్వేషన్లు కావాలని వాదించేది.

ఇందులోని కథలు ఎక్కువ శాతం తంగెడుపూవు చుట్టూ గునుగుపూవు అల్లుకున్నట్టుగా ప్రేమ చుట్టు తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి కాని పూల చాటున దాగిన ముళ్లలాగా హృదయానికి మెత్తగా గుచ్చుకుంటాయి. ప్రేమతో పాటు జీవితంలోని వెలుగు నీడలు కూడా ఆయా కథల్లో ప్రతిబింబిస్తాయి. ఇప్పటి సమాజ ముఖచిత్రాన్ని వినూత్న కోణంలో మనముందు నిలబెడుతాయి. శిల్ప పరంగా తెలంగాణ కథా ఔన్నత్యాన్ని పట్టిచూపే కథలివి. ‘యాత్ర’ కథ మినహా మిగిలిన కథలన్నీ మిశ్రిత తెలంగాణ తెలుగులో రాయబడ్డ కథలు. మనదైన భాషా వ్యక్తీకరణ కోసం ఇంకా కృషి చేయాల్సే ఉంది. 2018 తెలంగాణ కథా సముద్రాన్నంతా గాలించి ఈ కథా ‘బంగారు తీగ’ల్ని పట్టుకోగలిగాము. ఎన్నో జీవిత కోణాల్ని ఆవిష్కరించిన కథలు చాలానే ఉన్నాయి. కొన్ని పరిమితుల దృష్ట్యా ఈ కథల్ని మాత్రమే ప్రచురించగలుగుతున్నాం. ఇంతా చేసి మా దృష్టిపథం నుండి జారిపోయిన ఇంతకంటే మంచి కథలు కూడా ఉండవచ్చు. ఏదేమైనా మరింత మేలిమి కథల్ని తెలుగు పాఠకలోకానికి అందించడానికి చేస్తున్న మా ప్రయత్నాన్ని ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆకాంక్ష.

story about Inter caste marriage in society

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణ కథల ‘రివాజు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: