బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి

  తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా, ప్రఖ్యాత రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు గొల్లపూడి మారుతీరావు. ముఖ్యంగా విలక్షణ విలనిజానికి ఆయన పెట్టింది పేరు. ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించిన గొల్లపూడి ఆతర్వాత సినిమా రంగంలోకి వచ్చి రచయితగా, సినీ నటుడిగా, మాటల రచయితగా ప్రేక్షకులను అలరించారు. రేడియోలో కూడా పనిచేసిన ఆయన చిత్ర పరిశ్రమలో రాణించి… నటుడిగా, వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. గొల్లపూడి మారుతీరావు నటుడిగా తన […] The post బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా, ప్రఖ్యాత రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు గొల్లపూడి మారుతీరావు. ముఖ్యంగా విలక్షణ విలనిజానికి ఆయన పెట్టింది పేరు. ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించిన గొల్లపూడి ఆతర్వాత సినిమా రంగంలోకి వచ్చి రచయితగా, సినీ నటుడిగా, మాటల రచయితగా ప్రేక్షకులను అలరించారు. రేడియోలో కూడా పనిచేసిన ఆయన చిత్ర పరిశ్రమలో రాణించి… నటుడిగా, వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. గొల్లపూడి మారుతీరావు నటుడిగా తన తొలి చిత్రంలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రానికి పనిచేయడం విశేషం.

గొల్లపూడి మారుతీరావు 1939 సంవత్సరం ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వీరికి ఐదవ కుమారుడిగా ఆయన జన్మించారు. 1961 సంవత్సరం నవంబరు 11న హనుమకొండలో శివకామసుందరితో గొల్లపూడి మారుతీరావు వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు. ప్రముఖ నటుడిగా రాణించిన గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. విశాఖపట్నంలోని సిబిఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కాలేజీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గొల్లపూడి మారుతీరావు చదువుకున్నారు. 1959లో ఆంధ్రప్రభ పత్రికలో ఉప సంపాదకుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆతర్వాత రేడియోలో వివిధ హోదాల్లో ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు.

చిత్ర పరిశ్రమలోకి…
1963లో వచ్చిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి మొదటిసారిగా స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా గొల్లపూడి నంది అవార్డును అందుకోవడం విశేషం. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ (1982) చిత్రంతో నటుడిగా తన కెరీర్‌ను ఆరంభించారు గొల్లపూడి మారుతీరావు. ఈ చిత్రానికి ఆయన మాటల రచయితగా కూడా పనిచేయడం విశేషం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొని గొల్లపూడి మారుతీరావుకు నటుడిగా, మాటల రచయితగా మంచి పేరును తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకు నటుడిగా వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 250కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, సంసారం ఒక చదరంగం, పల్లెటూరి మొనగాడు, అభిలాష, స్వాతిముత్యం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369, ఛాలెంజ్, మురారి, యముడికి మొగుడు తదితర చిత్రాలు ఆయనకు విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించారు గొల్లపూడి మారుతీరావు. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు నంది అవార్డులను ఆయన అందుకున్నారు. అంతేకాకుండా నాటకాల్లో కూడా ఆయనకు పలు పురస్కారాలు లభించాయి. గొల్లపూడి నటించిన చివరి చిత్రం ఆది సాయికుమార్ హీరోగా చేసిన ‘జోడి’. రచయితగా నటుడిగా మాత్రమే కాకుండా గొల్లపూడికి మంచి వక్తగా కూడా పేరుంది. టివి రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. మనసున మనసై, ప్రజావేదిక లాంటి ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి బుల్లితెర వీక్షకులను మెప్పించారు.

తనయుడి పేరుతో అవార్డులు…
గొల్లపూడి మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. గొల్లపూడి తన చిన్నకుమారుడు శ్రీనివాస్ స్మారకార్థం ప్రతి సంవత్సరం అవార్డులను అందజేస్తున్నారు. దేశంలో వివిధ భాషల్లో వచ్చిన సినిమాలను పరిశీలించి… ప్రతిభ కలిగిన కొత్త దర్శకులను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తున్నారు. గొల్లపూడి చిన్న కుమారుడు శ్రీనివాస్ 1992లో తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు చనిపోయారు.

ఆయన జ్ఞాపకార్థం ‘గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు’ను నెలకొల్పి ప్రతి సంవత్సరం ఉత్తమ సినిమా దర్శకునికి లక్షన్నర రూపాయల నగదు బహుమతిని, జ్ఞాపికను అందజేస్తున్నారు. ఈమధ్య కాలంలో ‘96’ సినిమా దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే సినిమా రంగంపై విశేషంగా ఉపన్యాసం చేసిన ప్రముఖులకు ‘గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్’ పేరిట రూ.15,000 బహూకరిస్తున్నారు. ఈ నగదు పురస్కారం అందుకున్న వారిలో సినీ ప్రముఖులు సునీల్‌దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావెద్ అక్తర్, అనుపమ్ ఖేర్ తదితరులు ఉన్నారు.

ప్రముఖుల సంతాపం
-సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాతగా కూడా గొల్లపూడి మారుతీ రావు రాణించారని ఆయన గుర్తు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన మృతితో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “ఈమధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది.

ఆతర్వాత మళ్లీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకు, నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధమిది. నేను 1979లో ‘ఐలవ్ యూ’ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమా నిర్మాత భావన్నారాయణ నాకు గొల్లపూడి మారుతిరావుని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను టి.నగర్‌లో వాళ్లింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు.

1982లో కోడిరామకృష్ణ నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావు చేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి ఛాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్ అది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడమనేది మంచి అనుభూతినిచ్చింది. ఆ తర్వాత ఆలయ శిఖరం, అభిలాష, ఛాలెంజ్ లాంటి ఎన్నో సినిమాల్లో నాతో కలిసి నటించారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు ఇది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని అన్నారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు, మారుతిరావుకి సన్నిహితుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ “గొల్లపూడి అస్తమయం నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయనను చిన్న కుమారుడు శ్రీనివాస్ ఆకస్మిక మరణం బాగా కుంగదీసింది. గొల్లపూడి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు”అని అన్నారు. ఇక తనకు ఇష్టమైన నటులలో గొల్లపూడి మారుతిరావు ఒకరని టాలీవుడ్ హీరో నాని ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడేతీరు, నటించిన తీరు ఆకట్టుకుంటుందని, ఆయన సాన్నిహిత్యం మరువలేనిదని పేర్కొన్నారు.

ఆదివారం అంత్యక్రియలు…
గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకూ గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.

Telugu actor Gollapudi Maruthi Rao dies at 80 in Chennai

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: