తగ్గని అసమానతలు

మానవ మహాయానంలో లెక్కకు అందిన, అందకుండాపోయిన శతాబ్దాలెన్నో.. ఈ గమనంలో మనిషి సాధించిన అభివృద్ధి ఎంత, దేశాల వారీగా అదెలా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ వ్యవస్థ (యుఎన్‌డిపి) లోతైన పరిశీలనతో రూపొందించిన తాజా (2019) మానవాభివృద్ధి సూచీ గమనించదగినది. ఇందులో భారత దేశం ఒక మెట్టు పైకెక్కి తన స్థానాన్ని 130 నుంచి 129కి మెరుగుపరచుకోగలిగింది. అదే సమయంలో పాకిస్థాన్ 150వ స్థానం నుంచి 152కి దిగజారింది. అఫ్ఘానిస్థాన్ […] The post తగ్గని అసమానతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మానవ మహాయానంలో లెక్కకు అందిన, అందకుండాపోయిన శతాబ్దాలెన్నో.. ఈ గమనంలో మనిషి సాధించిన అభివృద్ధి ఎంత, దేశాల వారీగా అదెలా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ వ్యవస్థ (యుఎన్‌డిపి) లోతైన పరిశీలనతో రూపొందించిన తాజా (2019) మానవాభివృద్ధి సూచీ గమనించదగినది. ఇందులో భారత దేశం ఒక మెట్టు పైకెక్కి తన స్థానాన్ని 130 నుంచి 129కి మెరుగుపరచుకోగలిగింది. అదే సమయంలో పాకిస్థాన్ 150వ స్థానం నుంచి 152కి దిగజారింది. అఫ్ఘానిస్థాన్ 168 నుంచి 170కి పడిపోయింది. అయితే శ్రీలంక (71), చైనా (85) దేశాలు ఈ విషయంలో మన కంటే బాగా ముందున్నాయి. శ్రీలంక 4, చైనా ఒక్క స్థానం మెరుగుపడ్డాయి. మానవాభివృద్ధి సూచీ కోసం ఈ సంస్థ 189 దేశాల్లో అధ్యయనం జరిపింది. నార్వే అగ్రస్థానంలోనూ, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, జర్మనీ, హాంకాంగ్, ఆస్ట్రేలియాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లోనూ నిలబడ్డాయి.

మొత్తం మీద ఇండియా మానవాభివృద్ధి విలువ 50 శాతం పెరిగినప్పటికీ దేశంలోని అసమానతలను పరిగణనలోకి తీసుకోగా ఈ ప్రగతి మసకబారిపోయి వాస్తవాభివృద్ధి గణన ఒకే ఒక్క మెట్టు ఎగబాక గలిగింది. స్త్రీ పురుష అసమానతల పరంగా అధ్యయనం జరిగిన 162 దేశాల్లో ఇండియా 122వ స్థానంలో ఉంది. ఈ విషయంలో చైనా శ్రీలంక (86), భూటాన్ (99), మయన్మార్ (106)లు మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బృంద అసమానతలు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా బాలికలు, మహిళలు అల్ప పరిగణన పొందుతున్నారని, లింగపరమైన సమానత ఎక్కడా లేదని ఈ నివేదిక నిగ్గు తేల్చిన నిష్ఠుర సత్యం మొత్తం మానవాళి వీపున కొరడా దెబ్బ వంటిది. ప్రపంచ సమాజం ఆత్మవిమర్శ చేసుకొని తగిన దిద్దుబాటును త్వరితంగా చేపట్టవలసిన ఆవశ్యకతను ఇది గట్టిగా గుర్తు చేస్తున్నది.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ కృషి అత్యంత శీఘ్రంగానూ, ప్రభావవంతంగానూ అమలు కావలసి ఉంది. అమెరికాలో సైతం అసమానతలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. అయితే అవి అక్కడ ఒకప్పుడున్న కరకుగా, మొరటుగా ఇప్పుడు లేకపోడానికి అక్కడ జరిగిన శాసనపరమైన, సామాజికమైన దిద్దుబాట్లు, తిరుగుబాట్లే కారణం. తాజా మానవాభివృద్ధి సూచీలో అమెరికా 47వ, బ్రిటన్ 46వ స్థానాల్లో ఉండడం గమనార్హం. సంప్రదాయ సమాజాల్లో లింగ, జాతి, రంగు వంటి ప్రాతిపదికల పరమైన వివక్షలు తీవ్రాతి తీవ్రంగా, ఘోరాతి ఘోరంగా ఉండేవి. బలవంతులదే రాజ్యంగా సాగేది. ఆ సమాజాలు మృగరాజుల పాలనలోని ఆటవిక జంతు రాజ్యాలను తలపించేవి. స్త్రీలకు, పిల్లలకు భావ ప్రకటన స్వేచ్ఛగాని, సమానత్వంగాని ఉండేవి కావు. ఈ దుస్థితిని మార్చడానికి బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాలు, అమెరికా ముందుగా నడుం కట్టి ప్రజాస్వామ్య సమ సమాజ నీతిని ఆవిష్కరించుకున్నాయి.

అది కాలక్రమంలో ధనిక, పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యంగా మారి వెర్రి తలలు వేస్తున్నప్పటికీ మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో, పాశ్చాత్య ప్రపంచంలో సమానత్వ సూత్రానికి మెరుగైన వాతావరణమే ఉన్నది. మన వంటి దేశాల్లో కూడా ప్రజాస్వామిక రాజ్యాంగం సర్వసమానత్వానికి పెద్ద పీట వేసి చట్టం ముందు అందరూ ఒకటేనని, కుల మత తదితరాలకు అతీతంగా సమాన న్యాయం అందాలని నిర్దేశిస్తున్నప్పటికీ ఆచరణలో స్త్రీ పురుష, పై, కింది కులాల అసమానతలు కొనసాగుతున్నాయి. సామాజిక అణగారినతనం మెజారిటీ ప్రజలను పట్టి పీడిస్తున్నది. కుల వివక్ష ఇప్పటికీ దారుణంగా రాజ్యమేలుతున్నది. దళితులను, స్త్రీలను, మైనారిటీలను నిర్దాక్షిణ్యంగా చంపి మట్టుబెడుతున్న ఉదంతాలు సాగిపోతున్నాయి. ఆర్థిక అసమానతల గురించి చెప్పుకోనవసరమే లేదు.

ప్రపంచంలోని పేదల్లో 28 శాతం మంది భారత దేశంలోనే ఉన్నారు. దేశంలో అత్యధిక సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై అత్యధిక జనాభా పేదరికంలోకి, దారిద్య్రంలోకి మరింత మరింతగా కుంగి కునారిల్లిపోతున్నది. మానవాభివృద్ధి లక్షమే అందరూ సుఖంగా బతకగలిగే సమాజాలను ఆవిష్కరించడం. సర్వేజనో సుఖినోభవంతు అని ఎంతగా నీతులు వల్లించుకున్నప్పటికీ భారత సమాజంలో అది నానాటికీ నల్లపూస అయిపోతున్న చేదు నిజాన్ని కాదనలేం. కులాంతర, మతాంతర వివాహాలను నిరుత్సాహపర్చడం, పరువు హత్యలకు పాల్పడడం, ఖాప్ పంచాయితీల్లో స్త్రీల ఆధునిక పోకడలను తప్పుపడుతూ శిక్షలు విధించడం వంటి అమానుషాలు జరిగిపోతున్నాయి. అందుచేత వాస్తవ మానవాభివృద్ధి సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వ స్థాపనలోనే ప్రతిబింబిస్తుందనే విషయాన్ని గమనించి దానిని సాధించడానికి తగిన కృషి జరగాలి.

India’s human development value has risen by 50 per cent

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తగ్గని అసమానతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: