యాకూబ్ జీవితానుభవాల ‘తీగలచింత’న

  అపుడెపుడో కవి శ్రీనాథుడు ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు‘ అనే సీసపద్యం రాశాడు. అందులో రచనలపై వయసు తాలూకా ప్రభావం వుంటుందనీ స్పష్టపరిచాడు. నిజమే, ఇరవయ్యేళ్ల వయసులో పొంగుతూ వచ్చే నదిలా కవిత్వం పరవళ్లు తొక్కవచ్చు. అదే అరవయ్యేళ్ల ప్రాయంలో కవిత్వం తేటబడిన నీటితో నిలకడగా ఆవేశం లేని నదిలా మారిపోతుంది. ఏదైనా కవిత్వమే కావచ్చు. కానీ ప్రౌఢ వయస్సులో కవి దగ్గర ఎంతో జీవితానుభవం వుంటుంది. సామాజిక చింతన వుంటుంది. తనలోకి తాను, సమాజంతో […] The post యాకూబ్ జీవితానుభవాల ‘తీగలచింత’న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అపుడెపుడో కవి శ్రీనాథుడు ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు‘ అనే సీసపద్యం రాశాడు. అందులో రచనలపై వయసు తాలూకా ప్రభావం వుంటుందనీ స్పష్టపరిచాడు. నిజమే, ఇరవయ్యేళ్ల వయసులో పొంగుతూ వచ్చే నదిలా కవిత్వం పరవళ్లు తొక్కవచ్చు. అదే అరవయ్యేళ్ల ప్రాయంలో కవిత్వం తేటబడిన నీటితో నిలకడగా ఆవేశం లేని నదిలా మారిపోతుంది. ఏదైనా కవిత్వమే కావచ్చు. కానీ ప్రౌఢ వయస్సులో కవి దగ్గర ఎంతో జీవితానుభవం వుంటుంది. సామాజిక చింతన వుంటుంది. తనలోకి తాను, సమాజంతో తాను చేసే విలువైన సంభాషణ వుంటుంది. కవియాకూబ్ ఇపుడు ‘తీగలచింత‘గా మన ముందుకొచ్చారు. ఇంతకు ముందు ’ప్రవహించే జ్ఞాపకం’,’సరిహద్దు రేఖ ”ఎడతెగని ప్రయాణం,’ నదీ మూలం లాంటి ఇల్లు‘ వంటి సంపుటాలతో మనసుపై నాటుకునే కవిత్వమెంతో మథించారు. ఆయన నిరంతరం కవిత్వం శ్వాసగా బతికే మనిషి. కవిసంగమం వేదికగా ఎందరో యువకవుల కవిత్వాన్ని వెలుగు జూపిస్తూనే, అధ్యాపకుడిగా బాధ్యత వహిస్తూనే, మిగిలిన సమయంలో తన కలానికి పరిమళించిన జీవితాన్ని సిరాగా ఎక్కించారు. అదే ‘తీగల చింత‘ అయ్యింది.

ఏ కవిదైనా సృజనాత్మకత పాళ్లు పుస్తకానికి పెట్టిన శీర్షికలోనే తెలిసిపోతుంది. యాకూబ్ వారి తాజా కవిత్వాన్ని తీగలచింత అన్నారు. ఒక అర్థంలో తీగలు పెనవేసుకున్న చింతచెట్టు. అది కవి నోస్టాల్జియాలో భాగం. ఇంకొక అర్థంలో చింతన. అది జీవితానుభవాల పరిమళం. చింతన అనగా ఆలోచన.లోతైన చూపు.ఒక మథనం. పొరలు పొరలుగా ఒలిచిన జీవితవ్యాఖ్యానం. ఈ చింతన తీగలుగా సాగడం అంటే అదొక తాత్విక విస్తృతికి సంకేతం. ఇందులో దాదాపు అన్ని కవితల్లో అమూల్యమైన కవితాపంక్తులు వున్నాయి. తేలికపాటి మాటల్లో గాఢతనూ,గూడతను అందించారు. వాటి ఛాయల్లోని నడుద్దాం! ఇంతకీ తీగలచింత ఎవరు!? ఆ చింతన సారాంశం ఏమిటో తెలుసుకుందాం.‘నేనే తీగలచింతను/తీగలచింతను నేనే‘ అన్నారు కవి. మరి దాని సారాంశం పట్టిచూపే పంక్తులు చదవండి.

‘లోలోపలికి ప్రపంచాల కలబారిన తీగ/ నా గుండె అడుగుల అలికిడి/శతాబ్దాలుగా ఆత్మగౌరవం కోసం/ప్రవాహాల పరంపరలో సాగిన/మూలవాసి అడుగు/ఎడతెగకుండా చెమ్మగిల్లే కన్ను/గాయాల మథనాల/బిగబట్టిన ఊపిరి శబ్దం/ ఆధిపత్యాల కొమ్మలు నరికి/కొంగొత్త చిగురింతల్ని/కలగంటున్న చెట్టుకు అల్లుకుంటున్న/నేనే తీగలచింతను‘ (పుట:131,132)
ఒక చిన్న కవితలో తాను అక్షరాలచెట్టుకు ఏయే అనుభవాల తీగగా అల్లుకుంటున్నారో బొమ్మకట్టించారు. లోపలిప్రపంచం,మూలవాసి అడుగు,గాయాల మథనం, బిగబట్టిన ఊపిరిశబ్దం, ఎడతెగకుండా చెమ్మగిల్లే కన్ను వంటి పదచిత్రాలు కవితలోని సీరియస్ నెస్ నీ, తన జీవితంలోని స్ట్రెస్ నీ పట్టి చూపాయి. ‘కొంగొత్త చిగురింతల్ని కలగనడం‘ అనే పదబంధం కవి ఆశావాద దృక్పథాన్ని తెలిపాయి. అలజడిసంద్రం లోంచి ఒడ్డుకు చేర్చడమే కదా కవితాలక్ష్యం. ఈ పాదాలు కవి అస్థిత్వంలోంచి, స్వీయ జీవితంలోంచి పురుడోసుకున్న నిష్ఠురసత్యాలు!

నాటి కాలంలో గుండెలో తియ్యగా నాటుకునే మాటలెన్నో నేటికాలంలో మాటలెలా వికృతంగా, విశృంఖలంగా, స్వార్థభూయిష్టంగా మారాయో ముఖ్యంగా నగరీకరణలోని దుర్భరత ఎంతో ‘ట్రాష్’ అంటూ నిరసన చేశారు కవి యిలా…
‘అరిగిపోయిన పాత ప్రతీకలా/అవసరం లేని,ఎంతకీ అర్థం కాని పదబంధంలా నగరం/మనతనమేదీ అంటడంలేదు/పలకరింతల్లోకి సంబోధనల్లోకి సారవంతమైనదేదీ చేరడమే లేదు/మాడుచెక్కల్లాంటి మాటలు/సబ్సిడీల సరసమైన మాటలు/పగిలిన పైపులాంటి మాటలు/వాడిన పూలరేకు లాంటి మాటలు/నగరం పేటేంట్ కృత్రిమమాటలు/చెవికేవీ ఇంపుగా విన్పించడమే లేదు‘. ఆధునిక కాలపు మానవసంబంధాల్లోని డొల్లతనాన్ని, నిజాయితీలేనితనాన్ని అలతిఅలతి మాటల్లో వెలితిని వెల్లడించారు. ఈ కవిత మనుషుల్లో ‘చింతన‘ రేపుతుందని ఆశిద్దాం. జీవితం గురించి కూడా తలపోత జరిపారు. ‘ఆస్తులు పాస్తులు,సంపాదన,కూడబెట్టడం/కీర్తి,కిరీటాలు, జీవితమిదేనా/ఇల్లంటే గోడలు ద్వారాలు కొన్ని కిటికీలు మాత్రమేనా/అందులోని జీవితం కూడా’ అని అంటూ ఆ జీవితం ‘కోట్ల విలువున్న భూమిని శరణాలయానికి/చిరునవ్వుతో రాసిచ్చినంత‘ గొప్పగా ,త్యాగశీలంతో వుండాలనీ అపుడా యిల్లొక ‘సూఫీఘర్ ‘ అంటారు కవి.

చింతన అనేక రకాలు… ఆత్మచింతనే గాదు అవతలి ప్రపంచచింతన వుండాలి. అతి ప్రధానంగా కవికి సామాజికచింతన వుండాలి. యాకూబ్ కవిలో సమాజం పట్ల చింతన మెండుగా వుంది. తిరోగమనంలో పడ్డ సమాజాన్ని అక్షరాల్లోకి తెస్తారు. కులమతాల వివక్షల్ని మౌఢ్యాలను ఎండగడతారు. మానవ సమాజం స్తబ్దతనుంచి బయట పడాలనే ఆకాంక్షలెన్నో ఆయన వాక్యాల్లో నిండుగా వున్నాయి. నాసిక్ ముంబయ్ లో రైతుల పాదయాత్ర దేశాన్ని కుదిపింది.నగరంలో నాగళ్లు పట్టిన చేతులు పిడికిళ్లు బిగించి కవాతు చేయడం పాలనను గద్దించింది. కవి ‘ఇదే పాదం‘ అని జేజేలిలా పలికారు. ‘మట్టిని ముద్దాడిన పాదం/మట్టి ప్రేమించే పాదం/నాన్నలాంటి పాదం/అమ్మలాంటి పాదం/ఊరు లాంటి పాదం/కలల్ని నిజం చేస్తున్న పాదం/శూన్యంగా కన్పిస్తున్న కాలానికి/నడకను నేర్పుతున్న పాదం/అడుగు అడుగులో పోరాటం నేర్చుకోమనే పాదం/మాటలు చెప్పి మాయలు చేసి/అంతా తామే అన్నట్లు అంతా మేమే అన్నట్లు/కనికట్టు చేసే భ్రమల లోకపు దారుల్ని/ నిజమైన బతుకు అడుగుల రక్తంతో/కడుగుతున్న పాదం‘.

అపుడెపుడో పదకవితాకాలంలో అన్నమయ్య ‘బ్రహ్మ కడిగిన పాదం’ అన్నాడు. అది భక్తిపాదం. ఇపుడు కవియాకూబ్ ‘ఇదేపాదం‘ అన్నది రైతులపాదం, విప్లవపాదం. సమాజం బాగుండాలనే కవితాపాదం. అచ్ఛేదిన్ గానో, అంతా సవ్యం అనో ఆర్భాటాల అబద్ధాల్ని మెదడ్లో కూరే రాజకీయంపై తిరగబడే మనుషులు కావాలని పిలుపునిస్తున్నారు. ‘నిచ్చెన మెట్ల పన్నాగాల్ని ప్రశ్నించే యోధుల్లాంటి మనుషుల్ని‘ స్వాగతించారు. కులవృత్తి బతుకులు తలెత్తుకు జీవించే సమాజాన్ని సృష్టించే మనుషుల్నే’ కవి ఆశిస్తున్నారు. మనుషులు వీసాలుగా, ఓట్లుగా,ముడిసరుకులుగా,యంత్రాలుగా,నోరు మెదపలేని వాళ్లుగా,ప్రాణం లేని విగ్రహాలుగా వుండొద్దని మేలుకొలుపు చేశారు. ఆధిపత్య భావాలను ‘చరిత్రలన్నీ అవే‘ ననీ నిర్భయంగా చీల్చి చెండాడారు. అఖండ దేశపు నినాదపు అహంకారంతో మనిషిని వస్తువుగా మార్చే, ఆత్మలేని మొండెంలా మనుషుల్ని నిలబెట్టే సమకాలీన పాలక వ్యూహాలను కళ్లముందు చూపెట్టారు.

మాట్లాడాల్సిన దానిపై మాట్లాడి ‘కవిగౌరవానికి‘ పాత్రమయ్యాయి ఇందులోని అనేక కవితలు. పూవుల ఆత్మహత్య,సామూహిక ఆత్మహత్య, పాదాలు మొలిచిన పొలం,నెత్తురోడిన వాడ, ఖైదు చేయబడ్డ కదలని వీల్ ఛైర్ ,విరిగిన చూపుడు వేలు,మార్కుల హత్య, మాట్లాడని బావి,ఆహారపుటలవాటు,గుర్రాల సాక్ష్యం, ఆవు, రక్తమోడే పాదం, కట్టనిగోడ, అసహనం అంచున వేలాడే నేల ఇవన్నీ కనుమరుగౌతున్న ప్రజాస్వామ్యానికి ఆటంకాలనీ కవి ప్రకటించడం అందుకు నిదర్శనం. ‘తీగలచింత‘ లో పరాయీకరణతో ‘మిస్సింగ్ సమ్ థింగ్ ‘ అన్నదంతా కవిత్వం చేశారు. ఓ వెలితిని, ఓ పెనుగులాటనీ, ఒక వింత సందిగ్ధాన్నీ భరించలేని తనాన్ని విడిచి పెట్టాలనే తపననీ వెలిబుచ్చారు. ‘కాలంలోంచీ కాలంలోకి వొత్తిగిలే చీకటి/వెలుగుని లోపలికి జొరబడనీయని చీకటి‘ నుంచి ఇంకెప్పటికీ తెల్లారదా!? అనే వైరాగ్యమూ జతచేశారు.

‘నడిచి వచ్చిన దారికంటే/నడవాల్సిన దారి దుర్గమంగా కనిపిస్తున్నది/జీవితం పరాయిదయ్యింది/మనిషి తనకు తానే కాందిశీకుడు/కాలం ఇప్పుడు ఒక ప్రశ్నల అవశేషం‘ అందుకనీ కవి యాకూబ్ ‘యాటిట్యూడ్ చేంజ్ ‘ చేసుకోమంటున్నారు. అభద్రతల చట్రంలోంచి ఒక్కో శకలాన్ని విడగొట్టడానికే పాత్రలు ఎప్పటికప్పుడూ మారుతుండాలంటున్నారు. దశాబ్దాల కాలంగా వెనబడిన సమాజం ముందుకు సాగాలనీ ,అందుకు ‘దారులు నిర్మించాలి.గుంతలు నింపాలి. మార్గాలు చదును చేయాలి/ఇపుడు నిర్మించడమే అసలు సిసలు కర్తవ్యం/ ఇపుడు జీవించని జీవితాన్ని జీవించాలి‘. తేలికపాటి పదాలతో బిగువైన శైలిని సాధించి, తాను చెప్పబోయే చింతనను పాఠకసులభగ్రాహ్రంగా మలచడంలో కవికలం పరవళ్లు తొక్కింది. చక్కని సంభాషణాత్మక శిల్పాన్ని జమిలీ చేసి తీగలచింతను సారవంతం చేశారు. వర్ణనలేమీ వుండవు. ఇమేజుల మోజు కనబడదు. చిక్కని లోచూపు, తవ్వకం మాత్రమే వాక్యాలన్నింటా ‘వికసన‘మైంది. పదాల నిండా జీవితానుభవాలూ, సామాజిక వైరుధ్యాలూ పరుగులు పెట్టాయి. ఒక తాపసుడు సుదీర్ఘకాల ప్రయాణాన్ని కవితామయం చేస్తే అదే ‘తీగలచింత‘న అయ్యింది.
కవిత్వం తప్ప మరొక ధ్యాసలేని కవి యాకూబ్ . రాయడమూ, ఇతరులు రాసేదాన్ని క్షణక్షణం శ్వాసగా తీస్తూ కాలానికి వేడుక చేయడానికి అడుగువేస్తోన్న ‘తీగలచింత‘ కవికి అభినందనలు.

Story about Yacoob Thigala Chintha book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యాకూబ్ జీవితానుభవాల ‘తీగలచింత’న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: