బాలసాహిత్యాన్ని బతికించుకోవాలె

  సాహిత్యం అంటే…సమాజానికి మేలు చేసేది. సాహిత్యానికి బాలసాహిత్యం వెన్నుపూసలాంటిది. ఉజ్వలమైన భవిష్యత్తును భావితరాలకు అందించేది. ‘నేటి బాలలే రేపటిపౌరులు‘అన్నది అందరం అంగీకరించేదే. అట్లానే నేటి బాలల సాహిత్యమే రేపటి భవిష్యత్తు సాహిత్యం అనికూడా మనం అంగీకరించాల్సిందే. మట్టిలో ఒక మంచి ఇత్తు నాటకుండా మంచి ఫలాలను ఆశించనూలేం.అందుకే పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో అందమైన జీవితాన్ని నిర్మించడంలో బాలసాహిత్యం కీలకమైన పాత్ర వహిస్తుందనడలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.బాలసాహిత్యం బలంగా ఉంటేనే అది దేశంలోని బాలబాలికలందరికీ […] The post బాలసాహిత్యాన్ని బతికించుకోవాలె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాహిత్యం అంటే…సమాజానికి మేలు చేసేది. సాహిత్యానికి బాలసాహిత్యం వెన్నుపూసలాంటిది. ఉజ్వలమైన భవిష్యత్తును భావితరాలకు అందించేది. ‘నేటి బాలలే రేపటిపౌరులు‘అన్నది అందరం అంగీకరించేదే. అట్లానే నేటి బాలల సాహిత్యమే రేపటి భవిష్యత్తు సాహిత్యం అనికూడా మనం అంగీకరించాల్సిందే. మట్టిలో ఒక మంచి ఇత్తు నాటకుండా మంచి ఫలాలను ఆశించనూలేం.అందుకే పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో అందమైన జీవితాన్ని నిర్మించడంలో బాలసాహిత్యం కీలకమైన పాత్ర వహిస్తుందనడలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.బాలసాహిత్యం బలంగా ఉంటేనే అది దేశంలోని బాలబాలికలందరికీ విరివిగా చేరితేనే ఆ దేశం నైతికంగా ,విజ్ఞానపరంగా ముందుకు సాగుతుంది.అయితే ఒకప్పుడు బాలసాహిత్యం అంటే పెద్దలు పిల్లల కోసం రాసినది మాత్రమే ఉండేది.కానీ కాలం మారింది.

నేటి బాలల్లో సృజనాత్మకత పెరిగింది.అందుకే తమ సాహిత్యాని తామే సృష్టించికునే స్థాయికి ఎదగడం శుభ పరిణామం.ఇయ్యాల కథలు,పాటలు, కవితలు,గేయాలు,పొడుపు కథలు,ఆత్మ కథలు,నాటికలు,వ్యాసాలు,పద్యాలు,సామెతలు,జీవిత చరిత్రలు ఇలా ఒక్కటేమిటి? బాలసాహిత్యం ప్రక్రియలన్నిటిలోను విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ రచనా వ్యాసంగం చేస్తున్నారు.దీనికి తోడు మరోపక్క బాలసాహితీవేత్తలు కూడా అనేక ప్రక్రియలలో రచనలు చేస్తూ పిల్లలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.అయినప్పటికీ బాలసాహిత్యం అనుకున్నంతగా అందరూ బాలలకు చేరడం లేదన్న విమర్శ కూడా ఎదుర్కొంటున్నది.బాలసాహిత్యాన్ని పెంపోదించి ప్రయోజనం కలిగించే ‘బాలసభ’ ల నిర్వహణ అంతంత మాత్రమే కనిపిస్తుంది.

పూర్వ చరిత్ర : బాలసాహిత్యానికి ఎన్నో యేండ్ల చరిత్ర ఉంది. సుమారు 2 వేల యేండ్ల క్రితమే బాలసాహిత్యం ఉన్నట్లు ఆధారాలున్నాయి.తొలుత మౌఖికంగా పాటలు,కథలు,గేయాలు మొదలైన రూపాలలో ప్రారంభమైనది.మనదేశంలో పూర్వమే పంచతంత్రం,భేతాళ కథల్లాంటి పిల్లల కథలు ప్రాంతీయ భాషలలో నీతి కథలుగా గుర్తింపు పొంది,ఆ తరువాత కాలంలో సంసృత భాషల్లోకి అనువాదం పొందినట్లు ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.క్రీస్తుశకం 1690 ఇంగ్లాండులో జాన్ లాక్,1740 ఫ్రాన్స్ లో రూసో తెచ్చిన విప్లవంతో పిల్లలను ప్రత్యేకంగా చూడటం ,వారి ఆనందం కోసం ,మానసిక అభివృద్ధి కోసం తగిన బాల సాహిత్యం సృష్టించడం మొద లైంది.ఆ తర్వాత జర్మనీ దేశంలో గ్రిమ్ సోదరులు శ్రమకోర్చి విస్తృతంగా జానపద కథల్ని సేకరించాక వాటి రూపశిల్పాల ప్రయోజనకత్వాని గుర్తించడం జరిగి అవి బాల సాహిత్యంలో మౌలికంగా స్థిరపడ్డాయి. ఆ తరహాలోనే మన తెలుగు ప్రాంతంలోని నాగిరెడ్డి,చక్రపాణి లు 1947 లో ‘చందమామ’ ను తెలుగు, తమిళం భాషలలో ను ప్రారంభించారు.తదుపరి కుటుంబ రావు ఈ జానపద రీతిని సంస్కరించి ఒక ప్రమాణిక శిల్పంగా అభివృద్ధి పరచి ఉన్నత శిఖరాలకు చేర్చడం జరిగింది.

తెలంగాణ బాలసాహిత్యం విషయానికొస్తే 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు తొలిమెట్టుగా ‘జోసరచుచు నన్నతిబాడు’ అన్న జోలపాటను అందించాడు.ఇంక రాగుంజు ‘పోగుంజులాట’,‘గుడి గుడి గుంజం గుంజరాగం‘, దాగుడుమూతలు వంటి పాటలను అందించాడు.ప్రాచీన బాలసాహిత్యం ఎక్కువగా గేయ రూపంలో ఉండేదని చెప్పవచ్చు.పాల్కురికి సోమన తదుపరి అనంతమాత్యుని ‘భోజరాజీయం’, కొరివి గోపరాజు ‘సింహసన ద్వాత్రిశక’ వంటి గ్రంథాలలో బాల సాహిత్యం ప్రస్తావించబడింది.పోతన భాగవతంలో కూడా బాలకృష్ణుని ఆటలు వర్ణిస్తూ రాసిన గేయాలు కూడా ప్రముఖమైనవి.మడక సింగన రాసిన ‘సకలనీతి సమ్మతం’ కందనా మాత్యుడు రాసిన ‘నీతి తారావళి’, వేములవాడ భీమకవి చాటుపద్యాలు,చరికొండ ధర్మన ‘చిత్రభారతం’ ,శేషప్ప నరసింహ శతకాలు వంటి అనేక పుస్తకాలలో బాలసాహిత్యం ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి.

ఆధునిక కాలంలో…. : నేటి ఆధునిక కాలంలో బాలసాహిత్యం అనేక ప్రక్రియలలో సరళమైన బాలల బాషలో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది.ఈ కాలంలోనే రామాయణం,మహాభారతం,భాగవతం వంటి పురాణ ఇతిహాసాల్లోని కథలను పిల్లలకు అర్థమయ్యేలా ఎందరో రచయితలు గద్యం,పద్యం,గేయ ప్రక్రియల ద్వారా సులభశైలిలో రాసి అందిస్తూ వస్తూన్నారు.ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల కూడా తెలుగులో అనేక బాలసాహిత్య రూపాలు వెలుగులోకి వచ్చినాయి.బాలసాహిత్యం వికాసానికి,ప్రచారానికి అనేక బాలల పత్రికలు బాల చెలిమి,బుజ్జాయి,కొత్తపల్లి వంటివి తమదైన పాత్ర పోషిస్తున్నాయి.ఆధునిక బాలసాహిత్యంలో జేయాలు ,నాటికలు,నీతిశతకాలు,బుర్రకథలు,నృత్య రూపకాలు,నృత్య గేయాలు ,బాల విజ్ఞాన సర్వస్వాలు,జీవిత చరిత్రలు వంటి అనేకం అచ్చువేయబడినాయి. తెలంగాణలో సిద్ధిపేట,నల్లగొండ,నిజామాబాద్,పాలమూరు వంటి మొదలగు అనేక ఇతర జిల్లాలలో కూడా కవులు,రచయితలు వందల సంఖ్యలో బాల సాహిత్యం పుస్తకాలను రాసి ముద్రితం కావించి పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే విధంగా అనేక ప్రాంతాలలో బాలలకు తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో బాలసాహిత్యంపై కార్యశాలలు ఏర్పాటు చేసి అవగాహన కలిగిస్తూ పిల్లలలో దాగిఉన్న సృజనాత్మకత శక్తులను వెలికితీస్తున్నారు. సుప్రసిద్ధులైన కవి పండితులు డాక్టర్ సినారె ,దాశరథి,యశోదరెడ్డి,డాక్టర్ కపిలవాయి లింగమూర్తి,బోయ జంగయ్య,గడియారం రామకృష్ణ శర్మ మొదలైన వారు బాలల కోసం అనేక పద్యాలు, గేయాలు,నాటికలు,నవలలు,పాటలు,కవితలు,జీవిత చరిత్రలను రచించి బాలసాహిత్యానికి ఇతోధికంగా కృషి చేశారు.

పిల్లల బాషలో సాహిత్యం : పెద్దల సాహిత్యం ను పెద్దవారు రాయడం చాలా సులువు.కానీ పిల్లల కోసం బాలసాహిత్యాన్ని పెద్దలు బాలబాషలో రాయడం చాలా కష్టమైన పని.ఎందుకంటే వాళ్ళస్థాయికి దిగి అలతి అలతి పదాలతో సరళమైన బాషలో పిల్లల మాటల్లో రాస్తుపోవాలి.పిల్లలను తికమక పెట్టేదిగా ఉండకూడదు.అమ్మే బాలసాహిత్యానికి ఆదిగురువు అని చెప్పాలి.ఎందుకంటే బడికి రాకముందే అన్నం తినిపించే ముందుగానీ,నిద్ర పుచ్చడానికి పాడే జోలపాటలు ,మారాం చేసినప్పుడు ఊకుంచడానికి అమ్మ చెప్పే చిన్న చిన్న కథలు కూడా బాలసాహిత్యానికే చెందుతాయి.అందుకనే అమ్మ మొదటి బాలసాహితీ వేత్త.ఆ తర్వాత బడిలో చేరినంక భాష నైపుణ్యాలైన పఠనం,లేఖనం లను నేర్చుకోవడానికి అనేక బాలసాహిత్యం ప్రక్రియలు దోహదపడతాయి.ఇక అప్పటి నుండి బాలలు చదువులో రాణించే విధంగా బాలసాహిత్యం బాగా ఉపయోగపడుతుంది. బాల సాహిత్యం విభిన్న ప్రక్రియలలో అనగా జానపదం,పౌరాణికం,సాంఘిక,వైజ్ఞానిక,దేశభక్తి,వినోదం మానవత్వం, చమత్కారం, పర్యావరణం, భూతదయ, మతసామరస్యం, పండుగలు, శాస్త్రీయ అవగాహన,సంస్కృతి సంప్రదాయాలు ఇలా విభిన్న అంశాలతో ఇతివృత్తంగా ఎంచుకుని ఆలోచనలు రేకెత్తించేవిగా బాలసాహిత్యం రాయాల్సి ఉంటుంది.

బాలసాహిత్యంలో వాస్తవికత, సృజనాత్మకత, మానవీయ, నైతికవిలువలు, మంచి చెడు, వ్యక్తిత్వం, నీతి మొదలైన లక్షణాలు బాలసాహిత్యంలో కనిపించాలి.ఎనభై శాతం తెలిసిన పదాలు,ఇరవై శాయం కొత్త పదాల పరిచయం ప్రక్రియలలో చోటు చేసుకోవాలి.బాలసాహిత్యంలో వ్యతిరేక భావనలు,హింస,మూఢనమ్మకాలు,భయాందోళనలు లేకుండా ఉండాలి. హస్యం,ఆనందం ఆలోచన ఉండే విధంగా తగు జాగ్రత్తలతో బాలల సాహిత్యం రాయాలి.5 సంవత్సరాల పిల్లలకు బొమ్మల తో కూడిన కథలు,అభినయ గేయాలు,చిత్ర కథలు పొడుపు కథలు,సామెతలు,చిన్న చిన్న వాక్యాలతో కూడిన కథలు ఉండాలి.అదేవిధంగా 8-10సంవత్సరాల బాలల కోసం నాటికలు,పద్యాలు,చిన్న వ్యాసాలు 60 శాతం బొమ్మలు,40శాతం విషయ ప్రాధాన్యం కలిగిన ప్రక్రియలు,11సంవత్సరాల పై బడిన వారి కోసం మిగిలిన అన్ని ప్రక్రియలను 80 శాతం విషయానికి,20శాతం బొమ్మలకు ప్రాధాన్యత ఉండేటట్లు రచయితలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.బాలసాహిత్యం కార్యశాలలో పై అంశాలపై అవగాహన కలిగించటం అవసరం.

ఇతోధిక కృషి : బాలసాహిత్యానికి ఎంతో మంది ,ఎన్నో సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.తెలంగాణ వచ్చినంక బాలసాహిత్యానికి మంచి రోజులే వచ్చినట్లు చేప్పాలి.అందుకు హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడమే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా బాలసాహిత్యం పై రచనలు గావించే రచయితలను ప్రోత్సహించడం,ఆర్థిక సహాయం అందిండం జరుగుతంది. బాలసాహిత్యంలో ఒక సృజనాత్మకత విప్లవం వచ్చిందనాలి.ఒకప్పుడు పెద్దలు రాసిందే బాలసాహిత్యం గా ఉండేది.కానీ నేడు పెద్ద వారితో సమానంగా పిల్లలే పిల్లల కోసం ఉపాధ్యాయుల ,బాల సాహితీవేత్తల ప్రోత్సహించడం తో బాలసాహిత్యాని సృష్టించుకుంటున్నారు.దీనికి ప్రభుత్వ పాఠశాలలే వేదికలు కావడం తార్కాణం. ఇప్పటిదాక ఉభయ తెలుగు రాష్ట్రాలలో 160 కి పైగా బాలలచే రాసిన పుస్తకాలు పురుడు పోసుకోవడం గొప్ప విషయం.

గవర్నమెంట్ బడులల్ల చదివితే చదువే రాదన్న వారికీ చెంప చెల్లుమనేలా విద్యార్థులు రచయితలుగా ఎదగడం గొప్ప విషయం గా భావించాలి. 2018-19 సంవత్సరంలో ఒక్క తెలంగాణ నుండే 36 బాలల పుస్తక సంకలనాలు రావడం మామూలు విషయం కాదు. కవిత్వం, సాహిత్యం సృజన చేయడం అంత సులువైన విషయం కాదు.రాటు దేలిన రచయితలకే పదాలు దొరకక నిద్ర పట్టదు.అలాంటిది పసిడి పిల్లలే రచన చేయడం మామూలెట్లవుతది ? 1996 లో వి .ఆర్ శర్మ ‘ఆకాశం’ పేరుతో ,2013లో చిన్న కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ‘బాలలు కవితా మకరంధం’ 2015 లో ఖమ్మం జిల్లా లక్ష్మి పురం పాఠశాల నుండి ‘చిరు ఆశల హరివిల్లు’ 2017 లో ఆళ్ళపాడు పాఠశాల నుండి ‘అంకురాలు’ 2018 లో ‘పూలసింగిడి’ బాలల కథా సంకలనాలు వచ్చినాయి.

అదేవిధంగా కరీంనగర్ జిల్లా గంగాపురం పాఠశాల నుండి ‘నల్లపూసలు’ ,నల్లగొండ జిల్లా వట్టిమర్తి హైస్కూలు నుండి ‘రెక్క విప్పిన బాల్యం’ మిర్యాలగూడ విద్యార్థుల ‘మిణుగురులు’ జహీరాబాద్ కు చెందిన పిల్లల కథలు,రంగినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘కతల వాగు’ సనకలనం,‘కవితల సింగిడి‘,ప్రముఖ బాలసాహితీ వేత్త డాక్టర్ పత్తి పాక మోహన్ పొడుపు కథలు,వి ఆర్ శర్మ ‘నెలవంకలు’ గరిపల్లి అశోక్ కథలు,పురిమళ్ళ సునంధ ‘సాహితీ లోగిలి’ వాసరవేణి పరశు రాము‘చిర్రగోనే‘,నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బుచ్చి రెడ్డి ‘మొలకలు పిల్లల కథలు’ వేదకుమార్ సారధ్యంలోని బాల చెలిమి ద్వారా వెలువడు తెలంగాణ బడిపిల్లల కథలు వంటి అనేక పుస్తకాలు వచ్చాయి.

ప్రసిద్ధ బాలసాహితీవేత్త భూపాల్, నలిమెల భాస్కర్,రెడ్డి రాఘవయ్య,వేదాంతం సూరి,ఐతా చంద్రయ్య,భీంపల్లి శ్రీకాంత్,మేరెడ్డి యాదగిరి రెడ్డి,దొడ్డి రామమూర్తి,భోధనం నర్సిరెడ్డి,పెండెం జగదీశ్వర్,కందేపి రాణి ప్రసాద్,అమ్మన చంద్రారెడ్డి,పుప్పాల కృష్ణమూర్తి, పైడిమర్రి రామకృష్ణ, వాసాల నర్సయ్య, ఉండ్రాల రాజేశం,తోకల రాజేశం, ఉప్పల పద్మ ఇట్లా….అనేకమంది సీనియర్,జూనియర్ ప్రముఖ రచయితలెందరో బాలసాహిత్యం కొరకు అక్షర సేద్యం కావిస్తూ,ఎనలేని కృషా చేస్తూ బాలసాహిత్యాన్ని బతికిస్తున్నారు.

Taking children literature close to rural parts of Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలసాహిత్యాన్ని బతికించుకోవాలె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: