జార్జిరెడ్డి క్యాంపస్ జీవితం

  సుమారు అర్ధ శతాబ్దం క్రితం విద్యార్థ్థి నాయకుడుగా జార్జిరెడ్డి ప్రదర్శించిన సాహసం, పీడిత పక్షపాతం, అమోఘ జ్ఞానం మరోసారి చర్చనీయాంశమైనాయి. ఆయన జీవన సంఘటనలను ఆధారం చేసుకొని నిర్మించిన తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ సందర్భంగా మళ్లీ ఆయన తన సంచలనాల్ని మరోసారి రుజువు చేస్తున్నాడు. 1967లో ఎంఎస్‌సి (ఫిజిక్స్) చదవడానికి ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో అడుగు పెట్టిన జార్జి ఆ కోర్సులో గోల్డ్ మెడలిస్టుగా నిలిచాడు. తర్వాత ఫిజిక్స్‌లోనే పరిశోధక విద్యార్థిగా కొనసాగుతూ విద్యార్థి సమస్యలపై […] The post జార్జిరెడ్డి క్యాంపస్ జీవితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుమారు అర్ధ శతాబ్దం క్రితం విద్యార్థ్థి నాయకుడుగా జార్జిరెడ్డి ప్రదర్శించిన సాహసం, పీడిత పక్షపాతం, అమోఘ జ్ఞానం మరోసారి చర్చనీయాంశమైనాయి. ఆయన జీవన సంఘటనలను ఆధారం చేసుకొని నిర్మించిన తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ సందర్భంగా మళ్లీ ఆయన తన సంచలనాల్ని మరోసారి రుజువు చేస్తున్నాడు. 1967లో ఎంఎస్‌సి (ఫిజిక్స్) చదవడానికి ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో అడుగు పెట్టిన జార్జి ఆ కోర్సులో గోల్డ్ మెడలిస్టుగా నిలిచాడు. తర్వాత ఫిజిక్స్‌లోనే పరిశోధక విద్యార్థిగా కొనసాగుతూ విద్యార్థి సమస్యలపై పోరాడాడు. ఆ రోజుల్లో క్యాంపస్‌లో ఉన్న ఆధిపత్య కులాల ఆధిక్యతను ప్రశ్నించిన తొలి గొంతు జార్జిదే. అగ్రకుల విద్యార్థుల దాదాగిరికి ఎదురుతిరుగలేక అణగిమణగి కాలం వెల్లబుచ్చుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు బాసటగా నిలిచిన వాడు జార్జి.

జార్జి రెడ్డి చదువులోనే కాదు శరీర బలాఢ్యుడు కూడా. తనపై జరిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బాక్సింగ్ నేర్చుకున్నాడు. రాత్రి పగలు అనకుండా ఒంటరిగా తిరిగే సాహసి ఆయన. విద్యార్థి వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడుల కారణంగా ఆయన ఏడాది పాటు కాలేజి నుండి తొలగింపబడ్డాడు. ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాసి గోల్డ్ మెడల్ సాధించాడు.
క్యాంపస్‌లో జార్జి ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిచేది. ఆ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎదిగి వస్తున్న వామపక్ష ఉద్యమాలు, వాటి విజయాలకు సంబంధించిన సాహిత్యాన్ని ఎక్కువగా చదివేవాడు. సమస్యలు విద్యార్థులకే కాదు మహిళలు, కార్మికులు, నిమ్నజాతులవారు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన గ్రహించాడు. ఇస్రోలో ఉద్యోగం వచ్చినా చేరకుండా పై సమస్యల పరిష్కారానికి ఒక ఉద్యమం చేపట్టాలని ఆశించాడు.

ఈ క్రమంలో జార్జిరెడ్డిపై కొన్నిసార్లు మూక దాడి జరిగింది. అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కోగలిగాడు. అయితే 14 ఏప్రిల్ 1972 నాడు బలిష్టమైన కిరాయి గుండాల దాడిలో పోరాడుతూ ఆయన వారి కత్తి పోట్లకు మరణించాడు. ఆయన స్ఫూర్తిని మాత్రం తర్వాత తరాల విద్యార్ధులు అందుకొని ఆయన పేరిట విద్యార్థి సంఘాల రూపంలో కొనసాగిస్తున్నారు. ఆ పేరు ఇంకా గుర్తుండడానికి జార్జి వ్యక్తిత్వం, తెగువ, పోరాట గుణమే కారణం అనవచ్చు. ఆయన మరణించిన 47 ఏళ్ల తర్వాత వస్తున్న ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదలకు ముందే మీడియాలో చర్చనీయాంశమైంది. 25 ఏళ్ల వయసులోనే తన సాహసిక జీవన వైవిధ్యాన్ని ప్రదర్శించి వీరుడిగా మరణించిన జార్జి విద్యార్థి లోకానికి ఆదర్శుడు. ఉస్మానియా క్యాంపస్ ఉన్నంత కాలం జార్జిరెడ్డి ఉంటాడు. క్యాంపస్ చరిత్రనే జార్జికి ముందు, తర్వాతని విడదీయవచ్చు.

తెలంగాణ నుండి సినిమాలు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. తెలంగాణ విడి రాష్ట్రం కావడంతో సొంత సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటోంది. లోకల్ టాలెంట్స్‌కి పరిశ్రమలో స్థానం దొరుకుతోంది. తెలంగాణ జీవితాలు, జీవన వైవిధ్యం కూడా ఇప్పుడు సినిమాకు ఆదరణీయ నూతన సరుకుగా మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి వచ్చిన మరో సినిమాయే జార్జిరెడ్డి. జార్జి జీవితంపై ఇది వరకు రెండు సినిమాలు వచ్చాయి. 1989 లో తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణ దర్శకత్వంలో ‘అలజడి’ అనే సినిమా కథ జార్జిరెడ్డి జీవితానికి సంబంధించినదే. విద్యార్థి నాయకుడైన రవి రాజకీయ నాయకుల మోసాలకు గురై హత్య కావించబడడం ఇందులో ప్రధానాంశం.

భరద్వాజ్‌కు జార్జిరెడ్డి మంచి మిత్రుడు. జార్జి కాలేజీ నుండి బహిష్కరణను ఎదుర్కొన్న సమయంలో ఎక్కువ కాలాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంట్లోనే గడిపాడు. భరద్వాజ్ తండ్రి కృష్ణమూర్తి అలనాటి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలుడు. వారి ఇంట్లో ఉన్న కమ్యూనిస్టు సాహిత్యాన్ని జార్జిరెడ్డికి చదివే అవకాశం దొరికింది. జార్జిరెడ్డిపై సినిమా తీయడానికి ఆసక్తి చూపించిన మణిరత్నం భరద్వాజ్‌ను ఆయన సూచించిన మిత్రులను కలిసి జార్జిరెడ్డి జీవితానికి సంబంధించిన వివరాలను సేకరించాడు. వాటి ఆధారంగా 2004లో తమిళ, హిందీ భాషల్లో ‘యువ’ అనే సినిమా నిర్మించాడు.

అయితే జార్జిరెడ్డి క్యాంపస్ జీవితాన్ని మాత్రమే లక్షం చేసుకొని తీసిన సినిమా ఇప్పుడొస్తున్న ‘జార్జిరెడ్డి’. ఇప్పటికీ జార్జి గురించి తెలిసిన దగ్గరి వారు ఆయన సాహసం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏడాదిన్నర పాటు వీటన్నింటిని క్రోడీకరించి కథ తయారు చేసుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి తన చిత్రంలో క్యాంపస్ వాతావరణానికి ఎక్కు ప్రాధాన్యాన్నిచ్చినట్లు కనబడుతోంది. అక్టోబర్‌లో రిలీజైన జార్జిరెడ్డి సినిమా ట్రైలర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాకు జార్జిరెడ్డిని నామకరణం చేయడం మరో ప్లస్ పాయింట్. ఆ ట్రైలర్‌లో 1971లో జార్జి ఇచ్చిన ఇంగ్లీషు ప్రసంగం పుటేజిని వినిపించడం జరిగింది. ట్రైలర్‌లో కాషాయి వస్త్రాలు ధరించిన ఓ విద్యార్థి నాయకుడు భారత్ మాతాకి జై అంటూ కొంత సన్నివేశం ఉంది. అయితే జార్జిరెడ్డి హత్యలో రైట్ వింగ్‌కు చెందిన విద్యార్థుల హస్తం ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో బిజెపికి చెందిన విద్యార్థి సంఘాలను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉంటే సహించేది లేదని ఎంఎల్‌ఎ రాజాసింగ్ పత్రికల ముందు చెప్పారు. సినిమా విడుదలను ఆపివేయాలని కొన్ని విద్యార్థి సంఘాలు సెన్సార్ బోర్డుకు విన్నవించుకున్నాయి కూడా.

క్యాంపస్‌లో రెండు విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగింది వాస్తవమే. వాటిలో భాగంగానే జార్జిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. వారి చేతిలో ఆయన చనిపోయాడు. ఇవన్నీ వాస్తవాలే. ఇందులో వక్రీకరణ ఏమీ లేదని ఆ సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి స్పష్టం చేశాడు. ఈ నెల 19వ తేదీన జరగవలసిన ‘జార్జిరెడ్డి’ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ఈ కార్యక్రమానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ రావడానికి అంగీకరించాడు. అయితే శాంతి భద్రతల దృష్టా ఫంక్షన్‌కు అనుమతి నీయలేమని పోలీసులు అన్నారు. అనుమతి నిరాకరణ కూడా ఓ సంచలన వార్తే అయింది. జార్జిరెడ్డి సినియాలో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అనే మాటకన్నా ఇది జార్జిపై సినిమా అనేదే ఎక్కువ ప్రచారం అవుతోంది. సినిమా అనుకున్న స్థాయిలో ఉంటే ఇప్పటి స్తబ్ద విద్యార్థి, యువ లోకానికి అదో షాక్ ట్రీట్‌మెంటు అనవచ్చు.

Student leader George Reddy life on screen

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జార్జిరెడ్డి క్యాంపస్ జీవితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: