అలలపై ప్రయాణం

నదులు, అడవులు, ఆలయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం  నాగార్జున కొండపై బుద్ధవనం ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టిని మళ్లిస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా భవిష్యత్తులో తెలంగాణ టూరిజం రూపుదిద్దుకోబోతుందని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిజం స్పాట్‌గా ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద […] The post అలలపై ప్రయాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నదులు, అడవులు, ఆలయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం
 నాగార్జున కొండపై బుద్ధవనం ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టిని మళ్లిస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా భవిష్యత్తులో తెలంగాణ టూరిజం రూపుదిద్దుకోబోతుందని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిజం స్పాట్‌గా ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంఛీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 22 కోట్లతో నిర్మించిన టూరిజం కాటేజీలు, హరిత హోటళ్ళను ఆయన ప్రారంభించారు.

సోమశిలలో శ్రీశైలం వరకు నడిచే 120 మంది కెపాసిటీ గల ఏసి లాంఛీని ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఈ. శ్రీధర్, రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌లతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జడ్పీచైర్‌మెన్‌లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, పద్మావతిలతో కలిసి లాంఛీలో ప్రయాణించారు. అనంతరం లాంఛీలోనే ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ టూరిజం అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారానే నేడు సోమశిల, సింగొటంలలో టూరిజం శాఖ ద్వారా హోటళ్ళు, కాటేజీలు, లాంచీల వంటి కోట్లాది రూపాయల టూరిజం శాఖ పనులు చేపట్టడం జరిగిందన్నారు.

లక్షలాధి మంది తెలంగాణలో టూరిజం శాఖ హోటళ్ళను ఇతర పర్యాటక ప్రాంతాలను సధ్వినియోగం చేసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రికెసిఆర్ నాగార్జున కొండపై బుద్ధవనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టి తెలంగాన వైపు మళ్ళడం కాయమన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిజం స్పాట్‌గా బుద్ధవనం ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైన ప్రదేశం అన్నారు. కృష్ణానది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 240 కిలో మీటర్ల మేర తిరుగు జలాలతో మంచి టూరిజం స్పాట్‌గా అవతరించబోతుందన్నారు.

దీంతో పాటు నల్లమల అడవులు తెలంగాణలోని ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లాలో పూరాతన దేవాలయాలు ఉండడం ద్వారా దేశ నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకులు వచ్చే విధంగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించకున్నాక ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయనకు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు రెండు కళ్ళలాంటి వారని అన్నారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి కెసిఆర్‌యే అన్నారు.

ఒకప్పుడు కొల్లాపూర్ ప్రాంతంతో పాటు నల్లమల ప్రాంతం ఒక పక్క నక్సల్స్‌కు మరో పక్క గ్రేహౌండ్స్ దళాలకు కేంద్రంగా ఉండేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొల్లాపూర్ ప్రాంతం పూర్తిగా టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, విష్ణులతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivas Goud Launched Boat Service From Somasila

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అలలపై ప్రయాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: