ఉపాధి హామీయే శరణ్యమా?

       గ్రామీణ భారతం కొనుగోలు శక్తి, వినియోగ సరకులపై పల్లెల వ్యయం గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత భారీగా పడిపోయిందన్న చేదు వాస్తవం కలిగించిన దిగ్భ్రాంతి నుంచి తేరుకోక ముందే మరో ఆందోళనకరమైన సమాచారం వెలువడింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నవారి సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటుకు నివేదించింది. చదువుకుంటున్న గ్రామీణ యువతకు తగినన్ని ఉద్యోగాలు కరవు కావడం […] The post ఉపాధి హామీయే శరణ్యమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

       గ్రామీణ భారతం కొనుగోలు శక్తి, వినియోగ సరకులపై పల్లెల వ్యయం గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత భారీగా పడిపోయిందన్న చేదు వాస్తవం కలిగించిన దిగ్భ్రాంతి నుంచి తేరుకోక ముందే మరో ఆందోళనకరమైన సమాచారం వెలువడింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నవారి సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటుకు నివేదించింది. చదువుకుంటున్న గ్రామీణ యువతకు తగినన్ని ఉద్యోగాలు కరవు కావడం వల్లనే వారు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే ఉపాధి హామీ పథకం పనులను ఆశ్రయిస్తున్నారని బోధపడుతున్నది. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద పనులు చేసినవారి సంఖ్య 2014-15లో 6 కోట్ల 22 లక్షలు కాగా, 201819 నాటికి అది 7 కోట్ల 77 లక్షలకు చేరుకున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం నాడు లోక్‌సభకు తెలియజేశారు.

కేవలం శరీర శ్రమ మీదనే ఆధారపడి బతికే గ్రామీణ పేదలకు ఆహార, ఆర్థిక భద్రత కల్పించడం కోసం 2005లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేక చట్టం ద్వారా ప్రవేశపెట్టింది. 18 ఏళ్లు నిండిన పేద గ్రామీణులకు వారు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల వ్యవధిలో పని కల్పించవలసిన బాధ్యతను సంబంధిత అధికార్లపై ఈ చట్టం ఉంచింది. అలా ఏడాదిలో 100 రోజుల పనిని కల్పించవలసి ఉంటుంది. సహజంగా ఉత్పన్నమయ్యే ఉపాధులు, ఉద్యోగాలు కొరవడినవారికి కనీస భద్రతకు లోటు లేకుండా చూడడం కోసమే ఈ పథకం అవతరించింది. అంటే ఇది కేవలం ఆపత్కాల చేయూత పథకమని బోధపడుతున్నది. గ్రామాల్లో భూయజమానులు ఇచ్చే పనులతో జీవనం సాగించుకోడం తప్ప గత్యంతరం లేని స్థితిలోని దళిత మున్నగు బలహీన వర్గాలకు చెందిన శ్రామిక జనానికి ప్రత్యేక అభయ ప్రదాతగా ఈ పథకం ఊరట కలిగించింది. ఆ మేరకు మోతుబరి వర్గాల కన్నెర్రకు కూడా గురయింది.

యుపిఎ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం తప్పని సరి అవసరాన్ని గుర్తించి ఎన్‌డిఎ సర్కారు కూడా కొనసాగిస్తున్నది. నిద్ర మాత్రలిచ్చి కోమాలోకి పంపించేద్దామని మొదట్లో వ్యూహ రచన చేసుకున్న మోడీ ప్రభుత్వం అనంతరం వెనక్కు తగ్గింది. ఉపాధి కల్పనతో పాటు వాన నీటి నిల్వ కు తోడ్పడే వాటర్ షెడ్లు, ఇతర సాగు నీటి సదుపాయాలు, వరద నివారణ కట్టడాలు, మంచి నీటి తటాకాలు, బావుల వంటి వాటి తవ్వకాలు తదితర పనులను ఈ పథకం ద్వారా చేపడుతున్నారు. ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ నిధులను నిరంతరాయంగా కేటాయించవలసిన బాధ్యత చట్ట ప్రకారం కేంద్రంపై ఉన్నది. 201415లో ఈ పథకం కింద రూ. 32,977 కోట్ల 42 లక్షల మేరకు కేంద్ర నిధులు విడుదల కాగా, 201819 నాటికి అవి దాదాపు రెట్టింపై రూ. 61,829 కోట్ల 55 లక్షలకు చేరుకున్నాయి.

తాము కోరుతున్న మేరకు నిధులను కేంద్రం ఇవ్వడం లేదని, ఇచ్చి ఉంటే ఈ పథకాన్ని ఆశ్రయించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని రాష్ట్రాలు చెబుతున్నాయి. దీనిని బట్టి గ్రామీణ యువతకు ఆర్థిక రంగ ప్రధాన వాహినిలో ఉద్యోగాల కల్పన జరగడం లేదని చదువుకున్న యువతీ, యువకులు కూడా నిరుద్యోగంతో విసిగిపోయి ఈ పథకం కింద లభించే పనుల వైపు మొగ్గుతున్నారని భావించడం తప్పు కాదు. ఆధునిక సామాజిక నేపథ్యంలో నిపుణ వృత్తులకు డిమాండు పెరుగుతున్నది. శారీరక శ్రమ స్థానంలో యంత్రాలు, వాటిని నడిపే నైపుణ్యాలకు ప్రాధాన్యం కలుగుతున్నది. ఆ మేరకు యువతకు తగినంత శిక్షణ లభిస్తేగాని వారు ఈ కొత్త వృత్తులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం చదువుకున్నందు వల్లనే ఉద్యోగాలు లభించే అవకాశాలు లేవు. ఆ చదువులు అంతర్జాతీయ ప్రమాణాలలో ఉంటే తప్ప వారికి ఆధునిక కంప్యూటర్ ఆధారిత సంస్థల్లో కొలువులు దొరకవు.

ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కిందనే దేశ వ్యాప్తంగా 5 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సంకల్పించినట్టు కొద్ది మాసాల క్రితం వార్తలు వచ్చాయి. ఈ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేవారికి రోజువారీ భత్యం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఆ విధంగా శిక్షణ సమయంలో కూలి పనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతామనే భయాన్ని పారద్రోలే సంకల్పం కలిగినట్టు సమాచారం. ఇది ఎంత తొందరగా, మరెంత విస్తారంగా అమల్లోకి వస్తే గ్రామీణ యువత అంతగా బాగు పడే అవకాశాలు పెరుగుతాయి. ఆ మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఒత్తిడి పరిమితమవుతుంది.

Article about Rural Development Scheme

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉపాధి హామీయే శరణ్యమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: