బాల్యానికి ఏదీ భరోసా!

  ఎన్‌సిఇఆర్‌టి దేశ వ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న 18,000 పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్క్ ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని సూచించింది. అందుకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్.కె.జి. నుంచే పిల్లల సామర్ధ్యానికి మించి హోంవర్క్ ఇస్తున్నారు. ఒకటి నుంచి మూడు వరకు అదనంగా మరో 5 సబ్జక్టులను కూడా విద్యార్ధులకు బోధిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ […] The post బాల్యానికి ఏదీ భరోసా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్‌సిఇఆర్‌టి దేశ వ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న 18,000 పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్క్ ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని సూచించింది. అందుకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్.కె.జి. నుంచే పిల్లల సామర్ధ్యానికి మించి హోంవర్క్ ఇస్తున్నారు. ఒకటి నుంచి మూడు వరకు అదనంగా మరో 5 సబ్జక్టులను కూడా విద్యార్ధులకు బోధిస్తున్నారు.

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా వివిధ అంశాలపై వ్యాస రచన పోటీలు, ర్యాలీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించడం వంటి అంశాలతో బోధనకు కొంత ఆటంకం కలుగుతుండగా, మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణ పేరుతో ఇచ్చిన హోంవర్క్ చేయలేదని, తెలుగులో మాట్లాడుతున్నారని, బెల్టు పెట్టుకోలేదని, బూట్లు ధరించలేదని, టై లేదనే కారణాలతో పిల్లల్ని దండిస్తున్నారు, తీవ్రంగా దూషిస్తున్నారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ రెండు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రకమైన సిలబస్‌ని అమలు చేయడం లేదు. అధిక పుస్తకాల బరువుతో పిల్లలకు వెన్నునొప్పి, మెడనొప్పులొస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో తరగతి గదుల్లో ఏమి జరు గుతుందోనని సి.సి. కెమెరాల ద్వారాఆయా యాజమాన్యాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారే గానీ, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని తీవ్రంగా దండించడం వల్ల వారి మనసులో ఎటువంటి మార్పులొస్తున్నాయోనని ఎవరూ గమనించడం లేదు.

గతంలో సర్వశిక్షా అభియాన్ వారు విద్యా విషయక క్యాలెండర్స్‌ని పాఠశాలలకు జూన్‌లోనే పంపిణి చేసేవారు. ఉపాధ్యాయులకు శిక్షణని వేసవి సెలవులలో ఇచ్చేవారు. చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ నివేదిక ప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 1098 టోల్ ఫ్రీ నెంబరుకు దేశవ్యాప్తంగా 3.4 కోట్ల ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే వాటిలో 1.36 కోట్ల వరకు నిశ్శబ్ద ఫోన్‌కాల్స్ వున్నాయి. పిల్లలు ఫోన్ చేసి కొద్ది నిమిషాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుంటున్నారని ఫౌండేషన్ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఇందులో 66,000 ఫోన్‌కాల్స్ మధ్య, ఉన్నత తరగతి కుటుంబాల పిల్లల నుంచి వచ్చినవేనని ఫౌండేషన్ వెల్లడించింది. ఆ కుటుంబాల పిల్లలు తన తల్లిదండ్రులు వారి వారి వ్యక్తిగత వ్యవహారాలలో బిజీగా వుండటం వలన తమను సరిగ్గా పట్టించుకొనడం లేదని, తమకు గెడైన్స్ కావాలని చెప్తున్నారు. 2017-18 సంవత్సరానికి 53 లక్షల నిశ్శబ్ద ఫోన్‌కాల్స్ వున్నాయని ఫౌండేషన్ వెల్లడించింది. మరొక వైపు తీవ్రమైన ఒత్తిడితో 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సులో వున్న పిల్లలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్రం ఈ ఏడాది జనవరిలో లోక్‌సభలో వెల్లడించింది.

2007-16 మధ్య కా లంలో 75,000 మంది విద్యార్ధులు దేశ వ్యాప్తంగా వివిధ కారణాల వలన ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివిధ నివేదికలు చెప్తున్నాయి. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం గతంతో పోల్చుకుంటే యేటా ఆత్మహత్యల శాతం పెరుగుతోంది. 2014 నుంచి 2017 వరకు 26,000 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొన్నారు. ప్రతి 55 నిమిషా లకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నివేదికలు చెపుతున్నాయి. ఇంజినీరింగ్, మెడిసనే గాకుండా ఇతరత్రా కోర్సులలో విద్యనభ్యసించిన వారికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాల్సి ఉన్నది. ‘అందరూ చదవాలి అందరూ ఎదగాలి’ అనే నినాదంతో సర్వశిక్షా అభియాన్, ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి’ అనే నినాదంతో విద్యా హక్కు చట్టం ఏర్పడ్డాయి. విద్యాహక్కు చట్టం ఏర్పడి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది. చట్టంలో ఉన్న విషయాలన్నింటినీ అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆయా ప్రభుత్వాలకు సూచనలు చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి.

విద్యార్థులు లేరనే సాకుతో ఏ పాఠశాలనూ మూసి వేయరాదు. కాని పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం హేతుబద్ధీకరణ, విలీనం పేరుతో వందలాది పాఠశాలలను మూసివేస్తూనే, మరోవైపు ఎటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రైవేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గటమే కాకుండా, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాల జోరు పెరిగింది. విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో బాలలెవరూ కూడా వెట్టి చాకిరి చేయరాదు. జీతం అధారంగా వారిని పనిలోకి తీసుకోకూడదు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ బడి బయటి పిల్లలను గుర్తించి బడిలోకి చేర్పించాలి.

కాని పేదరికం, వలసలు, పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకపోవటం, తలిదండ్రుల నిరక్ష్యరాస్యత వలన ఉన్నత పాఠశాలల్లో చేరే నాటికి చాలామంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. డ్రాపౌట్స్ శాతం ప్రాథమిక పాఠశాలల్లో పోల్చుకుంటే ఉన్నత పాఠశాలల్లో ఎక్కువుగా కనిపిస్తోంది. బడి బయటి పిల్లలను ఆయా యాజమాన్యాలు తమ పనులలో పెట్టుకుని వారికి స్వల్ప మెుత్తంలో డబ్బు చెల్లిస్తున్నారు. వారి చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు. మరి కొంత మంది బడి బయటి పిల్లలు అనేక మోసాలకు గురవుతున్నారు. వారిలో కొంతమంది బాల నేరస్థులుగా మారుతున్నారు.

చిన్న తనంలోనే అనారోగ్యం పాలవుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉంటే, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లల పరిస్థితి మరో విధంగా ఉన్నది. ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెద్దగా ఉండవు. ఆ పాఠశాలల్లో రూపొందించుకునే పాఠ్యప్రణాళికలు కఠినతరంగా ఉంటున్నాయి. అంగ్ల మాధ్యపు నేపథ్యంలో పుస్తకాల బరువు పెరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా తమ పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నాయి. సబ్జెక్ట్ సంఖ్య పెరగటంతో పుస్తకాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నటు వంటి బ్యాగ్‌లను మోయలేకపోతున్నారు. అధిక బరువుల ఫలితంగా చాలామంది పిల్లలు మెడనొప్పి, వెన్నునొప్పులతో బాధపడుతున్నారు. వారు నిటారుగా నిలబడి నడవలేకపోతున్నారు.

సిలబస్ ఎక్కువుగా ఉండుట వలన తల నొప్పి వంటి వాటితో సతమతమవుతున్నారు. ఇరుకు గదులు, అధిక ఒత్తిడి, ఎక్కువ ఇంటి పని (హోంవర్క్) ఇవ్వటం వలన విద్యార్ధులు తీవ్ర మానసిక అందోళనకు గురవుతున్నారు. యశ్‌పాల్ కమిటీ సిఫార్సులను సైతం ప్రభుత్వం పక్కన పెడుతోంది. ఇటీవలి కాలంలో ముంబయిలో కొందరు విద్యార్ధులు తాము అధిక బరువున్న బ్యాగ్‌లను మోయలేమని బడి బయటే ధర్నా చేయటం సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. అయినప్పటికీ పాఠశాలల యజమానుల ఆలోచనలో గానీ, ప్రభుత్వాధికారుల పద్ధతుల్లో గాని ఎటువంటి మార్పు రాలేదు. స్కూల్ బ్యాగ్‌లతో పాటు వాటర్ బాటిల్, ఇతరత్రా సామగ్రితో పిల్లలు తమ బరువు కన్నా రెట్టింపు బరువును మోస్తున్నారు. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో మెుక్కు బడిగానే సిలబస్ పూర్తి చేస్తున్నారు. అక్కడ పని చేసే ఉపాధ్యాయులకు సైతం స్వల్పం మెుత్తంలో జీతాలు చెల్లిస్తున్నారు.

ప్రభుత్వం రూపొందించిన విద్యావిషయక కేలండర్‌ను వారు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. చాలా ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు తెలుగు, హిందీ వంటి భాషలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అసెంబ్లీని సైతం నామమాత్రంగా నిర్వహిస్తున్నాయి. నైతిక విద్య అనేది వారికి ఏ మాత్రం పట్టటం లేదు. అధిక బరువు ఉన్న బ్యాగ్, ఎక్కువ ఇంటి పని వయస్సుకు మించిన పాఠ్యప్రణాళికల ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా బాల కార్మికులుగా మారిపోతున్నారు. కాకపోతే వీరు బడి బయటి బాల కార్మికుల్లాగా కాకుండా బడికి వెళ్లే బాల కార్మికులగా మనం వర్ణించవచ్చు. ఇకనైనా విద్యాశాఖాధికారులు ప్రభుత్వం పాఠశాలలతో పాటు సమాంతరంగా ప్రైవేట్ పాఠశాలలను కూడా నిరంతరం తనిఖీ చేస్తూ అక్కడి విద్యార్థులకు ఆ యాజమాన్యాలు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించవలసిన అవ సరం ఎంతైనా ఉంది. ఈ దిశగా పాలకులు అలోచించాలి.

Story about CBSE Syllabus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాల్యానికి ఏదీ భరోసా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: