దాచేస్తే దాగని చేదు వాస్తవాలు

విమానాలు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి, పెళ్లిళ్లు హాయిగా, నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి, దేశ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నదనడానికి ఇంతకంటే రుజువులెందుకు, వాస్తవం ఇంత ఘనంగా ఉంటే కొంత మంది ప్రధాని నరేంద్ర మోడీపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగది శుక్రవారం నాడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మొదలు కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దేశ ఆర్థిక దుస్థితి గురించి ప్రతిపక్షాలు ప్రముఖంగా ప్రస్తావించనున్నాయన్న సమాచారం నేపథ్యంలో అంగది […] The post దాచేస్తే దాగని చేదు వాస్తవాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విమానాలు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి, పెళ్లిళ్లు హాయిగా, నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి, దేశ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నదనడానికి ఇంతకంటే రుజువులెందుకు, వాస్తవం ఇంత ఘనంగా ఉంటే కొంత మంది ప్రధాని నరేంద్ర మోడీపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగది శుక్రవారం నాడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మొదలు కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దేశ ఆర్థిక దుస్థితి గురించి ప్రతిపక్షాలు ప్రముఖంగా ప్రస్తావించనున్నాయన్న సమాచారం నేపథ్యంలో అంగది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన అలా అనడం, దేశ ప్రజల నెల వారీ ఖర్చు గత 4 దశాబ్దాలలో కనీవినీ ఎరుగనంతగా పడిపోయిందన్న చేదు వాస్తవం వెల్లడి కావడం ఇంచుమించు ఒకేసారి జరిగాయి.

2011-12 2017-18 మధ్య కాలంలో గ్రామీణ భారతంలో ఆహారాది సరకుల వినియోగం 8.8 శాతం తగ్గిపోయిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) సర్వే నివేదిక వెల్లడించింది. ప్రధాని మోడీ తొలి ప్రభుత్వ హయాంలో పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమలు జరిగిన కాలంలోనే ఎన్‌ఎస్‌ఒ ఈ సర్వే జరిపింది. ఈ రెండు చర్యలే దేశంలో నిరుద్యోగాన్ని విపరీతంగా పెంచాయని, వేతనాల్లో భారీ కోతకు దారి తీశాయని వాటి పర్యవసానంగానే ప్రజల కొనుగోలు, వినియోగ శక్తి ఎన్నడూ లేనంతగా పడిపోయిందని బోధపడుతున్నట్టు ఎన్‌ఎస్‌ఒ నివేదిక అభిప్రాయపడింది. గ్రామీణ భారత ప్రజలు తృణ ధాన్యాలు, చక్కెర, మసాలా దినుసులు, వంట నూనెలు, పప్పుల వినియోగాన్ని బాగా తగ్గించారని సర్వేలో వెల్లడయినట్లు ఈ నివేదికలోని ప్రధానాంశాలను బయట పెట్టిన బిజినెస్ స్టాండర్డ్ ఆంగ్ల దిన పత్రిక స్పష్టం చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వినియోగ పతనం అక్కడ పెరిగిన పోషకాహార లేమిని చూపుతున్నదని ఒకప్పటి ప్రణాళిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ చేసిన వ్యాఖ్యానాన్ని కూడా ఆ పత్రిక ప్రచురించింది. 2017 జులై, 2018 జూన్ మధ్య చేపట్టిన ఈ సర్వే నివేదికకు ఈ ఏడాది జూన్ 19న సంబంధించిన కమిటీ ఆమోద ముద్ర పడినప్పటికీ అందులోని వ్యతిరేక నిర్ధారణలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దీనిని తొక్కి పెట్టిందని కూడా బిజినెస్ స్టాండర్డ్ లోగుట్టును బట్టబయలు చేసింది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎదుర్కోని నిరుద్యోగం ప్రబలిందని బయటపెట్టిన మరో ఎన్‌ఎస్‌ఒ (నేషనల్ శాంపిల్ ఆఫీస్ జాతీయ నమూనా సేకరణల కార్యాలయం) నివేదికను గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం తొక్కిపెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని సగటు నెలసరి గృహ వినియోగం 201112లో రూ. 1,501 ఉండగా, అది 201718లో రూ. 1446కు తగ్గిపోయినట్టు ఇప్పటి ఎన్‌ఎస్‌ఒ నివేదిక వెల్లడించింది.

దేశంలో, ముఖ్యంగా గ్రామీణ భారతంలో వినియోగ పతనం కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నదే. వ్యవసాయ రంగం ఎప్పుడూ లేనంత దారుణంగా దెబ్బతిని చిన్న రైతులు, కూలీల నిజ ఆదాయం పడిపోయిన నేపథ్యమే ఇందుకు కారణం. అయితే ఒక ప్రభుత్వ సంస్థ క్షేత్ర పరిశీలన జరిపి దానిని స్పష్టం చేయడమే విశేషం. అలవాటు ప్రకారం ప్రధాని మోడీ ప్రభుత్వం తన పరిపాలనకు సంబంధించిన చేదు నిజాలను తొక్కి పెట్టడం గమనించవలసిన విషయం. మత, జాతీయపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోడానికి ఇస్తున్నంత ప్రాధాన్యం దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దడానికి, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రజల బతుకుల్లో సుఖశాంతులను నెలకొల్పడానికి ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నదని తరచూ రుజువవుతున్నది.

దేశ ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయిందని అది కోలుకునేలా చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసి ఉందని ఆర్థిక శాస్త్రంలో నోబుల్ అవార్డు పొందిన భారతీయ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రభుత్వంలో వివేకోదయం కలగకపోగా మంత్రులు అంతా బాగుందంటూ పెళ్ళిళ్లను, సినిమాలను ఉదహరించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. ఎంతో లోతైన అధ్యయనం చేసి వ్యాఖ్యానించవలసిన ఆర్థికాంశాలపై ఆషామాషీ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడడం బాధాకరం. మూడు సినిమాల వసూళ్లు రూ. 120 కోట్లకు చేరుకున్నాయని దేశ ఆర్థిక వ్యవస్థ సుభిక్షంగా ఉందనడానికి ఇంతకంటే నిదర్శనమేల అని మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంతకు ముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా కల్లబొల్లి ప్రకటనలతో అర్థరహితమైన ఆధారాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఆకు పచ్చ రంగు పూసి ప్రజల కళ్లకు గంతలు కట్టబోవడం పరిణతి గల పాలకుల లక్షణం కానేకాదు.

Opposition is creating issue of Indian economy to damage

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దాచేస్తే దాగని చేదు వాస్తవాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: