అంతా సహకరించండి

 అన్ని పార్టీలకూ స్పీకర్ విజ్ఞప్తి రేపటి నుంచి పార్లమెంట్ భేటీ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం నిరుద్యోగం, ఆర్థిక స్థితిపై ప్రతిపక్షం న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని స్పీకర్ ఓమ్ బిర్లా విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల శీతాకాల సమావేశాలు ఆరంభం అవుతాయి. ఈ నేపథ్యంలో శనివారం లోక్‌సభ స్పీకర్ శని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఇతర నేతలు […] The post అంతా సహకరించండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 అన్ని పార్టీలకూ స్పీకర్ విజ్ఞప్తి
రేపటి నుంచి పార్లమెంట్ భేటీ
బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం
నిరుద్యోగం, ఆర్థిక స్థితిపై ప్రతిపక్షం

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని స్పీకర్ ఓమ్ బిర్లా విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల శీతాకాల సమావేశాలు ఆరంభం అవుతాయి. ఈ నేపథ్యంలో శనివారం లోక్‌సభ స్పీకర్ శని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఇతర నేతలు హాజరయ్యారు. పలు పార్టీల నేతలతో సమావేశానంతరం స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. సభా కార్యక్రమాల కమిటీ ముందున్న అంశాలను, అజెండాను పార్టీలకు తాను తెలియచేశానని స్పీకర్ చెప్పారు. అన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయని, సభాపక్షం నేతలు కొందరు తాము సభలో లెవనెత్తే అంశాలను తనకు తెలియచేశారని స్పీకర్ తెలిపారు. వీటిని అవకాశాన్నిబట్టి చర్చకు పెడుతామని చెప్పారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ వారితో మాట్లాడి ఆయా అంశాలను సాధ్యమైనంత వరకూ సభలో ప్రస్తావనకు తీసుకువస్తామని వెల్లడించారు.

ఈ శీతాకాల సెషన్‌లో పార్లమెంట్ 20 సిట్టింగ్‌లు జరుపుతుంది. 17వ లోక్‌సభలో జరిగే ఈ రెండో సెషన్ మొదటి సెషన్ మాదిరిగానే సజావుగా సాగుతుందని తాను ఆశిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. సభ సమావేశాలు సజావుగా సాగేందుకు, ఫలప్రదం అయ్యేందుకు తమ నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని అన్ని పార్టీలూ హామీ ఇచ్చాయని వెల్లడించారు. ఈసారి పార్లమెంట్‌లో పలు కీలక విషయాలు ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ పోటీ అధికారం చలాయిస్తున్నారని, వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తాను స్పీకర్‌తో జరిగిన భేటీలో చెప్పానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బందోపాధ్యాయ్ విలేకరులకు తెలిపారు.

నిరుద్యోగం, దేశంలో ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కరాదని, సంఖ్యాబలంతో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై సభాధ్యక్షులపై ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యం , ఉత్తర భారతంలో కూడా నెలకొన్న పర్యావరణ సమస్యలపై కూలంకుషంగా చర్చ జరగాల్సి ఉందని బిఎస్‌పి నేత కున్వర్ దానిష్ అలీ స్పష్టం చేశారు.

ఎన్‌డిఎకు శివసేన దూరమవుతున్న తరుణంలో …

బిజెపి ఆధ్వర్యపు ఎన్‌డిఎకు మిత్రపక్షమైన శివసేన దూరమవుతున్న తరుణంలోనే సోమవారం పార్లమెంట్ సమావేశాలు ఆరంభం అవుతున్నాయి. శివసేన నాయకులు వినాయక్ రౌత్, ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదులు ముస్లిమాన్ నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఒవైసీ కూడా సమావేశానికి హాజరయిన వారిలో ఉన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడటం, రామాలయ నిర్మాణంపై కేంద్రం తరఫున ట్రస్టు ఏర్పాటు కావాల్సి ఉండటం వంటి పరిణామాల నడుమ శీతాకాల సమావేశాలు మొదలవుతాయి. ఈ సెషన్‌లో తమ బిల్లులకు ఆమోదం దక్కించుకునేందుకు, నిర్థిష్ట లెజిస్లేటివ్ అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు బిజెపి ప్రభుత్వం సమాయత్తం అయింది.

పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వంటి అంశాలతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు పదును పెట్టనున్నాయి. పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యి డిసెంబర్ 13వ తేదీ వరకూ సాగుతాయి. కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్, ఎల్‌జెపి తరఫున చిరాగ్ అలీ పాశ్వాన్, డిఎంకె తరఫున టిఆర్ బాలు సమావేశానికి వచ్చారు. ఢిల్లీలో 1728 అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ ఇతర బిల్లులను ఈసారి సభలో ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. ఇక విధులలో ఉన్న డాక్టర్లపై దాడులకు దిగే వారిని శిక్షించేందుకు వీలు కల్పించే బిల్లు కూడా రానుంది, ఈ మధ్యకాలంలో వెలువరించిన కార్పొరేట్ టాక్స్ తగ్గింపులు, ఇ సిగరెట్ల నిషేధం వంటి ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు తీసుకువచ్చి చట్టరూపం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి విశేష బలంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న రెండో సెషన్ ఇది. ఆదివారం ప్రభుత్వం తరఫున అఖిల పక్ష భేటీ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పంపించారు. ఇక ప్రధాన పార్టీల కూటములు కూడా ఆదివారం ఎంపిలతో సమావేశాలు నిర్వహించుకోనున్నాయి. శనివారం నాటి స్పీకర్ సమావేశానికి ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ కూడా హాజరయ్యారు.

రాఫెల్ డీల్‌పై జెపిసి దర్యాప్తుపై పట్టువదలని కాంగ్రెస్

రాఫెల్ డీల్‌లో పూర్తి స్థాయి అవకతవకలు జరిగాయని, మోడీ మనుష్యులకే డీల్ కట్టబెట్టారని చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ఈసారి మరింత పదును పెట్టనుంది. ఈ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు జరపాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇంతకు ముందు సెషన్‌లో ఈ అంశంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది. అయితే డీల్ సక్రమమే అని, రద్దు లేదా సమీక్ష చేయాల్సిన అవసరం లేదని గురువారమే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మోడీ ప్రభుత్వానికి మరోసారి క్లీన్‌చిట్ ఇచ్చింది.. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా జెపిసి దర్యాప్తునకు కాంగ్రెస్ తన పట్టు బిగిస్తుందని, ఇతర ప్రతిపక్షాలతో కలిసి జెపిసి దర్యాప్తు డిమాండ్‌కు దిగుతుందని వెల్లడైంది.

Lok Sabha speaker Om Birla appeals to all parties

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంతా సహకరించండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: