బాల్యం అద్భుత వరమేనా?

  నేటి బాలలే రేపటి పౌరులు. బాలలే భారత భాగ్య విధాతలు. ఇలాంటి నినాదాలు వింటున్నప్పుడు మధురాతి మధుర అనుభూతి ఏదో మనల్ని మైమరిపిస్తుంది. మనం మన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నామా? నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మన మంతా నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మన దేశంలో బాల్యం అనేక దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కొన్ని దృశ్యాలు మనసును పరవశింపచేస్తాయి. మరికొన్ని దృశ్యాలు గుండెను బరువెక్కిస్తాయి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ , అందరి […] The post బాల్యం అద్భుత వరమేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేటి బాలలే రేపటి పౌరులు. బాలలే భారత భాగ్య విధాతలు. ఇలాంటి నినాదాలు వింటున్నప్పుడు మధురాతి మధుర అనుభూతి ఏదో మనల్ని మైమరిపిస్తుంది. మనం మన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నామా? నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మన మంతా నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మన దేశంలో బాల్యం అనేక దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కొన్ని దృశ్యాలు మనసును పరవశింపచేస్తాయి. మరికొన్ని దృశ్యాలు గుండెను బరువెక్కిస్తాయి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ , అందరి బాల్యం ఒక్కలా సాగదు. ఒక చోట జననం ఓ ఉత్సాహం. మరో చోట అదొక విషాదం. కళ్లు తెరచీ తెరవక ముందే మృత్యువు వెన్నాడుతోంది. మన దేశంలో ఏటా దాదాపు పన్నెండు లక్షల మంది శిశువులు నెల నిండకుండానే కన్ను మూస్తుండడం ప్రపంచంలో మరెక్కడా లేని విషాదం.

బాల్యం ఓ అద్భుత వరం
బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు. ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే. వారి కోసం ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. బాలలంటే బడికి వెళ్ళే పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల వల్ల, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్న వయసులో మోయవలసిన పరిస్థితిలో… భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే లక్ష్యానికి బలై బ్రతికే ప్రతీ బాలుడు, బాలిక. మరి వారి బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? అని ఆలోచిస్తే అనేక కారణాలు లభిస్తాయి. ప్రధాన కారణం మాత్రం బాలల హక్కులను కాలరాస్తున్న మన పాలకుల నిర్లక్ష్య ధోరణి. కారణం పరిశీలిస్తే వారికి ఓటు హక్కు లేక పోవడమే .
దేశంలో బాల్యాన్ని బాల్యంలా అనుభవిస్తున్న పిల్లల సంఖ్య చాల తక్కువ.

తల్లిదండ్రుల పేదరికం పిల్లలను ఆనందానుభూతుల్లోకి కాకుండా నరకంలోకి నెడుతోంది. బాల కార్మికులు, ఆకలితో అల్లాడే పిల్లలు మన దేశంలోనే ఎక్కువ. కొన్ని కోట్ల మందికి అసలు బాల్యమే లేదు. ఎందుకంటే పుట్టిన 5 ఏళ్ల లోపే వారు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న ఐదేళ్ళ వయస్సులోపు పసి పిల్లల సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ళ వయస్సు లోపున్న పిల్లల మరణాలలో మూడో వంతు మన దేశంలోనే జరుగుతున్నాయి. 2017 లో మరణించిన పిల్లల్లో 22 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. భారత్‌లో పుట్టిన వెయ్యి మంది శిశువుల్లో 62 మంది ఏడాదిలోపే చనిపోతుంటే, మిగిలిన వారిలో కొంతమంది పోషకాహార లోపంతో మృతి చెందుతున్నారు.

ఏటా 14.5 కోట్ల మంది పిల్లలు పుట్టిన రెండు మూడేళ్లకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలపడం మన దేశ పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. శిశు మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. వాగాడంబరం… ఆచరణ శూన్యత శైశవానికి శాపాలుగా మారుతున్నాయి. చాలా గ్రామాల ఆసుపత్రులలో మౌలిక వసతులు సైతం లేకపోవడం, ఆసుపత్రులున్నా డాక్టర్లు లేకపోవడం, మందులు లేకపోవడం… మరణాల రేటు పెరగడానికి ప్రధానకారణమవుతోంది. ఏజెన్సీలో సరైన వసతులు లేకపోవడం వలన కలిగే చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర సమాజం, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నా పాలకులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరం.

నేడు మనిషి తన బాల్య దశను క్రమక్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. నేడు బాల్యం చిదిమివేయబడుతోంది. లేనివాళ్లింటో ఆకలి, అనారోగ్యం, అవిద్యతోనూ, బాల కార్మికులుగాను చిదిమివేయబడుతున్న బాల్యం, ఉన్నవాళ్లింట్లో రెండు మూడేళ్లకే ప్రారంభమవుతున్న ప్రైవేటు, కాన్వెంటు చదువులు, కార్పొరేట్ స్కూళ్లలో సర్వనాశనం అయిపోతోంది. మనుష ధర్మం ఛిద్రమైన ఈ సమాజంలోకి రావాలంటేనే శిశువు అనుమానిస్తున్నాడు, వచ్చినా ఆ బిడ్డ పెదవి నవ్వడానికీ సంశయిస్తున్నది. ఈ లోకంలో జరిగే అకృత్యాలను చూసే ధైర్యం లేక ఆ శిశువు అంధత్వం కోసం తపస్సు చేస్తున్నది. అందుకే ఆరోగ్యవంతమైన శిశువులను స్వేచ్ఛగా ఎదగనిద్దాం. భారతదేశంలో కోట్లాది చిన్నారుల్లో చాలా మంది పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు. ఆర్థిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన, శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన నవ భారతాన్ని నిర్మించాలంటే… నేటి బాలల అవసరాలను తీర్చడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అందుకు సమయమాసన్నమైనది.

ఇక బాలికల సంగతి చెప్పనక్కరలేదు. ఇంట్లో, బడిలో, గుడిలో ఎక్కడ సరైన రక్షణ లేదు, స్వేచ్ఛగా ఎగరడం సంగతి అటుంచి, సరిగ్గా బతకలేని పరిస్థితి. తలిదండ్రులు, కుటుంబం బాగున్న వారి పరిస్థితి వేరు. వలస వెళ్ళేవారు, తలిదండ్రులు పట్టించుకోనివారు, తాగుబోతుల పిల్లలు, అనాథలు ఇలాంటి వారి పరిస్థితి గురించి తలుచుకుంటేనే బాధ వేస్తుంది. వసతి గృహాలు, హాస్టళ్ళు వంటి వాటి గురించి చెప్పనవసరం లేదు. ఇది కాకపోతే అడ్డంగా తిని ఆంబోతులా బలిసిన కుర్రకారు ప్రేమా…. గీమా అని మోసం చేయడం, కుదరకపోతే యాసిడ్లు పోయడం, అఘాయిత్యం చేయడం, ఘోరంగా చంపేసే వార్తలు నిత్యకృత్యం.

పిల్లలకు మనం ఇచ్చే బహుమతి
ఒకచోట బడి పిల్లలు రాజ కుమారుల్లా దర్శనమిస్తారు. మరోచోట యోగి వేమనల్లే ఎదురొస్తారు. ఒకరికి వంటి నిండా మోయలేనన్ని బరువులు. షూ, టై, బ్యాడ్జీ, రిబ్బన్, వీపు మీద బ్యాగ్ . వీటిలో ఏది లోపించినా అది నేరం. మరచిపోయినా, మాసిపోయినా వళ్లంతా వాతల శిక్ష. మరొకరిది సిగ్గుబిళ్లలు కూడా కప్పుకోలేని దైన్యం. సుర్రున కాలే రోడ్డు మీద నడవాలన్నా, ముళ్ల బాటలో పరుగెత్తాలన్నా కనీసం చెప్పులేసుకోలేని దౌర్భాగ్యం. అతుకుల బొంతలే వారికి యూనిఫాం. పిల్లలకి బహుమతిగా ఏమివ్వబోతున్నారు? ఖరీదైన ఎలక్ట్రానిక్ ఆట వస్తువులూ, థీమ్ పార్కు, మాల్స్, పర్యటనలు..? పోనీ మొబైల్ ఫోన్ ఇస్తారా? భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి.. ఆర్థిక బాండ్లూ, బీమా పథకాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా? వారి పేరు మీద లక్షలు కాదు కాదు కోట్లు కూడకట్టాలనుకుంటున్నారా? వారి అడుగు తీసి వేయకుండా కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా కాపలా ఉంటున్నారా? చేయండి మంచిదే! కానీ వీటన్నింటికంటే మించినది ఒకటుంది అదే నేటి పిల్లలకి వాళ్ల బాల్యాన్నే వారికి బహుమతిగా ఇవ్వండి! నిజానికిది బహుమతి కూడా కాదు. వాళ్ల నుంచి మనం బలవంతంగా దూరం చేసిన ఒక అద్భుతమైన వరం. దాన్ని ఖచ్చితంగా వారికి తిరిగి ఇవ్వండి.

మన కున్న ఎన్నో కోరికల మధ్య వాళ్లని వర్తమానంలో పిల్లలుగా చూడటం మరిచిపోతున్నాం. మార్కుల కోసం కొందరు, రాంకుల కోసం మరికొందరు మంచి భవిష్యత్తునిస్తున్నామనే భ్రమలో.. వాళ్ల బాల్యాన్ని తీసేసుకుంటున్నాం! వారి నించి బలవంతంగా లాక్కుంటున్న దాన్నెలా మనం తిరిగివ్వాలి? ఉన్నదాన్ని ఎలా కాపాడాలి? తరగని ఆనందం, నియంత్రణ లేని ఉద్వేగం … ఇవే బాల్యం లక్షణాలు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఈ ఏడు దశాబ్దాల కాలంలో నిశ్చితమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ, చట్ట నిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను, కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరముంది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించే విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పిల్లల హక్కులను సంరక్షించే ఫలాలు ఇప్పటికీ అందరికీ అందడంలేదు. చిన్నారులపై ఏ ఒత్తిడి తేకుండా ఈ మూడింటిని సరైన దారి మళ్లించగలిగితే చాలు. మంచి బాల్యాన్ని బహుమతిగా అందించినట్టే. అపుడే బాలల దినోత్సవం పరమార్థం నెరవేరినట్టు.

November 14 is Childrens Day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాల్యం అద్భుత వరమేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: