పిల్లల్ని నమ్మటం నేర్చుకోండి!

  “డబుల్ ఎమ్మే చేశాను. మా కాలేజీలో నా స్టూడెంట్స్ నే గీసిన గీటు దాటమంటారు. బ్రహ్మాండంగా మాట్లాడతానని ప్రతి అడ్డమైన మీటింగ్‌కూ పిలుస్తారు. కానీ చూశావూ నా కొడుక్కి మాత్రం నే సమాధానం చెప్పలేక పోతున్న” అంది జయంతి. “ ఎదిరిస్తాడా? మాటవినడా? అడిగింది వసంత. “ రెండూ కాదు, వాడే పర్‌ఫెక్ట్ అనుకుంటాడు. నేనేం చెప్పినా వాడికి నచ్చదు. ప్రతిదీ కాదంటాడు.” “తెలివితేటలు పర్లేదా?” “అసలదే కదా ప్రాబ్లమ్. వాడికి ప్రతిదీ తెలుసు… ఇంటిలిజెంట్‌ని […] The post పిల్లల్ని నమ్మటం నేర్చుకోండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

“డబుల్ ఎమ్మే చేశాను. మా కాలేజీలో నా స్టూడెంట్స్ నే గీసిన గీటు దాటమంటారు. బ్రహ్మాండంగా మాట్లాడతానని ప్రతి అడ్డమైన మీటింగ్‌కూ పిలుస్తారు. కానీ చూశావూ నా కొడుక్కి మాత్రం నే సమాధానం చెప్పలేక పోతున్న” అంది జయంతి. “ ఎదిరిస్తాడా? మాటవినడా? అడిగింది వసంత.
“ రెండూ కాదు, వాడే పర్‌ఫెక్ట్ అనుకుంటాడు. నేనేం చెప్పినా వాడికి నచ్చదు. ప్రతిదీ కాదంటాడు.”
“తెలివితేటలు పర్లేదా?”
“అసలదే కదా ప్రాబ్లమ్. వాడికి ప్రతిదీ తెలుసు… ఇంటిలిజెంట్‌ని అంటూ వాదిస్తాడు. నువు మాత్రం అలా చేయటం లేదా అని నన్నే తప్పుపడతాడు. ప్రతిదీ తనకు తెలుసంటాడు.”

“ కరెక్టేనేమో జయంతి… న్యాయంగా మనకే పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. జీవితంలో మనసాయం లేకుండా వాళ్లు చాలా పనులు చేయగలరనీ అనుకోవాలి. అక్కడే వస్తోంది సమస్య. మనమేమో వాళ్లను చిన్నపిల్లలుగా చూస్తాం”
“ ఏమో వసంతా నేను చాలా స్ట్రెస్ ఫీలవుతున్నాను. స్కూల్లో కాలేజీల్లో పాఠాలు నేర్చుకుంటాం. ఉద్యోగంలోకి వచ్చి ఆఫీస్ పని నేర్చుకుంటాం. కానీ ఎక్కడో మనం మిస్ అయ్యేది ఏమిటంటే పెళ్లయ్యాక ఎలా ప్రవర్తించాలి, పిల్లలు పుట్టాక వాళ్లను ఎలా పెంచుకోవాలి? ఎలాంటి బాధ్యతలను పోషించాలి అన్న చదువు దొరకదు. పని, వృత్తి, ఉద్యోగబాధ్యతలు, పిల్లలు వీటి మధ్య పరుగులు పెడతాం కానీ ఈ బాధ్యత పోషించటంలో ఎక్కడో తప్పు చేస్తున్నాం. నా విషయం తీసుకో నేనొక పర్‌ఫక్ట్ తల్లిని కావాలని, నా భర్త మంచి తండ్రి కావాలని కలలు కన్నాం. కానీ మా పిల్లవాడు నేననుకున్నట్లు ప్రవర్తించడు. చాలా ఇండివిడ్యుల్‌గా ఉంటాడు. నేను చెప్పేవి వాడికి నచ్చవు” అన్నది జయంతి.

“నువ్వే కాదు జయంతీ నీలాంటి పేరెంట్స్ అందరూ ఇదే చెప్తారు. సగం నా దగ్గరకు వచ్చే కేసులు ఇవే. చిల్ట్రన్స్ సైకాలజిస్టుగా నేను నీలాంటి తల్లులతో మాట్లాడుతూనే ఉంటాను. ఉదాహరణకు మీ అబ్బాయి అఖిల్‌కు పదేళ్లు. పిల్లవాడికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండేందుకు నువు అనుమతి ఇవ్వవు. అస్తమానం అది చేయద్దు ఇది చేయద్దు అని చెబుతూ ఉంటే, వాళ్లలో లోలోపల ఎదురు తిరిగే స్వభావం పెరిగి ప్రవర్తనా సంబంధిత లోపాలు తలెత్తుతాయి. అప్పుడు పెద్దవాళ్లలో ఒత్తిడి మొదలవుతుంది.

పిల్లల్ని నమ్మండి: నిజానికి పిల్లలంతా తెలివైనవాళ్లే వాళ్లు పెరుగుతూ చుట్టూ వాతావరణం అర్థం చేసుకుంటూ తమ పనులు తాము చేసుకోగల సామర్థాన్ని పెంచుకుంటారు. ఈ విషయం గుర్తించలేనిది తల్లిదండ్రులే. ప్రతిదీ తాము చెప్పిందే వినాలని చూస్తారు. దాన్ని క్రమశిక్షణ అంటారు. కానీ ఎదిగే పిల్లలకు కండిషన్ పెడితే సరిపోదు. వాళ్లతో అన్ని విషయాలు చర్చించాలి.
పిల్లల్ని మనతో సమానంగా చూడాలి. వాళ్ల ప్రవర్తననీ, గడిపే జీవితాన్ని చూస్తూ ఉండాలి. ఒక్కసారి తప్పులు చేయచ్చు దాన్నించి నేర్చుకుంటారు. పొరపాటులకు బాధ్యత తీసుకుంటారు. దాన్ని ప్రోత్సహించాలి. వాళ్ల సెక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగానీ చిన్న పొరపాటు జరిగినా జీవితంలో మనమేం చేయలేదు, ఎప్పూడూ సక్సెస్‌ఫుల్ లైఫ్ గడిపాం అన్నట్లు మాట్లాడుతుంటేనే పిల్లలు ఎదిరిస్తారు. వాళ్లు మన జీవితాలను చూస్తారు.

దగ్గరగా గమనిస్తారు. ఉదాహరణకు తీసుకుంటే… తల్లి కూడా ఎప్పుడో ఒకసారి పొరపాటున ఏ గాజుగ్లాసో పగలగొడుతుంది, పొయ్యిమీద పాలు మరచిపోతుంది. దాన్ని అరే చూడలేదే అని సమర్ధించుకుంటుంది. అదే పిల్లవాడు చేస్తే అదేదో అపరాధం అన్నట్లు దండిస్తే వాడు ప్రశ్నించడా? పిల్లలు తప్పులు చేస్తే చెప్పవచ్చు. వాళ్ల బాధ్యతలు, ప్రవర్తన గురించి మాట్లాడ వచ్చుకానీ తప్పు పట్టకూడదు. వారిని దూషించి దండిస్తే వ్యక్తిగత స్థైర్యం దెబ్బతింటుంది. విశ్వాసం సన్నగిల్లిపోయి ఆత్మన్యూనతలకు గురవుతారు. ఇంట్లో వాళ్లే సమీక్షలు ముగింపులు ఇస్తున్నారని, పిల్లవాడిని అర్థం చేసుకునే దిశగా కాకుండా వాడి తప్పు ఎత్తి చూపించి ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

తల్లిదండ్రులే స్ఫూర్తి: సాధారణంగా పిల్లలపైన పెద్దవాళ్లు గొప్ప అంచనాలు పెంచుకుంటారు. కానీ దానికి తగ్గట్టు పెద్దవాళ్ల జీవిత విధానం కూడా ఉండాలి. పిల్లల బాధ్యతాయుతమైన జీవన విధానంలో ఉండాలని అపేక్షిస్తే అలాంటి ఉత్తమ విలువలున్న తాము అనుభవించి చూపెట్టగలిగాలి. ఇంట్లో పెద్దవాళ్లతో తమ తల్లిదండ్రులు మాట్లాడే విధానం, వాళ్ల పట్ల ప్రవర్తన, చుట్టు పక్కలవారితో మెలిగే పద్ధతి, వాళ్ల విషయంలో పరోక్షంగా మాట్లాడుకునేవి, పబ్లిక్ లైఫ్‌లో హెల్మెట్ పెట్టుకోవడం, రోడ్ రూల్స్ పాటించటం, ఇతరులతో నిజాయితీగా ఉండటం వంటి సూక్ష్మమైన విషయాలు పిల్లలు గమనిస్తారు. ఇవన్నీ వాళ్లు అర్థం చేసుకున్న రీతిలో ఆచరణలో పెడతారు. వాళ్ల వ్యక్తిత్వ రూపకల్పనతో ఈ అంశాలన్నీ చోటు చేసుకుంటాయి. వాళ్ల మనసులో తల్లిదండ్రుల పట్ల కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. శిక్షణ పేరిట తల్లిదండ్రులు విధించే కట్టడిని, నిరంతరం వాళ్లపై జులుం ప్రదర్శించటం, ఆంక్షలు పెట్టటం భరించలేకపోతారు.

పిల్లలకు తల్లిదండ్రులు తమనెంత ప్రేమిస్తారో, తమకోసం ఎంత జీవితాన్ని త్యాగం చేస్తారో, అర్థం అయ్యేలా పెద్దవాళ్ల ప్రవర్తన ఉండాలి. పిల్లల నమ్మకం సంపాదించగలిగితే వాళ్ల మనసుపైన అదుపు దొరుకుతుంది. ముందుగా వాళ్లు మన మాట వినాలన్న పట్టుదల అవతల పెట్టి వాళ్లు మనకెంత ముఖ్యమో నచ్చ జెప్పాలి.

ఆ తరువాత పిల్లలు ఆపేందుకు వాళ్లే లొంగిపోతారు. ఈ ప్రపంచంలో తమ పేరెంట్స్ కంటే తమ మేలు కోరే వాళ్లు ఎవరూ ఉండదని వాళ్లకి అర్థమైతే అసలు ఘర్షణే ఉండదు. పిల్లల్ని పెంచటం చాలా గొప్ప బాధ్యత. ఎప్పుడూ వాళ్లని ఇతరులతో పోల్చకూడదు. మన పిల్లలు డిజైన్ చేసిన బొమ్మ కాదు. ఎవరిపిల్లల లాగో మన పిల్లలు ఉండకూడదు. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వాళ్ల ఆలోచనలు భయాలు అర్ధం చేసుకోవాలి. వాళ్ల శక్తిని సరిగ్గా అంచనా వేయాలి. వాళ్ల సామర్థ్యాన్ని గుర్తించాలి. నమ్మాలి. అప్పుడే పిల్లలు మనల్ని నమ్ముతారు. మనం చెప్పిన మాట వినటం తమ జీవితానికి చాలా అవసరం అని గుర్తిస్తారు. అప్పుడే వాళ్లు చక్కగా ఎదిగేందుకు పునాదులు పడతాయి. చక్కని విలువలతో ఎదుగుతారు. మంచి కెరీర్ నిర్మించుకోగలుగుతారు.

Learn to Trust Children!

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిల్లల్ని నమ్మటం నేర్చుకోండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: