మహారాష్ట్ర పరిణామాలు

         మహారాష్ట్రలో బళ్లు ఓడలు, ఓడలు బళ్లూ అవుతున్నాయనిపిస్తున్నది. మరో ఐదేళ్ల కాలం రాష్ట్రంలో అడ్డులేకుండా అధికార చక్రం తిప్పుతుందనుకున్న భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని గవర్నర్‌కు చెప్పేసి చేతులెత్తేసింది. మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవడమే తప్ప గత్యంతరం లేదనుకున్న నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్‌సిపి), కాంగ్రెస్ పార్టీలు శివసేన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూలస్తంభాలవుతున్న సూచన లు కనుపిస్తున్నాయి. శివసేన ప్రభుత్వంలో ఎన్‌సిపి చేరనున్నట్టు, కాంగ్రెస్ బయటి నుంచి […] The post మహారాష్ట్ర పరిణామాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         మహారాష్ట్రలో బళ్లు ఓడలు, ఓడలు బళ్లూ అవుతున్నాయనిపిస్తున్నది. మరో ఐదేళ్ల కాలం రాష్ట్రంలో అడ్డులేకుండా అధికార చక్రం తిప్పుతుందనుకున్న భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని గవర్నర్‌కు చెప్పేసి చేతులెత్తేసింది. మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవడమే తప్ప గత్యంతరం లేదనుకున్న నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్‌సిపి), కాంగ్రెస్ పార్టీలు శివసేన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూలస్తంభాలవుతున్న సూచన లు కనుపిస్తున్నాయి. శివసేన ప్రభుత్వంలో ఎన్‌సిపి చేరనున్నట్టు, కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు వార్తలు చెబుతున్నాయి. సొంత పార్టీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ మద్దతును శివసేనకు, ఎన్‌సిపికి తెలియజేసినట్టు సమాచారం. బిజెపి, శివసేనలు హిందుత్వ కవలలు. సైద్ధాంతికంగా దాదాపు ఏకాభిప్రాయం ఉన్న పార్టీలు. అవి రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరు, విరుద్ధ ఆలోచనలు, ఆశయాలున్న ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన అధికార పగ్గాలు చేపట్టడం వేరు.

కశ్మీర్‌లో సిద్ధాంతాలపరంగా బద్ధ వ్యతిరేకి అయిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పిడిపితో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కలిసి శివసేన అధికారంలోకి రావడంలో అనౌచిత్యం కనిపించదు. ఇతర కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య సత్సంప్రదాయాలను కూడా గాలికి వదిలి ఏ మార్గంలోనైనా అధికారాన్ని చేజిక్కించుకోడానికే అమిత ప్రాధాన్యం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో తనకు అనువు కాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయకుండా శివసేనకు అవకాశం ఇప్పించడానికే నిర్ణయించుకోడం గమనించవలసిన పరిణామం. ఐదేళ్ల క్రితం 2014 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి అనంతరం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి, శివసేన మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కూడా మళ్లీ ఐక్య సంఘటన ప్రభుత్వం నెలకొల్పడంలో విఫలమయ్యాయి.

ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పాటు పంచుకుందామని శివసేన చేసిన సూచనకు బిజెపి బొత్తిగా అంగీకరించకపోడమేనని రూఢి అయిపోయింది. ఎంతటి సైద్ధాంతిక సాన్నిహిత్యమున్నా అధికారం దగ్గర మాత్రం అది నిలబడదని ఈ పరిణామం చాటుతున్నది. శివసేనకు మరాఠీల్లోనూ, కుంభీల్లోనూ గట్టి మద్దతు ఉన్నది. అలాగే ఎన్‌సిపి నేత శరద్ పవార్ మొన్నటి ఎన్నికల్లో తిరుగులేని, ఎదురులేని మరాఠీ నేతగా ఊహించని విజయాలను సాధించుకున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి నెలకొల్పే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల స్థానిక సమస్యల పట్ల మరింత శ్రద్ధ వహించగలదని ఎదురు చూడవచ్చు. శివసేన నెలకొల్పే ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచైనా మద్దతు ఇవ్వబోవడంలోని ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ ప్రవచించే సెక్యులర్, సోషలిస్టు తరహా సామాజిక పొందికకు, శివసేన హిందుత్వకు బొత్తిగా పొసగదు.

అయితే హిందుత్వ కార్డుతో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పోటీ లేని పాలక పక్షంగా బలపడిన నేపథ్యంలో తాను కూడా మెజారిటీ మతస్థుల ఓట్లను ఆకర్షించుకునే దిశగా అడుగులు వేయడం మంచిదని భావించి శివసేన పాలనకు దన్ను నిలవాలని కాంగ్రెస్ అనుకున్నదేమో! గత లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాలు సందర్శించి తాను బ్రాహ్మణుడినని ప్రకటించు కోడంలోనూ ఈ వ్యూహం కనిపించింది. దేశంలో రాజకీయాలు అవకాశ వాదం వైపు మొగ్గిపోయి చాలా కాలమైంది. అందుచేత చివరి నిమిషంలో కాంగ్రెస్ వైఖరిలో మార్పు వస్తే తప్ప శివసేన, ఎన్‌సిపి ప్రభుత్వానికి బయటి నుంచి ఆకిజన్‌ను అందించడానికే అది సిద్ధపడవచ్చుననిపిస్తున్నది. అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన అంతిమ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.

ఆ విధంగా తిరిగి దేశాధికారంలోకి రావడానికి తగిన అవకాశాలను కల్పించుకుంటున్న ఆ పార్టీ శివసేన విషయంలో మెత్తబడడాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం సాయంత్రం 7.30 గం. వరకు మాత్రమే గడువు ఇచ్చిన మహారాష్ట్ర గవర్నర్‌ను మరి కొంత వ్యవధి ఇవ్వాలని శివసేన అర్థించిందని అందుకు ఆయన తిరస్కరించారని ఆ తర్వాత ఎన్‌సిపిని కూడా ఆహ్వానించి దానికి మంగళవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చారని సమాచారం. కాంగ్రెస్ మద్దతుతో శివసేన ఎన్‌సిపి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో మహారాష్ట్ర రాజకీయం మరో ఆశ్చర్యకరమైన మలుపు తిరుగుతుందో మంగళవారం నాడు తేలిపోతుంది. రాజకీయాల్లో మైత్రి శాశ్వతం కాదని అధికార అయస్కాంతమే అంతిమ నిర్ణేత కాగలదని మహారాష్ట్ర పరిణామాలు మరో సారి రుజువు చేస్తున్నాయి.

BJP says can’t form government

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహారాష్ట్ర పరిణామాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: