కన్నవారి కన్నీళ్లు తుడుద్దాం

  తలిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమన. ఇది అక్షరాల సత్యం. అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రస్తుత సామాజిక పరిస్థితులలో రోజురోజుకూ తలిదండ్రుల సంరక్షణను గాలికి వదిలేస్తున్న వారసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించి, విచ్ఛిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో వృద్ధ తలిదండ్రులను ఒంటరిగా వదిలేస్తూ అభివృద్ధి పేరిట, సాంకేతికత పేరిట, కాలానుగుణంగా […] The post కన్నవారి కన్నీళ్లు తుడుద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తలిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమన. ఇది అక్షరాల సత్యం. అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రస్తుత సామాజిక పరిస్థితులలో రోజురోజుకూ తలిదండ్రుల సంరక్షణను గాలికి వదిలేస్తున్న వారసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించి, విచ్ఛిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో వృద్ధ తలిదండ్రులను ఒంటరిగా వదిలేస్తూ అభివృద్ధి పేరిట, సాంకేతికత పేరిట, కాలానుగుణంగా పరిగెడుతున్నది నేటి సమాజం.

భౌతికంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా తమను పట్టించుకునే నాథుడే లేక ఆయా వృద్ధులు మానసిక ఆందోళనలకు గురవుతూ ఆరోగ్యం క్షీణించి, చివరకు ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది కన్న పిల్లలకు తాము భారం కాకూడదని, వారి సంతోషాలకు తాము అడ్డుగా ఉన్నామనే అపోహతో తమ ఉసురు తామే తీసుకుంటున్నారు. ఆస్తి కోసం తలిదండ్రుల ప్రాణాలను కన్నపిల్లలే హరిస్తున్న సంఘటనలు సైతం వెలుగు చూస్తున్నాయి. మానవతా విలువలను మంట కలుపుతున్న ఇటువంటి సంఘటనలు, ఆధునిక సమాజంలో మానవ జీవన శైలిని, అభివృద్ధి పేరిట జరుగుతున్న పోకడలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి.

మానవ జీవితంలో వృద్ధాప్యం చివరి దశ. ఆ దశలో పిల్లలతో కలిసి ఆనందంగా గడపాలని అందరి తలిదండ్రులు కోరుకుంటారు, కానీ యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నేటి మనుషులు వారికి అటువంటి అవకాశం ఇవ్వకుండా, వారి కోరికలు తీర్చడంలో విఫలమవుతూనే ఉన్నారు. వృద్ధాప్యం మూలంగా వారి పనులు వారు చేసుకోలేని పరిస్థితుల్లో, అచేతనావస్థలో వారికి తోడుగా ఉండాల్సిన పిల్లలు, తలిదండ్రులను భారంగా భావిస్తున్నారు. మానసికంగా వాళ్లను సంతోషపరచాల్సింది పోయి సూటి పోటి మాటలతో, అయిష్టంగా ఉంటూ, మానసికంగా వారిని వేధిస్తున్నారు.

ఇక మరికొంత మంది తమ ఎదుగుదలకు తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని మరచిపోయి, గొప్పలకు పోతూ, పరువు పేరిట వృద్ధ, పేద తలిదండ్రులను ఇతరులకు కనిపించకుండా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరితో మాట్లాడే అవకాశం లేకుండా గృహ నిర్బంధం చేస్తున్నారు. మరి కొందరు తల్లిదండ్రుల కనీస అవసరాలు తీర్చకుండా వారి ఆస్తి మొత్తం లాక్కొని, వారి ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా, వారికి వైద్యం చేయించడం వృథా ఖర్చు అనుకుంటూ వారి మరణాలకు కారణం అవుతున్నారు. కొన్ని సార్లు భౌతిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి. ఏదో మొక్కుబడిగా తలిదండ్రులతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్న కుమారులు, కుమార్తెలే ఈనాటి సమాజంలో అధికం.

ఇటీవల కాలంలో తలిదండ్రులపై వరుసగా జరుగుతున్న దాడులు, ఆధునిక సమాజంలో మానవీయ విలువలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. పిల్లల అభివృద్ధి కోసం తలిదండ్రులు చేస్తున్న త్యాగాలను మర్చిపోయి, తాము చేసేదే సరైనది అనే రీతిలో, జల్సాల మాయలో పడి, చివరికి కన్నవారిని కడతేర్చడం అత్యంత హేయమైన చర్య. తప్పుడు మార్గంలో వెళుతున్న కూతురును సరి చేయాలని చూసిన కన్నతల్లిని, తన సంతోషానికి, ప్రేమకు అడ్డుగా ఉందని భావించి కన్న కూతురే ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపిన సంఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. ఇక ఆస్తి తగాదాల కారణంగా కన్న బంధాన్ని మర్చిపోయి అతి దారుణంగా కన్న కొడుకే తలిదండ్రులను గొంతు కోసి చంపిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో చోటు చేసుకుంది. చిన్నచిన్న కారణాలతో తలిదండ్రులపై దాడి చేస్తున్న సంఘటనలు సైతం అనేకం. బంధాలు -బంధుత్వాలకు ఇటువంటి సంఘటనలు మాయని మచ్చలాగా నిలుస్తున్నాయి.

ఆధునిక మానవుని ఆలోచన మేము అనే భావన నుండి నేను అనే భావనకు మారిపోయింది. దీంతో కనీసం తలిదండ్రుల సంరక్షణ సైతం తమ బాధ్యతగా గుర్తించకుండా, దూరంగా ఉంటున్నారు. వారికి భౌతికంగా సహాయ పడలేక, చాలామంది పిల్లలు వారి తలిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చుతున్నారు. దీంతో అందరూ ఉండి కూడా అనాథలుగా మిగిలిపోతున్న ఆయా వృద్ధుల బాధ వర్ణనాతీతం. కన్న పిల్లల నుండి సరైన ఆదరణ లభించక, వారికి భారం కాకూడదు అనే ఉద్దేశంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ, సమాజపు తీరుతెన్నులలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోకపోవడం ఆలోచించాల్సిన అంశం. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 22 శాతం మంది వృద్ధులు ఉన్నారు. భారతదేశంలో అధిక భాగం యువతదే. ప్రస్తుతం దాదాపు 13 కోట్ల మంది వయో వృద్ధులు భారత దేశంలో ఉన్నారు.

రానున్న కాలంలో అది మరింతగా పెరగనున్నది. అయితే, సమాజంలో వృద్ధుల పట్ల కొనసాగుతున్న ఇటువంటి వివక్ష రూపుమాపడానికి, తమ పిల్లల నుండి నిరాదరణకు గురవుతున్న తలిదండ్రులకు రక్షణ కల్పించాలి అనే లక్ష్యంతో తలిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టంను కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఇందులో తలిదండ్రుల బాగోగులు చూడాల్సిన బాధ్యత పిల్లలదేనని, దానిని విస్మరిస్తే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలు జైలు శిక్ష వంటి నిర్ణయాలు చట్టంలో పొందుపరిచారు. దాంతో పాటుగా పిల్లల నుండి జీవన భృతిని పొందే హక్కును కూడా తలిదండ్రులకు ఈ చట్టం కల్పించింది. అయితే కన్నపిల్లలపై ప్రేమతో, వారి పై ఫిర్యాదు చేయడానికి తలిదండ్రులు ముందుకు రావడం లేదు, తద్వారా ఈ చట్టం రూపకల్పన లక్ష్యాలు నీరుగారి పోతున్నాయి. అయితే తలిదండ్రులు అంత ప్రేమను చూపిస్తున్నప్పటికీ పిల్లల ఆలోచనల్లో మార్పు లేకపోవడం శోచనీయం.

ఇటువంటి సమస్యల పట్ల ఎన్ని చట్టాలు చేసినప్పటికీ అవి పరిష్కార మార్గాలను చూపించలేవు. క్షణికావేశంలో ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన వారిపట్ల భౌతిక దాడులు చేయడం, హత్య చేయడం, వారిని మానసికంగా హింసించడం, ఆత్మహత్యల వైపు ఉసిగొల్పడం వంటి చర్యలు సమాజానికి మంచివి కావు.తలిదండ్రుల పట్ల సగటు పిల్లల ఆలోచన శైలి మారాల్సిన అవసరం ఉంది. వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధంగా నేటి సమాజపు వైఖరి మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనల నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా ఉండే విధంగా సమాజంలో మార్పులు వచ్చి, తలిదండ్రులు, వృద్ధుల కన్నీళ్ళు ఉండకూడని విధంగా ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకొవాలని, దానిలో మనమంతా భాగస్వాములం అవ్వాలని కోరుకుందాం.

Old Age is final stage in human life

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కన్నవారి కన్నీళ్లు తుడుద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: