వీడని మహోత్కంఠ

  తాజాగా ఎన్‌సిపికి గవర్నర్ పిలుపు, నేటి రాత్రి 8:30గం. వరకు గడువు అంతకు ముందు రాజ్‌భవన్‌కు వెళ్లి కలిసిన శివసేన బృందం, కాంగ్రెస్ మద్దతుపై కొనసాగుతున్న అయోమయం ముంబయి/న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మబ్బులు తొలగినట్లే తొలిగి మళ్లీ కమ్ముకున్నాయి. కాంగ్రెస్ చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ మహోత్కంఠకు దారి తీసింది. అది శివసేనలో గుబులు రేపుతోంది. మరోవైపు సోమవారంనాడు రా త్రి తనను కలిసిన శివసేనఎన్‌సిపి బృందానికి గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ షాక్ […] The post వీడని మహోత్కంఠ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తాజాగా ఎన్‌సిపికి గవర్నర్ పిలుపు, నేటి రాత్రి 8:30గం. వరకు గడువు
అంతకు ముందు రాజ్‌భవన్‌కు వెళ్లి కలిసిన శివసేన బృందం, కాంగ్రెస్ మద్దతుపై కొనసాగుతున్న అయోమయం

ముంబయి/న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మబ్బులు తొలగినట్లే తొలిగి మళ్లీ కమ్ముకున్నాయి. కాంగ్రెస్ చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ మహోత్కంఠకు దారి తీసింది. అది శివసేనలో గుబులు రేపుతోంది. మరోవైపు సోమవారంనాడు రా త్రి తనను కలిసిన శివసేనఎన్‌సిపి బృందానికి గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు వారు కోరిన 48గంటల గడువును నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అదే సమయంలో వెన్వెంటనే ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావల్సిందిగా ఎన్‌సిపికి ఆహ్వానం పంపారు. కాసేపటికే ఎన్‌సిపి బృందం గవర్నర్‌ను కలిసింది. వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా సూచిస్తూ గవర్నర్ ఒక లేఖ ఇచ్చారు. దానికి ఎన్‌సిపి నేతలు తమతో కలిసి వచ్చే పార్టీలతో చర్చించేందుకు సమయమివ్వాలని కొశ్యారీని కోరారు.

ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోయే తుది నిర్ణయం ఏంటనేది చర్చనీయాంశమవుతోంది. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో మాట్లాడారు. అయితే ఇంకా లోతుగా ఎన్‌సిపితో చర్చలు జరపాల్సి ఉంది’ అని కాంగ్రెస్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. అందులో శివసేన ప్రస్తావన కూడా లేకపోవడంతో పొత్తుపై కాంగ్రెస్ ఎటూ తేల్చలేదని స్పష్టమైంది.

అంతకుముందు సోనియాతో ఉద్ధవ్ థాక్రే ఫోన్ మంతనాలు జరిపారని, ఆమె శివసేనకు మద్దతునిచ్చేందుకు ఒప్పుకున్నారని వచ్చిన వార్తలకు కాంగ్రెస్ చేసిన అధికారిక ప్రకటనకు పొంతన లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరిన శివసేన నేతలకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ఇక గవర్నర్ సోమవారంనాడు సాయంత్రం 7గంటల వరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఏ విషయమైనా చెప్పండని శివసేనకు విధించిన గడువు దగ్గర పడడంతో ఆ పార్టీ నేత ఆదిత్య థాక్రే కొందరు పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు తరలి వెళ్లారు.

గవర్నర్ కొశ్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మరో 48గంటలు గడువు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారు. కొశ్యారీని కలిసిన తర్వాత ఆదిత్య థాక్రే మీడియాతో మాట్లాడారు. తాము కోరిన గడువును గవర్నర్ తిరస్కరించారని చెప్పారు. ఎన్‌సిపి, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తామని అనధికారికంగా తెలిపాయని అన్నారు. ఇదిలావుండగా కేంద్ర మంత్రివర్గం నుంచి శివసేన వైదొలిగింది. మంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. సంబంధిత లేఖను ప్రధాని కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

సోనియా నివాసంలో చర్చోపచర్చలు..
అంతకుముందు సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనాయకులు భేటీ అయ్యారు. మహారాష్ట్ర పరిణామాలు, శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశంపై చర్చించారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏకే ఆంటోని, అహ్మద్ పటేల్ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన కీలక నేతలతో నూ కాంగ్రెస్ అధిష్టానం చర్చించింది. ఈ భేటీ జరుతుండగానే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సోనియాగాంధీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. శివసేన ప్రభుత్వానికి మద్దతునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా సోనియాను కోరారు. అయితే, పార్టీ ముఖ్య నేతలతో సోనియా భేటీ అనంతరం సిడబ్లుసి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మహారాష్ట్ర పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించామని, అనంతరం మహారాష్ట్ర పార్టీ నేతలతోనూ చర్చలు జరపామని, ఈ విషయంలో శరద్ పవార్‌తో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా కాంగ్రెస్‌లోని మెజారిటీ ఎంఎల్‌ఎలు శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఉత్తమమని హైకమాండ్‌కు లేఖ రాసినట్లు సమాచారం. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ దోస్తీపై బిజెపి విమర్శలు గుప్పించింది. ఒకప్పుడు బాబా సాహెబ్ సేనగా ఉన్న శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిపోయిందని ఆ పార్టీ ఎద్దేవా చేసింది.

Formation of Government in Maharashtra is Suspense

The post వీడని మహోత్కంఠ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: