గుండె తడి ప్రతిఫలనం ‘దండెం’

  మానవ సంబంధాలపై ఆర్థిక పరిస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో ఈ కవిత వివరిస్తుంది. ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ రక్త సంబంధాలను కూడా తృణీకరించడం అత్యాధునిక వ్యవస్థ లక్షణంగా మారిన తీరును ఏకరువు పెట్టారు ఈ కవి. సమాజం సంఘర్షణలకు, సంవేదనలకు నిలయం. పూటకో వార్త, రోజుకో సంఘటన మనిషిలోని మనసును గాయపరుస్తూనే ఉంటాయి. స్పందనలెక్కువుండే కవులు మరీ ఎక్కువగా గాయపడుతూంటారు. ఎన్నో నిద్రలేని రాత్రులు కళ్లకింద చీకటి వలయాలను సృష్టిస్తాయి. ఆ గాయాల బాధ […] The post గుండె తడి ప్రతిఫలనం ‘దండెం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మానవ సంబంధాలపై ఆర్థిక పరిస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో ఈ కవిత వివరిస్తుంది. ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ రక్త సంబంధాలను కూడా తృణీకరించడం అత్యాధునిక వ్యవస్థ లక్షణంగా మారిన తీరును ఏకరువు పెట్టారు ఈ కవి.

సమాజం సంఘర్షణలకు, సంవేదనలకు నిలయం. పూటకో వార్త, రోజుకో సంఘటన మనిషిలోని మనసును గాయపరుస్తూనే ఉంటాయి. స్పందనలెక్కువుండే కవులు మరీ ఎక్కువగా గాయపడుతూంటారు. ఎన్నో నిద్రలేని రాత్రులు కళ్లకింద చీకటి వలయాలను సృష్టిస్తాయి. ఆ గాయాల బాధ కవిత్వ సృష్టికి బీజమవుతుంది. ఆ చీకటి వలయాలు బాధితులకు వెలుగు దారి చూపించే దివిటీలవుతాయి. దాసరి మోహన్ కవిత్వం అందుకు ఉదాహరణ. గుండె గాయాల భాషను కవిత్వ రూపంలోకి తర్జుమా చేస్తున్న కవి దాసరి మోహన్. ఆయన అంతరంగంలోని భావోద్వేగాలకు అక్షర రూపం ‘దండెం’ కవితాసంపుటి. అరిగిపోయిన వ్యక్తీకరణలకు చెల్లుచీటీ ఇచ్చిన కవితాసంపుటి ఇది. సాంద్రత ఉన్న కవిత్వం ఈ సంపుటి నిండా పరుచుకుని, పాఠకుడిని ఆకర్షిస్తుంది.

‘దండెం’ శీర్షికతో ఉన్న కవితలో మనసును దండెంతో పోలుస్తారు మోహన్. దండెంపై బట్టలను ఆరేసినట్టు బంధాలు కూడా కన్నీటి తడితో, అవమానపు భారంతో వచ్చి వాలాయంటారు. ఫెవికాల్ బంధంలా అవన్నీ ఉండిపోవడంతో బతుకు దండెం బరువెక్కిపోయిందంటారు. దండెంపైకి ఎక్కిన దుస్తుల భారం ఎక్కువ కావడంతో దండెం తనకు మోక్షం కలిగించమని కోరుకుంటుందట. అందుకే “దారాలన్నీ / చివరి ప్రార్థన చేస్తున్నాయి / రేపో మాపో/ రాలిపోతుంది శాశ్వతంగా…” అంటూ ఈ కవితను ముగించారు కవి.

జీవనోపాధి కోసం అమెరికాను ఆశ్రయించే పిల్లల మనస్తత్వాలను కవి చిత్రిక పడతారు. తల్లిదండ్రులు మరణించినా రాని పిల్లలెందరో. బతికి ఉన్నప్పుడు బంధాలు దూరమై అనుక్షణం నరకం అనుభవించే వృద్ధ తల్లిదండ్రుల క్షోభ వర్ణనాతీతం. కనీసం కర్మకాండలకు కూడా రాని పిల్లల పరిస్థితిని వివరించే ‘నాకేం తెలుసు’ పాఠకులను కదిలించే కవిత. “నాకేం తెలుసు/ కర్మకాండలు కొడుకులు/ అమెరికాలో నుండి/ ఆన్‌లైన్‌లో చూస్తారని/ పంపకాలు మాత్రమే/ ఆఫ్‌లైన్‌లో / షెడ్యూల్ చేసుకుంటారని/ ప్రాణాలు పోయాకే తెలిసింది” అనే వాక్యాలతో ముగిసే ఆ కవిత పాఠకుల కంట నీరు తెప్పిస్తుంది. మానవ సంబంధాలపై ఆర్థిక పరిస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో ఈ కవిత వివరిస్తుంది. ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ రక్త సంబంధాలను కూడా తృణీకరించడం అత్యాధునిక వ్యవస్థ లక్షణంగా మారిన తీరును ఏకరువు పెట్టారు ఈ కవి.

దాసరి మోహన్ కవిత్వం మొదటి పాదం నుండి చివరి పాదం వరకు ఒక లయబద్ధంగా సాగుతుంది. ఫ్రేము తర్వాత ఫ్రేము వచ్చి, సినిమాలో గ్యాప్ లేకుండా చేసినట్టు ప్రతి పాదమూ అంతకుముందు పాదంతో, తర్వాతి పాదంతో సంబంధం కలిగి ఉండి, పూసలో దండలు అమరినట్టు చక్కగా కుదిరిపోతాయి. మొదటి పాదానికి, చివరి పాదానికి చక్కటి సమన్వయం దాసరి మోహన్ కవిత్వంలో కనబడుతుంది. ఉదాహరణకు ‘మంచి పని…’ అనే కవిత “నిద్ర పట్టేంత/ మంచి పనేం చేయలేదు నేను” అనే పాదాలతో ప్రారంభం అవుతుంది. ఈ కవిత “కునుకు పడితే/ అదృష్టమే మరి/ నిద్ర పట్టేంత/ మంచి పనేం చేసాను అని…” అనే పంక్తులతో ముగుస్తుంది. ‘చప్పట్లు కొడదాం…’ అనే కవిత “అమ్మాయి జాగ్రత్త!/ అన్నప్పుడే ఆమెను / అబలను చేసాం మనం” అనే పాదాలతో మొదలవుతుంది. ఆత్మవిశ్వాసపు బలాన్ని అందజేసి, కవితను ముగిస్తారు కవి. ‘ఇపుడిక ఆమె/ తన సొంత వ్యక్తిత్వంతో/ వెలిగిపోతుంది/ చప్పట్లు కొడదాం” అనే పంక్తులతో ఈ కవిత ముగుస్తుంది. ఈ రెండు కవితల్లోనూ ఆరంభానికి, ముగింపుకు చక్కటి సమన్వయం ఉండడాన్ని గమనించవచ్చు.

ఈ కవి సృజించిన కవిత్వంలో నిరాశావాదం తొంగిచూస్తుంది. కొన్ని సమస్యలకు మరణం మాత్రమే పరిష్కారం అందజేయగలదన్న అభిప్రాయాన్ని కొన్ని చోట్ల కవి వ్యక్తం చేస్తారు. ‘మట్టి మాత్రమే’ అనే కవితలో “అన్ని బంధాలు పొమ్మనేవే/ మట్టి మాత్రమే పిలుస్తుంది/ శాశ్వతంగా తనలో దాచుకుంటుంది” అని పేర్కొంటారు. ‘దండెం’ కవితలో కూడా “దండెం దండం పెడుతుంది/ ఇక మోయలేనని/ మోక్షం కలిగించమని” అంటారు. “ఒంటరిగానే…’ అనే కవితలో “భగవత్ గీత/ మోగుతుంటుంది/ పంచుకునేదేమైనా ఉంటే/ హక్కుల కోసం ఏడుస్తారు/ మనం మాత్రం మౌనంగానే వెళ్ళాలి/ మహాప్రస్థానానికి/ ఒంటరిగానే వెళ్లాలి” అని తేటపరుస్తారు. ‘సమాధిలోనే…’ అనే కవితలో “జీవితం కుండ/ నిండదేమో ఎప్పుడూ/ మనస్సు/ సంతృప్తి పడేది/ సమాధి చేరినప్పుడే కావొచ్చు..” అంటారు. ‘నీకేంటి…’ కవితలో “నేను మాత్రం/ ఒంటరిగానే/ ఒక్కోసారి/ నాలో నేను ఏడుస్తూ/ ఒక్కోసారి../ ఆత్మహత్యకై ప్రయత్నిస్తూ…” అని పేర్కొంటారు. కవులకు మరీ ఇంత నిరాశావాదం పనికిరాదేమో!.

చీకటితో పాటే వెలుతురున్నట్టు నిరాశావాదంతో పాటే ఆశావాదం కూడా దాసరి మోహన్ కవిత్వంలో కనబడుతుంది. పాఠకుడిని ఆశావహ దృక్పథం పెంచేందుకు ఈ కవితలు ఉపయోగపడతాయి. ‘జీవిత పాఠం’ అనే కవితలో “రాలిన చోటే చిగురించాలట/ ప్రకృతి కన్నా గొప్ప పాఠం ఏముంది/ గాయమే కొత్త గేయాల్ని రాయాలి/ జీవితం నేర్పిన గుణపాఠం/ కొత్త శిఖరాల్ని సృష్టించాలి” అని గొప్ప ఆశావాదాన్ని వ్యక్తపరుస్తారు. ‘చెలి…మె’ అనే కవితలో “దోసెడు/ జ్ఞాపకాలతో/ మళ్లీ నేను/ బతుకుతాను/ మురిపాలన్నీ/ మూట కట్టుకుని/ మరింత ముందుకు/ ప్రయాణం సాగిస్తాను” అంటారు. ‘గెలుపు శిఖరం’ అనే కవితలో “ఓడిపోయినపుడల్లా/ ఒడిసిపట్టుకో విశ్వాసాన్ని/ పట్టు వదలకు/ గట్టు చేరేవరకు” అని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని ఉద్బోధిస్తారు.

ఐఐటి ర్యాంకుల కోసం బాల్యాన్ని బందీఖానా చేస్తున్న విద్యావ్యవస్థపై దాసరి మోహన్ ఎక్కుపెట్టిన కవితాస్త్రం ‘చైతన్యం లేని జీవితాలు’. “వల్లెవేయడమే వారి వంతయ్యింది/ మెదడు మొద్దు బారిపోతుంది/ కళ్లకు క్లిప్పులు పెట్టి చదివిస్తున్నారు/ రాత్రింబవళ్లు ర్యాంకుల పోరాటమే”నని విమర్శిస్తారు. ఈ కవి రాసిన ‘నేనేం చెప్పనూ!’ ఆయన రాసిన ఉత్తమ కవితల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ‘కోరకుండానే కెరటం ఒకటి/ కాళ్లను కౌగిలించుకుని వెళ్లిపోయింది/ అమ్మాయి కూడా అంతే/ గంపెడన్ని జ్ఞాపకాల్ని గుండెల్లో దింపి/ బ్రేకప్ చెబుతుంది” అంటారు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఆ బ్రేకప్ బాధను గుర్తుకు తెచ్చే గొప్ప కవిత ఇది.

కొత్త పోలికలు, కొత్త ప్రయోగాలు అనేకం దాసరి మోహన్ కవిత్వంలో కనబడతాయి. బతుకును హలీం బట్టీతో, సర్కస్ తీగతో, గానుగెద్దు ప్రయాణంతో, బుద్ధ విగ్రహంతో, ఫౌంటెన్ పెన్‌తో పోలుస్తారు ఈ కవి ‘బతుకు’ అనే కవితలో. నిద్రతో మూతపడ్డ కన్ను అక్షరాన్ని చదవలేదు. కన్ను మూతపడకుండా ఉంటేనే ర్యాంకుల సమరంలో విజయపతాకం ఎగురవేయగలడు విద్యార్థి. కన్ను మూతపడకుండా ఉండాలంటే ఎలా? అందుకే ‘కళ్లకు క్లిప్పులు పెట్టి చదివిస్తున్నారు’ అని ‘చైతన్యం లేని జీవితాలు’ అనే కవితలో అంటారు మోహన్. ‘ఎక్కడ మొదలెడదాం’ అనే కవితలో “ఏ తలుపు/ తెరిస్తే/ శవాల గుట్ట/ రాలుతుందో ఏ మనస్సు/ తడితే/ కన్నీళ్ల కుండ / పగిలిపోతుందో” అని పేర్కొంటారు. మనసు బాధ కన్నీటి రూపంలో బయటపడుతుంది. ఆ కన్నీటి కుండ కూడా పగిలిపోవడం అంటే భరించలేని భారంతో ఆ కుండ సతమతమౌతుందన్న అర్థం ధ్వనిస్తుంది. అంతకు ముందు పంక్తుల్లో శవాలను పేర్కొన్నారు కవి. కుండ పగలగొట్టడం అంత్యక్రియల్లో చేసే ఒక విధి. ఇక్కడ వేడినీటి కుండ కాకుండా కన్నీటి కుండ పగిలిందన్న రెండో భావాన్ని కూడా స్ఫురింపజేస్తారు. ‘50 ప్లస్’ అనే కవితలో “ఆమె రాల్చిన కన్నీళ్లు/ ఎన్ని క్యూసెక్కులో/ ఎవరు కొలిచారు” అని ప్రశ్నిస్తారు.

ఈ కవి ఉపయోగించే భాష ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడక్కడా ఉర్దూ పదాలు, ఆంగ్ల పదాలు, తెలంగాణ మాండలిక పదాలు సమర్థవంతంగా సరైన చోట ప్రయోగించడం కవితలకు చక్కటి రూపాన్ని అందిస్తుంది. ‘ఆప్తుడైనట్టు’ అనే కవితలో “మజ్‌బూరి చేసి/ మాయ మాటల్లో ముంచుతాడు” అంటారు. ‘సమాధిలోనే…’ అనే కవితలో “… అయినా/ గుండెలో ఏదో గుబులు/ గిర్క సప్పుడోలె?…’ అని పేర్కొంటారు. ‘గాడ్ మస్ట్ బి క్రేజీ’ అనే కవితలో “గూగుల్‌లో తోడాను/ తేడాలెందుకని/ గాడ్ మస్ట్ బి క్రేజీ/ గమ్మునుండమంది” అంటారు. ‘కైకూ పరేశానీ…’ అనే కవితలో “పక్క వాళ్ల బాధలతో/ పనేంటి మనకు/ దేశం సమాజం/ కైకూ పరేశానీ” అని ప్రశ్నిస్తారు.

క్షీణిస్తున్న మానవ సంబంధాలు, సగటు మనుషుల బాధలు, సమకాలీన సంఘటనలు దాసరి మోహన్ కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. తపించిన తడి గుండె ఆవేదన ఈ కవితాసంపుటిలో అడుగడుగునా కనబడుతుంది.
(‘దండెం’ కవితాసంపుటి, కవి: దాసరి మోహన్, పుటల సంఖ్య: 58, వెల: రూ. 30, ప్రతులకు: రచయిత, ఫోన్ నెం. 9985309080, నవ చేతన బుక్ హౌజ్)

External Factors Affecting Human Resources

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుండె తడి ప్రతిఫలనం ‘దండెం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: