గుణాత్మక విద్యకు మార్గదర్శి ఆజాద్

  దేశం గర్వించే విద్యాశాఖామాత్యులు గానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. సుప్రసిద్ధ రాజనీతిజ్ఞు డు, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా స్వాతంత్య్ర భారత నిర్మాతల్లో ప్రముఖులుగా చరిత్రలో నిలిచి, విద్యను సార్వజనీనం చేయడం లో విశేష కృషి చేసి సమ సమాజాన్ని రూపుదిద్దుటలో అవిరల కృషి చేసిన దార్శనికుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. అసలుపేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు, ఆజాద్ కలం పేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు 1888 […] The post గుణాత్మక విద్యకు మార్గదర్శి ఆజాద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశం గర్వించే విద్యాశాఖామాత్యులు గానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. సుప్రసిద్ధ రాజనీతిజ్ఞు డు, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా స్వాతంత్య్ర భారత నిర్మాతల్లో ప్రముఖులుగా చరిత్రలో నిలిచి, విద్యను సార్వజనీనం చేయడం లో విశేష కృషి చేసి సమ సమాజాన్ని రూపుదిద్దుటలో అవిరల కృషి చేసిన దార్శనికుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. అసలుపేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు, ఆజాద్ కలం పేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించారు. 1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పదకొండు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.

రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 10%, రాష్ట్ర బడ్జెట్‌లో 30% కేటాయింపులను అమలు చేయించారు. వలస పాలకుల అవసరాలకు తోడ్పడుతూ వచ్చిన విద్యావ్యవస్థను సమూలంగా మార్చడం కోసం, విద్య పునాదిని విప్లవకీకరించడం కోసం దేశీయ వనరులు, అవసరాలకు అనువైన ప్రజాతంత్ర విద్యను రూపొందించడం కోసం మౌలానా నిపుణులతో కమిటీలను వేసి వారి సిఫారసులను అమలు చేశాడు. పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్పు చేసి, వృత్తి విద్యను, క్రీడా విద్యను ప్రవేశపెట్టాడు.

బ్రిటిష్ ఇండియాలో తీవ్ర నిర్లక్ష్యానికి లోనైన భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి సాంస్కృతిక ఉద్యమ సేనానిగా పని చేశారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు నియమించారు. తొలి ఐదేళ్ళ కాలంలోనే యుజిసి, ఐసిసిఆర్, ఎఐసిటియు, సిఐఎన్‌ఆర్, తదితర అత్యున్నత సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థను, సంగీత, సాహిత్య, లలిత కళా అకాడమీలను ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి గల భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమి, సాహిత్య అకాడమి, ఆరట్స్ అకాడమిలను స్థాపించారు. స్వయంగా సాహితీవేత్త అయిన మౌలానా ఇండియా విన్స్ ఫ్రీడమ్‌ను రాశారు. ఆయన చనిపోయి 61 సంవత్సరాలు గడించింది. కానీ ఆయన తలపెట్టిన విద్యావిధానం ఇంకా అసమగ్రంగా, అనేక మందికి అందకుండా నిరాశా నిస్పృహలతో నిట్టూరుస్తోంది. కనీసం 14 ఏళ్ళ ప్రాయం వరకైనా బాలబాలికలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలనే మౌలానా ఆకాంక్షకు అనుగుణంగా ఎట్టకేలకు విద్యా హక్కు చట్టం వచ్చినా పాలనా వైఫల్యాలతో అది కాగితాలకే పరిమితమయింది.

పాఠశాలల్లో చేరిన విద్యార్థులలో సగం మంది 10వ తరగతి కూడా చదవకుండా మధ్యలోనే మానేస్తుండడంతో పాఠశాల విద్యా స్థాయికి చేరుకోలేక పోతున్నారు. నిరక్షరాస్యుల్లో, మధ్యలోనే బడి మానేస్తున్న వారిలో అధికులు దళితులు, గిరిజనులు, మైనార్టీలే. పాఠశాల విద్యను గట్టెక్కిన వారిలో కూడా అందరూ పై చదువులకు పోవటం లేదు. 15-18 సంవత్సరాల వయసులోని 25 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాతీయ సగటు అక్షరాస్యత 74 శాతంగానే ఉన్నా, ఏడు సంవత్సరాలు పైబడిన వారిలో 29 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరాస్యుల్లో 36 శాతం మంది మన దేశంలోనే ఉండడం పాలకుల నిర్లక్షానికి నిదర్శనం. దేశ జనాభాల్లో గ్రాడ్యుయేట్లు 5 శాతం లోపే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిర్ణీత విద్యా ప్రమాణాలు లేకపోవడం అనేది పాఠశాలల స్థాయికే పరిమితం కాక అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇంజినీరింగ్ అర్హత కలిగిన వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు సరి పడిన సామర్థ్యం ఉంటున్నట్లు పారిశ్రామిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు గల 200 విశ్వ విద్యాలయాల్లో భారతదేశానికి చెందినవి ఒక్కటి కూడా లేదు. సామాజిక ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించాలనే రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో ఆజాద్ రూపాందించి అమలు చేసిన విద్యా వ్యవస్థ మార్గదర్శక సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయించకోవలసిన బాధ్యత పౌర సమాజం స్వీకరించాలి. అప్పుడే విద్య ప్రజాస్వామికీకరించబడి అందరికీ సమానంగా అందించబడి సామాజిక న్యాయం జరిగి, సాంఘిక ఆర్థిక అసమానతలు నివారింపబడి సృజనాత్మక, జ్ఞాన, లౌకిక భారతదేశం నిర్మింపబడుతుంది.

గాంధీజీ ఆజాద్‌ని భారత ప్లాటో అని, నెహ్రూ మౌలానా మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవారు. భారత విద్యారంగానికి చేసిన విశేష సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది. అంతేకాక భారత విద్యారంగాన్ని పరిపుష్టం చేసి కొత్త పోకడలు సృష్టించి కొత్త దారులకు పరుగులు తీయించిన మహానుభావుడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటూ అతడికి విశేష రీతిలో నివాళులు అర్పించడం జరుగుతుంది. భారతీయుల సమైక్యతా సాధనంగా విద్యను వికసింపజేస్తేనే తొలి విద్యామంత్రికి నిండు నివాళి అర్పించినట్లు అవుతుంది. అందుకు అనువైన విద్యావిధానం కోసం ప్రత్యేక కృషి జరగాల్సిన అవసరం ఉన్నది.

Article about Maulana Abul Kalam Azad Life History

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుణాత్మక విద్యకు మార్గదర్శి ఆజాద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: