సమయపాలన పాటిస్తున్నారా?

  ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారిది పరిపక్వంకాని వ్యక్తిత్వంగా భావించాలి. ప్రస్తుత కాలంలో ఎవర్ని కదిలించినా వినిపించేమాట అస్సలు టైం ఉండటం లేదు… చాలా బిజీగా ఉంటున్నాం.. తినడానికే సమయం ఉండటం లేదు.. పని పని పని ఇదే మాట మంత్రంగా మార్చుకుంటున్నవారు.. అసలేంటి ఎప్పటికీ తెమలదా ఈ పని అని వినేవాళ్లకు విసుగొస్తుంది. భార్యాభర్తల్లో ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి, బిడ్డలను ప్రేమగా దగ్గరకు తీసుకుని వాళ్లతో ఓ గంట సేపు గడపడానికి, […] The post సమయపాలన పాటిస్తున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారిది పరిపక్వంకాని వ్యక్తిత్వంగా భావించాలి.

ప్రస్తుత కాలంలో ఎవర్ని కదిలించినా వినిపించేమాట అస్సలు టైం ఉండటం లేదు… చాలా బిజీగా ఉంటున్నాం.. తినడానికే సమయం ఉండటం లేదు.. పని పని పని ఇదే మాట మంత్రంగా మార్చుకుంటున్నవారు.. అసలేంటి ఎప్పటికీ తెమలదా ఈ పని అని వినేవాళ్లకు విసుగొస్తుంది. భార్యాభర్తల్లో ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి, బిడ్డలను ప్రేమగా దగ్గరకు తీసుకుని వాళ్లతో ఓ గంట సేపు గడపడానికి, ముసలి తల్లిదండ్రులను పలకరించడానికి…. కనీసం తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడానికి కూడా సమయం లేనంతగా పనిచేస్తున్నారు.

నిద్ర కూడా సరిగ్గా పోవడంలేదు. జీవనశైలి అంతా తారుమారు చేసుకుంటున్నారు. సమయపాలన పాటిస్తున్నాం అనుకుంటూనే సమయానికి చేయాల్సినవేవీ చేయట్లేదు. అర్థరాత్రుళ్లు తినడాలు, పనిచేయడాలు సాధారణమై పోయాయి. చిన్నవయసులోనే బిపి, షుగర్లు వెంటాడుతున్నాయి. వీటన్నింటికీ కారణం మళ్లీ సమయపాలన పాటించకపోవడమే. ఏ టైంలో చేయాల్సినవి ఆ టైంలో చేయాలని పెద్దలు అంటారందుకే. అన్నీ సక్రమంగా జరగాలంటే సమయపాలన చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

చాలా మంది మాకు చాలా చాలా పనులు చేయాలని ఉంది కానీ అస్సలు సమయం ఉండట్లేదు అంటుంటారు. కోటి రూపాయలు సంపాదించేవారికి, పది రూపాయలు సంపాదించేవారికి రోజుకు 24 గంటలే ఉంటాయి. దీనికి మించి ఎవరికీ ఎక్కువ సమయం ఉండదు. మరెందుకు కొందరు టైము ఉందని, కొందరు లేదని అంటారు… అంటే వారికి ఏ సమయంలో ఏది చేయాలో తెలియకపోవడమే అంటున్నారు నిపుణులు. నిద్ర లేచింది మొదలుకొని అలసత్వంతో, సోమరితనంతో, ఓ ప్రణాళిక అంటూ లేకుండా ఉంటే ఇక ఆ రోజంతా ఏపనీ సక్రమంగా చేయలేరు. అనుకున్న పనులు అసలే కావు. తెలివిగలవాళ్లు మాత్రం ముందురోజే తర్వాతి రోజుకు ఏ పనులు ఉన్నాయో చూసుకుంటారు. వాటిని ఒక క్రమంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో కూడా ఆలోచించుకుంటారు.

ప్రతిరోజు ఎవరైనా సరే చేయాల్సిన పనిని ఎంత సమయంలో పూర్తి అవుతుందో చూసుకోవాలి. ఆ టైము ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత పని మొదలెట్టాలి. మధ్యలో ఆపేసి ఇంకో పనికి వెళ్లగూడదు.
పనులు చేయడంలో క్రమపద్ధతిని పాటించాలి. ఉదాహరణకు 1,2,3,4 అనే పనులున్నాయి అనుకోండి ఒకదాని తర్వాత మరోటి చేస్తూ పోతే మిమ్మల్ని మోనోక్రానిక్‌గా పనిచేస్తున్నారు అంటారు. అట్లాకాక ఉన్న నాలుగు పనులను అవసరాన్ని బట్టి పనులు ముందు వెనుక చేస్తారు కొందరు. ఒకేసారి రెండు పనులు కూడా చేస్తుంటారు. వీళ్లని పాలీక్రానిక్ అంటారు. కానీ వీళ్లు చేసే పనిని కలగాపులగం అయ్యేట్టు చేసుకుంటారు. దానివల్ల పనిలో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి వస్తుంది. ఒక పని అతిత్వరగా ముగించాల్సి ఉంటుంది. మరో పని నిదానంగా చేయాల్సి ఉంటుంది. అందుకే ఏ పనైనా ఒక్కొక్కటిగా చేయడమే ఉత్తమమని చెబుతున్నారు నిపుణులు.

పనిని నాణ్యంగా చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అనుకొన్న పని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసుకోవాలి. అంతేకాని అవసరం ఉన్నా లేకున్నా ఎవరితోనో గంటల తరబడి మాట్లాడడం లేదా టీవీ చూస్తు కాలాన్ని గడిపేసి ఇపుడు చేయాల్సిన పనికి టైము లేదనుకోవడం తప్పు. అట్లానే పొద్దున్నే లేవడం వల్ల కూడా పనులను తొందరగా అంటే అనుకొన్న సమయంలోనే పూర్తి చేసుకోవచ్చు. పైగా కాసేపు నడక లేదా ఇష్టమైన వ్యాయామాన్ని అరగంట చేసినా పనులు చేయడానికి శరీరం పూర్తిగా సహకరిస్తుంది. అపుడు ఉత్సాహంగా పనులు పూర్తి చేయొచ్చు.

విశ్రాంతి తీసుకున్నా కూడా పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. శరీరానికి, మనసుకి తప్పకుండా కాస్తంత రిలాక్స్ కూడా కావాలి. అపుడే పని తొందరగాను, నైపుణ్యంతోను చేయగలరు. తినే ఆహారం కూడా మెదడుపై ప్రభావం చూపుతుంది. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, నట్స్ ..ఇవన్నీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు కొంతమంది పొద్దస్తమానం పనిచేస్తూనే ఉంటారు. మరికొంతమంది తమ స్మార్ట్ వర్క్‌తో అన్నీ చక్కబెట్టేస్తుంటారు. అందుకే అంటారు సమయం మన చేతిలో ఉండాలిగానీ మనం దాని చేతిలోకి వెళ్లకూడదని.

సమయాన్ని అదుపులో పెట్టుకోవాలి
ఏ పని అయినా దాన్ని చేయాల్సిన సమయంలో ఏకాగ్రతతో పూర్తిచేయడమే టైమ్ మేనేజ్‌మెంట్. అది తెలియక చాలామంది అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. కొన్ని చిట్కాలతో సమయాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు.
* మన ముందున్న పనుల్ని ఈ రోజు, ఈ వారం, ఈ నెలలో చేయాల్సిన పనులుగా విభజించు కోవాలి. ముందుగా ఇవ్వాళ్టి పనుల మీద దృష్టి పెట్టాలి. అలా ఏ రోజు పనులు ఆ రోజే అయిపోతే ఆటోమేటిగ్గా ఒత్తిడి తగ్గుతుంది. తీరిక సమయమూ మిగులుతుంది.

* అన్ని పనులూ ఒకరే చేయాలనుకోవడమూ, అందరి పనుల్నీ నెత్తినేసుకోవడమూ అలవాటైన వాళ్లు ముందుగా ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలి. పనిని పంచాలి. ఇందువల్ల పని త్వరగా అవుతుంది. ఒత్తిడికి గురవకుండా ఉంటారు.
* ధ్యానం, వ్యాయామం, ఆహారం, నిద్ర… ఈ నాలుగింటికీ తగినంత సమయం కేటాయించగలగాలి.
* ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లు మంచి ఆరోగ్యంగా ఉంటేనే ఏదన్నా సాధ్యమవుతుంది. పోషకాహారం, వ్యాయామాలతో మానసిక, శారీరక ఆరోగ్యాలు చక్కబడతాయి. పనిలో సామర్థం పెరుగుతుంది.
* ధ్యానం అలవాటు లేకపోతే సంగీతం వినడం, తోటపని, పూజ… అలా ఎవరికి ఇష్టమైన పని వారు చేసుకోవచ్చు.
* వృత్తికీ, కుటుంబానికీ, వ్యక్తిగత ఆనందానికీ.. ఇలా మీ ప్రాధాన్యతా క్రమాన్ని రాసుకోవాలి. 16 గంటల్లో దేనికెంత కేటాయించ దలచుకున్నారో నిర్ణయించుకుని ఫాలో అయిపోవాలి.

* చేతిలో స్మార్ట్‌ఫోనూ, ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కంప్యూటరూ ఒకసారి ఆన్ చేశామంటే పని కాగానే కట్టెయ్యం. ఒకదాని వెంట ఒకటి ఏవేవో బ్రౌజింగ్ చేస్తూ గంటలు గడిపేస్తాం. అందుకని వాటితో పని ప్రారంభించే ముందు అలారం పెట్టుకుని కచ్చితంగా కేటాయించుకున్న సమయంలోనే ఆ పని పూర్తిచేసి వాటిని పక్కన పెట్టేయాలి. ఈ అలవాటు చేసుకుంటే చాలా సమయం కలిసొస్తుంది.
* పనులను వాయిదా వేస్తే అప్పటికి విశ్రాంతిగా, హాయిగా అనిపిస్తుంది. కానీ దానివల్ల నష్టం ఎక్కువే. చేయాల్సిన పని పేరుకుపోతుంది. ఆ పని చేయాలికదా అనుకుంటూ ఉంటే మనసు మీద ఒత్తిడీ పెరిగిపోతుంది. దీని వల్ల చేసే పనుల్నీ సమర్ధవంతంగా చేయలేం. అందుకని వాయిదా వేసే అలవాటుని వదిలించుకోవాలి.

* ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారిది పరిపక్వంకాని వ్యక్తిత్వంగా భావించాలి.
* సమయాన్ని నిర్లక్ష్యం చేయడం సహించ రానిది. సమయపాలన పాటించి ఉన్నతస్థాయిని చేరుకున్న ఎంతో మంది వ్యక్తుల్ని సమాజంలో నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కెరీర్‌లో ఎదగాలంటే సమయపాలన ముఖ్యం. చాలామంది ఉద్యోగులు ఒకేరకమైన ఆలోచనతో ఆఫీసు కొస్తారు. ఎలాగోలా రావడం, పనిచేస్తే చెయ్యడం, లేకపోతే లేదు, తొందరగా ఇంటికెళ్ళిపోవడం ..ఇంతే అనుకుంటారు. కానీ

కొంతమంది మాత్రం తమ ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటూ పోతారు. అలాంటివారే ఉన్నత శిఖరాల్ని చేరుకుంటారు. అలాంటి ఉద్యోగుల్ని కంపెనీ యాజమాన్యం తప్పక గుర్తిస్తుంది. యాంత్రికంగా పనిచేసేవారిని కంపెనీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. మనిషి తలచుకుంటే తనకు తాను ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారు కావచ్చని బ్రూస్‌లీ కరాటే యోధుడు నిరూపించాడు. కాబట్టి చదువుకాని, ఏదైనా నైపుణ్యంకాని, శ్రమించడానికి సిద్ధంగా వుండడం కాని వుండాలి. చేసే పనిలో ఎక్కువ నైపుణ్యం సాధించాలంటే.. ఎక్కువ సమయం చేసే పనిపై పట్టుసాధించడం. సమయాన్ని మనకు ఉపయోగకరంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. చాలామంది విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, ఉద్యోగస్థులు అందరూ అనే మాట ఒకటే.. ఎన్నో నేర్చుకోవాలని వుంటుంది, ఎంతో పని చేయాలని ఉంటుంది. కానీ సమయం సరిపోవడంలేదు, సమయాన్ని సరిగ్గా మేనేజ్ చెయ్యలేక పోతున్నామని.. సమయాన్ని మేనేజ్ చెయ్యటమంటే మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం. అంటే మన ఉద్వేగాలను, ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం.

సోషల్‌మీడియాతో సమయం వృథా
ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో గడిపిన సమయం సగటున దాదాపు 60 శాతం పెరిగింది. లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2012 సంవత్సరంలో రోజుకు మనిషి సగటున 90 నిమిషాలు సెల్‌ఫోన్‌లో సోషల్ మీడియా కోసం కేటాయించేవాడు. 2019 నాటికి ఈ సమయం 143 నిమిషాలకు పెరిగింది. భారతదేశంలో ఈ టైం 148 నిమిషాలుగా ఉంది.

క్రమశిక్షణతో ఒత్తిడి దూరంఉన్న పనుల్లో ఏది అవసరమైనదీ, ఏది అనవసరమైనదీ అన్నది నిర్ణయించుకోగలగాలి. కాలాన్ని వృథా చేయాకుండా పని చేసుకునే నైపుణ్యం ఉన్నవారు ఒత్తిడి నుంచి బయట పడగలుగుతారు. టైమ్ స్ట్రెస్‌ని ఎదుర్కొనే ప్రధాన ఆయుధం క్రమశిక్షణ.
అయితే దాని కన్నా ముందు ‘సమయం’ పట్ల మనకున్నా అభిప్రాయం మారాలి. చాలామంది ‘టైమ్ ఈజ్ మనీ’ అంటారు. సమయాన్ని డబ్బుతో పోలుస్తారు.

డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు సమయాన్ని అలా సంపాదించుకోవడం అసాధ్యం. అందుకే టైమ్ డబ్బు కన్నా చాలా విలువైనదనీ, దాన్ని సంతోషంతో పోల్చుకోమనీ చెబుతున్నారు నిపుణులు. డబ్బు విషయంలో ధనికులూ పేదలూ ఎలా ఉంటారో టైమ్ విషయంలోనూ అలాగే ఉంటారనీ, అయితే డబ్బున్న వారికన్నా టైమ్ ఎక్కువ ఉన్నవారు ఎక్కువ ఆనందంగా ఉంటారనీ అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.

మిగుల్చుకునే సమయంతో ఆనందం
ప్రణాళికబద్ధంగా పనుల్ని పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోవడాన్ని ‘టైమ్ అప్లుయెన్స్’ అంటారు. చాలినంత సమయం ఉందనుకున్న ప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్పష్టంగా ఆలోచించగలుగుతుంది. మనకి కూడా గుడ్డా బట్టా నీడ లోటు లేకుండా అమరాక ఎంత డబ్బున్నా అది మానసిక తృప్తిని ఇవ్వదనీ, అదే కావాల్సినంత సమయం ఉంటే మాత్రం ఎంతో తృప్తిగా ఉంటుందంటున్నారు మనస్తత్వ పరిశోధకులు.

శక్తిని మించిన పనులు పెట్టుకుని ఎప్పుడూ బిజీగా ఉండడమే గొప్ప అనుకునే సంస్కృతికి అలవాటు పడడం వల్ల నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నామన్నది పరిశోధనల సారాంశం. కావాల్సిన సమయం ఉంటే మనసుకు నచ్చిన పని చేస్తాం. విశ్రాంతి తీసుకుంటాం. అయినవారితో గడిపి అనుబంధాలను పెంచుకుంటాం. సమయం ఇచ్చే ఆనందం డబ్బు ఇవ్వదంటారు. పైగా అలా మనకోసం మనం మిగుల్చుకునే సమయం వ్యక్తిగానూ ఉద్యోగిగానూ కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Do you follow the rule of Time?

The post సమయపాలన పాటిస్తున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.