ఆరోగ్యంతోనే అన్నీ!

  “కళ్లు తెరుస్తూనే నన్ను చూడు. నేనిచ్చేవే తిను, నిమిషం అటూ ఇటూ తేడా రానివ్వని నా క్రమ శిక్షణను చూసి అలవర్చుకో.. ప్రకృతి పాడే జోలపాటను వింటూ హాయిగా నిద్రపో… ఏ రుతువులో నీకు ఏమివ్వాలో తెలుసు నాకు… ఆ కానుకలన్నీ అంది పుచ్చుకో.. స్వచ్ఛమైన గాలి, నీరు, పండ్లు, పూవులు సర్వం నీకోసం ఉన్నాయి” అని పుడమి తల్లి అత్యంత ప్రేమతో పిలస్తూనే ఉంది. పేరుకు మనం ఈ భూమిపైనే ఉన్నాం. కానీ జీవన […] The post ఆరోగ్యంతోనే అన్నీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

“కళ్లు తెరుస్తూనే నన్ను చూడు. నేనిచ్చేవే తిను, నిమిషం అటూ ఇటూ తేడా రానివ్వని నా క్రమ శిక్షణను చూసి అలవర్చుకో.. ప్రకృతి పాడే జోలపాటను వింటూ హాయిగా నిద్రపో… ఏ రుతువులో నీకు ఏమివ్వాలో తెలుసు నాకు… ఆ కానుకలన్నీ అంది పుచ్చుకో.. స్వచ్ఛమైన గాలి, నీరు, పండ్లు, పూవులు సర్వం నీకోసం ఉన్నాయి” అని పుడమి తల్లి అత్యంత ప్రేమతో పిలస్తూనే ఉంది. పేరుకు మనం ఈ భూమిపైనే ఉన్నాం. కానీ జీవన విధానం పూర్తిగా ప్రకృతికి వ్యతిరేకం. తినే తిండి, నిద్రా అన్నీ శరీరానికి విషతుల్యమే.

ఎక్కడ సౌకర్యం దొరుకుతుందా అని ఎదురుచూస్తాం. నాకిది పడుతుందా, పడదా, ఇది తింటే ఆరోగ్యమా అనారోగ్యమా అని శరీరం చెప్పే మాట వినం. నాలుగు అడుగులు నడిస్తే అనవసరపు అలసట ఎందుకు? బైక్ స్టార్ట్ చేసో, కారులో ఎ.సి. వేసుకునో ప్రయాణం చేస్తాం. లిఫ్ట్ ఉంది కదా అని ఎక్కేస్తాం. పార్టీలు, ఫంక్షన్లు వస్తే తృప్తిగా తింటాం. అవి కరిగించే దారులు ఏనాడో మూసేశాం. శరీర కష్టం అనేది జీవనశైలి నుంచి మాయమైపోయింది. గంటలు గంటలు కడుపులో చల్ల కదలకుండా కూర్చోవటం, నిద్రపోవాల్సిన సమయాన్ని స్మార్ట్ ఫోన్‌తో గడిపేయటం… ఇంతే జీవితం.

వాడని వస్తువు ఏదయినా సరే పనిచేయటం మానేస్తుంది. శరీరానికి మాత్రం మినహాయింపు ఎందుకు ఉంటుంది. పనులేమీ లేక శరీరంలోని కండరాలు పనిచేయటం మానేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా తినటం, తినకూడనివి తినటం, తినకూడని సమయంలో తినటం, దాన్ని కరిగించుకునే మార్గం లేకపోవటం, ఇవన్నీ ఆరోగ్యంతో ఆటలాడుకోవటం మొదలుపెడతాయి. ఫలితం జీవనశైలి రుగ్మతలుగా చెప్పుకుంటున్న అనారోగ్యాలు సంప్రాప్తమవుతాయి.

మనదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 13.5 కోట్ల మందికి స్థూలకాయం, 7.2 కోట్ల మందికి మధుమేహం, 4.2 కోట్ల మందికి థైరాయిడ్ సమస్యలు, 8 కోట్ల మందికి రక్తపోటు, 5.5 కోట్ల మందికి గుండెజబ్బులు ఉన్నాయి. న్యాయంగా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చిన వైద్య సౌకర్యాల వల్ల ఇవేమీ భయపడవలసిన అనారోగ్యాలు కానేకాదు. కానీ ఇవన్నీ మనం చేజేతులా తెచ్చుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొవాలి కదా! ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ చూపెట్టాలి. భోజనం, వ్యాయామం, ఒత్తిడి, జీవనశైలి, అలవాట్లు, ఆలోచనలు అన్నీ మార్చుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్ల హెచ్చరిక కూడా ఇదే.

పూర్వం ఆహారం సంపాదించుకునే కాలంలో ఆహార సంపాదన మార్గంలో కాయకష్టం ముడిపడి ఉండేది. శరీరాన్ని కష్టపెట్టకుండా సంపాదించటం నేర్చుకున్నాక ఆ తిండితోనే ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నాం. శరీరానికి చాలినంత పని లేకపోవటమే మరణాలకు ప్రధాన కారణం అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రతి నలుగురిలోనూ ఒకరు శరీరాన్ని కదిలించరు. నూటికి ఎనభై మంది పిల్లలకు శారీరక వ్యాయామం తెలియదు. నూటికి 54 మంది ఏ విషయంలోనూ ఒళ్లు వంచరు అంటోంది భారత వైద్య పరిశోధన మండలి.

కనబడకుండా ఆరోగ్యంపైన ప్రభావం చూపించే ఇంకో శత్రువు ఒత్తిడి. ఇంట్లో బాధ్యతలు, ఆఫీసులో టార్గెట్లూ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఏవైనా కానివ్వండి వాటి ప్రభావం ఒత్తిడి రూపంలో మనసుపైన, శరీరంపైన పడుతోంది. ఒత్తిడి నిద్రలేమికి దాడి తీస్తే నిద్రలేమి స్థూలకాయానికి దారి తీస్తోంది. దీర్ఘకాలపు ఒత్తిడి అల్సర్లు, మధుమేహం, గుండె జబ్బులు, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇవన్నీ జీవనశైలికి సంబంధించిన వ్యాధులు. సాధారణంగా నిద్రలేమికి విపరీతమైన మానసిక ఒత్తిడే కారణం. నైట్‌షిఫ్ట్‌లో వ్యాయామం లేకపోవటం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌లకు, కంప్యూటర్లకు అతుక్కుపోవటం వంటి వృథా కాలక్షేపాలే నిద్రలేమికి కారణం. నిద్రలేమిని అమెరికా వంటి అగ్రరాజ్యాలు ప్రజారోగ్య సమస్యగా గుర్తించారు. ఆయువును హరింపజేసే నిద్రలేమిపై నిర్లక్షం వద్దంటూ పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి.

నిద్రలేమికి వైద్య చికిత్సలు మందులు కాకుండా అలవాట్లలో మార్పులు అవసరం అంటున్నాయి అధ్యయనాలు. టి.వి.లు లాప్ టాప్‌లు, కంప్యూటర్లు స్విచ్ ఆఫ్ చేసి, సుదీర్ఘమైన చర్చలు వాదనలు ఆపేసి, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఘర్షణలు లేని జీవితం అలవాటు చేసుకోమని సలహా ఇస్తున్నారు. వేళకు భోజనం చేసి, మంచి పుస్తకం చదువుకుంటూ, లేదా చక్కని సంగీతం వింటూ మంచి శృంగార జీవితం గడుపుతూ, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఒక ప్రశాంతమైన జీవనశైలిని పునర్మించుకోమంటున్నారు. తేలికైన మనసుతో నిద్రకు ఉపక్రమిస్తే నెమ్మదిగా శరీరం విశ్రాంతి తీసుకుంటుందని చెబుతున్నారు.

ప్రకృతి సిద్ధంగా లభించే ముడిసరుకులు వాడి తయారు చేసిన ఆహారం అద్భుత తత్వం అని తెలుసుకోండి అంటున్నారు అధ్యయనకారులు. సాత్వికమైన ఆహారాన్ని, శరీరానికి పుష్టినిచ్చే పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటం ద్వారా కడుపులో ఏర్పడే గ్యాస్, మలబద్ధకం ఇతర జీర్ణాశయ వ్యాధులు నెమ్మదిగా తగ్గిపోతాయి. ముందుగా ఆవేశం, కోపం వంటివి తగ్గించుకుంటే వాటివల్ల కడుపులో ఏర్పడే రసాలు తగ్గి ఆహారం తేలిగ్గా జీర్ణ మౌతుంది.

వైద్య విధానం ప్రకారం ముక్కుకు జలుబు చేస్తే అజీర్తి కావచ్చు, ఒళ్లునొప్పులొస్తే ఊపిరి తిత్తులు సామర్థం తగ్గి ఉండవచ్చు. ఎముకలు గుల్లబారితే సూర్యరశ్మిని విటమిన్‌డిగా మార్చలేని చర్మం నిస్సహాయుత కావచ్చు. జీవనశైలిని దారిలో పెడితే ఆయుష్షు పెరుగుతుంది అంటుందీ వైద్యం. శరీరాన్ని మొత్తం కడిగేయాలంటుందీ శాస్త్రం. ఏ వైద్యాన్ని ఏ కొత్త ఆవిష్కరణని ఫాలో అయినా ముందు మార్చుకోవలసింది మన దృక్పథాన్నే. శరీరంలో తలెత్తే ప్రతి చిన్న అసౌకర్యానికీ కారణం మన ఆలోచన ధోరణి. కోపం, ద్వేషం, ఆవేశం వంటి వ్యతిరేక భావనలే వాటిని నియంత్రించుకోగలిగితే సగం అనారోగ్యాలు మందులు అరగకుండానే పరారవుతాయి. ఇప్పటికే జీవన ప్రమాణంలో 125వ స్థానంలో ఉన్న మనం 125ఏళ్లే బతికే రోజు తప్పకుండా వస్తుందను కోవచ్చు.

మహిళల విషయంలో అయితే ఇంటి పనిలో, లక్షాల గురిలో, లక్షల సంపాదనలో తనని తాను పూర్తిగా మరచిపోతూ, రెండు చేతులతో వెయ్యి పనులు చేస్తూ నిజంగానే కొవ్వొత్తిలా కరుగుతుంది. రక్తహీనత, డిప్రెషన్, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ ఆమెకు వేగవంతమైన జీవన విధానం ఇచ్చిన అనారోగ్యాలే. ఆధునిక మహిళ మూడు ప్రపంచాల్లో బతుకుతుంది.

గడప దాటే వరకు కుటుంబం, దాటితే ఆఫీస్ కెరీర్, పోటీ, మూడోది బయట ప్రపంచంలో ఏదో రూపంలో ఎదురయ్యే వేధింపులు, లైంగిక హింస ఆమెను నిరంతరం అభద్రతకు గురి చేస్తూనే ఉన్నాయి. అనేకానేక ఒత్తిడిల వల్ల చిరునవ్వుతో నిభాయించుకుని కుటుంబాన్ని పిల్లలను చూసుకోవటం ఆమెకు తలకు మించిన బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది మహిళలు డిప్రెషన్ బారిన పడుతున్నారని అంచనా. ప్రపంచ ఆరోగ్యసంస్థ మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు ఆమెకి కావలసినది పూర్తిగా కుటుంబ సభ్యుల తోడ్పాటు, ప్రోత్సాహం, ఆసరా.

మహిళలు వాళ్లకోసం కాస్త సొంత సమయం కేటాయించుకోవాలి. మనసారా మాట్లాడుకోగల స్నేహితులను సంపాదించుకోవాలి. కుటుంబ సభ్యులకు తన గురించి తానే చెప్పుకోవాలి. వారి సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇల్లు మొత్తం తన బాధ్యతేనన్న ఆలోచన నుంచి బయటపడి, దాన్ని కుటుంబ సభ్యుల వ్యవహారంగా చూడాలి. కెరీర్ నైపుణ్యాలు మెరుగు పరుచుకోవాలి. కొత్త కోర్సులు చేయాలి. లోపలి కళలకు సాన బెట్టుకోవాలి. ముందు కడుపు నిండా తినాలి. రేపటి బాధ్యతలు తీర్చేందుకు సత్తువ సమకూర్చుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి.

కార్పొరేట్ వైద్య విధానంలో అంతులేని మార్పులు ఇప్పటికే చోటు చేసుకుంటున్నాయి. గుండె జబ్బులతో బాధపడే రోగులకు స్వాంతన కలిగించే లాఫింగ్ థెరఫీ లొచ్చాయి. ఒత్తిడి తగ్గేలా నరాలకు హాయిని కలిగించే సంగీతం వినమని డాక్టర్లు సూచిస్తున్నారు. నవ్వుతో శరీరంలో సంపూర్ణమైన మార్పులు వస్తాయంటున్నారు. పచ్చికలో ఉదయం వేళ నడవమంటున్నారు. అదీ స్నేహితులతోగానీ, జీవిత భాగస్వామితోగానీ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడవమంటున్నారు. భార్యభర్తల మధ్య సామరస్య పూరితమైన వాతావరణం ఉంటేనే ఇల్లు, కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని, వాదనలు ఎత్తి పొడుపులు తగ్గించుకుని ఇద్దరు స్నేహితుల్లాగా జీవించమంటున్నారు. ఖరీదైన మందుల కంటే ఒక్క చల్లని మాటతో దొరికే స్వాంతనతో రోగాలు మాయమైపోతాయని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

కాలుష్యంతో అతలాకుతలమై పోతున్న నగర జీవితంలో, అంతులేని పరుగు మిగిల్చిన ఒత్తిడిని తట్టుకునేందుకు కావలసింది స్నేహం, ఓర్పు, నవ్వు, ప్రేమ, అభిమానం వంటివి కానుకగా ఇచ్చే మానవ సంబంధాలేనంటున్నారు. మనిషికి ఎప్పుడూ మనిషి తోడే కావాలి. మనిషి స్పర్శే కావాలి. మనుషులే కావాలి.

All with Health!

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్యంతోనే అన్నీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: