ని(హ)త్య ధారావాహికలు

  మొన్న దసరా సెలవులకి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అన్నయ్య కొడుకు అయిదేళ్ళ వాడు.. నిద్ర లేవడంతోనే మా పాపని, బాబునీ వాళ్ళు ఊపిరాడక గోల చేస్తున్నా కూడా వదలకుండా గట్టిగా వాటేసుకుని ఓ రెండేసి నిమిషాలు అదేదో తూ.చా తప్పకుండా చేయాల్సిన యజ్ఞంలాగా కౌగిలించుకోవటం గమనించి ఆశ్చర్యపోయాను. ఆరా తీస్తే వాడు వాళ్ళమ్మా, నాన్నతో కలిసి రెగ్యులర్‌గా బిగ్‌బాస్ వాచ్ చేస్తున్నట్టూ, ఆ ప్రోగ్రామ్‌కి వాడు బిగ్ ఫ్యాన్ అనీ తెలిసింది. వాడికి ఎంతవరకు […] The post ని(హ)త్య ధారావాహికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మొన్న దసరా సెలవులకి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అన్నయ్య కొడుకు అయిదేళ్ళ వాడు.. నిద్ర లేవడంతోనే మా పాపని, బాబునీ వాళ్ళు ఊపిరాడక గోల చేస్తున్నా కూడా వదలకుండా గట్టిగా వాటేసుకుని ఓ రెండేసి నిమిషాలు అదేదో తూ.చా తప్పకుండా చేయాల్సిన యజ్ఞంలాగా కౌగిలించుకోవటం గమనించి ఆశ్చర్యపోయాను. ఆరా తీస్తే వాడు వాళ్ళమ్మా, నాన్నతో కలిసి రెగ్యులర్‌గా బిగ్‌బాస్ వాచ్ చేస్తున్నట్టూ, ఆ ప్రోగ్రామ్‌కి వాడు బిగ్ ఫ్యాన్ అనీ తెలిసింది. వాడికి ఎంతవరకు అర్ధం అయిందోగానీ నిద్ర లేవటంతోనే ఏరోజుకారోజే హౌస్‌లో అంతా ఒకర్నొకరు పాతికేళ్ల తర్వాత చూసుకున్నంత ఫీల్‌తో గాఢంగా కౌగిలిలో ఊగులాడటం అనే మేనరిజం మాత్రం వాడిని బాగా ఆకర్షించి, దాన్ని తన సైజువాళ్ళతోనైతే కంఫర్ట్ కాబట్టి యాజ్‌టీజ్ గా ఆచరిస్తున్నాడు.

మొన్న మా అపార్ట్మెంట్‌లోనయితే ఓ ఇంట్లో పనమ్మాయి వెంట ఆమె కూతురు కూడా రోజూ వచ్చి సీరియల్స్ చూస్తూ అడ్డంగా కూర్చూండి పోతుండటంతో ఇబ్బంది ఫీల్ అయి ఆ కూతుర్ని తీసుకు రావద్దు అని ఓనర్ చెప్పినందుకు ఆ పాప ఆ ఫ్లాట్ వారు నడిచే మెట్లదారిపై నూనె కుమ్మరించిందట! ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్ చెప్పగలం. ఆయా ప్రోగ్రాముల ప్రభావం పిల్లలపై ఎంతగా పడి వాళ్ళని నాశనం చేస్తోందో అనేందుకు!

ఈ మధ్య ఒకసారైతే నేను మొక్కలకు నీళ్ళు పోస్తూ, ఆర్నెల్లు అమెరికా వెళ్ళి నిన్నే వచ్చిన గిరిజగారికి రజనీగారు చెబుతున్న విషయాలు విని హడలి చచ్చానంటే నమ్మండి. ‘ఆ సునందుంది కదా…అది నీలాంబరి ఫ్యామిలీ మొత్తాన్ని చిన్న పాపతో సహా కత్తులు, బాంబులతో చంపేసిందండీ! ఇక దీపికా అగర్వాలైతే మీనాక్షీ భర్త క్రిష్ ని ఆల్రెడీ సఫా చేసేసి మీనాక్షినీ, కుటుంబ సభ్యులనీ కూడా లేపేసే ప్లాన్లో ఉంది. ఆ మరేమనుకున్నారూ..అంటూ ఆవిడ గుక్క తిప్పకుండా చెప్పుకుపోతుంటే, నేను భయంగా ఏంటండీ? ఎక్కడా ఈ ఘోరాలన్నీ జరుగుతా??! నేను వినలేదే అని అడగాను. ఆవిడ నవ్వుతూ ‘మేం డైలీ సీరియల్స్ గురించి చెప్పుకుంటున్నామండీ’ అంటూ మళ్ళీ సీరియస్‌గా సీరియల్ రీళ్ళలో పడిపోయింది.

వీళ్ళ ఇంట్రెస్ట్ తగలేయ. ఇంతకు ముందు మా పనమ్మాయీ ఇలాగే …ఓరోజు మా అత్తయ్యతో …ఏదో వెనకింట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో చావులు గురించీ, తగువుల గురించీ మాట్లాడుకుంటున్నట్టూ సీరియల్ సంగతులు ముచ్చట్లు పెట్టారు.
వాటి తాలూకు యాడ్స్ చూస్తేనే ఏదో కంగారు నాకు.. నిద్ర మంచం కూడా అరచేతి మందానున్న మేకప్‌తో, అతికించిన అందంతో, పెళ్ళికి రెడీ అన్నట్టున్న చీరలూ, నగలతో, మొబైల్ నగలకొట్టు నడిచొస్తున్నట్టూ దిగుతూ.. అత్తా, కోడలూ ఒకే రకంగా గంప బోర్లించినట్టున్న హెయిర్ స్టైల్స్‌తో నొసలు విరుస్తూ, కుయుక్తులతో, వంచన నిండిన కళ్ళతో నిరంతరం నెగెటివ్ ఏటిట్యూడ్‌తో, ఎత్తులతో …ఓహ్…నావల్లకాదు. అందుకే పక్కవాళ్ళనుంచి చిన్న ఇన్ఫో కలెక్ట్ చేసాను.

దాని ప్రకారం….
అగ్నిసాక్షిలో….. గౌరీశంకర్ పిన్ని భైరవి, ఆస్తి కోసం అతన్ని చంపేసిందట.!
ఒదినమ్మలో….. శైలు పెళ్ళాడిన లక్ష్మణ్ నీ, అతని ఫ్యామిలీని కూడా చంపేసి శైలుని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడుట శైలు తండ్రి.
కార్తీకదీపం లో…. ఇద్దరు పిల్లల తల్లైన దీప కేరక్టర్ మంచిది కాదనీ ఆమె డాక్టర్ భర్తని నమ్మించి, ఆమె నుంచి విడదీసి అతడిని పెళ్ళాడాలని ఓ లేడీ డాక్టర్ విశ్వ ప్రయత్నం..
ఇంకా కడుపులో పిండాలను కూడా చంపే ప్లేన్లూ….పసోళ్ళతో ముదురు మరియు కుళ్ళు, కుతంత్రపు హావభావాలతో డైలాగులు చెప్పించడం ..చెప్పుకుంటే ఎన్నో…. ఈ డైలీ డానుల గురించి.
ఈ సీరియల్స్ లో మగ విలన్స్‌కి విశ్రాంతి..పాపం విలనీ బాధ్యత అంతా మహిళలే మోయటం, పూలవంటి సున్నితమైన వారిగా కీర్తించబడిన స్త్రీలు పదారణాల మేకప్పూ, తలనిండా మల్లెచెండ్లతో సాంప్రదాయ వేషధారణలో కనపడుతూ అందుకు విరుద్ధంగా కళ్ళూ, నోర్లూ వంకర్లు తిప్పుతూ చేసే గూండాగిరీ ఎబ్బెట్టులకే బొబ్బట్టు తినిపించేటట్టుగా ఉంటుంది.
ఏదో సినిమాలో అన్నట్లు సభ్య సమాజానికి వీళ్ళు ఏం మెసేజిస్తున్నట్టూ!!?
మహిళలు అంతరిక్షంలో విహంగాలై దూసుకెళుతున్న సమయంలో, ఇళ్ళకే పరిమితమై , ఏ పనీ లేకుండా కేవలం పక్క మనిషి… ఎక్కువగా సాటి స్త్రీనే నాశనం చేయ ప్రయత్నిస్తూండే పాత్రల్లో మాత్రమే స్త్రీలను చూపించటం ఎంతవరకూ సమంజసం??!

ఇంత సాడిజంను ఎందుకు భరిస్తున్నారూ అంటే…పనుల నుండి రిలీఫ్ కోసం చూస్తూన్నారు అంతే అంటారు..అలసిన వారికి రిలీఫ్ కామెడీ సీరియల్లోనో …కాస్త పాజిటివ్ సీరియల్లోనో దొరుకుతుంది గానీ శారీరకంగా అలిసున్నవాళ్ళకి ఇక మానసికంగా కూడా తెలీని స్ట్రెయిన్ ఇస్తాయి ఇవి. మహిళామణులు ఈ టీ.వీ. రంగంలో, సీరియల్స్ నిర్మాణంలో పైచేయిగా ఉన్నారని ఆనందించాల్సినదే. ఖచ్చితంగా అభినందించాల్సిందే! కానీ మనుషుల్లో మానవతే లేదన్నట్టూ, కుట్రలే జీవితం, జెలసీలే జీవాధారం అన్నట్టూ చూపటం ఆరోగ్యకర వినోదం కాదు.ప్రేక్షకులు ఆదరిస్తారని తీస్తున్నాం అంటారు..
అయితే వారు పొద్దున్నుంచి సాయంత్రం వరకూ ఇలాంటి మూస సీరియల్స్ ‘మాత్రమే’ ఆదరిస్తామని చెప్పినట్లు ఏం దాఖలాలున్నాయి?! మహాభారత్‌నీ, మాల్గుడీడేస్‌నీ, పసలపూడి కథల్నీ, ఝాన్సీ లక్ష్మీనీ, అమృతం సీరియల్‌నీ ఎంత ఆదరించారో మర్చిపోతే ఎలా? డి.డి.లో ప్రసారమైన ‘స్టార్ ట్రెక్’ సాహసోపేత సీరియల్ ని మా రోజుల్లో గొప్పగా చూసేవాళ్ళం.. టెక్నాలజీపై ఎందరికో ఆశక్తి రేపిందది.
సీరియల్ నిర్మాణం చాలా పెద్ద వ్యవస్థ అయింది. అది మెజార్టీ మహిళలని తన ముందు కట్టిపడేయగలుగుతోంది. దానికి కొంచెమైనా సామాజిక బాధ్యత ఉంటే… ఇలాంటివి చేయెచ్చు.

రైతుల కథలూ, కల్పనా చావ్లా జీవితం, ఎందరో వికలాంగులు అథ్లెటిక్స్‌లో తమ సత్తా చాటటం వంటి కథలు పిల్లలకు స్ఫూర్తి నిస్తే, మహిళ అయితే చాలు పెద్ద సబ్సిడీతో లోనులిచ్చే ‘ముద్ర’లాంటి ఎన్నో ప్రభుత్వ లోనుల గురించి కథలో చొప్పించి చూపితే, వేలిముద్ర చాలు వ్యాపారవేత్తవు కావచ్చును అనే నమ్మకం కలిగిస్తూ, కాస్త తమ గురించి పనిచేసే సంస్థలు గురించి తెలిసేలా, వారి బుర్ర పెరిగేలా తీయగలిగితే, తాము ఎదగాలనున్నా ఎలా ఎదగాలో తెలీని ఎందరో మహిళలను ఈ ‘ధారావాహికలు’..ధీరోదాత్తలుగా మారుస్తాయి. అందుకు సామాజిక బాధ్యతగల కొత్త నిర్మాతలూ, డైరెక్టర్లూ కావాలి.
కొంత కాలానికి విలువలు పడిపోవటం, కుటుంబ సభ్యులని లేపేయటం, కుట్రతోనే జీవించటం వంటివి అతి సహజమైన జీవన విధానాలన్నట్టూ సమాజం తయారవక ముందే, మెసేజ్ వెళ్ళక ముందే స్తబ్దత వీడడం చాలా అవసరం.

Public Adult TV shows

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ని(హ)త్య ధారావాహికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: