నల్లమలపై రెండు పుస్తకాలు

“నల్లమలను రక్షించుకుందాం’ అని కోటి గొంతుకలు నినదిస్తున్నవేళ ఇది. తెలుగు రాష్ట్రాలు కలిసే చోట నొసట పచ్చని కుంకు మ బొట్టులా మెరిసే నల్లమల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యురేనియం తవ్వకాల నిర్ణయంతో పొక్కిలికానుంది. అడవి గర్భం లో ఉన్న విలువైన ఖనిజం కోసం వెల కట్టలేని ప్రకృతినే పణంగా పెట్టదలిచింది ఢిల్లీ సర్కార్. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ ప్రేమికులు, స్థానిక బాధితులు కలగలిసి ప్రకటిస్తున్న ఆగ్రహానికి, ఆందోళనకు కేంద్రం ఏ మేరకు మేలుకొంటుందో, […] The post నల్లమలపై రెండు పుస్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

“నల్లమలను రక్షించుకుందాం’ అని కోటి గొంతుకలు నినదిస్తున్నవేళ ఇది. తెలుగు రాష్ట్రాలు కలిసే చోట నొసట పచ్చని కుంకు మ బొట్టులా మెరిసే నల్లమల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యురేనియం తవ్వకాల నిర్ణయంతో పొక్కిలికానుంది. అడవి గర్భం లో ఉన్న విలువైన ఖనిజం కోసం వెల కట్టలేని ప్రకృతినే పణంగా పెట్టదలిచింది ఢిల్లీ సర్కార్. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ ప్రేమికులు, స్థానిక బాధితులు కలగలిసి ప్రకటిస్తున్న ఆగ్రహానికి, ఆందోళనకు కేంద్రం ఏ మేరకు మేలుకొంటుందో, అడవి బిడ్డల మేలుకోరుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే.
ధ్వంసమవుతున్న ప్రకృతిలో మిగిలిన పచ్చని తివాసి లాంటి నల్లమల అడవి ప్రధానంగా ఆదివాసీ చెంచుల జీవనక్షేత్రం. వందలాది చెంచుపెంటలలో ఆ అడవిబిడ్డలు శతాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు.
నల్లమలను కాపాడుకునేందుకు అన్ని వర్గాలకు చెందిన వారు వివిధ వేదికల ద్వారా ముందుకు రావడంతో సాధారణంగా నల్లమల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలగటం సహజమే. పర్యాటకులు అమ్రాబాద్ చెక్‌పోస్ట్ నుండి అటవీ శాఖ వాహనాల్లో అడవి అందాలు చూసిరావొచ్చు కాని చెంచుపెంటలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి కావాలి. తొలిచూపులోనే ‘నాగరికులను’ కలిసేందుకు, మాట కలిపేందుకు చెంచులు ముందుకురారు. అయితే ఈ ప్రతిబంధకాలను దాటి నల్లమల నైసర్గిక స్వరూపాన్ని, చెంచుల జీవన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలిపే పుస్తకాలు తెలుగులో వచ్చాయి. వాటి వల్ల పాఠకులకు నల్లమల గురించి తెలుసుకునే అవకాశం మరింత లభిస్తోంది.
పి. చంద్ రాసిన నవల పేరే ‘నల్లమల’ విప్లవోద్యమ నేపథ్యంలో రాసిన ఈ నవల చదువుతుంటే నల్లమల అటవీ ప్రాంతంలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. నల్లమల చుట్టూ ఉన్న మైదాన ప్రాంతంలో ఎగసిన మావోయిస్టుల పోరాటాన్ని గ్రంథస్తం చేసే విధంగా ఈ రచన సాగుతుంది. ఈ నవల ఉద్దేశం కూడా అదే. అయితే చిక్కని అరణ్యమైన నల్లమల అడుగడుగునూ అవిష్కరిస్తుంది. కథానాయకుడు మాధవ్ అడవిలో ప్రవేశించిన కాన్నుంచి ఆయన పోలీసు తూటాలకు బలి అయ్యేదాకా కథ సుమారు మూడువందల పేజీలు నడుస్తుంది.
దళాల సంచారం, ఆశ్రయం, కొత్త సభ్యుల చేరిక, స్థానికుల తోడ్పాటు, రాత్రి పగలు వంటలు, టెంట్లలో నివాసం అంతా అడవి నడుమనే జరుగుతుంది. స్థానిక దళ సభ్యులకు అడవిపైనున్న పట్టు, అవగాహన రూపంలో రచయిత చంద్ ప్రతి సందర్భంలో అడవి నైసర్గికతను కథతో పాటు సమాంతరంగా నడిపించాడు. నల్లమలలో ఉన్న వృక్షజాతులు, పక్షులరకాలు, వన్యప్రాణులు, వాగులు, వంకలు, కొండల ఎత్తులు, లోయల లోతులు, రాళ్లు రప్పలు ఇలా ప్రతి చిత్రాన్ని ఈ నవలలో దర్శించవచ్చు. చెట్టుకు ఆ పేరెందుకు వచ్చింది, దాని వల్ల ప్రయోజనమేమిటి, అది పళ్లు ఎప్పుడు కాస్తుంది, ఆ పళ్లరుచి ఎలా ఉంటుంది, అదేవిధంగా వినబడే అరుపుతో పక్షిని పసిగట్టడం, దాని అరుపుకు అర్థమేమిటి, ఏ కొండ ఎంత ఎత్తుంటుంది, ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది, దిగాక ఎదురయ్యే మైదాన ప్రాంతమేమిటి, ఏ ప్రాంతం వంటకు, రాత్రి ఆవాసానికి అనువైనది ఇలా క్షుణ్ణంగా అడవి సజీవ దృశ్యంగా మనముందు నిలుస్తుంది.
ఒక వైపు దళాల ఎత్తుగడలు, ఎదురుదెబ్బల పోరాటక్రమం, మరోవైపు విశాలమైన నల్లమల అటవీ పరిసరాల పరిచయం పెనవేసుకొని ఈ నవల సాగుతుంది.
నల్లమల సజీవ చిత్రవోణే ఈ నవలకు జీవాన్నించింది అనవచ్చు. అడవి నేపథ్యంగా సాగే కథకు తగిన సమాచార సేకరణే క్లిష్టమైన పని. దీని కోసం రచయిత చంద్ ఎంతకాలం వెచ్చించాడో, ఏ మార్గం ఎంచుకున్నాడోగాని ఓ కఠినమైన కార్యాన్ని నెత్తినెత్తుకున్నాడు. అడవిలో అడుగు పెట్టనిదే కథాంశానికి తగిన న్యాయం చేయలేరనిపిస్తుంది. అటవీ వివరణ, వర్ణనకు తగిన ప్రాధాన్యతనిచ్చి నవలకు నల్లమల పేరును సార్థకం చేశాడు.
నల్లమలపై వచ్చిన మరో మంచి పుస్తకం ‘మరణం అంచున’ పాత్రికేయుడు వర్దెల్లి వెంకటేశ్వర్లు రాసిన వ్యాసాల సంపుటి ఇది. చెంచుల జీవన పరిస్థితులకు అద్దం పట్టే స్థాయిలో ఈ రచనలున్నాయి. ప్రకృతిలో భాగమై బ్రతుకుతున్న చెంచులను ఉద్ధరించే పేరుతో వారి జీవన విధానంలో పొసగని శైలిని బలవంతంగా రుద్ది ఆ జాతికే చరమగీతం పాడుతున్న ప్రభుత్వాల దుర్నీతిని రచయిత వేదనాభరితంగా ఎండకట్టాడు. వ్యాస సంపుటికి ‘మరణం అంచున’ అని నామకరణం చేశాడంటే నల్లమలలో చెంచుల పరిస్థితిని ఊహించవచ్చు. అడవి గాలి, చెట్టు నీడ, కాయాపండూ ఆదివాసీలకు సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తినిస్తుంది. బలవంతంగా మైదాన ప్రాంతానికి వారిని తేవడంతో ఆహార విధానం సరిపడక చెంచులు పిట్టల్లా రాలిపోయారు. పులుల సరంక్షణ పేరిట అటవీశాఖ వారిపై విరుచుకుపడుతోంది. వజ్రాల వేట కోసం దక్షిణాఫ్రికాకు చెందిన ది చీర్స్ సంస్థకు అనుమతి పొందింది. దాని ప్రకారం కర్నూలు జిల్లా పరిధిలోని 59 గ్రామాలు, మహబూబ్‌నగర్ ప్రాంతంలోని 139 చెంచుపెంటలు ఖాళీ కావాలి. అయితే, యురేనియం తవ్వకాలను వ్యతిరేకించినట్లే ఓ ఉద్యమం వెల్లువెత్తినందున వజ్రాల వేటకు తెరపడింది. గిరిజనుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులున్నా అనారోగ్య కారణంగా చెంచుల ఆయు ప్రమాణం యాభై ఏళ్లు కూడా దాటడం లేదని, ఓ పెంటలో చూసినా భార్యను కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యలు, బిడ్డల్ని పోగొట్టుకున్న దంపతులు అంతా నడీడు వాళ్లేనని రచయిత పేర్కొన్న విధానం నాగరికతను ప్రశ్నిస్తుంది.
నల్లమలలో గిరిజానభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు తప్పుడు నివేదికల ద్వారా లోకాన్ని మభ్యపెడుతున్నాయని రచయిత వివరాల పట్టికలను ఇందులో పొందుపరిచారు. చెంచుల మూలాలు నల్లమలతో సుమా రు రెండువేల ఏళ్ల క్రితం నుండి ఉన్నాయి. వారికి దేశం, రాష్ట్రం, పాలన, పార్టీలు ఏవీ తెలియవు. తాము ఫలానా దేశ పౌరులమనే కనీస విషయానికి కూడా వారు దూరంగా ఉన్నారు. బలవంతంగా వారిని మైదాన ప్రాంతాలకు తరలిస్తే వారికి ఏ పనిచేసి బతకాలో, మనుషులతో ఎలా మెలగాలో తెలియదని వారితో కొంతకాలం గడిపిన ఈ రచయిత అభిప్రాయపడుతున్నారు. కాల్పనిక సాహిత్యపు డెంపు సొంపులు లేని, నుడికారపు విన్యాసాలు, యతిప్రాసలు లేని ఆత్మతో రాసిన నిఖార్సయిన సమాచారం ఇది. కోట్లాది రూపాయల కేటాయింపులు జరిగినా ఆదివాసీ బిడ్డల అభివృద్ధి గుడిసె దాటలేదు. ఏ పెంను కదిపినా కన్నీటి వ్యథలే. ఏ చెంచు గుడిసె చూసినా చావు కథలే. ఈ మరణాలను వెలికితీసి, బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమే తన ‘మరణం అంచున’ అని రచయిత పుస్తకాన్ని ముగించారు. వడ్డెల్లి వెంకటేశ్వర్లు చిత్తశుద్ధితో చేసిన ఈ రచన ద్వారా తన గుండె బరువును కొంత దింపుకున్నా. మనసున్న మనుషుల్ని ఆలోచనల అంచునకు తీసుకుపోయే సమాచారం ఇందులో ఉంది.
ఇప్పుడు నల్లమల మందికళ్లబడ్డ బిడ్డ. దాని గొంతు పిసికేందుకు బలమైన చేతులు ముందుకొస్తున్నాయి. వాటి శక్తిని ఎదుర్కొనేందుకు ప్రజాబలం సమీకరించాలి. నల్లమల అవసరాన్ని ప్రత్యేకతని, ప్రాధాన్యతను తెలియజేసే రచనలు రావాలి. ఇదివరకే వచ్చిన రచనలు జన సమీకరణకు తోడవ్వాలి. ఇప్పటికే వచ్చిన పుస్తకాల పరిచయం ఆవశ్యం. నల్లమల గురించి తెలుసుకుంటేనే నల్లమల్లను రక్షించేశక్తి అజేయమవుతుంది.

Save Nallamala Forest from Uranium Mining

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నల్లమలపై రెండు పుస్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.