చేపలతో గుండె పదిలం!

  వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో చేపలు భేష్. చేపల్లో ప్రోటీన్లు, విటమిన్-డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలతోపాటు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల వంటి ముఖ్యమైన పోషక పదార్ధాలను కలిగి ఉన్న వాటిలో చేపలు కూడా ఒకటి. సాల్మన్ , కొర్రమట్టలు, బొచ్చెలు, పులస… ఇలాంటి రకాలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు డైట్‌లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. 1. మెదడు […] The post చేపలతో గుండె పదిలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో చేపలు భేష్. చేపల్లో ప్రోటీన్లు, విటమిన్-డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలతోపాటు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల వంటి ముఖ్యమైన పోషక పదార్ధాలను కలిగి ఉన్న వాటిలో చేపలు కూడా ఒకటి. సాల్మన్ , కొర్రమట్టలు, బొచ్చెలు, పులస… ఇలాంటి రకాలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు డైట్‌లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

1. మెదడు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలతో నిండిన శక్తిని అందిస్తాయి.
2. కుంగుబాటు లక్షణాలను అరికడుతుంది. చేప నూనె డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
3. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను పోగొడుతుంది. చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
4. నిద్రపట్టక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటే చేపలను తింటే సరి.
5. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
6. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి గాని అయితే, మీరు రోజువారీ చేపలను తినడమే మంచి మార్గ మంటున్నారు వైద్యులు.
7. శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

 

మసాలా ఫ్రైడ్ ఫిష్
కావలసినవి: చేపముక్కలు: అరకిలో, పసుపు: కొద్దిగా, నిమ్మరసం: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ధనియాలు: 2 టీస్పూన్లు, లవంగాలు: నాలుగు, ఎండుమిర్చి: నాలుగు, అల్లం : రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, చింతపండు గుజ్జు: టీస్పూను, బొంబాయి రవ్వ లేదా బ్రెడ్‌పొడి: అరకప్పు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ: ముల్లు లేని చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, నిమ్మరసం పట్టించాలి. జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేయించి తీయాలి. మిక్సీలో ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, వేయించిన మసాలా దినుసులు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు దీన్ని చేపముక్కలకు పట్టించి పావుగంట సేపు నాననివ్వాలి. ఈ ముక్కల్ని బొంబాయి రవ్వ లేదా బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. బాణలిలో నూనె కాగాక చేపముక్కలను వేసి వేయించి తీయాలి. చాలా రుచిగా ఉంటుంది.

 

చేపల వేపుడు

కావలసినవి: చేపముక్కలు: అరకిలో, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి: అర టీస్పూను, కారం: టీస్పూను, పసుపు: అరటీస్పూను, నిమ్మరసం: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా, మసాలా కోసం: కారం: అరటీస్పూను, పసుపు: పావుటీస్పూను, బియ్యంపిండి: 2 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ : 2 టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి: టీస్పూను, జీలకర్ర పొడి: టీస్పూను, నిమ్మరసం: టీస్పూను.
తయారు చేసే విధానం: ముందుగా మసాలా కోసం తీసుకున్నవన్నీ బాగా కలిపి ముక్కలకు పట్టించి ఓ గంటసేపు ఉంచాలి. తరవాత బాణలిలో నూనె వేసి ముక్కలు వేయించి తీయాలి. ఇప్పుడు ఎక్కువగా ఉన్న నూనె అంతా వంపేసి ఓ రెండు టీస్పూన్లు ఉంచి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
తరవాత ధనియాల పొడి, కారం, పసుపు వేసి బాగా కలిపి చేపముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించి చివరగా నిమ్మరసం చల్లి అందించాలి.

సాల్మన్ ఇగురు

కావసినవి: చేప ముక్కలు: అరకిలో, ఉల్లిపాయలు: నాలుగు, పచ్చిమిర్చి: ఆరు, కారం: 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి: టీస్పూను, ధనియాలపొడి: టీస్పూను, పసుపు: టీస్పూను, టొమాటో: రెండు, అల్లం వెల్లుల్లి: టేబుల్ స్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్ స్పూన్లు, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం: ముందుగా చేప ముక్కల్ని కడిగి వాటికి అర టీస్పూను చొప్పున పసుపు, ఉప్పు, కారం పట్టించి అరగంట సేపు నాననివ్వాలి. తరవాత కాగిన నూనెలో ముక్కల్ని వేయించి తీయాలి.
అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, జీలకర్రపొడి, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తరవాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చే వరకూ ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరగించాలి. వేయించిన చేప ముక్కలు వేసి సుమారు పది నిమిషాల పాటు దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే ఇగురు సిద్ధం.

కొబ్బరి కూర
కావల్సినవి: చేపముక్కలు: అరకిలో, టొమాటోలు: రెండు, ఉల్లిపాయలు: నాలుగు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, మంచి నీళ్లు: కప్పు, చింతపండు గుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు: కప్పు, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, కొబ్బరి తురుము: 2 కప్పులు, జీలకర్ర: 2 టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, మెంతులు: చిటికెడు, ధనియాలు: 3టీస్పూన్లు, మిరియాలు: టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు కరివేపాకు: నాలుగు రెబ్బలు.
తయారు చేసే విధానం: బాణలిలో మెంతులు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి తీయాలి. తరవాత టీస్పూను నూనె వేసి కాగాక సగం ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లి, కొబ్బరి తురుము కూడా వేసి ఓ నిమిషం వేగనిచ్చి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటికీ తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి. మసాలా దినుసులు వేయించిన బాణలిలోనే మిగిలిన నూనె వేసి కాగాక మిగిలిన ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి వేగాక, రుబ్బిన మసాలా వేసి నూనె బయటకు వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసి పది నిమిషాల పాటు ముక్కలను వేగనివ్వాలి. తరవాత చింతపండు గుజ్జు, ఉప్పు, కొబ్బరిపాలు పోసి బాగా కలిపి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించేముందు కొత్తిమీర చల్లాలి.

Fish Curry Preparation In Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చేపలతో గుండె పదిలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: