బహుజన రాజ్య స్థాపనే కామ్రేడ్ ఓంకార్‌కు నివాళి

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అమరులై 2019 అక్టోబర్ 17 నాటికి పదకొండు సంవత్సరాలు కావస్తుంది. 1924 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంత లక్ష్మి దంపతులకు జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులోనే నిజాం నవాబ్ పాలన నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభలో వాలెంటర్‌గా చేరి ఆ తరువాత భూమి, భుక్తి, […] The post బహుజన రాజ్య స్థాపనే కామ్రేడ్ ఓంకార్‌కు నివాళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అమరులై 2019 అక్టోబర్ 17 నాటికి పదకొండు సంవత్సరాలు కావస్తుంది. 1924 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంత లక్ష్మి దంపతులకు జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులోనే నిజాం నవాబ్ పాలన నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభలో వాలెంటర్‌గా చేరి ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ అందుకొని సాయుధ పోరాటం చేశారు. ప్రజలకు పోరాట చైతన్యాన్ని నూరిపోసి పోరాటంలో భాగస్వాములను చేశారు.

సాయుధ పోరాటం నాటి నుండి తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం అణగారిన వర్గాల చెంతనే ఉండి భారతదేశంలోని వర్గ వ్యవస్థను అంచనా వేసి వాటి పరిష్కారానికి మార్క్సిస్టు దృక్పథంతో ఒక కమ్యూనిస్టుగా తన ఆలోచనను ప్రజల ముందుంచారు. వర్గవ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ అని, కుల పోరాటాలను వర్గ పోరాటాలలో భాగంగా చూడాలని సామాజిక శక్తులు, శ్రామిక శక్తులు ఐక్యంగా పోరాడితేనే సామాజిక న్యాయం సాధించవచ్చునని అన్నారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బహుజన ప్రజల ప్రాతినిధ్యంతో అధికారంలోకి వస్తే ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాలలో సమూల మార్పులతో జనాభా నిష్పత్తి ప్రకారం సమాన అవకాశాలు కల్పించి, అసమానతలను రూపుమాపే ఒక నూతన భారత సమాజాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. ‘సామాజిక న్యాయం’ అనే ఈ సమస్య ముఖ్యంగా ఆర్ధిక న్యాయం, రాజకీయ న్యాయం కావాలంటూ జరిపే ఈ ఉద్యమాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి మాత్రమే కాకుండా ఆర్ధికంగా వెనుకబబడిన తరగతుల (అగ్రవర్ణాలలోని పేదలు) వారిని కలుపుకురావాలని, మతం రీత్యా ముస్లిం, మైనార్టీలలో సహా వివక్షకు గురవుతున్న వారికి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం అవసరమైనదని ఓంకార్ అంచనా.

తరతరాలుగా భారతదేశ నిర్దిష్ట పరిస్థితులలో కుల వ్యవస్థ క్రమంగా బలపడుతూ వచ్చిందని, స్వాతంత్య్ర అనంతరం కూడా రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలను మరింత శాసించాయని అన్నారు. ఎక్కువ మంది ఉన్న బహుజనులు పిడికెడు అగ్రకులాల ఆధిపత్యానికి, అణచివేతకు గురవుతున్న వారికి సాంఘిక, అసమానతలను తొలగించి ఆర్ధిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని సాధించబడాలన్నారు. అగ్రవర్ణాలలోని పేదవారికి సమ న్యాయాన్ని సాధించే విధంగా ఉండాలన్నారు. భారత రిపబ్లిక్ రాజ్యాంగ చట్టంలో అణచబడిన కులాలకు రక్షణ, వెసులుబాటు, మార్గదర్శకాలు చూపబడినప్పటికి హక్కులను పొందలేకపోతున్నారు.

ఎస్‌సి, ఎస్‌టిలకు కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్స్ కల్పించినప్పటికి సక్రమంగా అమలుకు నోచుకోలేకపోతున్నాయి.స్వాతంత్య్రం వచ్చి అనేక దశాబ్దాలు గడుస్తున్నా రాయితీలు మాకు, రాజ్యాధికారం మీకా? పరికరాలు మాకు పదవులు మీకా? ఓట్లు మావి, సీట్లు మీవా? విద్య, ఉద్యోగం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదు అంటూ, జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేసి జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బహు జనులైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు అన్ని రంగాలలో సమన్యాయం సాధించాలని పిలుపునిచ్చి, వారందరినీ ఒక తాటిపైకి తెచ్చిన ఘనత కా॥ ఓంకార్‌ది. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి ఐదుసార్లు శాసనసభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న సమయంలో కూడా సామాజిక, ఆర్ధిక సమానత్వం కోసం చట్ట సభలో తన గళాన్ని వినిపించారు.

ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం దాని మిత్రపక్షాలు దేశ ప్రజలపై విషపూరితమైన మత ఉన్మాదంతో ఒకవైపు, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ ప్రజలపై వివిధ రూపాలలో దాడులకు పూనుకుంది. జనాభాలో 93% ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ ప్రజలు రాజకీయ, సామాజిక, ఆర్ధికంగా అభివృద్ధి చెందకపోవడానికి అనేక రకాలుగా అడ్డగింతలు పెడుతున్నాయి. బహుజన ప్రజలకు రాజ్యాధికారాన్ని చేజిక్కనియ్యకుండా తమ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. భారతదేశంలో తరతరాలుగా మహా వృక్షానికి వేరులా పాకి ఉన్న కుల వ్యవస్థను ధ్వంసం చేయనిదే సోషలిజం సాధింపబడదని ఇందుకు వామపక్ష, కమ్యూనిస్టులు ముందుగా కుల వ్యవస్థ నిర్మూలనకు నడుం కట్టవలసిఉందని గ్రహించిన ఓంకార్ ఇందుకు 1986లోనే పూనుకున్నారు. ప్రస్తుత వ్యవస్థలో కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలు వాటిని అనుసరించే నాయకులు, కార్యకర్తలు ఈ ఆలోచనకు భిన్నంగా లేరన్నది నిజం.

సామాజిక న్యాయదిశగా, బహుజనులకే రాజ్యాధికారం కావాలని, 1999లోనే ఎంసిపిఐ(యు) ముందుకు వచ్చింది. అనేక అనుభవాల తరువాత 2018లో సామాజిక న్యాయం పేరుతో సిపిఎం ముందుకు వచ్చింది. ఈ రెండు కలిసి ఇతర వామపక్షాలను ఫ్రంట్‌లో చేర్చే దశలో సిపిఎం వెనుకడుగు వేసింది. ఆ కర్తవ్యాన్ని ఎంసిపిఐ(యు) తన భుజస్కంధాలపై వేసుకొని సామాజిక పార్టీలను, శక్తులను సమీకరించి బిఎల్‌ఎఫ్ ద్వారా బహుజన రాజ్యస్థాపనకై ముందుకు సాగుతుంది.

93% గా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం రానిదే ఆర్ధిక దోపిడీ, రాజకీయ అవకాశవాద, సామాజిక అణచివేత మరింత జటిలం అవుతుందన్నారు ఓంకార్. అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 11వ వర్ధంతి సందర్భంగా 2019 అక్టోబర్ 17 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో ‘బహుజనులకు రాజ్యాధికారం బిఎల్‌ఎఫ్ యే ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సభలకు, సదస్సులు జరుగుతున్నాయి. బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే కా॥ ఓంకార్ గారికి అర్పించే నిజమైన నివాళి.

Tribute to Maddikayala omkar

వనం సుధాకర్, 9989220533

The post బహుజన రాజ్య స్థాపనే కామ్రేడ్ ఓంకార్‌కు నివాళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.