ఆర్థిక సంక్షోభం-ఆకలి

భారత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతున్నది, కాలయాపన చేయకుండా ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గాలు వెతకండి, వ్యవస్థలోకి భారీగా నిధులు గుప్పించండి, ముఖ్యంగా పేద ప్రజల చేతిలో డబ్బు ఆడేటట్టు చూడండి ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించిన ప్రవాస భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీ నేరుగా భారత ప్రభుత్వానికి ఈ సూచన చేశారు. సోమవారం నాడు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీడియా గోష్ఠిలో మాట్లాడుతూ వ్యక్తం చేసిన ఈ ఆందోళన మన […] The post ఆర్థిక సంక్షోభం-ఆకలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతున్నది, కాలయాపన చేయకుండా ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గాలు వెతకండి, వ్యవస్థలోకి భారీగా నిధులు గుప్పించండి, ముఖ్యంగా పేద ప్రజల చేతిలో డబ్బు ఆడేటట్టు చూడండి ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించిన ప్రవాస భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీ నేరుగా భారత ప్రభుత్వానికి ఈ సూచన చేశారు. సోమవారం నాడు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీడియా గోష్ఠిలో మాట్లాడుతూ వ్యక్తం చేసిన ఈ ఆందోళన మన ఆర్థిక వ్యవస్థ అథఃపతనం గురించి వెలువడుతున్న అనేక ప్రమాదకర సంకేతాలకు పరాకాష్ట అనవచ్చు. దేశం ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రధాన కారణం ప్రధాని మోడీ గత ప్రభుత్వం అమలు పరచిన పెద్దనోట్ల రద్దేనని కూడా అభిజిత్ బెనర్జీ ఇటీవల ఎత్తి చూపారు. ఈ రద్దు వల్ల నగదు సంక్షోభం ఏర్పడి ఆర్థిక లావాదేవీలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని 85 శాతం, అంతకు మించి భారతీయ కార్మికులకు ఉపాధి ఆధారమైన అవ్యవస్థీకృత రంగం తీవ్రంగా దెబ్బ తిన్నదని కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.

ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలపై తల ఎత్తిన వివాదంలో ప్రభుత్వం తనకు అనుకూలంగా లేని లెక్కలను తప్పని కొట్టి పారేస్తున్నదని అభిజిత్ సోమవారం నాడు చెప్పినది కఠోర వాస్తవాలు చూడడానికి ఇష్టపడని ప్రధాని మోడీ సర్కారు కపటాన్ని ఎండగట్టింది. అవును, అభిజిత్ ఒక్కడే కాదు అనేక మంది నిపుణుల అంచనాల్లో, పలు పరిశీలనల్లో దేశ ఆర్థిక రంగం కనీవినీ ఎరుగని అధోగతిని చవిచూస్తున్నదనే చేదు వాస్తవం స్పష్టపడింది. అభిజిత్ మరింత స్పష్టంగా రోగ నిర్ధారణ చేశారు. 2019 స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా 6.1 శాతానికి కుదించి వేసింది. దాదాపు ఆరు మాసాల క్రితం ఏప్రిల్ నెలలో దీనిని 7.3 శాతంగా అంచనా వేసింది. వరుసగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మన ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. దిగుమతులు కింది చూపు చూశాయి.

తయారీ రంగం అమితంగా దెబ్బ తిన్నది. ఈ అన్ని చేదు పరిణామాల నేపథ్యంలో అభిజిత్ రోగ నిర్ణయంతోపాటు దాని మూలాన్ని కూడా ఎత్తి చూపించారు. పేదల కొనుగోలు శక్తి పెరిగేలా ప్రభుత్వ నిధుల వ్యయం పెరగాలని సూచించారు. అంటే ఇంత వరకూ ప్రకటించిన ఉద్దీపన చర్యలేవీ ఆ దిశగా లేవని అసలు గుట్టును విప్పి చెప్పారు. ఇదే సమయంలో తాజాగా వెలువడిన 2019 ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం 102 వ స్థానంలో ఉందని, పొరుగునున్న నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడిందని ఈ సూచీ తెలియజేస్తున్నది. 2018లో 103 వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు ఇంతగా దిగజారడం దేనిని సూచిస్తున్నది? అట్టడుగునున్న పేదలు ఆహారానికి ఇతర కనీస సౌకర్యాలకు మరింత దూరమయ్యారని దీని వల్ల రుజువవుతున్నది. ఈ ఏడాది 117 దేశాలలో పరిస్థితిని పరిశీలించి ఆకలి సూచీని విడుదల చేశారు. 2000 సంవత్సరంలో 113 దేశాల జాబితాలో మన స్థానం 83గా ఉంది.

దేశంలో ఒక వైపు ధనికుల సంపద, సంపన్నత ఎగబాకుతుంటే మరోవైపు పేదరికం, ఆకలి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని ఎలా అనగలం? ప్రపంచ ఆకలి సూచీని పోషకాహార లేమి, బాలల మరణాలు వంటి ఐదు అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. దేశంలో ఎత్తుకు తగిన బరువులేని బాలలు 2008 2012 కాలంలో 16.5 శాతం ఉండగా, అది 20142019 లో 20.8 శాతానికి పెరగడం గమనించవలసిన విషయం. ఇండియాలో ఉన్నంత అధ్వానమైన బాల్యం ఇంకే దేశంలోనూ లేదని ఆకలి సూచీ నివేదిక పేర్కొనడం గమనించవలసిన విషయం.

నిరంతరం ఘర్షణలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు అలముకొని ఉండే యెమెన్, జిబౌటీ వంటి దేశాల్లో పరిస్థితి భారత దేశంలో ఉన్నదాని కంటే మెరుగని కూడా నివేదిక అభిప్రాయపడింది. స్వచ్ఛ భారత్ ద్వారా కొత్త మరుగుదొడ్ల నిర్మాణం భారీగా చేపట్టినప్పటికీ భారత దేశంలో బహిరంగ మల విసర్జన అంతం కాలేదని ఇది ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకుంటున్నదని పర్యవసానంగా బాలల్లో ఎదుగుదల దెబ్బ తింటున్నదని నివేదిక ఎత్తి చూపింది. ఆర్థిక రంగంలో ప్రస్ఫుటమవుతున్న ఈ అధ్వాన స్థితి దేశ పాలకులకు తీవ్ర హెచ్చరిక అని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పబ్లిక్ రంగ పరిశ్రమల ప్రైవేటైజేషన్ తగదని బిజెపి అనుబంధ కార్మిక సంస్థలే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. దీనిని బట్టి ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యాల్లో సమూలమైన జనహితమైన మార్పు రావాలని బోధపడుతున్నది. అందుకు తగిన కార్యాచరణను అది తొందరగా చేపట్టవలసి ఉంది.

Indian economy heading towards disaster

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్థిక సంక్షోభం-ఆకలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: