టర్కీపై అమెరికా ఆంక్షలు!

  ఈశాన్య సిరియా నుంచి సేనలను ఉపసంహరించినందుకు స్వదేశంలోనే స్వజనం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆలస్యంగా తేరుకొని టర్కీపై ఆంక్షల అస్త్రాలు ప్రయోగించాడు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న సిరియా అంతర్యుద్ధంలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ (ఐసిస్)కి గంగవెర్రులెత్తించిన భీషణ పోరాటంలో అమెరికాకు అత్యంత నమ్మకమైన తోడుగా ఉండి ఎంతో నష్టపోయిన కుర్దులను ట్రంప్ స్వహస్తాలతో టర్కీ సేనల ఉన్మత్త దాడులకు అప్పగించాడు. నాటోలో అమెరికా సహచరి అయిన టర్కీతో […] The post టర్కీపై అమెరికా ఆంక్షలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈశాన్య సిరియా నుంచి సేనలను ఉపసంహరించినందుకు స్వదేశంలోనే స్వజనం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆలస్యంగా తేరుకొని టర్కీపై ఆంక్షల అస్త్రాలు ప్రయోగించాడు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న సిరియా అంతర్యుద్ధంలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ (ఐసిస్)కి గంగవెర్రులెత్తించిన భీషణ పోరాటంలో అమెరికాకు అత్యంత నమ్మకమైన తోడుగా ఉండి ఎంతో నష్టపోయిన కుర్దులను ట్రంప్ స్వహస్తాలతో టర్కీ సేనల ఉన్మత్త దాడులకు అప్పగించాడు. నాటోలో అమెరికా సహచరి అయిన టర్కీతో ట్రంప్ కుమ్మక్కయ్యే ఈశాన్య సిరియా నుంచి సేనలను ఉపసంహరించాడన్న సంగతిని ప్రపంచం గమనించింది.

అత్యంత విశ్వసనీయ మిత్రులైన కుర్దులను ట్రంప్ దగా చేశాడని అమెరికా రక్షణ శాఖ అధికారులు, రిపబ్లికన్‌లు కూడా విమర్శించారు. సేనల ఉపసంహరణకు ముందు ట్రంప్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్‌లో మాట్లాడాడన్న సమాచారం అనుమానాలకు ఆస్కారం కలిగించింది. సిరియా సరిహద్దుల్లో తమ సేనలతో చిరకాలంగా పోరాటం సాగిస్తున్న కుర్దిష్ వర్కర్స్ పార్టీ దళాలను టర్కీ టెర్రరిస్టులుగా పరిగణిస్తోంది. వారికి అండగా నిలిచిన ఈశాన్య సిరియాలోని సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్ (ఎస్‌డిఎఫ్) కు చెందిన కుర్దు యోధులపై అది కక్షగట్టి ఉంది. అమెరికా సేనలు వైదొలగడంతోనే టర్కీ తన సైన్యాలను అక్కడకు పంపించి కుర్దుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది.

దీనితో ఈశాన్య సిరియాలోని ఎస్‌డిఎఫ్‌కు చెందిన కుర్దు దళాలకే కాకుండా అక్కడ నివసిస్తున్న 17 లక్షల మంది కుర్దు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇంతకాలం అమెరికాతో కలిసి తాము ప్రతిఘటించిన సిరియా పాలకుడు బషర్ అల్ అస్సాద్‌ను దానికి అండగా ఉన్న రష్యా, ఇరాన్‌లను ఆశ్రయించక తప్పని పరిస్థితి కుర్దు దళాలకు కలుగుతున్నది. ట్రంప్ తెలివి తక్కువ చర్యతో అక్కడ అంతమైపోయిందనుకున్న ఐసిస్ తిరిగి పుంజుకునే అవకాశం ఏర్పడింది. వేలాది మంది ఐసిస్ ఖైదీలకు స్వేచ్ఛ లభించే పరిస్థితి తల ఎత్తింది. సిరియాపై మళ్లీ అస్సాద్ ప్రభుత్వం పట్టు పెరిగేందుకు సందు కలిగింది. కుర్దుల సారథ్యంలోని సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్ దళాలను ఒంటరులను చేస్తూ ట్రంప్ తీసుకున్న చర్య వల్ల సిగ్గుతో తల వంచుకోవలసి వస్తోందని అమెరికా సైనికాధికారి ఒకరు చేసిన వ్యాఖ్య గమనించదగినది.

ట్రంప్ చర్య కుర్దుల పట్ల విద్రోహమేనని అమెరికా ప్రతిష్ఠను విశ్వసనీయతను దెబ్బ తీసే వ్యూహాత్మక తప్పిదమని రిపబ్లికన్ పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ట్రంప్‌లో పునరాలోచన కలిగించినట్టు బోధపడుతున్నది. దాని పర్యవసానంగానే అమెరికా ఇప్పుడు టర్కీపై ఆంక్షలు విధించింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తోనూ ఈశాన్య సిరియాలోని కుర్దు దళాల నేత జనరల్ కొబానీ అబ్డితోనూ ట్రంప్ మాట్లాడాడని అక్కడి కుర్దుల నగరమైన కొబానీపై దాడి చేయబోమని ఎర్డోగన్ నుంచి హామీ పొందాడని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సే చేసిన ప్రకటన ఎంత వరకు నమ్మదగినదో ఆచరణలో చూడాలి. ఆంక్షల నేపథ్యంలో పెన్సే స్వయంగా టర్కీ రాజధాని అంకారాకు బయల్దేరినట్టు వార్తలు చెబుతున్నాయి.

ఈశాన్య సిరియాపై టర్కీ సేనల దాడులు ఐసిస్ తిరిగి పేట్రేగడానికి, అక్కడి పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లడానికి దారి తీస్తున్నదని ఆ ప్రాంతంలో శాంతిని బలి తీసుకుంటుందని అమెరికా ఆంక్షల విధింపు ప్రకటనలో పేర్కొన్నది. ట్రంప్ టర్కీపై విధించిన ఆంక్షల వల్ల అంకారాతో అమెరికా కుదుర్చుకోదలచిన 100 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం చిక్కుల్లో పడుతుంది. టర్కీ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఉక్కుపై సుంకాలను 50 శాతం పెంచుతుంది. టర్కీ సీనియర్ అధికారులపైనా దాని రక్షణ, ఇంధన మంత్రిత్వ శాఖలపైనా అమెరికా ఆంక్షలు విరుచుకుపడతాయి. సిరియాలో టర్కీ ఈ ఆగడాన్ని కొనసాగిస్తే దాని ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తానని ట్రంప్ శపథం పూనినట్టు వార్తలు చెబుతున్నాయి.

ఈ తెలివి ముందే ఆయనలో చోటు చేసుకుని ఉంటే ఈశాన్య సిరియా నుంచి అంత అనాలోచితంగా సేనలను ఉపసంహరించుకునే వాడు కాదు. పైపెచ్చు కుర్దులకు చాలా డబ్బు, సామగ్రి ఇచ్చామని ప్రకటించడం ద్వారా అమెరికా ఆధారపడదగ్గ మిత్రురాలు కాదనే అభిప్రాయానికి చోటు కల్పించాడు. విదేశీ యుద్ధ క్షేత్రాల నుంచి సేనలను వెనక్కి రప్పిస్తున్నాననే అభిప్రాయం అమెరికన్లలో కలిగించడం ద్వారా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇటువంటి వరుస పొరపాట్లు ట్రంప్ చేస్తున్నాడు. తద్వారా అంతర్జాతీయ శక్తిగా అమెరికా ఇంత కాలం గడించుకున్న పేరును, విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నాడు.

US sanctions on Turkey

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టర్కీపై అమెరికా ఆంక్షలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: