పారిశ్రామిక అధోగతి!

         దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక గురువైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ నమ్మకాన్ని, ఉద్ఘాటనను వమ్ము చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ మరింత అథోగతి పాలవుతున్నది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఆగస్టులో 1.1% పతనమైందన్న తాజా సమాచారం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ ఫలించడం లేదని ఎటువంటి […] The post పారిశ్రామిక అధోగతి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక గురువైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ నమ్మకాన్ని, ఉద్ఘాటనను వమ్ము చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ మరింత అథోగతి పాలవుతున్నది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఆగస్టులో 1.1% పతనమైందన్న తాజా సమాచారం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ ఫలించడం లేదని ఎటువంటి అనుమానాలకు చోటు లేకుండా రుజువు చేసినది. ఆర్థిక మందగమనం, పతనం అని అంటున్నదానిపై అధిక ప్రచారం తగదని అది వ్యాపార వర్గాలను, ప్రజలను అనవసర భయాలకు లోను చేస్తుందని మోహన్ భగవత్ తన విజయదశమి ప్రసంగంలో హెచ్చరించారు.

ఆర్థిక పరిస్థితిని బాగు చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని దాని కృషిని విశ్వసించాలని కూడా ఆయన అన్నారు. వృద్ధి రేటు 0% కంటే తగ్గిపోయినప్పుడే ఆందోళన చెందాలని ప్రస్తుతం 5% రేటు ఉందని తనతో ఒక ఆర్థిక వేత్త చెప్పినట్టు కూడా ఆయన వెల్లడించారు. నిండా మునిగిపోయేంత వరకు నిబ్బరంగా ఉండాలని భగవత్ ప్రజలకు చావుధైర్యం నూరిపోస్తున్నారు. అంతేగానీ, ప్రభుత్వం తీసుకుంటున్న అపసవ్య ఉద్దీపన చర్యలలోని లోపాలను ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకోవాలని చెప్పడం లేదు. చిచ్చు అంటుకుంటుంటే ఆర్పడానికి బదులుగా అరవ వద్దు, ఆర్తనాదం చేయొద్దని సూచించడం ఎంతవరకు సబబు!, ఆర్థిక పరిస్థితికి సంబంధించి వెల్లడైన సరికొత్త సమాచారం అత్యంత ఆందోళన కలిగించేదిగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ప్రధానమైన తయారీ రంగం గత ఆగస్టులో 1.2% పడిపోయింది. గత దాదాపు ఆరేళ్లలో ఇది అత్యంత దయనీయమైన పతనం.

దేశంలో పెట్టుబడుల తీరును ప్రతిబింబించే భారీ పరికరాల ఉత్పత్తి 21% తగ్గిపోయింది. అంటే, కొత్త పెట్టుబడులు శూన్యమని బోధపడుతున్నది. వాస్తవానికి మోడీ గత ప్రభుత్వం తీసుకున్న స్వీయ వినాశకరమైన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అవకతవక అమలు చర్యలతోనే దేశంలో పెట్టుబడులు తీవ్ర నిరుత్సాహం చెందాయి. గత ఏప్రిల్ ఆగస్టు కాలంలో పరిశ్రమల వద్ద నమోదైన ఉత్పత్తి వృద్ధి 2.4%. గత సంవత్సరం ఇదే కాలంలో 5.3%గా నమోదైంది. ప్రయాణికుల వాహనాల అమ్మకాలు ఈ సెప్టెంబర్ నెలలో 23.7% పతనాన్ని చవిచూచాయి. ఈ పతన మాసాలలో సెప్టెంబర్ నెల వరుసగా 11వది కావడం గమనార్హం. ఇప్పట్లో ఈ పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబస్థాయి పొదుపు తగ్గిపోవడం, వ్యవసాయం దెబ్బతినడం ఇందుకు దారితీసిన కారణాలలో ప్రధానమైనవని కూడా వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం వద్ద తగినంతగా నిధులు లేకపోవడం, ఉన్న నిధులను ఉత్పత్తి పెరగడానికి దోహదం చేసే చర్యలకు ఉపయోగించడం డిమాండ్‌ను పెంచేవైపు దృష్టి పెట్టకపోవడమే ఈ దుస్థితిని దాపురింపచేశాయని కూడా చెబుతున్నారు.

కార్పొరేట్ పన్నులో ప్రకటించిన భారీ రాయితీ ఖజానాపై విపరీతమైన భారం వేసింది గాని, పారిశ్రామిక రంగం పుంజుకునేలా చేయలేదు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేవిధంగా అదనపు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వ వ్యయాన్ని అసాధారణంగా పెంచి ఉంటే అది డిమాండ్‌ను పైకి తీసుకువెళుతుంది. అటువంటి చర్యల జాడ కనిపించడం లేదు. దేశ ఆర్థిక పరిస్థితిపై బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ అభిప్రాయాలు పరిశీలించదగినవి. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక , కార్మిక విధానాలే ఈ దుస్థితి కారణమని అది తెగేసి చెప్పింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీదనే భారం వేసి ప్రభుత్వం ఇతరత్రా ఏమీ చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నదని కుండబద్ధలు కొట్టినట్టు వెల్లడించింది. దీనివల్ల దేశంలో సంప్రదాయంగా కొనసాగుతున్న అనేక చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు తుడుచుపెట్టుకుపోయాయని స్పష్టం చేసింది. తయారీ రంగం దారుణ దయనీయ స్థితిలో ఉన్నదని, సామాన్య ప్రజలు చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారని కూడా వివరించింది. ఇంతకంటే హిత వాక్యాలు వేరే ఏమి ఉంటాయి? అలాగే విదేశాల నుంచి దిగుమతులకు అవకాశాలను పెంచకూడదని పార్టీ స్థాయిలో బిజెపి నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే సూచనలు వస్తున్నాయి. దీనివల్ల దేశీయ ఉత్పత్తులకు తీవ్రమైన హాని కలుగుతుందని అవి హెచ్చరిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం తక్షణమే తన పద్ధతిని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం స్పష్టపడుతున్నది.

Industrial production drops by 1.1% in Aug

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పారిశ్రామిక అధోగతి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: