కశ్మీర్‌కు మళ్లీ కళ?

         రెండు నెలల పైనుంచి తీవ్రమైన ఆంక్షల పడగనీడలో కొనసాగుతున్న కశ్మీర్‌కు విహారయాత్రికులను తిరిగి అనుమతించాలని తీసుకున్న నిర్ణయం అక్కడి పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే అభిప్రాయానికి సందు కలిగిస్తున్నది. కశ్మీర్ టూరిజం ఆదాయాన్ని పెంచే విదేశీ యాత్రికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా కశ్మీర్‌కు దేశీయ యాత్రికుల ఒత్తిడి అక్టోబర్‌తో ముగుస్తుంది. చలికాలంలో కశ్మీర్‌ను సందర్శించడానికి విదేశీ యాత్రికులు ఉత్సాహం చూపుతారు. మామూలు పరిస్థితులు సంపూర్ణంగా పునరుద్ధరణ కాకుండానే టూరిస్టులకు తిరిగి […] The post కశ్మీర్‌కు మళ్లీ కళ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         రెండు నెలల పైనుంచి తీవ్రమైన ఆంక్షల పడగనీడలో కొనసాగుతున్న కశ్మీర్‌కు విహారయాత్రికులను తిరిగి అనుమతించాలని తీసుకున్న నిర్ణయం అక్కడి పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే అభిప్రాయానికి సందు కలిగిస్తున్నది. కశ్మీర్ టూరిజం ఆదాయాన్ని పెంచే విదేశీ యాత్రికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా కశ్మీర్‌కు దేశీయ యాత్రికుల ఒత్తిడి అక్టోబర్‌తో ముగుస్తుంది. చలికాలంలో కశ్మీర్‌ను సందర్శించడానికి విదేశీ యాత్రికులు ఉత్సాహం చూపుతారు. మామూలు పరిస్థితులు సంపూర్ణంగా పునరుద్ధరణ కాకుండానే టూరిస్టులకు తిరిగి ద్వారాలు తెరిచినందువల్ల కలిగే ప్రయోజనం అనుమానాస్పదమే. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఇంకా బంద్ అయ్యే ఉన్నాయి. దీనివల్ల అక్కడి ప్రజలు అత్యవసర వైద్య అవసరాలు తీరక నానా ఇబ్బందులకు గురి అవుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. సకాలంలో చికిత్స అందక పలువురు చనిపోతున్నట్టు సమాచారం.

ఈ అంధకారానికి తెర దించకపోతే విదేశీ టూరిస్టులు మాత్రం ఎలా వస్తారు? కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగం 370 అధికరణను రద్దు చేసిన సందర్భంలో ఆగస్టు మొదటి వారంలో అక్కడి నుంచి టూరిస్టులను ప్రభుత్వం ఉన్న పళంగా వెనక్కి పంపించివేసింది. కశ్మీర్‌ను పూర్తిగా దేశంలో విలీనం చేసుకుంటూ, దాని రాష్ట్ర హోదాను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంట్ ఆమోదంతో తీసుకున్న చర్యకు అంతర్జాతీయ సమాజం అడ్డు చెప్పలేదు. అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దానిని మన అంతరంగిక వ్యవహారంగానే పరిగణించింది. అయితే, అక్కడ విధించిన ఆంక్షలు కొనసాగుతూ ఉండడంతో మానవ హక్కులకు విఘాతం కలుగుతున్నదనే అభిప్రాయం నెమ్మదిగా బలపడడం ప్రారంభించింది. ఇది బలహీనపడాలంటే కేంద్రం తన చర్యలకు జమ్మూకశ్మీర్ మెజార్టీ ప్రజల మద్దతును సాధించి తీరాలి.

ఈ నెల 24వ తేదీన జరగనున్న స్థానిక ఎన్నికల (బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్స్) ద్వారా అక్కడ మూమూలు పరిస్థితులు పునరుద్ధరణ అయ్యాయని ప్రపంచానికి చాటాలని ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు. అయితే, కశ్మీర్‌లోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీల ముఖ్యనేతలు ఇంకా నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. ఫారుఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ సయీద్‌లు పాల్గొనకుండా స్థానిక ఎన్నికల రాజకీయ కార్యాచరణ ఏవిధంగా సంపూర్ణం, సమగ్రం కాగలదనే ప్రశ్న సహజమే. వీరి నిర్బంధానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆగస్టు 5 నాటి అసాధారణ నిర్ణయం దరిమిలా ప్రతీకార హింస చెలరేగకుండా చూడడానికి 400 మంది రాజకీయ నాయకులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఒక సమాచారం ప్రకారం ముందుజాగ్రత్త చర్యగా రాజకీయ నేతలు, ప్రమాదభరితులని భావించిన ఇతరులు కలిసి మొత్తం 3000 మందిని జైళ్లల్లో పెట్టినట్టు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే రెండవ, మూడవ శ్రేణి నాయకులు కొందరిని విడుదల చేయడం ప్రారంభమైనా ముఖ్య నేతలను వదిలిపెడితే కాని రాజకీయ వాతావరణం మామూలు స్థితికి చేరుకున్నట్టు కాదు. ఆగస్టు 5 నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్‌లో 306 రాళ్ల రువ్వుడు సంఘటనలు జరిగినట్టు సమాచారం. ప్రభుత్వ చర్యలకు నిరసనగా మూకలు పోలీసులపై రాళ్లు రువ్వడం చిరకాలంగా జరుగుతున్నదే. అయితే 2019 తొలి ఆరు మాసాల్లో ఇటువంటి 40 సంఘటనలు మాత్రమే రికార్డయ్యాయి. గత రెండు మాసాల్లోనే 306 ఘటనలు చోటుచేసుకోవడం వల్ల జన నిరసన స్థాయి తీవ్రమైందని అనుకోక తప్పదు. కశ్మీర్ ప్రజల మద్దతును, సానుకూలతను చూరగొనడానికి ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు.

ముఖ్యంగా ప్రజల సకల స్వేచ్ఛలను, సదుపాయాలను పునరుద్ధరించవలసి వుంది. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సౌకర్యాలను కలిగించ వలసి వుంది. వాటిని బంద్ చేయడం ద్వారా వైద్యులతో, ఆసుపత్రులతో కూడా అత్యవసర సంప్రదింపులకు అవకాశం లేకుండా చేసి ప్రభుత్వం తమ ప్రాణాల మీదికి తీసుకువచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో నుంచి తొలగించవలసి వున్నది. 370 రద్దు చర్యను జమ్మూకశ్మీర్ బాగు కోసం అక్కడి ప్రజల వికాసం కోసమే తీసుకున్నామనే భావన వారిలో గట్టిగా చోటుచేసుకునేలా చూడవలసి ఉన్నది. అప్పుడే కశ్మీర్‌లో మానవ హక్కులకు విఘాతం ఏర్పడుతున్నదనే అభిప్రాయాన్ని అంతర్జాతీయ సమాజం నుంచి తొలగించవచ్చు. టెర్రరిజాన్ని ఎగదోసి తమాషా చూద్దామనుకుంటున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పవచ్చు.

Foreign tourists visited Kashmir during the winter season

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్‌కు మళ్లీ కళ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: