అమ్మాయే కావాలి!

అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ… అమ్మాయి పుట్టినా పర్వాలేదని సర్దుకుపోయే మనస్తత్వం మన దేశంలో ఈ మధ్యకాలంలో కనిపిస్తోంది. అమ్మాయి పుడితే బాగుండు అనుకునే పరిస్థితికి మనం చేరాల్సి ఉంది. ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే పథకాలు బాలికలకు చదువుపై అవగాహన కల్పిస్తున్నాయి. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల ..ఈ అంశాలపై అవగాహన అత్యంత అవసరం. అందుకోసమే అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఏర్పడింది. రోజులు మారాయి. అమ్మాయి అనగానే […] The post అమ్మాయే కావాలి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ… అమ్మాయి పుట్టినా పర్వాలేదని సర్దుకుపోయే మనస్తత్వం మన దేశంలో ఈ మధ్యకాలంలో కనిపిస్తోంది. అమ్మాయి పుడితే బాగుండు అనుకునే పరిస్థితికి మనం చేరాల్సి ఉంది. ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే పథకాలు బాలికలకు చదువుపై అవగాహన కల్పిస్తున్నాయి. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల ..ఈ అంశాలపై అవగాహన అత్యంత అవసరం. అందుకోసమే అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఏర్పడింది. రోజులు మారాయి. అమ్మాయి అనగానే ముఖం తిప్పుకునే తల్లిదండ్రులు లేరిప్పుడు. అమ్మాయిని ఎంతో ధైర్యంగా, ఉన్నతంగా, స్వేచ్ఛగా పెంచుతున్నారు. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా తయారుచేస్తున్నారు. అబ్బాయితో సమానంగా అమ్మాయిలను చూడటం హర్షణీయం.

అన్ని రంగాల్లో వాళ్లే. ఒకప్పుడు మహిళల్ని వంటింటికే పరిమితం చేసేవాళ్లు. ఇవాళ అన్ని రంగాల్లో వాళ్లు దూసుకెళ్తున్నారు. విద్యా, ఉద్యోగాల్లో గట్టిపోటీ ఇస్తూ ర్యాంకుల పంట పండిస్తున్నారు. అవకాశం ఇస్తే, అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. బాలికల దశ నుంచే వారికి సరైన తోడ్పాటు అందించాలి. అమ్మాయి భారం అనే సంకుచిత ధోరణి నుంచీ… అమ్మాయే బెటర్ అనే ఆలోచనకు రావాలి. తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ ప్రపంచ దేశాధినేతల సమక్షంలో అందరినీ హౌడేర్ యూ అంటూ నిలదీసిన విషయం తెలిసిందే.

అమ్మాయి అంటే తలొంచుకునే పోయే రోజులు పోయాయి. ఇలా ప్రశ్నించే కాలం వచ్చింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు అన్యాయానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నారు. ప్రభుత్వాలు కూడా బాలికల సంరక్షణకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వారిని పోత్సహిస్తున్నాయి. బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్ డెవలప్‌మెంట్ మిషన్’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది.

మన దేశంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం ద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది.
బాలికల కోసం మరిన్ని పథకాలు: మన దేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 940 మంది అమ్మాయి లున్నారు. అంటే అమ్మాయిల సంఖ్యను మరింత పెంచాలన్నమాట. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు కొంతవరకే ఫలితం ఇస్తున్నాయి. ఇప్పటికి మన ఊళ్లలో పాప పుడుతోందని తెలిస్తే, అబార్షన్ చేయించేస్తున్నారు. ఈ ఆలోచనా ధోరణి మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం ఆయా రాష్ట్రాలు కొన్ని పథకాలు తెచ్చాయి.

* బేటీ బచావో బేటీ పడావో (కేంద్రం), * సుకన్య సమృద్ధి యోజన * బాలికా సమృద్ధి యోజన * ముఖ్యమంత్రి రాజ్‌శ్రీ యోజన * ముఖ్యమంత్రి లాడ్‌లీ యోజన ( హర్యానా)
* మాజీ కన్య భాగ్యశ్రీ యోజన ( మహారాష్ట్ర), * లాడ్లీ లక్ష్మీయోజన ( మధ్యప్రదేశ్)
* భాగ్యశ్రీ యోజన ( కర్ణాటక) * కన్యశ్రీ ప్రకల్ప (పశ్చిమ బెంగాల్)
ఇన్ని పథకాలున్నా బాలికల సంఖ్య తక్కువగా ఉందంటే ఆశ్యర్యపడాలి. తప్పు మనలోనే ఉంది. బాలిక అంటే భారం అనే ఆలోచన మారాలి. ప్రెగ్నెన్సీ స్కానింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి. వరకట్నపు వేధింపులకు చెక్ పెట్టాలి. ఆడపిల్లలకు చక్కగా చదువు చెప్పించాలి. తల్లిదండ్రులంతా ఈ విషయంలో సానుకూలంగా ఆలోచిస్తే, ఆడపిల్లలకు అదే అసలైన రక్ష.

తక్కువౌతున్న బాలికల శాతం: మా ఇంట ఆడపిల్ల పుట్టింది… మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటిదీపం అని సంబరపడి సంబరాలు చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవనిపిస్తోంది. మహిళల అభివృద్ధి ఆశించే వారందరినీ ఆవేదనకు గురిచేస్తున్న సమస్య ఏంటంటే రోజురోజుకీ పడిపోతున్న స్త్రీ, పురుష నిష్పత్తి. ఈనాడు దేశవ్యాప్తంగా 1000 మంది బాలలు ఉంటే 933 మంది బాలికలు ఉన్నారని, ఇక మన రాష్ట్రంలో 1000 మంది బాలలకు 972 మంది బాలికలున్నారు. దీనిని బట్టి చూస్తే ఆడపిల్లల జనన శాతం ఎంతగా పడిపోతుందో అర్థమవుతుంది.

సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్త్రీ పురుషుల మధ్య అసమానతలు కొనసాగుతుండటం, లింగ వివక్ష, ఆడపిల్లల పట్ల నేరాలు పెరగడం, ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న వరకట్న దురాచారం పెచ్చుమీరడం వల్ల పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి గుండెల మీద కుంపటిలా భావించడం ద్వారా భ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి. ఈనాడు అమ్మాయిలు మగవాడికి తామేమీ తీసిపోమన్నట్లుగా అన్ని రంగాలలో ఆకాశమే హద్దుగా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ దూసుకెళ్తున్నారు. అయినా ద్వితీయ శ్రేణి పౌరురాలుగానే గుర్తించబడుతున్నారు.

లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, వరకట్న వేధింపులకు బలవుతున్నారు. ఆరు సంవత్సరాల అమ్మాయి నుండి 60 సంవత్సరాల బామ్మ వరకు హత్యాచారానికి బలవుతున్న దుస్థితి కనిపిస్తోంది. అమ్మాయిలు స్కూళ్లకు, కళాశాలకు, పని ప్రదేశాల నుండి ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులకు ఒకటే ఆందోళన. ఏ ప్రేమోన్మాది వెంటపడి తమ బిడ్డను ఏం చేస్తాడోనని భయం. ఈ పరిస్థితికి కారణం ప్రసార మాధ్యమంలో స్త్రీని చూపే విధానం. స్త్రీల శరీరాన్ని ఒక వస్తువుగా చూపడం, స్త్రీల శరీరాన్ని లైంగిక దృష్టితో చూపడం, వ్యాపార ప్రకటనలు, ఇలాంటివన్నీ బాలికలపై, మహిళలపైన అత్యాచారాలకు, లైంగిక హింసకు పోత్సహిస్తున్నాయి.

ఆడ పిల్లల సమస్య వారి ఒకరిదే కాదు ఇది సమాజ సమస్యగా భావించినప్పుడే ఆడపిల్లల పట్ల అభద్రతా భావం పోయి ఆడపిల్ల పుట్టిందంటూ ఆనందపడే పరిస్థితి వస్తుంది. లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ తదితర సమస్యలపై తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు కౌన్సిలర్లతో కమిటీలు నియమించాలి.

పోషకాహార లోపం ఎక్కువ

భారతదేశంలో బాలికలు చాలా ఎక్కువ శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
న్యూట్రిషన్ లెక్కల ప్రకారం చూస్తే బాలికలు అంటే 13 నుంచి- 19 వయసు లోపు వారు…
* 50.2 శాతం మంది బరువు తక్కువ ఉన్నారు.
* 46.౩శాతం మంది సాధారణంగా ఉన్నారు.
* 2.8 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుంటే. 0.7 శాతం మంది ఒబేసిటీతో ఉన్నారు.
* 50 శాతం కంటే ఎక్కువ మంది రక్తహీనత ( ఎనీమియా) తో సతమతమౌతున్నారు.
* కౌమార దశలో అమ్మా యిలు పల్లె ప్రాంతాల్లో 47 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది సాధారణ
ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉన్నారు.

హౌ డేర్ యూ?

ఇంత ధైర్యంగా ప్రపంచ దేశాధినేతలను నిలదీసిందో 16 ఏళ్ల బాలిక. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా పెద్దలను కడిగేసింది. “మీరంతా కలిసి మా కలలను భగ్నం చేశారు. బాల్యాన్ని చిదిమేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కథలు చెబుతున్నారు. మీకెంత ధైర్యం? మా తరాన్ని మీరు మోసం చేస్తున్నారు. మిమ్మల్ని ఎంతమాత్రం క్షమించబోమని హెచ్చరించింది. యువత మిమ్మల్ని గమనిస్తోంది. ఇప్పుడు మీరు నవ్వుకున్నా… త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను నాశనం చేశారు.

భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం పర్యావరణం అంతరించిపోయే మొదటి దశలో ఉన్నాం. మా సమస్యలను వింటున్నామని మీరు చెబుతున్నారు. ఒకవేళ మీరు నిజంగా పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటే సమస్యను పరిష్కరించడంలో ఇంత తాత్కారం ఎందుకు చేస్తున్నారు? అందుకే మిమ్మల్ని నేను నమ్మలేను. కొత్త తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండటానికి మీరెవరు? ఎంత ధైర్యం మీకు? యువత మిమ్మల్ని గమనిస్తోందంటూ” ” అంటూ ధైర్యంగా ప్రశ్నించింది స్వీడన్‌కు చెందిన గ్రెటా థంబర్గ్.

హక్కుల కోసం పోరాటమే..

సుమారు పాతికేళ్ల క్రితం 30వేల మంది 200 వందల దేశాల నుంచి స్త్రీపురుషులంతా కలిసి చైనాలో మహిళల కోసం జరుగుతున్న నాల్గవ ప్రపంచ సదస్సుకు హాజరయ్యారు. ఆ సందర్భంగా బాలికలకు, మహిళలకు మానవ హక్కులు కలిగించాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచీ మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇది గ్లోబల్ మూవ్‌మెంట్‌గా మారింది. బాల్య వివాహాలు, చదువు విషయంలో సమానత్వం లేకపోవడం, ఆడ పిల్లగా పుట్టినందుకు హింసించడంపై పోరాటాన్ని ఉధృతం చేశారు.

ప్రభుత్వేతర సంస్థ ప్లాన్ ఇంటర్నేషన్ ప్రాజెక్టు ఫలితమే ఈ రోజు. “ ఐ యామ్ ఎ గర్ల్‌” అనే అవగాహనా కార్యక్రమం అన్ని దేశాలకూ విస్తరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను పోషించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేసిందీ సంస్థ. కెనడాలోని ప్లాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్దతుదారుల కూటమిని కోరుతూ అంతర్జాతీయంగా బాలికల హక్కుల కోసం పోరాడారు. ఫలితంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళల స్థితి మంత్రి రోనా అంబ్రోస్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. మహిళల స్థితిగతులపై 55 వ ఐక్యరాజ్యసమితి కమిషన్‌లో చొరవకు మద్దతుగా మహిళలు, బాలికల ప్రతినిధి బృందం ప్రదర్శనలు ఇచ్చింది. డిసెంబర్ 19, 2011న, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అక్టోబర్ 11, 2012 ను మొదటి అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ఆమోదించింది.

ఈ ఏడాది థీమ్‌గా “బాలికల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది. వారిపై ఎవరికీ హక్కులేదు. వారి ఇష్టా ఇష్టాలను ఎవరూ ఆపలేరు”. పాతికేళ్ల నుంచీ బాలికలు తమ కలలను లక్షాలను నెరవేర్చుకోవడానికి పోరాడుతూనే ఉన్నారు. దీని ఫలితమే చాలా మంది అమ్మాయిలు ఈ రోజు పాఠశాలకు వెళ్తున్నారు. కొద్ది మంది మాత్రమే చిన్న వయసులో పెళ్లిచేసుకుంటున్నారు.
చిన్నారులుగా ఉన్నప్పుడే అమ్మలవుతున్నారు. ఈ స్థితిని మార్చడానికి మరింత పోరాడాల్సి ఉంది. హద్దుల్ని చెరిపేయాలి. సంప్రదాయం ముసుగులో వారిపై జరుగుతున్న అసమానతలు, వివక్షలు, లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు సిద్ధమవ్వాలి. ఇందుకు మహిళా పారిశ్రామిక వేత్తలు, సామాజిక వేత్తలు అంతా కలిసి ఉద్యమాలనే చేస్తున్నారు. బాలికల హక్కుల కోసం పోరాడుతున్నారు. వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. స్త్రీపురుష సమానత్వం కోసం పోరాడుతున్నారు. పనిచేసే చోట వేతనాలు సమానంగా అందాలంటున్నారు. ఇవన్నీ సఫలమైతే బాలికల భవిష్యత్తు బంగారమే.

International Girl Child Day 2019

 మల్లీశ్వరి వారణాసి

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమ్మాయే కావాలి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.