ఎవరి అదుపులో ఎవరున్నారు?

  ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి, సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ విజయదశమి సందర్భంగా, అంటే సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం చేసిన ప్రసంగం గమనించదగింది. ఎందుకంటే సాధారణంగా సర్ సంఘ్ చాలాక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చేసే ప్రసంగం సంఘ్ పరివార్ కార్యకర్తల ముందు, బిజెపి కార్యకర్తలతో సహా సంఘ్ కార్యకర్తలందరి ముందు రాజకీయ ఎజెండాను ప్రతిపాదించే ప్రసంగంగా ఉంటుంది. కానీ, 2019 దసరా సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అలా లేదు. ఆయన […] The post ఎవరి అదుపులో ఎవరున్నారు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి, సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ విజయదశమి సందర్భంగా, అంటే సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం చేసిన ప్రసంగం గమనించదగింది. ఎందుకంటే సాధారణంగా సర్ సంఘ్ చాలాక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చేసే ప్రసంగం సంఘ్ పరివార్ కార్యకర్తల ముందు, బిజెపి కార్యకర్తలతో సహా సంఘ్ కార్యకర్తలందరి ముందు రాజకీయ ఎజెండాను ప్రతిపాదించే ప్రసంగంగా ఉంటుంది. కానీ, 2019 దసరా సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అలా లేదు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని వివరించడం అనేది ఈ సారి జరగలేదు. దాదాపు గంట సేపు మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. పైగా, మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు ఎదుర్కొంటున్న రంగాల్లో మోడీ ప్రభుత్వాన్ని వెనుకేసుకు వస్తూ మాట్లాడడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు.
నిజానికి బిజెపితో తమకు సంబంధం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ బహిరంగంగా చెప్పదు. తమ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసే ఏ రాజకీయ పార్టీతో అయినా సరే తాము సహకరిస్తామని గతంలో అనేక సార్లు భగవత్ స్వయంగా చెప్పి ఉన్నారు. బిజెపితో తమకు సంబంధాలేమీ లేవనే చెబుతుంటారు. కానీ, ఈ సారి భగవత్ ప్రసంగం గమనిస్తే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల మధ్య సంబంధాలను ఆయన స్పష్టంగా ప్రకటిస్తున్నట్లు కనబడింది. నిజానికి చాలా మంది ఆర్‌ఎస్‌ఎస్ మాతృసంస్థ కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు బిజెపి వింటుందని కూడా అనుకుంటారు. కాని ఈ సారి భగవత్ ప్రసంగం గమనిస్తే బిజెపి కోసం పని చేసే సంస్థ స్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ కనబడింది.
గతంలో భగవత్ ప్రసంగాలను గమనిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 2016 విజయదశమి సందర్భంగా భగవత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సర్జికల్ స్ట్రయిక్స్ చేసినందుకు అభినందిస్తూ, దాంతో పాటు అనేక పరిపాలనా సంబంధమైన విషయాలు మాట్లాడారు. కశ్మీరీ పండిట్ల పునరావాసం, మీర్ పుర్, ముజఫరాబాద్, గిల్గిత్, బాల్టిస్థాన్ తదితర ప్రాంతాల్లో వేధింపులకు గురయిన హిందూ మైనారిటీల పునరావాసం గురించి చెప్పారు. అంతేకాదు మాజీ కేబినెట్ సెక్రటరీ టి.యస్.ఆర్ సుబ్రమణ్యన్ ప్రతిపాదించిన కొత్త విద్యా విధానం ముసాయిదాను సమీక్షించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గో రక్షకులు, సంఘ విద్రోహశక్తుల మధ్య తేడా చూపాలని కూడా చెప్పారు.
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం పౌరసత్వ బిల్లు కోసం ప్రయత్నిస్తుంది. ఈ బిల్లు ప్రకారం భారతదేశానికి వచ్చిన శరణార్థులలో ముస్లింలు తప్ప మిగిలిన మతాలవారందికీ భారత పౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాజీ కేబినెట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఇచ్చిన నూతన విద్యా విధానాన్ని పక్కన పెట్టి కె.కస్తూరీ రంగన్ ఇచ్చిన ముసాయిదాను అమలు చేస్తోంది.
2017లో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మాట్లాడుతూ పాకిస్థాన్, చైనాలతో సరిహద్దుల విషయంలో దృఢమైన విధానం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పారు. అలాగే రోహింగ్యాలకు ఆశ్రయమివ్వడానికి సంబంధించి జాతీయ భద్రతకు, సమగ్రతకు ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి గురించి ఆయన వ్యతిరేకతను చూచాయగా వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ నిర్ణయాలు సంఘ్ పరివార్ కు మద్దతిచ్చే చిన్న, మధ్యస్థాయి వ్యాపార వర్గాలకు నష్టం కలిగిస్తాయి. అంతేకాదు, ఆయన నీతిఆయోగ్ పై కూడా విమర్శలు సంధించారు. పాత ఆర్ధిక విధానాలకే కట్టుబడ్డారని, ఆర్ధిక ప్రణాళికలు ఏవైనా సరే దేశంలోని మౌలిక వాస్తవాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు.
2018లో దేశానికి ఎదురవుతున్న బయటి ప్రమాదాలను ప్రభుత్వం ఎదుర్కోవడం గురించి ఆయన మాట్లాడారు. దేశంలో అంతర్గత భద్రతను కూడా పటిష్టం చేయాలని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారం చేసే హిందూత్వ బ్రాండ్ జాతీయ వాదాన్ని విమర్శించేవారిపై మండిపడ్డారు. అర్బన్ నక్సల్స్, నియో నక్సల్స్ గురించి మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వాలు ప్రజాసేవే ప్రధానంగా పని చేయాలని చెబుతూ ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు, పారామిలిటరీ దళాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని అన్నారు. ఈ విధి బాధ్యతలను అప్రమత్తంగా నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కొంత విమర్శించారు కూడా. పరిపాలనా పరంగా సానుభూతి, అప్రమత్తత, పారదర్శకత, మంచి విధానాలను అమలు చేయడంలో సమగ్రత ఇంకా ఆశించిన ప్రమాణాలలో లేవని కూడా చెప్పారు. అందువల్ల వివిధ విధానాల ఫలితాలు సమాజంలోని అట్టడుగు ప్రజలకు అందడం లేదని అన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా సర్ సంఘ్ చాలక్ ప్రభుత్వాన్ని వాగ్దానాలు నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తూ వచ్చారు. ఇందులో కొన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నవి. ఉదాహరణకు అధికరణ 370 రద్దు, అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం, యూనిఫాం సివిల్ కోడ్. ఈ సంవత్సరం భగవత్ ప్రసంగాన్ని గమనిస్తే, నాగపూరులో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ అధికరణ 370 రద్దు చేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తడం, ప్రజలు ఆర్ధిక ఇబ్బందుల విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించరాదని ప్రజలకు సలహాలు ఇవ్వడమే కనిపిస్తుంది. ఆయన ప్రసంగంలో తరచు కనబడే అంశాలు, వినబడే పదాలు… జాతీయవాదం, హిందూత్వ, పాకిస్థాన్, చైనా, బయటి ప్రమాదాలు వగైరా కూడా ప్రసంగంలో వినిపించాయి. కాని, ప్రభుత్వంపై ఒక్క విమర్శ కూడా లేదు. కనీసం పల్లెత్తు మాట లేదు. పైగా ప్రభుత్వాన్ని సమర్థించడమే పనిగా మాట్లాడారు.
పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టిల పట్ల వ్యతిరేకత నుంచి ఇప్పుడు దేశంలో జిడిపి రేటు పడిపోవడాన్ని సమర్థించే భగవత్ ను మనం చూశాం. ఆయన తన ప్రసంగంలో ఆర్ధిక వ్యవస్థ గురించి చాలా సేపు మాట్లాడారు. “దేశం అభివృద్ధి చెందుతోంది. కాని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఒక వలయంలో తిరుగుతుంది. కొన్ని సార్లు అడ్డంకులు ఎదుర్కొంటుంది. వృద్ధి మందగిస్తుంది. దాన్ని ఆర్ధికమాంద్యం అంటాం” అంటూ, భగవత్ మాంద్యం గురించి వివరణల ద్వారా సమర్థించే ప్రయత్నం చేశారు. “దేశంలో వృద్ధి రేటు సున్నా కన్నా తక్కువ స్థాయికి పడిపోతే దాన్ని మాంద్యం అంటారని నాకు ఒక ఆర్ధికవేత్త చెప్పారు. కాని దేశంలో ఇప్పుడు 5 శాతం వృద్ధి రేటు ఉంది. ఇది తక్కువ వృద్ధి రేటు కావచ్చు. కాని దీని గురించి మరీ ఎక్కువ చర్చలు అవసరం లేదు” అని తేల్చేశారు.
“దీనిపై చర్చలు ఎక్కువ జరిగితే ప్రజలపై ప్రభావం పడుతుందని, మాంద్యం గురించి మరీ ఎక్కువ చర్చల వల్ల వ్యాపార రంగంలో ఉన్నవారు నిజంగానే తీవ్ర మాంద్యం ఉందని భయపడిపోతారని, అందువల్ల మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని, ఫలితంగా ఆర్ధికవ్యవస్థ మరంత మందగిస్తుందని అన్నారు. గతంలో ఆయన ప్రసంగాలు విమర్శనాత్మకంగా ఉండేవి. కాని ఇప్పుడు ఆయనేమన్నారంటే, “ప్రభుత్వం నిజాయితిని చూపిస్తోంది. సానుభూతిని చూపిస్తోంది. సమస్యల పరిష్కారానికి కొన్ని చర్యలు తీసుకుంది. మనం మన ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి. మనం అనేక చర్యలు తీసుకున్నాం. రానున్న రోజుల్లో మంచి ప్రభావం కనిపించవచ్చు” అన్నారు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ బయటి కారణాల వల్ల అంటే అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు.
మూక హత్యల గురించి కూడా ఆయన మాట్లాడారు. అసలు మూక హత్యలనేవి పాశ్చాత్య దేశాలకు చెందినవనీ, మనకు వీటితో సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించే ఎత్తుగడలుగా చెప్పారు. భారతదేశాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రయత్నించే శక్తుల ఎత్తుగడలని అన్నారు. అనేక మంది ముసింలు, దళితులు పట్టపగలు దారుణంగా హతమార్చబడిన సంఘటనలను ఆయన పట్టించుకోనే లేదు. పైగా ఈ హత్యలు క్రైస్తవం, ఇస్లాంల వల్ల భారతదేశంలోకి దిగుమతయ్యాయని చెప్పే ప్రయత్నం చేశారు.
మోడీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన స్వాగతించారు. గతంలో చెప్పిన స్వదేశీ మాటలకు ఇప్పుడు కొత్త అర్ధాలు చెప్పారు. గ్లోబల్ ఎకానమిలో భారతదేశానికి అనుకూలమైన పరిస్థితుల ప్రకారం జీవించే వ్యక్తి స్వదేశీ అన్నారు. మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల జాబితాను ప్రకటించారు. గతంలో మాదిరిగా ప్రభుత్వానికి సలహాలేవీ ఇవ్వలేదు. గత ప్రసంగాలను పోల్చి చూస్తే ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ అధినేతగా చేసిన ప్రసంగం పూర్తిగా విభిన్నమైనది. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు, మోడీ, అమిత్ షా వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలనే ఆయన చెప్పారు. ఈ ప్రసంగం వల్ల అర్థమవుతున్నదేమిటి? ఆర్‌ఎస్‌ఎస్ మాటే తుది మాటే అని ఇంత వరకు అనుకునేవారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు వింటుందని అనుకునేవారు. కాని ఇప్పుడు పరిస్థితి తలకిందులైనట్లు కనబడుతోంది. మోడీ, అమిత్ షాల తర్వాతి స్థానంలోకి భగవత్ వచ్చేశారా? మోడీ, అమిత్ షాల కోసం పని చేసే సంస్థగా మారిందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేశారు.

                                                                                   * అజోయ్ ఆశీర్వాద్ మహాప్రశస్థ (ది వైర్)

SarSanghChalak Mohan Bhagwat address on Dussehra

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎవరి అదుపులో ఎవరున్నారు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: