బూడిదలో పోసిన ‘ఉద్దీపన’!

  చిక్కి శల్యమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన వరుస చికిత్సలు ఫలించలేదు. అది మరింతగా జబ్బు పడి మంచానికి అతుక్కున్నది. సంపన్న ఆర్థిక వేత్తలపై కార్పొరేట్ పన్నును బాగా తగ్గించినా ఫలితం లేకపోయింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శ్లాబులు కుదించినా ప్రయోజనం కనిపించలేదు. రిజర్వు బ్యాంకు వరుసగా ఐదో సారి రెపో రేటు తగ్గించింది. అయినా మేలు కలగలేదు. ఉత్పత్తి, అమ్మకాలు పుంజుకోలేదు. దిగుముఖం ఆగని ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం […] The post బూడిదలో పోసిన ‘ఉద్దీపన’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిక్కి శల్యమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన వరుస చికిత్సలు ఫలించలేదు. అది మరింతగా జబ్బు పడి మంచానికి అతుక్కున్నది. సంపన్న ఆర్థిక వేత్తలపై కార్పొరేట్ పన్నును బాగా తగ్గించినా ఫలితం లేకపోయింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శ్లాబులు కుదించినా ప్రయోజనం కనిపించలేదు. రిజర్వు బ్యాంకు వరుసగా ఐదో సారి రెపో రేటు తగ్గించింది. అయినా మేలు కలగలేదు. ఉత్పత్తి, అమ్మకాలు పుంజుకోలేదు. దిగుముఖం ఆగని ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆ శాఖ కీలక అధికారులతో చర్చించారు. జిఎస్‌టి వసూళ్లు పడిపోయాయి. పారిశ్రామిక వాణిజ్య రంగాలు నీరసించాయనడానికి ఇది చాలు. వస్తూత్పత్తి, తయారీకి చెందిన ఐదు భిన్న రంగాలలో వ్యాపారం జరుగుతున్న తీరుపై సేకరించిన సమాచారమూ ఆశాజనకంగా లేదు. తయారీ, సేవా రంగాలు రెండూ నిరాశాజనకంగానే ఉన్నాయి. నడుస్తున్న ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను అర్‌బిఐ ఒక్కసారిగా 7.4 నుంచి 6.1 శాతానికి కుదించివేసింది. కార్పొరేట్ పన్నును అంత భారీగా తగ్గించినా అది ఉత్పత్తిని, అమ్మకాలను పెంచి అదనపు ఉద్యోగావకాశాలను కల్పించకపోడం గమనించవలసిన విషయం. అంటే కార్పొరేట్ పన్నులో కోత ద్వారా ప్రభుత్వం భరించిన లక్షా 45 వేల కోట్ల రూపాయల భారం వృథా అయిపోయిందని అర్థం. ఆ మేరకు సంపన్న వర్గాల లాభాలు పెరుగుతాయేగాని సాధారణ ప్రజానీకానికి ఒరిగేదేమీ ఉండదని రుజువయిపోయింది. అటువంటప్పుడు అంత ఆదరా బాదరాగా కార్పొరేట్ పన్నును అంత భారీ ఎత్తున ఎందుకు తగ్గించినట్టు? ప్రయోజనం ఉండబోదని ప్రభుత్వానికి ముందస్తు సలహా ఇచ్చే నిపుణులు కరువైపోయారా, లేక కావాలనే ప్రభుత్వం ఈ పరిస్థితిని సాకుగా తీసుకొని సంపన్న వర్గాలకు మేలు చేసిందా అనే సందేహాలకు ఆస్కారం కలుగుతుంది. తగ్గించిన రెపో రేట్ల మేరకు బ్యాంకులు తామిచ్చే అప్పులపై వడ్డీ రేట్లను వెంటనే తగ్గించేలా చూశారు. అదీ ఫలించడం లేదు. కార్ల తదితర ఉత్పత్తి రంగాలు కింది చూపేగాని పై చూపు చూడడం లేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని భారత్ వంటి వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థలు మరింత తీవ్రంగా చవి చూస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిధి సంస్థ అధినేత ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దిలో ఎన్నడూ లేనంత పతనాన్ని ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. 2019లో 90 శాతం దేశాలు తక్కువ వృద్ధి రేటును రికార్డు చేస్తాయని కూడా అన్నారు. మన ఆర్థిక దుస్థితికి అంతర్జాతీయ మాంద్యం చాలా వరకు కారణమన్నది ముందు నుంచి అనుకుంటున్నదే. అయితే ఈ ప్రమాదాన్ని అడ్డుకోడానికి ఏమి చేస్తున్నామన్నది ప్రశ్న. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో వాణిజ్య రంగానికి నిధుల అందుబాటు 88 శాతం తగ్గిపోయిందని రిజర్వు బ్యాంకు వద్ద గల సమాచారం వెల్లడిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య రంగానికి అందిన నిధుల మొత్తం 7.36 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈ ఏడాది ఇంత వరకు అందింది 91 వేల కోట్ల రూపాయలే. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ. 1.65 లక్షల కోట్ల మేరకు ఆహారేతర రుణాలు ఇచ్చాయి. అవి ఈ ఏడాది ఇప్పటికి రూ. 93,700 కోట్లకే పరిమితమయ్యాయి. అంటే పారిశ్రామిక వాణిజ్య రంగాలకు ద్రవ్య సౌలభ్యం దాదాపు శూన్యమేనని అర్థమవుతున్నది. మొండి బకాయిలకు భయపడి బ్యాంకులు భారీ రుణాలు ఇవ్వడం తగ్గించుకున్నాయా, వాణిజ్య పారిశ్రామిక వర్గాలు అమ్మకాలు లేక అదనపు రుణాలు తీసుకోడం మానేశాయా? మార్కెట్‌లో తమ ఉత్పత్తులకు డిమాండు పడిపోయినప్పుడు పెట్టుబడిదార్లు అదనపు పెట్టుబడికి తొందరపడకుండా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితి దీన్నే రుజువు చేస్తున్నది. మరి డిమాండ్‌ను సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏ బూడిదలోకి పోయినట్టు? అది రోగానికి సరైన వైద్యం చేయలేదని రూఢి అవుతున్నది. సంపన్న వర్గాలను పెంచడం వల్ల సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. అది పెరగకపోతే ఉత్పత్తి, అమ్మకాలు పుంజుకోవు. ఆర్థిక వృద్ధి రేటు ఎగబాకదు. ఈ సూక్ష్మం తెలుసుకోకుండా తీసుకునే ఉద్దీపన చర్యల వల్ల ప్రయోజనం బొత్తిగా ఉండదు. ప్రభుత్వ వ్యయం పెరిగితే ఆ మేరకు ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. వారి కొనుగోలు శక్తీ పెరుగుతుంది. రోడ్ల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన రంగాలలో ప్రభుత్వం విరివిగా ఖర్చు చేసినప్పుడు అందులో పనులు ఊపందుకుంటాయి. ఇందుకు బదులుగా ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు రంగం దయాదాక్షిణ్యాల మీద ఆర్థిక రంగాన్ని వదిలి పెట్టింది. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు.

PM Modi review on Economy with FM Nirmala Sitharaman 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బూడిదలో పోసిన ‘ఉద్దీపన’! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: