ఏది దేశ ద్రోహం?

‘దేశంలోని మెజారిటీ మతస్థులకు రామ అనేది అతి పవిత్రమైన నామం. దానిని అప్రతిష్ఠ పాలు చేయడాన్ని ఆపండి… జై శ్రీరామ్ అనేది ఇప్పుడు యుద్ధోన్మాద నినాదంగా మారింది… ముస్లింలను, దళితులను, ఇతర అల్పసంఖ్యాక సామాజిక వర్గ ప్రజలను మూకలు హత్య చేస్తున్న ఘటనలకు తెర దించండి. 2016వ సంవత్సరంలో దేశంలో దళితులపై 840కి తక్కువ కాకుండా దౌర్జన్య సంఘటనలు సంభవించాయి. దోషులకు శిక్షలు మాత్రం పడడం లేదు. మూక హత్యలను మీరు పార్లమెంటులో విమర్శించారు. కాని అది […] The post ఏది దేశ ద్రోహం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘దేశంలోని మెజారిటీ మతస్థులకు రామ అనేది అతి పవిత్రమైన నామం. దానిని అప్రతిష్ఠ పాలు చేయడాన్ని ఆపండి… జై శ్రీరామ్ అనేది ఇప్పుడు యుద్ధోన్మాద నినాదంగా మారింది… ముస్లింలను, దళితులను, ఇతర అల్పసంఖ్యాక సామాజిక వర్గ ప్రజలను మూకలు హత్య చేస్తున్న ఘటనలకు తెర దించండి. 2016వ సంవత్సరంలో దేశంలో దళితులపై 840కి తక్కువ కాకుండా దౌర్జన్య సంఘటనలు సంభవించాయి. దోషులకు శిక్షలు మాత్రం పడడం లేదు. మూక హత్యలను మీరు పార్లమెంటులో విమర్శించారు. కాని అది చాలదు. ఈ దారుణాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? భిన్నాభిప్రాయానికి తావులేని చోట ప్రజాస్వామ్యం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిని జాతి విద్రోహులని, పట్టణ నక్సలైట్లని ముద్ర వేయడం తగదు”.

గత జులై నెల 23వ తేదీన ఈ అభిప్రాయాలతో ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసిన ఆదూర్ గోపాలకృష్ణన్, మణిరత్నం, అపర్ణా సేన్, రామచంద్రగుహ వంటి 49 మంది సుప్రసిద్ధులను దేశద్రోహులుగా పేర్కొంటూ కేసు నమోదు కావడాన్ని ఏమనుకోవాలి? ఒక దారుణ దురన్యాయాన్ని గత కొద్ది సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న లించింగ్ (మూక హత్యాకాండ) అమానుషాన్ని ఆపండి మహాప్రభో అంటూ దేశ ప్రధానికి లేఖ రాయడం అందునా వివిధ రంగాల్లో విశేష ప్రజాభిమానాన్ని చూరగొన్న 49 మంది పెద్దలు ప్రజాస్వామ్య, సెక్యులర్, సమ సమాజ నీతిని కాపాడే పరమోద్దేశంతో పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం, ఆ లేఖను ప్రజల ముందుంచడం ఏ విధంగా దేశ ద్రోహమవుతుందో అలాగని ఒక న్యాయస్థానానికి ఎలా అనిపించిందో అర్థం కాని విషయం. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఒక న్యాయవాది దాఖలు చేసుకున్న పిటిషన్‌పై అక్కడి చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పోలీసులు ఈ పెద్దలపై ఈ కేసు నమోదు చేశారు. దీనిని బట్టి ఏది దేశభక్తి, మరేది దేశద్రోహం అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. వాటి అర్థాలు తారుమారు చేసుకోక తప్పని పరిస్థితి తల ఎత్తుతున్నది.

పాలకులకు హితవు కాని అభిప్రాయాలు వ్యక్తం చేయడం దేశద్రోహమని వారికి ఆనందం కలిగించే మాటలు మాట్లాడడమే దేశభక్తి, ప్రజాస్వామ్యం అని అనుకోవలసి వస్తున్నది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని దుర్నీతి, దుష్ట రీతి. పోనీ ఆ 49 మంది సుప్రసిద్ధులూ ప్రధాని మోడీ ప్రభుత్వం పరువు తీయడానికే, దానిని అప్రతిష్ఠ పాలు చేయడానికే తప్పుడు ఆరోపణలతో ఆ లేఖను రాసి బహిరంగ పర్చారని కాసేపు అనుకుందాం. దేనికైనా వాస్తవమే గీటురాయి, తిరుగులేని సాక్షం అవుతుంది. దేశంలో మూక హత్యాకాండలకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన గత ఐదేళ్లకు పైబడిన కాలంలో గో రక్షక మూకలు దళితులు, మైనారిటీలపై దాడులు చేయడం, దారిగాచి హింసించి చంపడం తరచూ సంభవిస్తున్నాయని స్పష్టపడుతుంది. 2015 సెప్టెంబర్ 28వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో గల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాద్రి అనే పట్టణం సమీపంలో గో మాంసం కలిగి ఉన్నాడనే ఆరోపణతో మొహమ్మద్ అఖ్లాక్‌ను అందరూ కలిసి హతమార్చారు.

అప్పటి ఒక కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ఆ ఘాతుకాన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పేర్కొన్నాడు. ఆ మూక హంతకుల్లో ఒకరైన రవి శిసోడియా అనే వ్యకి మరణించగా ఆయన అతని అంత్యక్రియలను ఒక జాతీయ నాయకుడికి చేసిన స్థాయిలో జరిపించాడు. అఖ్లాక్ హత్య నిందితులందరికీ బెయిల్ లభించింది. ఈ దురంతాల పరంపరకు ఇది ఆరంభం మాత్రమే. అప్పటి నుంచి ఆవులను అమ్మడానికి తరలిస్తున్నారనో, చంపారనో ఆరోపణలతో మరెంతో మందిని గో రక్షక గణాలు హతమార్చాయి, హింసించాయి. 2016 మార్చిలో జార్ఖండ్ రాష్ట్రంలో ఇద్దరు పశువుల వర్తకులను చంపేశారు. అదే సంవత్సరం జులైలో గుజరాత్‌లోని ఉనా అనే చోట చనిపోయిన ఆవుల కళేబరాల నుంచి చర్మం వొలుస్తున్న నలుగురు దళితులను చితకబాదారు. ఇప్పటికీ ఇవి నిరాటంకంగా సాగిపోతూనే ఉన్నాయి. దేశ సర్వాధికార పీఠమైన ప్రధాని పదవిలోని నరేంద్ర మోడీగాని, పాలక పక్షంలోని బాధ్యత గల మరి ఏ ప్రముఖులు గాని ఈ దుర్మార్గాన్ని అవసరమైన స్థాయిలో ఖండించడం, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడడం జరగలేదు. ఇప్పుడు చెప్పాలి ఈ దుర్మార్గాలను ప్రధాని, ప్రజల దృష్టికి తీసుకు రావడమా, కళ్లెదుట అదే పనిగా జరిగిపోతున్న ఈ దురాగతాలను చూస్తూ దేశాధినేతలే ప్రేక్షక పాత్ర వహించడమా ఏది దేశ ద్రోహం?

Row erupts over sedition FIR against 49 celebrities

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏది దేశ ద్రోహం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.